(భారతదేశంలో ప్రాచీనకాలం నుండి ‘వైతాళ - పంచవింశతికా’ లేదా ‘వైతాళపచ్చీసీ’ అనబడు కథలు విక్రమ - బేతాళ సంవాదరూపంలో అత్యంత ప్రసిద్ధాలు. వీటికి మూలం భవిష్యపురాణమే అనిపిస్తోంది. స్త్రీ - పురుషుల మనోద్రేకాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు కనిపించినప్పటికీ ఈ కథలను వ్యవహారదృష్టితో చూస్తే నీతికథలుగానే పరిగణించ బడతాయి. అందుచేత వీటిలో కొన్ని కథలిక్కడ ఇవ్వబడుతున్నాయి)
సూతమహర్షి ఇలా చెప్పసాగాడు.
“మునులారా! రుద్రకింకరుడొక్కమారు శంకర భగవానులను మనసారాధ్యానించి రాజుతో ఇలా చెప్పసాగాడు.
మహారాజా! ముందుగా ఒక మనోహరమైన కథను వినండి. ప్రాచీన కాలంలో అన్ని అదృష్ట భాగ్యాలు అబ్బిన నగరమొకటుండేది. దానిపేరు వర్ధమానపురి. అక్కడ రూపసేనుడను మహాత్ముడు రాజుగా వుండేవాడు. అతని రాణి విద్వన్మాల పరమపతివ్రత. ఒకరోజు ఈ ధర్మాత్ముని దర్బారుకు ఒక క్షత్రియ వీరుడు తన భార్య, పుత్రుడు, పుత్రికలతో సహా వచ్చాడు. అతని పేరు వీరవరుడు. తనకేదైనా పనినిప్పించుమని మాత్రమే అడిగాడు. అయినా ఆ మాటతీరూ, వినయమూ, కనులలో కనిపించు ధర్మశీలతా రాజుని ఎక్కడో చల్లగా తాకినట్లు కావడంతో అతనిని తన సింహద్వార రక్షకునిగా నియమిస్తూ వేతనం మాత్రం చాలా ఎక్కువగా రోజుకి వేయి సువర్ణ ముద్రలుగా ప్రకటించాడు. రాజు మనసులో ఏముందో మరి. ఆయన తన గుప్తచరులను ఈ వీరవరుడు ఇంత సొమ్మును ఎలా ఖర్చు పెడుతున్నాడో కనుక్కొమ్మని పంపించాడు. వారు వచ్చి చెప్పగానే రాజు తన అంచనా తప్పలేదని ఆనందంగా తల పంకించాడు. ఎందుకంటే వీరవరుడు పరమ ధర్మపరుడు. అధికాంశద్రవ్యాన్ని యజ్ఞ, తీర్థ, పోషణకూ శివ, విష్ణు మందిరాలలో ఆరాధనాది కార్యాలకూ, సాధు, బ్రాహ్మణ, అనాథుల ఆశ్రమాలలో అన్నదానాలకూ వెచ్చిస్తూ తాను చాలా సీదా సాదాగా బ్రతుకుతున్నాడు. రూపసేనుడు వీరవరుని శాశ్వత ప్రాతిపదికపై అదే ఉద్యోగంలో నియుక్తం చేశాడు.
ఒకనాటి అర్ధరాత్రి భయంకరమైన వాన పడింది. మేఘగర్జనలు గుండెలో గుబుళ్ళు పుట్టించసాగాయి. మెరుపు మెరిసినపుడల్లా కనులు కొంతసేపు పనిచేయడం మానివేయ సాగినాయి. ఆ సమయంలో శ్శశానం నుండి ఏదో ధ్వని వినిపించింది. అదొక రోదనధ్వని. ఎవరో స్త్రీ హృదయ విదారకంగా యేడుస్తున్నట్లు రాజుకు వినిపించింది. ఆయన వెంటనే సింహద్వారానికి వచ్చి అక్కడ అప్రమత్తంగా పనిచేస్తున్న వీరవరుని పిలిచి ఆ రోదన ఎవరిదో, ఎందుకో కనుక్కొని రమ్మన్నాడు. కత్తిని చేతబట్టి పరుగున బయలు దేరిన వీరవరుని వెనకే అతనికి కనబడకుండా మహారాజుకూడా బయలుదేరాడు. మరుభూమిలో వీరవరునికి యేడుస్తున్న ఒక స్త్రీ కనిపించింది. ఇతడు వెళ్ళి ఆమెను మృదువైన పలుకులతో ఓదార్చి ఏడుపునాపించి ఇలా అడిగాడు.
