భవిష్య పురాణము

32 - పంచమీ వ్రత విధానం - ఫలం; నాగ పంచమి కథ

మహారాజా! నేనిపుడు పంచమీ కల్పాన్ని వర్ణిస్తాను. పంచమీతిథి నాగులకు ప్రియమైనది, ఆనందమును చేకూర్చేది. ఈనాడు నాగలోకంలో విశిష్ట ఉత్సవాలు జరుగుతాయి. పంచమినాడు నాగులను పాలతో స్నానమాడించే వ్యక్తికి వాసుకి తక్షక, కాళీయ, మణిభధ్ర, ఐరావత, ధృతరాష్ట్ర, కర్కోటక, ధనుంజయులను మహానాగముల అభయ దానముంటుంది. ఆ వ్యక్తి కుటుంబానికి సర్ప భయముండదు. ఒకప్పుడు నాగమాత శాపం వల్ల ఆలోకం మండిపోసాగింది. ఆ దాహభయం వల్ల పంచమినాడు ఇప్పటికీ నాగులకు ఆవుపాలతో స్నానం చేయిస్తారు.

“మునివరా! నాగమాత నాగులకు ఎందుచేత శాపమిచ్చింది? వారెలా రక్షింపబడ్డారు? దయచేసి నాకా కథను సవిస్తరంగా తెలపండి” అన్నాడు రాజు.

“రాజా! ఒకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి సముద్రమథనం చేశారు. ఆ సమయంలో అతిశయ శ్వేతవర్ణంలో నున్న ఉచ్చైఃశ్రవమను గుఱ్ఱం పుట్టింది. దానిని ఆ దారంట పోతున్న వినత, కద్రువ గమనించారు. వీరిద్దరూ కశ్యప ప్రజాపతి పత్నులు: సహజమైన అసూయగల సపత్నులు. వీరిలో కద్రువ నాగమాత. ఆమె వినతతో “చూశావా ఇంత తెలుపును ప్రపంచంలో ఎక్కడా ఏ గుఱ్ఱానికీ కానము. అయినా ఆ విధాత ఎందుకో గానీ తోకపై నల్లచుక్కను పులిమాడు” అంది. వినత బాగా పరికించి చూచి “అలాటిదేమీ లేదు. ఇది సర్వ సంపూర్ణ శ్వేతాశ్వమే అంది. కద్రువ వెంటనే పందెం వేసింది. ఈ గుఱ్ఱంపై పులమబడిన నలుపు నిజమైతే నువ్వు నా దాసివి కావాలంది. లేకుంటే నేనే నీ దాసినౌతానంది. ఇద్దరూ మరునాడు ఉదయమే వెళ్ళి చూద్దామనే అంగీకారానికి వచ్చి ఇంటికి పోయారు. కద్రువ తన పిల్లలను పిలచి తనూ వినతా వేసుకున్న పందాన్ని చెప్పి వారిలో కొందరిని సూక్ష్మరూపం ధరించి ఆ తెల్లని అశ్వం తోకను తాత్కాలికంగా నలుపు చేయాలని ఆజ్ఞాపించింది. ఈ మోసానికి ఉత్తమ నాగులంగీకరించలేదు. వారినందరినీ కన్నతల్లే శపించింది. పాండవపౌత్రుడు చేసే సర్పయాగంలో మండి మసైపొమ్మని. నాగులంతా ఈ శాపానికి భయపడి వాసుకిని ముందిడుకొని బ్రహ్మదేవుని వద్దకు పోయి శరణు వేడారు. నాగులారా చింతించకండి. యాయావర వంశంలో జరత్కారువనే పేరిట ఒక మహా తపస్వియైన బ్రాహ్మణుడుద్భవిస్తాడు. మీకు జరత్కారువనే అదే పేరుతో ఒక చెల్లెలు జన్మిస్తుంది. ఆమెను ఆయనకిచ్చి వివాహం చేయండి. ఆయన ఏం చేప్తే అది చేస్తుండండి. వారికి జగద్విఖ్యాతుడు కాబోయే ఆస్తీకుడను కొడుకు పుడతాడు. అతడు జనమేజయుని సర్పయాగాన్నాపి మిమ్మల్ని రక్షించగలడు” అని బ్రహ్మ చెప్పి వారి నాశీర్వదించి పంపించాడు.

ఓ మహారాజా! ఈ సర్పయాగాన్ని నీ తండ్రి జనమేజయ మహారాజే చేశాడని తెలుసుకదా! ఈ మాటనే శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి చెబుతూ “ధర్మజా! నేటికి నూరేళ్ళకి ఒక సర్పయజ్ఞం జరుగుతుంది. అందులో విషధరాలు, దుష్టాలు అయిన నాగులు నశిస్తాయి. కోట్ల సంఖ్యలో అలాటివి మంటల్లో పడిపోతున్నపుడు ఆస్తీకుడనే బ్రాహ్మణుడు సర్పయాగాన్ని ఆపించి మిగిలే నాగులను రక్షిస్తాడు” అని వెల్లడించాడు.

