(జాతస్మరుడు లేదా జాతిస్మరుడు అనగా పూర్వజన్మాలను స్మృతి పథంలో నుంచుకోగలిగిన వ్యక్తి. యోగదర్శనానుసారం త్యాగం, అపరిగ్రహం, మనస్సు బుద్ధి ప్రకృతి అనువాటి అనుశీలనం ద్వారా ఈ శక్తి లభిస్తుంది.’ సంస్కార సాక్షాత్కరణాత్ పూర్వజాతి జ్ఞానమ్’ (యోగదర్శనం - 3/18) అద్రోహం, సద్భావం, సరళతాదులు ఈ జాతి స్మర, కుండలినీ జాగరణాది శక్తుల సంపాదనకు ఆపై లోక కల్యాణానికీ బాటలు వేస్తాయి. కల్యాణ అనగా లోక శుభకామన గలవారు ఈ శక్తి సంపాదనకు ముందూ, ఆ తరువాతా కూడా అహంకారం, కౌటిల్యం, ద్వేషం, ద్రోహచింతన వంటి వాటిని మనసులోకి రానివ్వరాదు.)
“గీతాచార్యా! మాలాంటి వారికి పూర్వజన్మ జ్ఞానం వుండడం అసంభవం కదా! అసలు ఎవరికైనా జపతమ హెూమవ్రత యజ్ఞాదుల ద్వారా ఆశక్తిని పొందే అవకాశం వుందా? అలాటిదేమైనా వుంటే దయచేసి ఆ విషయంలో నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి” అని వేడుకొన్నాడు ధర్మరాజు.
“ఒక వ్రతముంది. దానిని ఒకే సంవత్సరంలో మార్గశిర, ఫాల్గుణ, జ్యేష్ఠ, భాద్రపద మాసాల్లో ఉపవాస పూర్వకంగా అత్యంత శ్రద్ధతో చేయాలి. ప్రాచీన కాలంలో యమునా తీరంలో శుభోదయ నామకుడొక వైశ్యుడుండేవాడు. అతడీ వ్రతాన్ని చేస్తుండేవాడు. కాలక్రమాన అతడు మరణించి మరుజన్మలో ఈ వ్రత ప్రభావంవల్ల సంజయుడను మహారాజుకి పుత్రునిగా జనించాడు. అపుడతని పేరు స్వర్ణష్ఠీవి. అతనికి పూర్వజన్మ స్మరణ వుండేది. కొన్ని దినాలకే అతనిని దొంగలు చంపేశారు. అయినా దేవర్షి నారదుని ప్రభావము వల్ల అతడు మరల బ్రతికాడు.”
“పరంధామా! అతనికి స్వర్ణష్ఠీవి అనే పేరెలా వచ్చింది? దొంగలు అతని నెందుకు చంపేశారు? నారదుడతని నెందుకు బ్రతికించాడు? ఎలా బ్రతికించాడు?”
“మహారాజా! నీ జిజ్ఞాస అభినందనీయము. వివరంగా చెప్తాను విను. కుశావతీ నగరంలో సంజయుడని ఒక మహారాజుండేవాడు. ఒకరోజు మహర్షులైన నారదుడు, పర్వతుడు ఆయన వద్దకు వచ్చారు. వారిద్దరూ ఆ రాజుగారికి దర్శనమివ్వగానే ఆయన ఆనందంతో ఉప్పొంగివారికి అన్ని సేవలనూ చేశాడు. అప్పుడక్కడికొక దివ్యసుందరివలె నున్న రాజకన్య వచ్చింది. నారదుడామెను చూచి మోహితుడై ‘రాజా! ఎవరీ యువతి?’ అని అడిగాడు. ఆమె తన కూతురేనని రాజు చెప్పగానే నారదుడు, ‘ఓరాజా! నీ కన్యను నాకిచ్చి వివాహం చెయ్యి. నువ్వేం కోరుకున్నా ప్రసాదిస్తాను’ అన్నాడు.
‘దేవర్షి మహోూదయా! నాకొక విశిష్ట లక్షణమున్న కొడుకు కావాలి. అతడు ఎక్కడ మల, మూత్ర, నిష్టీవనాదులను విసర్జించినా అవి ఉత్తమ శ్రేణికి చెందిన బంగారు ముద్దలైపోవాలి.’
‘తథాస్తు’ అన్నాడు మునీశ్వరుడు.