‘ఎవరమ్మా నువ్వు? ఎందుకేడుస్తున్నావు?
‘నేను రాజ్యలక్ష్మిని నాయనా. అంటే ఈ రాజ్య సంపదని, సుఖాన్ని, సంతోషాన్ని’. ‘నమస్కారం తల్లీ! నీకింత దుఃఖమెందుకు కలిగింది?’
ఈ (ఈనెలాఖరు అనేమాట వ్యాకరణ ప్రకారం తప్పే. మాసాంతం అనే అనాలి. కాని ఈమాట వ్యవహారంలో నిలిచివుంది.) నెలాఖరులో రూపసేన మహారాజును మృత్యువు కబళించబోతోంది. నేను అనాథనై పోతానని రోదిస్తున్నాను.
‘శివశివా! ఇది మనందరికీ హృదయశల్యమే. అమ్మా! భూతభవిష్యద్వర్తమానాలు తెలిసినదానివి. ఈ దారుణాన్ని ఎలా ఆపాలో కూడా నీకు తెలిసేవుండాలి. దయచేసి చెప్పు. నా రాజు నెలా కాపాడుకోగలనో సెలవియ్యి.’
‘తెలుసు వీరవరా! రాజుగారిని కాపాడడమే కాదు; ఆయనను దీర్ఘాయువును గావించే ఉపాయమొకటుంది. నీకొడుకుని చండికాదేవికి బలిఇస్తే రాజుగారు దీర్ఘాయువుకాగలరు. ‘
ఏమాత్రమూ తటపటాయించకుండా ‘అలాగే తల్లీ’ అని బయల్దేరాడు వీరవరుడు. ఆమె ఆనందంగా అంతర్ధానం చెందింది. వీరవరుడు ఇంటికేగి వివరాలన్నీ చెప్పగానే కొడుకు తనంతతానే బయలుదేరాడు. వీరవరుడు, అతనిపుత్రుడు, ఇతర కుటుంబసభ్యులైన తల్లీకూతుళ్ళు చండికాలయానికి వెళ్ళగా వారికి కనబడకుండా రాజుకూడా వారిని వెంబడించాడు.
వీరవరుడు దేవిని స్తుతించి ‘నా రాజు ప్రాణాలను రక్షించు మాతా’ అంటూ కొడుకు తలను తెగగొట్టాడు. నిర్జీవమై నేలపై పొరలుతున్న అన్న శిరస్సును చూసి తట్టుకోలేక వీరవరుని కూతురు గుండె ఆగి చనిపోయింది. ఈ దృశ్యాన్ని చూసి ప్రాణాలు నిలుపుకోలేక వారి తల్లి మరణించింది. వీరవరుడు నిశ్చలంగా కొంతసేపు నిలబడిపోయి తేరుకొని వారికి దహనసంస్కారాలు చేసి తానుకూడా తన చివరి కోరికగా రాజుగారి దీర్ఘాయువును కాంక్షిస్తూ దేవికి తన శిరస్సును ఖండించి యిచ్చి మరణించాడు.
