భవిష్య పురాణము

37 - శ్రీ పంచమీ వ్రత కథ

“జనార్దనా! లక్ష్మీ కటాక్షం బహుదుర్లభం కదా! మనిషి జీవితాంతపు వెతుకులాట తత్ర్పాప్తి కోసమే కదా! ఏ వ్రత, హోమ, తప, జపకర్మల ద్వారా లక్ష్మీప్రసన్నత కలుగుతుంది? మీరు సర్వజ్ఞులు. మీరే చెప్పగలరు” అన్నాడు ధర్మరాజు.

శ్రీకృష్ణుడిలా ఉపదేశించసాగాడు. “ధర్మజా! చాలాకాలం క్రిందట ఒకప్పుడు లక్ష్మీదేవి భృగుమునికి ఖ్యాతి అను పేరుగల స్త్రీ ద్వారా పుత్రికగా ఆవిర్భవించింది. సర్వజ్ఞుడైన భృగువామెను విష్ణుభగవానునికిచ్చి వివాహం చేశాడు. ఆమె కూడా జగత్పతియే తన పతియైనందుకు మిక్కిలిగా ఆనందించి తన కృపాకటాక్షంతో సంపూర్ణ జగత్తునే సంతోష చంద్రికలతో నింపసాగింది. దాంతో ప్రజలంతా, క్షేమంగా సుభిక్షంగా జీవించసాగారు. అన్ని ఉపద్రవాలూ ఆగిపోయాయి. బ్రాహ్మణులు హవనాలు ఇవ్వసాగారు, దేవగణాలకు భోజనాలు హవిష్యరూపంలో అందజొచ్చినాయి. రాజులు నాలుగు వర్ణాల ప్రజలనూ కన్నబిడ్డలవలె చూసుకున్నారు. దేవతల అతీవ, అసీమ ఆనందానికి లక్ష్మీ కటాక్షమే కారణమని తెలుసుకున్న విరోచనుడు మున్నగు దైత్యులు కూడా లక్ష్మి ప్రసన్నతకై యజ్ఞ యాగాదులు, తపస్సు చేయసాగినారు. వారంతా సదాచారులూ, ధార్మికులూ అయిపోవడంతో లక్ష్మీ ప్రసన్నత లభించింది. నేల నాలుగు చెఱగులా వారే పాలకులైనారు.

కొన్నేళ్ళ తరువాత దేవతలకు సంపద లెక్కువై మదం పెచ్చురేగింది. శౌచం, పవిత్రత, సత్య సంధతా, ఇతర సదాచారాలూ లోపించాయి. దాంతో లక్ష్మి వారిని వదలి దైత్యులను అనుగ్రహించింది. దేవగణాలు శ్రీవిహీనులైపోయారు. అయితే, దైత్యులకుకూడా లక్ష్మీప్రాప్తి వల్ల గర్వం పెరిగింది. వారు ఎవరి మట్టుకు వారే, ‘నేనే దేవతను, నేనే యజ్ఞాన్ని, నేనే బ్రాహ్మణుడను, ఈ సమస్త జగత్తు యావత్తూ నా స్వరూపమే, బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, చంద్రాదులన్నీ అందరూ నేనే’ అనుకొనసాగారు. ఈ అతిశయ అహంకారం వల్ల అనర్థాలు జరిగాయి. ఈ దైత్య ప్రవర్తనకు వ్యాకులయై భగవతి భృగుకన్య లక్ష్మి క్షీరసాగరంలో ప్రవేశించింది. వెంటనే త్రిలోకాలూ శ్రీహీనం, నిస్తేజం అయిపోయాయి.

అపుడు దేవరాజు ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిని తిరిగి లక్ష్మీ కటాక్షం ఏ వ్రతం వల్ల లభిస్తుందని అడిగాడు. ఆయన ఇలా చెప్పాడు.

‘దేవేంద్ర! పరమ గోపనీయమగు శ్రీ పంచమీ వత్ర విధానాన్ని వివరిస్తాను. దీని నాచరించడం వల్ల మీకు అభీష్ట సిద్ధి కలుగుతుంది’ అని చెప్పి సాంగోపాంగముగా శ్రీ పంచమీ వ్రత విధిని ఉపదేశించాడు. తదనుసారం ఇంద్రుడా వ్రతాన్ని చేశాడు. ఆ తరువాత దేవతలు, దైత్యులు, మహారాజులు ఎందరో ఈ వ్రతాన్ని చేసి ఐశ్వర్యాన్నీ, ఉత్తమ బలాన్నీ, తేజస్సునీ బుద్ధినీ వ్రత వరదానంగా పొందారు. అప్పుడు ఎప్పటి నుండో వారి మనసులో వున్న క్షీరసాగర మథనాన్ని చేయడానికి తగిన శక్తి కలిగిందనిపించి ఆ దిశగా ముమ్మరంగా ప్రయత్నాలు చేయసాగారు. సాగరాన్ని మథియించి లక్ష్మినీ, అమృతాన్నీ కైవసం చేసుకోవడమనే ముఖ్యాశయంతో అంతా కలిశారు. మందరపర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా అమరగా విష్ణువు కూర్మావతారుడై పర్వతాన్ని మూపున పెట్టుకొని మోయగా సాగర మథనం సాగింది. ఫలస్వరూపంగా మొట్టమొదట శీతల కిరణాల వేల్పు అత్యుజ్జ్వలమైన వెలుగుల ఱేడు చంద్రుడుద్భవించాడు. తరువాత ఏవేవి జనించాయో అందరికీ తెలుసుకదా! లక్ష్మీదేవి సంపూర్ణ శక్తులతో ఉద్భవించి విష్ణు వక్షః స్థలాన్ని చేరుకుంది. విష్ణు దేవుడు శ్రీ పంచమి వ్రతాన్నాచరించిన ఫలం అది. ఇంద్రుడు రాజసభావంతో వ్రతం చేసి త్రిభువన రాజ్య పాలకుడయ్యాడు. దైత్యులు తామస భావంతో ఈ వ్రతాన్ని చేశారు కాబట్టి వారికి ఐశ్వర్యం వచ్చినా సుఖశాంతులు లేకపోయాయి. మొత్తానికి శ్రీ విహీనమైన సంపూర్ణ జగత్తుకి ఈ వ్రతం ద్వారా ఐశ్వర్యప్రాప్తి కలిగింది.”