తనకు అభీష్ట వరం ప్రాప్తించడంతో సంజయుడు వెంటనే తన కన్యను నారదునికిచ్చి వైభవోపేతంగా వివాహం చేశాడు. నారదుని ఈ లీల పర్వత మహామునికి చాలా కోపం తెప్పించింది. కోపంతో కన్నులెఱ్ఱబడగా, పెదవులు వణకుతుండగా అతడిలా శపించాడు: “నారదా! నీవు దేవర్షిలా ప్రవర్తించకుండా ఒక రాజకన్యను చూసి మోహ పరవశుడవైనావు. అందుచేత నీకిక స్వర్గాది ఊర్థ్వలోకాలలోకి ప్రవేశం వుండదు. అంతేకాదు నీ విచ్చిన వరప్రసాది చోరులచేత చంపబడతాడు.”
“పర్వతా! నువ్వు ధర్మాన్ని ఆలోచించకుండా ప్రవర్తించావు. ఒక బ్రహ్మచారికి ఒక కన్య నచ్చి, ధర్మమార్గంలో వివాహం చేసుకోవడం దోషమని నీ నోటే వింటున్నాను. గృహస్థాశ్రమ ద్వారాన్నే క్రోధపరవశుడవై, మూఢుడవై ప్రశ్నించి, శపించావు కాబట్టి ఇకపై నీకు కూడా స్వర్గాది లోకాల్లో ప్రవేశం వుండదు. నాది ధర్మమార్గం కాబట్టి ఆ ధర్మమే నాకీ రాజపుత్రుని మరల బతికించే శక్తినిస్తుంది’ అన్నాడు నారదుడు.
ఈరకంగా పరస్పరం శపించుకొని వారిద్దరూ ఎవరి ఆశ్రమాలకు వారు వెళ్ళారు. ఆ తరువాత ఏడాదిలోపలే రాజుగారికి కొడుకు పుట్టాడు. అతడు అతిశయ రూపవంతుడు, జాతస్మరుడు. నారదుడు వరమిచ్చినట్లుగానే అతడెక్కడ దేనిని విసర్జించినా ఆమేర బంగారమై పోసాగింది. రాజుగారు తన పుత్రునికి ఈ వరప్రసాదానికి సార్థక్యం కలిగిస్తూ, స్వర్ణష్ఠీవి అని పేరు పెట్టాడు. ఆ రాజపుత్రునికి మానవేతర ప్రాణుల మాటలను కూడా అర్థం చేసుకొనే శక్తి కలిగింది. సంజయ మహారాజు ఈ స్వర్ణరాశులను సద్వినియోగం చేస్తూ రాజసూయంతో సహా ఎన్నో మహాయజ్ఞాలను విధి విధాన పూర్వకంగా ఆచరించాడు. తన రాజ్యంలో కొన్ని తరాల వఱకూ నీటియెద్దడి వచ్చే ప్రసక్తి లేకుండా వాపీ, కూప, తటాకాదులను పెద్ద ఎత్తున నిర్మింపజేశాడు. దేవాలయాలను కూడా నిర్మించాడు. తన పుత్రునికి ఒక విశాలమైన సైన్య పటాలంచే రక్షణ నేర్పాటు చేశాడు.
ఈ స్వర్ణరాశుల వార్త నేల నాలుగు చెఱగులా వ్యాపించడంతో మోహపరవశులైన కొందరు మదోద్ధురులైన సమర్థులైన దొంగలు స్వర్ణష్ఠీవిని అపహరించారు. కాని అతని శరీరంపై వారికెక్కడా బంగారం కనిపించలేదు. చేసిన కష్టం ఫలించలేదని మదిలో పుట్టిన వేదన క్రోధానల జ్వాలగా మారగా వారు అతనిని చంపివేసి శవాన్ని అడవిలో విసిరేశారు.
నారదుడు వెంటనే అక్కడకు వచ్చి రాజు నోదార్చి రాజపుత్రుని శవాన్ని భద్రపరచుమని చెప్పి తాను స్వయంగా యమలోకానికి వెళ్ళి రాజపుత్రుని ప్రాణాలను తీసుకొని వచ్చి అతనిని బ్రతికించాడు. అన్ని దుఃఖాలూ ఉపశమించగా రాజు నారదుని ఇలా అడిగాడు. స్వామీ ఏ కర్మ ప్రభావం చేత మావాడు స్వర్ణష్ఠీవి అయినాడు? జాతస్మరత్వం ఏ కర్మ ప్రభావాన ప్రాప్తించింది?