ఇదంతా చాటుగా వుండి చూసిన మహారాజు గబగబగా దేవాలయంలోనికి వచ్చి చండికామాతను స్తుతించి ‘ఇంతటి విశ్వాసపాత్రుని నాప్రాణం కోసం బలియిచ్చిన నేను సుఖంగా బ్రతకగలగడం అసంభవం. ఇందరి ప్రాణాలను తీసి నేను ఎందుకుబతకాలి?” అంటూ ఒర నుండి కత్తిని తీసి తన తలను తానే ఖండించుకోబోతుంటే చండీమాత ప్రత్యక్షమై అతని చేతిని పట్టుకొని ఆపి ‘రాజా! నీ కరుణతో ప్రేమతో త్యాగంతో నన్ను ప్రసన్నం చేసుకున్నావు. నీకు దీర్ఘాయువు ఇంతక్రితమే ప్రసాదింపబడింది. ఇప్పుడు నీకేం కావాలో కోరుకో. అని కటాక్షించింది.
‘అమ్మా! కుటుంబసమేతంగా వీరవరుని బ్రతికించి, అతనికి ఇందులో నా ప్రమేయం తెలియకుండా చెయ్యి’ అన్నాడు.
‘తథాస్తు’ అంటూ దేవి మాయమైంది.
రాజు గబగబగా బయటికి వెళ్ళిపోయాడు. లేచి నిలబడి ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ నిలబడిపోయారు వీరవరుడూ అతని కుటుంబమూ. చివరికి తమ ఈ పునర్జన్మ దేవి ప్రసాదమే నని సమాధానపడి కుటుంబాన్ని ఇంటిలో దించి సింహద్వారం వద్దకు పోయాడు వీరవరుడు.
తరువాత మహారాజు వీరవరుని పిలిపించి రాత్రి రోదించిన స్త్రీ సంగతేమిటని అడిగాడు. వీరవరుడు అదేం పెద్ద విషయమేం కాదు అన్నట్టుగా చాలా తేలికగా ‘అదెవరో అసంతృప్త ఆత్మ ప్రభూ! స్త్రీ రూపంధరించి యేడుస్తోంది. నన్ను చూడగానే అదృశ్యమై పోయింది.’ అనేశాడు. (పురాణంలో ఇక్కడ ‘చుడైల్’ అనే మాట వాడబడింది. అంటే పిశాచి లేదా దుష్టస్త్రీ అని అర్థము. రాజ్యంలో అందరికీ తల్లిలాటిదైన రాజ్యలక్ష్మిని వీరవరుడలా అని వుండడనిపిస్తోంది) రాజుకు ఏమనాలో తోచలేదు. తన ప్రాణాన్ని రక్షించి స్వంత ప్రాణాన్ని తృణ ప్రాయంగా త్యజించిన వ్యక్తి తన వద్ద ఆ విషయాన్నే చెప్పుకోకపోవడం అరుదు. వీరవరుని స్వామి భక్తిని ధీరతనూ చూసి అత్యంత ప్రసన్నుడైన మహారాజు తన కూతుర్ని వీరవరుని కొడుకునకిచ్చి పెండ్లిచేశాడు. వీరవరుని తన సేవకునిగా కాక ప్రియమిత్రునిగా ప్రకటించాడు.
ఇంతవఱకు చెప్పి కాస్త ఆగి బేతాళుడు విక్రమాదిత్యుని ఇలా అడిగాడు. ‘మహారాజా! ఈ కథలోని ముఖ్యపాత్ర లిరువురూ కూడా ఒకరికోసమొకరు ప్రాణత్యాగానికి వెనుదీయలేదు. ఇద్దరిలో నెవరిది అధిక త్యాగము, స్నేహము?’
