భవిష్య పురాణము

66 - అరణ్య ద్వాదశీ వ్రతం

ధర్మరాజా! ఇపుడింకొక ద్వాదశీ వ్రతాన్ని వినిపిస్తాను. దీనిపేరు అరణ్య ద్వాదశీ వ్రతం. శ్రీరామచంద్రుని ఆజ్ఞపై, వనంలో, సీతాదేవి ఈ వ్రతాన్ని చేసి అనేక ప్రకారాల భక్ష్య భోజ్యాదులచే అక్కడి మునిపత్నులను సంతుష్టపఱచేది.

ముందుగా మార్గశిర శుద్ధ ఏకాదశినాడు వేకువనే స్నానం చేసి భగవంతుడైన జనార్దనునికి భక్తిపూర్వకంగా గంధ పుష్పాద్యుపచారాలతో పూజ చేసి ఉపవాసముండాలి. రాత్రి జాగరం చేయాలి. మరునాడు స్నానాదికములను గావించి కొందరు వేదజ్ఞులైన బ్రాహ్మణులను సత్కరించి తోటలోనికి గొనిపోయి వారి కక్కడ ఫలములతో కూడిన భోజనాన్ని పెట్టాలి. తరువాత ప్రతి పంచగవ్య ప్రాశ్న చేసి భోజనం చెయ్యాలి.

ఇలా ఒక యేడాదిపాటు చెయ్యాలి. సుందర ఉపవనాలలోకి వనవాసులను, మునీశ్వరులను, గృహస్థ బ్రాహ్మణులను గొనిపోయి మండక, ఘృతపూర, ఖండవేష్టక, శాక, వ్యంజన, అపూప, మోదక, సోహాలకాదులతో వివిధ ప్రకార పక్వాన్నాలతో భోజ్య పదార్థాలతో వారిని సంతృప్తిపఱచాలి. ప్రతి బ్రాహ్మణుని వద్దకూ పోయి నమస్కరించి నిలబడి వాసుదేవ, జనార్దన, దామోదర, మధుసూదన, పద్మనాభ, విష్ణు, గోవర్ధన, త్రివిక్రమ, శ్రీధర, హృషీకేశ, పుండరీకాక్ష, వరాహ - ఈ పన్నెండు మంత్రాలనూ చదివి వస్త్ర, దక్షిణలిచ్చి, ఇస్తున్నపుడు విష్ణుర్మే ప్రీయతాం అంటుండాలి. మునులకు త్రిదండాలనివ్వాలి. ఈ వ్రతాన్ని చేసినవారికి కుటుంబంతో సహా భగవన్నిలయమైన శ్వేతద్వీపనివాసం ప్రాప్తిస్తుంది.”