‘మహారాజా! ఇతడు పూర్వజన్మలో ‘భద్ర’ నామక వ్రతాన్ని విధిపూర్వకంగా నాలుగుమార్లు చేశాడు’ అని చెప్పి సెలవు తీసుకున్నాడు నారదుడు.
ధర్మజా! ఈ వ్రత ప్రభావంవల్ల ప్రతి ఉత్తమకులంలో జన్మించి, పూర్వజన్మ జ్ఞాతయై చిరకాలంపాటు జీవిస్తాడు. మంచి అందమైన రూపం కూడా ఈ వ్రత ఫలాలలో నొకటి. ఈ వ్రతం నాలుగు పాదాలలో వుంటుంది. మార్గశిరంలో మొదటి, ఫాల్గునంలో రెండవ, జ్యేష్ఠమాసంలో మూడవ, భాద్రపదంలో నాలుగవ పాదాలు ఉంటాయి.
మార్గశిర శుక్లంతో మొదలెట్టి మూడు మాసాలు చేసే భద్రవ్రతానికి ‘విష్ణుపద”మని పేరు. ఇది సర్వధర్మ సాధకము. ఫాల్గున శుక్లం నుండి మూడు మాసాలమేర ఆచరించే భద్రవ్రతాన్ని ‘త్రిపుష్కర’ మంటారు. ఇది తపాది సాధకము, లక్ష్మీప్రదం. జ్యేష్ఠ శుక్లాది మూడు మాసాలలో గావించు భద్రవ్రతం ‘త్రిరామా’ నామకం. ఇది సత్య, శౌర్య ప్రదాయకం. భాద్రపద శుక్లం నుండి మూడు మాసాలాచరించు భద్రవ్రతం. ‘త్రిరంగ’ నామకం. ఇది కూలంకష విద్యాప్రదాయకం. స్త్రీలు కూడా దీన్ని చేయవచ్చు.”
“జగత్పతీ! ఈ భద్రవ్రతాల మొత్తం విధానాన్ని విస్తారంగా నాకు వినిపించండి” కోరాడు ధర్మజుడు.
“పాండవాగ్రజా! ఈ వ్రత విధానాన్ని నా నుండి వినబోతున్న వారిలో కూడా అగ్రజుడవు కాబోతున్నావు. విను. ప్రథమంగా నీకే వినిపిస్తున్నాను.
దీనిని ప్రారంభించడానికి మార్గశిర శుద్ధ పాడ్యమి అన్నివిధాలా సరియైనది. ఎందుకనగా మార్గశిర శుద్ధ విదియ, తదియ, చవితి, పంచమి అనే తిథులే సంవత్సరంలో సర్వశ్రేష్ఠ తిథులుగా భావింపబడుతున్నాయి.
వ్రతి ఆ పాడ్యమినాడు జితేంద్రియుడై ఒకేపూట భోజనం చేసి పడుకోవాలి. విదియనాడు మధ్యాహ్న కాలంలో మంత్రపూర్వకంగా గోమయం, మట్టి పూసుకొని స్నానంచేయాలి. ఈ మంత్రాలపై నాలుగు వర్ణాలవారికీ అధికారమున్నది కాని వర్ణ సంకరులకులేదు.
త్వం మృత్ స్నే వందితా దేవైః సమలైర్దైత్యఘాతిభిః ।
మయాపి వందితా భక్త్యా మామతో విమలంకురు ॥ (ఉత్తర. 13/86,87)
పై మంత్రాన్ని చదువుతూ ఒంటికి మన్ను రాసుకుంటూ జలాశయానికి పోయి దాని తీరంలో తెల్ల ఆవాలు, నల్లనువ్వులు, వస, ఔషధులు కలిపిన ముద్దను ఒంటికి నలుచుకొని ఈ మంత్రం చదువుతూ స్నానం చెయ్యాలి.
త్వమాదిః సర్వదేవానాం జగతాం జగన్మయే ।
భూతానాం వీరుధాంచైవరసానాంపతయే నమః ॥
గంగాసాగరజం తోయం పౌష్కరంనార్మదం తథా ।
యామునం సాంనిహిత్యంచ సంనిధానమిహాస్తుమే ॥ (ఉత్తర. 13/68,69)
స్నానానంతరం శుద్ధ వస్త్రాలను ధరించి సంధ్యావందనం, తర్పణం గావించాలి. అప్పుడు ఇంటికి వచ్చి నియమ నిష్ఠలతో గడుపుతూ చంద్రోదయం దాకా ఎవరితోనూ మాట్లాడరాదు.