‘స్థూలదృష్టికి ఇద్దరూ సమాన స్థాయిలో నున్న ఆదర్శపురుషులే. అద్భుత కర్తవ్యపరాయణులే. అయినా కూడా రాజుగారి వ్యక్తిత్వమే అధిక త్యాగ స్నేహాలమయ మనిపిస్తోంది. ఎందుకంటే వీరవరుడు రాజసేవకుడు. అతని సేవకి ప్రతిఫలం లభిస్తోంది. రాజు ప్రాణాన్ని రక్షించడం అతని ధర్మం. దీని తరువాతనే ఇక ఏధర్మమైనా. రాజుకి వీరవరుని రక్షించవలసిన ధర్మం లేదు. అయినా అతడు ఒక సామాన్య సేవకుని కోసం తన ప్రాణాలనే త్యాగం చెయ్యడానికి పూనుకోవడం గొప్ప విషయం. కాబట్టి రాజుగారి స్నేహ, త్యాగాలే అధిక స్థాయికి చెందినవి అని’ చెప్పాడు రాజు.
మరొక కథ నందుకున్నాడు బేతాళుడు.
‘మహారాజా! ఒకప్పుడు ఉజ్జయినిని మహాబలుడనే చంద్రవంశపు రాజు పాలిస్తుండేవాడు. అతడత్యంత బుద్ధిమంతుడు, వేదాది శాస్త్రజ్ఞాత. అతని కొలువులో హరిదాసు అను పేరు గల బ్రాహ్మణుడుండేవాడు. ఈయన మహాపండితుడు. వ్యవహారజ్ఞాని, రాజుగారి ప్రత్యేకదూత (అంటే నేటి విదేశాంగమంత్రి స్ధాయి కావచ్చు) అతని పత్ని భక్తిమాల పేరుకు తగినట్లే భక్తురాలు. పతివ్రత. వీరి ముద్దులకూతురు మహాదేవి. ఆమె అన్ని విద్యలలోనూ పారంగతురాలు. కమలముల వంటి కన్నులతో గొప్ప కళగా వుండేది. అత్యంత రూపవతి, సద్గుణవతికూడ. ఆమె ఒకనాడు తన తండ్రిని ఇలా కోరుకుంది. ‘నాన్నా నాకంటే అన్ని విధాల అధికమైన సద్గుణములు గలవానికే నన్నిచ్చి పెండ్లి చేయండి’ అని అప్పటికేదో సంబంధాన్ని ఆలోచిస్తున్న హరిదాసు సంతోషంగా అంగీకరించాడు.
ఒకనాడు మహారాజు తన వద్దకు హరిదాసుని పిలిపించుకొని ‘హరీ! నీవు వెంటనే తైలంగ్ దేశానికిపోయి అక్కడి పాలకులు, మామామగారునైన హరిశ్చంద్రుల వారి వద్దకు పోయి వారి క్షేమ సమాచారాలను కనుక్కొని శీఘ్రమే నావద్దకు రావాలి.’ అని ఆజ్ఞాపించాడు. మహాపండితుడైన హరిదాసుని హరిశ్చంద్రుడు బ్రహ్మాండంగా గౌరవించికుశల సమాచారాలు ఇచ్చిపుచ్చుకున్న మీదట ఆయనను ఇలా అడిగాడు. ‘స్వామీ! మీకంటె పండితులు విద్వన్మణులు నాకు కనబడలేదు. నాకు ఒక్క విషయం చెప్పండి. ఈ లోకంలోకి కలి ప్రవేశించినట్లు ఎలా తెలుస్తుంది?’