“పరంధామా! ఈ వ్రత విధానమెట్టిది? ఎప్పుడు ప్రారంభించాలి? ఎలా పూర్తి చేయాలి?”

“ధర్మజా! ఈ వ్రతాన్ని మార్గశిర శుద్ధ పంచమినాడు చేయాలి. ప్రాతల్వేళనే లేచి దంతధావన, శౌచాదులను ముగించి వ్రతనియమాలను ధరించాలి. నదిలోగాని ఇంటిలోగాని స్నానం చేసి రెండు వస్త్రాలను గరించి దేవతలకు, పితరులకు తర్పణ లివ్వాలి. అనంతరం లక్ష్మీదేవిని పూజించాలి. సువర్ణంతో గానీ, వెండి, లేదా రాగి, అరకూట, కాష్ఠ ఆదులలో దేనితోనైనాగానీ కనీసం చిత్రపటంగానీ లక్ష్మీదేవిని ఎదురుగా పెట్టుకోవాలి. ఈ ప్రతిమగానీ పటంగానీ కమలంపై కూర్చున్న దేవితో శోభించాలి. చేతిలో కమలం, సర్వాంగాలకూ తగిన అలంకారాలూ, నాలుగు తెల్ల ఏనుగులు సువర్ణ కలశాల నుండి నీరు తీసి అమ్మవారిపై పోస్తున్న భంగిమా వుండాలి.  ఈ విధమైన లక్ష్మీ ప్రతిమ లేదా చిత్రపటానికి ఆ కాలంలో దొరికే అన్ని పుష్పాల ద్వారా ఈ మంత్రాలతో సర్వాంగ పూజ చేయాలి.

ఓం చపలాయై నమః, పాదౌ పూజయామి

ఓం చంచలాయై నమః, జానూనీ పూజయామి

ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి

ఓం ఖ్యాత్యై నమః, నాభిం పూజయామి

 ఓం మన్మథవాసిన్యై నమః, స్తనౌ పూజయామి

ఓం లలితాయై నమః, భుజద్వయం పూజయామి

ఓం ఉత్కంరితాయై నమః, కంఠం పూజయామి

ఓం మాధవ్యై నమః, ముఖమండలం పూజయామి

ఓం శ్రియై నమః, శిరః పూజయామి.

ఇలా పూజించి, అప్పుడే అంకురితములైన వివిధ ధాన్యాలనూ, అనేక ప్రకారాల పండ్లనూ దేవికి నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తయిదువలకు పుష్ప కుంకుమాదులతో సత్కారం చేసి భోజనం పెట్టాలి. ప్రణామం చేసి వారిని వీడ్కొల్పి ఒక శేరు నేతితో, బియ్యంతో నింపిన పాత్రలను బ్రాహ్మణునికిచ్చి వేసి శ్రీశః సంప్రీయతామ్ అంటూ ప్రార్థించాలి. ఈ రకంగా పూజను ముగించి మౌనంగా భోజనంచేయాలి.

ప్రతి నెలా శుద్ధపంచమినాడు ఈ వ్రతం చేసి లక్ష్మీదేవిని శ్రీ లక్ష్మీ, కమలా, సంపత్, తహణ, నారాయణీ, పద్మా, ధృతి, స్థితి, పుష్టి, బుద్ధి, సిద్ధి అనే పన్నెండు నామాలతో క్రమంగా పూజించాలి. ప్రతి నామం చివర ప్రీయతాం అనే మాట నుచ్ఛరించాలి. పన్నెండవ పంచమినాడు వస్త్రంతో నొక ఉత్తమ మండవాన్ని తయారుచేసి, దానిని గంధపుష్పాదులతో అలంకరించి దారి మధ్యలో శయ్యపై ఉపకరణ సహితంగా భగవతిలక్ష్మి యొక్క ప్రతిమను స్థాపించాలి. ఎనిమిది ముత్యాలు, పట్టువస్త్రం, సప్తధాన్యాలు, పాదుకలు, కొత్త చెప్పులు, గొడుగు, కొన్ని గిన్నెలు, ఆసనములను మండపంపై వుంచాలి., తరువాత శ్రీదేవిని పూజించి వేదవేత్తయు, సదాచార సంపన్నుడునైన బ్రాహ్మణుని సగౌరవంగా పిలచి ఒక దూడగల ఆవుతో సహా మండపాన్ని మొత్తంగా దానమివ్వాలి. యథాశక్తి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణలివ్వాలి. సర్వసమృద్ధికై లక్ష్మీ దేవిని ఈ విధంగా ప్రార్థించాలి:

క్షీరాబ్ధి మథనోధ్భూతే విష్ణో వక్షః స్థలాలయే

సర్వకామప్రదాదేవి బుద్ధిం యచ్చనమోఽస్తుతే (ఉత్తరపర్వం-37/54)