ఇలాగే విదియాదిరోజుల్లో కూడా చేస్తూ కృష్ణ, అచ్యుత, అనంత, హృషీకేశ అను నామాలతో భక్తిపూర్వకంగా భగవానుని పూజించాలి. తొలిరోజు భగవానుని చరణార విందాలను, రెండవ రోజు నాభిని, మూడవరోజు వక్షఃస్థలాన్నీ నాలుగవరోజు నారాయణుని మస్తకాన్ని, విధిపూర్వకంగా, ఉత్తమ పుష్ప, ధూప, దీప, నైవేద్యాలతో పూజించాలి. రాత్రి చంద్రోదయం కాగానే శశి, చంద్ర, శశాంక, ఇందు అనే నామాలతో క్రమంగా చందనం, అగరు, కర్పూరం, దధి, దూర్వ, అక్షతలు, రత్నాలు, పుష్ప ఫలాదులతో చంద్రునికి అర్ఘ్యమివ్వాలి. దినదిన ప్రవర్ధమానుడగు చంద్రుడు వృధ్ధి చెందుతున్న కొద్దీ అర్ఘ్యంలో కూడా వృద్ధిని చేస్తుండాలి. అర్ఘ్య మంత్రం ఇది.
నవోనవోఽసిమాసాంతే జాయమానః పునః పునః ।
త్రిరగ్ని సమవేతాన్ వై దేవానాప్యాయసే హవిః ।
గగనాంగణ సద్దీప దుగ్ధాబ్ధి మథనోద్భవ ।
భాభాసితదిగాభోగ రామానుజ నమోఽస్తుతే ॥ (ఉత్తర పర్వం. 13/86,87)
తరువాత బ్రాహ్మణులకు కూడా అర్ఘ్యమివ్వాలి. భూమిపై పద్మపత్రాన్ని పఱచి మౌనంగా భోంచేయాలి. పలాశ లేదా అశోక పత్రాల ద్వారా పవిత్ర భూమినిగాని శిలాతలాన్ని గాని శోధనం చేసి ఈ మంత్రంతో భూమిని ప్రార్థించాలి.
త్వత్తలే భోక్తు కామోఽహం దేవి సర్వరసోద్భవే ।
మదనుగ్రహాయసుస్వాదం కుర్వన్నమమృతో పమం ॥ (ఉత్తర పర్వం. 13/90,91) -
అనంతరం కూరగాయలతో అన్నం తినాలి. ఆచమనం చేయాలి. అంగస్పర్శ సహితంగా చంద్రుని ధ్యానం చేస్తూ నేలపైనే శయనించాలి.
విదియనాడు లవణరహితమైన హవిష్యాన్నాన్నీ, తదియనాడు నీవార అన్నాన్నీ, చవితినాడు ఆవుపాలతో చేయబడిన ఉత్తమ పదార్ధాలనూ తినాలి. పంచమినాడు నేతితో కలిసిన కృశరాన్నం (కిచిడీ) స్వీకరించాలి. ఈ భద్రవ్రతంలో సాఁవ్రాఁ, బియ్యం, ఆవు పాలతో వచ్చిన నెయ్యి (ఆవు నెయ్యి) ఇతర గోపదార్ధాలు మరియు అయాచితంగా ప్రాప్తించిన వన్యఫలాలూ శ్రేష్ఠంగా ప్రశస్తంగా పరిగణింపబడతాయి. చివరగా ప్రాతఃకాలంలోనే మేల్కొని స్నానం చేసి, పితరులకు తర్పణాలను వదిలి బ్రాహ్మణులకు భోజనాలుపెట్టి దక్షిణలతో బాగా తృప్తిపఱచి వారికి వీడ్కొలివ్వాలి. ఆ తరువాత ప్రతి తన భృత్యులతో బంధుజనులతో కలిసి భోంచెయ్యాలి.
ఇలా మూడేసి నెలలకు మొత్తం యేడాదిలో నాలుగు భద్రవ్రతాలను భక్తిపూర్వకంగా దోషరహితంగా నెరవేర్చిన వారికి చంద్రదేవుడు ప్రసన్నుడై లక్ష్మినీ, సర్వత్ర విజయాన్నీ ప్రసాదిస్తాడు. వాంఛనీయ వస్తువులన్నిటితోబాటు పూర్వజన్మ జ్ఞానాన్ని కూడా ఇస్తాడు.
(పూర్వజన్మ జ్ఞానాన్ని ప్రసాదించే ఇంకో సాధనం కూడా హైందవంలో చెప్పబడింది. అది భ్రమరవాసినీ మంత్ర సాధన... అనువాదకుడు)