‘మహారాజా! కలి ఆగమనం జరగగానే ముందుగా లోకంలో వేద ప్రతిపాదితములైన ఆచారాలు, మర్యాదలు నశిస్తాయి. వేదోక్త ధర్మం విపరీతంగా, అసంగతంగా తోస్తుంది. అంటే వేద నిరాదరణ కనిపించిందంటే కలి వచ్చి దిగబడినట్లే. వాడితోనే వాడికిష్టులైన మ్లేచ్ఛగణాలు కూడా దిగుమతి అవుతారు. కలికి ప్రియమిత్రము అధర్మం. ఈ అధర్మమే ఆయుధంగా వాడు దేవతలను అవమాన పఱచగలిగిననాడు కలియుగం ప్రవేశిస్తుంది. నృపాలా! కలికి పరమమిత్రుడు పాపము లేదా పాపి. ఈ పాపి పత్ని మృష అనగా అసత్యం. వీరి పుత్రుడు దుఃఖము. వీని పత్ని దుర్గతి. కలియుగంలో అన్ని గృహాల్లోనూ ఈ దుర్గతిని పొందే ప్రయత్నాలే జరుగుతుంటాయి. రాజులందరూ క్రోధానికి, బ్రాహ్మణులంతా కామానికీ దాసులై పోతారు. ధనిక వర్గం లోభానికి వశీభూతులు కాగా శూద్రులకు అధికారాలు ప్రాప్తిస్తుంటాయి. స్త్రీలు సిగ్గును వదిలేస్తారు. సేవకులు యజమాని ప్రాణాలు తీస్తారు. నేలతల్లి సత్త్వశూన్యమై నిష్ఫలమైపోతుంది. ఇట్టి విపత్కర పరిస్థితుల్లో నిత్యమూ శ్రీహరిని స్మరించేవారు మాత్రమే ఆనందంగా జీవించగలరు. శ్రీహరిని శరణుకోరిన వారిని కలి ఏమీ చేయలేడు.’
ఇది విన్న హరిశ్చంద్రుడు సందేహం తీరినందులకు సంతోషించి హరిదాసును దక్షిణలతో సన్మానించి పంపించాడు. అతడు వచ్చి తన రాజైన మహాబలునికి అక్కడి వివరాలన్నీ వివరించి తన యింటికి చేరుకున్నాడు.
అప్పుడు బుద్ధి కోవిదుడను సార్థక నామధేయుడైన బ్రాహ్మణుడొకడు హరిదాసు గారింటికి వచ్చి తన వైదిక విద్యలను ఆయన వద్ద ప్రదర్శించాడు. తన మంత్ర శక్తితో దేవిని ఆరాదించి, జపించి అప్పటికప్పుడు అక్కడికక్కడ ఆశ్చర్యజనకమైన, శీఘ్రగామియైన ఒక విమానాన్ని సృష్టించి హరిదాసుకి చూపించాడు. ఇంకా చాలా చేశాడు. అతని విద్యకి ముగ్ధుడైన హరిదాసు తన పుత్రిక మహాదేవినతనికిచ్చి పెండ్లి చేద్దామనుకున్నాడు.
హరిదాసు పుత్రుడు ముకుందుడు సరిగా ఆరోజే విద్యను పూర్తిచేసుకుని స్నాతకుడై సంతుష్టుడై తన గురువుగారిని ‘గురుదక్షిణగా ఏమి సమర్పించుకొమ్మంటారు?’ అని మిక్కిలి వినయ సంపన్నతతో అడిగాడు. గురువుగారు వీరి కుటుంబాన్ని క్షుణ్ణంగా పరిశీలించినవాడు కావడం వల్ల, ‘నాయనా ముకుందా! నాపుత్రుడు ధీమంతుడు దైవజ్ఞుడు ఎంతగుణాధికుడో నీకు తెలుసుకదా! నాకేమీ వద్దు గానీ నీ సోదరి మహాదేవిని నా ఇంటి కోడలిని చెయ్యి’ అని కోరాడు. సంతోషంగా అంగీకరించి ముకుందుడు ఇంటికి బయలుదేరాడు.
ఇక్కడ హరిదాస పత్ని భక్తిమాల ద్రోణుని ప్రశిష్యుడైన వామనుడను విప్రయువకుని సర్వవిద్యలనూ శబ్దవేది, శస్త్ర విద్యలతో సహా తిలకించి ముగ్ధురాలై పోయి ఆ బ్రాహ్మణునికే తన కూతురినిచ్చి వివాహం చేద్దామని నిశ్చయించుకొంది.
