భవిష్య పురాణము

63 - దశావతార వ్రత కథ, విధానం

మహారాజా! కృతయుగారంభంలో భృగువను పేరు గల ఒక ఋషి వుండేవాడు. ఆయన భార్య దివ్య(విష్ణు, భాగవతాది పురాణాల్లో భృగుపత్ని పేరు ‘ఖ్యాతి’ అని చెప్పబడింది.)  మహా పతివ్రత. ఆయన ఆశ్రమానికి శోభాప్రాయమై నిరంతరం గృహకార్యాలలో నిమగ్నమై వుండేది. భృగువుకి కూడా ఆమె ప్రాణ సమానం.

ఒకప్పుడు దేవ దానవుల సంగ్రామంలో విష్ణువు ప్రళయ భయంకరాకృతితో దానవులను దునుమాడుచుండగా వారు భయవిహ్వలులై పారిపోయి వచ్చి భృగుని శరణు జొచ్చారు. ఆయన వారికి అభయమిచ్చి తన అగ్నిహూత్రాది కార్యభార్యాన్ని భార్యకొప్పగించి సంజీవనీ విద్య కోసం హిమాలయ ఉత్తర భాగానికేగి తీవ్ర తపస్సు చేయసాగాడు. శంకరభగవానుని ప్రసన్నం చేసుకొని సంజీవని విద్యను సాధించాలని ఆయన ప్రయత్నం. దాని వల్ల దైత్యరాజు బలిని బలోపేతం చేయాలనేది అతని వాంఛ. అదే సమయంలో విష్ణువు గరుడారూఢుడై భృగ్వాశ్రమాన్ని చేరి క్షణంలో అక్కడి దైత్యులందరినీ చంపేశాడు. తన భర్త ఆశ్రమంలో ఆశ్రయంలో నున్న వారిని చంపిన విష్ణువుపై కోపించి భృగుపత్ని విష్ణువును శపించబోతుండగా ఆయన చక్రాయుధంతో ఆమె తలను ఖండించాడు. ఈలోగా సంజీవనీ విద్యను సాధించి అక్కడికి చేరుకున్న భృగువు విష్ణువు చేసిన సంహారాన్ని చూసి కుపితుడై ‘ముందు వెనుకలు చూడకుండా మానవుని వలె నీ స్వరక్షణకై ఒక బ్రాహ్మణిని వధించావు కాబట్టి పది జన్మలు మనుష్యలోకంలో నీకు కలగాలి ‘ అని విష్ణువును శపించాడు”.

ధర్మజుడడిగిన మీదట శ్రీకృష్ణుడు దశావతార వ్రత విధానాన్ని ఇలా ఉపదేశించాడు.

“ధర్మనందనా! భాద్రపద శుద్ధదశమి నాడు సంయతేంద్రియులై నదిలోగాని జలాశయంలో గాని స్నానం చేసి తర్పణాలిచ్చి ఇంటికి రావాలి.

మూడు అంజలి ధాన్యపు గింజలను చూర్ణం చేసి నేతిలో కలిపి వేడి చేయాలి. ఇలా పది సంవత్సరాలు చేయలి. ఈ పదేళ్ళలో ఆ చూర్ణాన్ని పెద్ద యెత్తున ఉపయోగించి క్రమంగా పూరీ, బాద్‌షా, కసార్, లడ్లు, సోహాలకం, ఖండవేష్టకం, కోకరసం, అప్పాలు, కర్ణవేష్టాలు, ఖండకాలు వండి నైవేద్యం పెట్టాలి. ప్రతి దసరానాడు పదిమంది బ్రాహ్మణులకు గోదానం చెయ్యాలి. నైవేద్యాలలో సగభాగం భగవంతుని వద్ద వుంచి, పావు వంతును బ్రాహ్మణునికిచ్చి, మిగిలిన పావును పవిత్ర జలాశయం వద్దకు పోయి స్వయంగా తినాలి. ధూప దీప నైవేద్యాలతో అవతారాల పేర్లతో మంత్రాలతో పూజలు చేయాలి. దశావతారాల నామములు ఇవి: మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి,అనంతరం ఈ మంత్రంతో విష్ణువును ప్రార్థించాలి.

గతోఽస్మి శరణం దేవం హరింనారాయణం ప్రభుం

ప్రణతోఽస్మి జగన్నాథం సమే విష్ణుః ప్రసీదతు  

ఛినత్తు వైష్ణవీం మాయాం భక్త్యాప్రీతో జనార్దనః

శ్వేత ద్వీపం నయత్వ స్మాన్మయాత్మా వినివేదితః  (ఉత్తర పర్వం (63/24,25)

ఈ ప్రకారంగా వ్రతం చేసిన వారికి ఇక జనన మరణ బాధలుండవు. శాశ్వతంగా విష్ణులోకంలోనే వుండిపోవచ్చు.