నాగులకు బ్రహ్మ అభయమిచ్చింది పంచమినాడు. ఆస్తీకుడా యాగాన్ని ఆపించినదీ పంచమి నాడే. అందుకే నాగదేవతలకు పంచమి అంటే ఇష్టం. పంచమినాడు నాగులను పూజించి ఇలా ప్రార్ధించాలి. పృథ్వి,

సర్వేనాగాః ప్రీయంతాం మేయే కేచిత్ పృథివీతలే

యేచ హేలి మరీచిస్థా యేఽతరే దివి సంస్థితాః

యే నదీషు మహానాగాయే సరస్వతి గామినః

యేచవా పీతడాగేషు తేషు సర్వేషు వైనమః (బ్రాహ్మ 32 / 33, 34)

 “ఆకాశం, సూర్యకిరణాలు, సరోవరాలు, వాపీ, కూప, తటాకాలు, వీటిలో ఎక్కుడున్న నాగులైనా సరే మాకు ప్రసన్నులు కావాలి. మేం వాటికి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాం.

ఆరోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తరువాత కుటుంబ సభ్యులంతా కలిసి భోంచేయాలి. ముందు తీపి తినాలి. తరువాత ఇతర రుచులను ఆస్వాదించాలి. ఈ విధంగా నియమ నిష్టలతో నాగ పూజ చేసినవారు నాగలోక ప్రాప్తిని పొంది మరల జన్మించినపుడు ద్వాపరంలో మిక్కిలి పరాక్రమం, చక్కని ఆరోగ్యము, ప్రతాపం కలిగిన రాజుగా జన్మిస్తారు.

“మునీంద్రా! కోపించిన సర్పం కాటుకి చనిపోయిన వానికి ఏ గతులు ప్రాప్తిస్తాయి?”

“రాజేంద్రా! పాముకాటుకి మరణించిన వానికి అధోగతులే వస్తాయి. మరల జన్మించినపుడు విషహీన సర్పంగా జన్మించడం జరగవచ్చు. ఐతే మాతగాని, పితగాని పాముకాటుకి పోతే వారి పిల్లలు వారి సద్గతి కొరకు భాద్రపద శుక్ల పంచమి నాడు ఉపవాసం చేసి నాగపూజ చేయాలి. అన్ని పంచాంగాలలోనూ శ్రావణశుక్ల పంచమినాడే నాగపంచమి అని వుంటుంది. ఈ భాద్రపద పంచమి ప్రత్యేక సందర్భములలో పాటింపబడుతుంది. ఏ పంచమినాడు నాగపూజ ప్రారంభం చేసినా పన్నెండు నెలల పాటు పంచమి నాడు పూజ చెయ్యాలి. చవితినాడు ఒక పూటే భోజనం చెయ్యాలి. నేలపై ఒక మహానాగ చిత్రాన్ని గీసి దానిపై బంగారం, దారు లేదా మట్టితో చేసిన సర్పాకృతిని పెట్టి దానిని పంచమినాడు కరవీర, కమల లేదా మల్లెపూలతో అర్చించాలి. గంధ, ధూపాలతో పూజించాలి. నెయ్యి, పాలు, లడ్డులను నివేదించి వాటిని అయిదుగురు ఉత్తమ బ్రాహ్మణులకు భోజనంతో పెట్టాలి. అనంతుడు, వాసుకి, శంఖ, పద్మ, కంబల, కర్కోటక, అశ్వతర, ధృతరాష్ట్ర, శంఖపాల, కాళియ, తక్షక, పింగళులను ఈ పన్నెండుగురు నాగరాజులను నెలకొక్కని చొప్పున, క్రమంగా పూజించాలి.

ఈ విధంగా ఒక యేడాదిపాటు ఈ వ్రతాన్ని చేసిన తరువాత చాలామంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. విద్వాంసులకు బంగారు నాగాభరణాలను దానం చెయ్యాలి. ఇది ఉద్యాపన విధి. ఓ మహారాజా! నీ తండ్రి జనమేజయుడు ఆతని తండ్రి పరీక్షిన్మహారాజు యొక్క ఉత్తమలోక ప్రాప్తికై ఈ వ్రతాన్ని కూడా చేశాడు. చాలా బంగారు నాగాభరణాలను గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చాడు. ఆ విధంగా ఆయన తండ్రిఋణం నుండి విముక్తుడయ్యాడు. పరీక్షిత్తు ఉత్తమలోకగతుడయ్యాడు. నీవు కూడా ఈ వ్రతం చేసి ఋణవిముక్తుడవు కావలసివుంది. ఈ వ్రతం చేసిన వారికి కూడా పాముకాటు చావు వచ్చినా మంచి లోకాలే వస్తాయి. శ్రద్ధాపూర్వకంగా ఈ వ్రతాన్ని గూర్చి విన్నవారి కుటుంబంలో ఎవరికీ నాగపీడ వుండదు.” (తెలుగువారి నాగుల చవితి తెలుగు వారిదే. దానికీ దీనికీ సంబంధం లేదు. అసలు నాగుల చవితి పరమార్థమే వేరు.)