ఒకరిని సంప్రదించకుండా మహాదేవిని వరులకు వాగ్దానం చేసిన ఈ మువ్వురూ పెళ్ళికొడుకులను తమ ఇంటికి ఆహ్వానించడం కూడా, మరొకరికి తెలియకుండానే, ఒకే రోజుకి చేశారు. ముగ్గురు గుణవంతులైన బ్రాహ్మణయువకులూ హరిదాసుని కన్యను పరిగ్రహించడానికి ఒకే సమయానికి విచ్చేశారు. కాని, అదే సమయానికి అలా ఆకాశంలో పోతున్న రాక్షసుడొకడు మహాదేవి అందాన్ని చూసి మోహితుడై ఆమెను ఎత్తుకుపోయి ఎక్కడో వింధ్య పర్వతాలపైకి విడిది చేశాడు.
ఈ వార్త వినగానే వరులు ముగ్గురూ తాత్కాలికంగా దిగ్ర్భమ చెంది మ్రాన్పడిపోయినా వెంటనే తేరుకొని కన్యను రక్షించి తేవడానికుపక్రమించారు. గురుపుత్రుడు ధీమంతనామకుడునైన దైవజ్ఞుడు దివ్య దృష్టితో చూసి ఆమె వింధ్య పర్వతాలలో ఎక్కడ బంధింపబడిందో అక్కడికి ఏదారంట వెళ్ళాలో చెప్పాడు. వెంటనే బుద్ధికోవిదుడను పేరు గల యువకుడు తానింతకు మున్ను హరిదాసుకు చూపించిన విమానాన్ని మరల సృష్టించి అందులో ఇతర వరులనిద్దరినీ తోడ్కొని పోయాడు. అక్కడ తన శబ్దవేది బాణాల ద్వారా రాక్షసుని మాయను పటాపంచలు చేసి, మూడవ యువకుడైన వామనుడు, రాక్షసుని సంహరించాడు. తరువాత ముగ్గురు వరులూ ఒకే వధువూ అదే విమానంలో ప్రయాణించి హరిదాసునింటికి వచ్చారు.
ఇంతవఱకు చెప్పి కాస్త ఆగి ఇలా అడిగాడు బేతాళుడు. ‘మహారాజా ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు లేకపోయినా మహాదేవి మరలిరావడం జరిగేది కాదు కదా! అలాగని మరోలా చేయలేరు కదా! ఒకరికే ఆమెను కట్టబెట్టాలి కదా! మీరు ధర్మం చెప్పండి. మహాదేవిని ఎవరికిచ్చి పెండ్లిచెయ్యాలి?”
‘పండితోత్తమా! కన్యను పురుషులు మూడు విధాలుగా రక్షిస్తారు. పై లోకం నుండి ఈ లోకంలోకి తెచ్చే వాడు తండ్రి. ఆయనతో సమానంగా ఆమెను పోషించేవాడు అన్న. అవసరమైతే ప్రాణాలకైనా తెగించి ఆమె ప్రాణాలను కాపాడేవాడు భర్త. గురుపుత్రుడైన జ్యోతిశ్శాస్త్ర విద్వాంసుడు మహాదేవికి తండ్రి అవుతాడు. తాను రాక్షస సంహారం చేయలేనని తెలిసినా ఏదో దారిని వెదకి ఆమె వద్దకు పోయి నైతికధైర్యాన్నిచ్చిన బుద్ధికోవిదుడు ఆమెకు అన్నవంటివాడు. ఇంక రాక్షస సంహారంచేసి ఆమెను కాపాడుకున్న వీరబ్రాహ్మణ యువకుడైన వామనునికే ఆమెను పత్నిగా పరిగ్రహించే హక్కు వుంది.’ అని వివేచనాత్మకంగా చెప్పాడు విక్రముడు.
మహారాజుగారికి మరోకథను వినిపిస్తానంటూ చెప్పసాగాడు బేతాళుడు. ‘మహారాజా! చంపాపురి (భాగల్‌పుర్) ని ఒకప్పుడు మంచి బలవంతుడు, ధనుర్విద్యలో దిట్టయగు చంపకేశమహారాజు పాలిస్తుండేవాడు. అతని కూతురు త్రిలోక సుందరిపేరుకి తగినట్టే గొప్ప అందెగత్తె. చంద్రసమానమైన ముఖము, లేడి కన్నుల వంటి కన్నులు, కోకిల గొంతువంటి గొంతు ఇలా కావ్యనాయక లక్షణాలన్నీ ఆమెలో వున్నాయి. రాజామెకు స్వయంవరాన్ని చాటించాడు. ఆమెను చేపట్టే ఆశతో భూలోకంలోని రాజులే కాక దివినుండి దేవతలు కూడా దిగి వచ్చారు. అన్నీ ఆలోచించి చూడగా ఓ నలుగురు ప్రథమ శ్రేణిలో నిలిచారు. ఆ నలుగురిలో ఒకడు ఇలా చెప్పాడు.
‘ఆర్యా! నాపేరు ఇంద్రదత్తుడు. నేను సకల వేదార్థ సారవిదుడను, సర్వశాస్త్ర కుశలుడను, అఖిల విద్యాపారంగతుడను. రూపవంతుడను కూడా కాబట్టి నీకుమార్తెకు నేనే తగిన వరుడను.’
ఇంకొకడు ఇలా అన్నాడు: ‘మహారాజా! నాపేరు ధర్మదత్తుడు. నేను ధనుర్విద్యా కుశలుడను. అన్ని సమర శిక్షణలలోనూ ఆరితేరినవాడను. రూపసిని కూడా కాబట్టి మీ దుహితకు తగిన వరుడను.’
మరొకడు ఇలా విన్నవించాడు:
‘నరపాలా! నాపేరు ధనపాలుడు. ధన ధాన్య విస్తారక ప్రజ్ఞ నాసొత్తు. నేను అన్ని ప్రాణుల భాషలూ తెలిసిన వాడను. గుణవంతుడిని రూపవంతుడిని కూడ, కాబట్టి రాకుమారికి తగిన వరుడను.
వేరొకడిలా వచించాడు:
‘భూమీశా! నాపేరు కళావిదుడు. పేరుకు తగినట్టే సకల కళావిశారదుడను. నా ఉద్యోగంలో రోజుకి అయిదు రత్నాలను సంపాదిస్తాను. వాటిలో నొకటి పుణ్యానికీ, ఇంకొకటి హోమానికీ, మరొకటి ఆత్మకీ, వేరొకటి పత్నికీ పోగా మిగిలిన దాన్ని భోజనానికి ఖర్చు చేస్తాను. గుణవంతుడను, స్ఫురద్రూపిని కాబట్టి త్రిలోక సుందరికి నేనే తగిన వరుడను.
నలుగురి అర్హతలనూ విన్న మహారాజుకి నలుగురూ అర్హులేననిపించింది. ఎటూ తేల్చలేక త్రిలోక సుందరివైపు చూశాడు. ఆమె సిగ్గుతోనన్నట్లుగా తలవంచుకున్నదేగాని ఏమీ మాట్లాడలేదు. (మూలంలో ఈ కథకు అంతం చెప్పబడలేదు. రాజగురువు వివేచనాపూర్వకంగా ప్రవచించి నలుగురిలో ఒకడిని ప్రకటించాడంటే బాగుంటుంది.) ఇంతవఱకు చెప్పిన బేతాళుడు విక్రముని ‘మీరైతే ఏంచేస్తారు? ఎందుచేత?’ అని ప్రశ్నించాడు. విషయాన్ని వివరణాత్మకంగా వివేచించి చెప్పడంలో విశారదుడైన విక్రమాదిత్య మహారాజు ఇలా పలికాడు.
‘రుద్రకింకరా! ఇంద్రదత్తుడు వేదశాస్త్రాలలో నిష్ణాతుడు కాబట్టి బ్రాహ్మణుడై వుంటాడు. భాషలు తెలిసినవాడు ధనధాన్యాలను విస్తరింపజేయగలవాడు కాబట్టి ధనపాలుని వైశ్యవర్ణుడనుకోవలసివుంది. కళావిదుడై రత్నాల ప్రసంగం చేసిన వాడు శూద్రవర్ణుడు. ధనుర్వేదంలోనూ ఇతర సమరశస్త్ర, అస్త్రవిద్యలలోనూ అసమాన శూరుడైన ధర్మదత్తుడు క్షత్రియ వర్ణుడు. క్షత్రియ పుత్రికయైన త్రిలోక సుందరిని క్షత్రియ వర్ణావలంబకుడైన ధర్మదత్తునికే ఇచ్చి పెండ్లిచెయ్యాలి. ఎందుకంటే ఏ యుగాననైనా ఏ జగాననైనా వివాహ బంధం విషయంలో కట్టుబాటును ఎట్టి పరిస్థితులలో దాటిపోరాదు. ‘
‘మహారాజా! ప్రాచీనకాలంలో పుణ్యవర (పూనా) నగరం రాజధానిగా ధర్మ వల్లభుడను రాజు రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. అతని మంత్రి సత్యప్రకాశుడు. ఒకరోజు రాజు తన మంత్రిని ఇలా అడిగాడు. ‘మిత్రవరా! ఆనందంలో ఎన్ని భేదాలుంటాయి? నాకు చెప్పు. మంత్రి ఇలా చెప్పుకొచ్చాడు. మహారాజా! ఆనందం నాలుగు ప్రకారాలుగా వుంటుంది. బ్రహ్మచర్యాశ్రమం నుండి వచ్చేదే బ్రహ్మానందం. ఇది శ్రేష్ఠమైనది. గృహస్థాశ్రమం ద్వారా పొందబడేది విషయానందం; ఇది మధ్యమం. వాన ప్రస్థాశ్రమం ద్వారా వచ్చు ధర్మానందం సామాన్య స్థాయిదే; సన్యాసం ద్వారా వచ్చే శివానందం ఉత్తమోత్తమం. రాజా! గృహస్థాశ్రమంలో మనం అనుభవించ వలసిన విషయానందం స్ర్తీ ద్వారానే రావాలి. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఆడది లేక అనుభవమూ లేదు సంసారమే లేదు.’
ఈ విషయాన్ని విన్నరాజు అనుకూలురాలైన పత్నికోసం దేశాటనం చేశాడు, విదేశాల్లోనూ తిరిగాడు. ఐనా, అతని మనసుకు నచ్చిన మగువ దొరకలేదు. అతడు వెనక్కి వచ్చేసి తనకు తగిన స్త్రీని వెతికే పనిని మంత్రికే ఒప్పజెప్పేశాడు.
మంత్రి ఈ పనిమీద అన్ని దేశాలలో అన్ని ప్రాంతాలనూ చుట్టబెట్టాడు. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని వెతికినా తన రాజుకి తగిన కన్య దొరకలేదు. చివరికి సింధు దేశాన్ని చేరి అక్కడ సముద్రతీరానికి పోయి సముద్రుని ఇలా ప్రార్థించాడు. ‘స్వామీ! నీవు రత్నాకరుడవు. నీకు తెలియనిరత్నముండదు. నీవు సింధు దేశాధినేతవు. నీకు నా వినయపూర్వక నమస్కారములు. శరణాగత వత్సలా! నేను నేడు నీ శరణు జొచ్చినాను. గంగాది నదీమ తల్లులకు స్వామివి, సకల జలాధీశుడవు. సకల జనాధీశుడవు. నీకు నమస్కారములు. నా యజమానికి కొక మంచి స్త్రీ రత్నాన్ని ప్రసాదించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి. నీవు నాకు సాయం చెయ్యకపోతే నేను నీలోనే ప్రవేశించి ప్రాణత్యాగం చేస్తాను.’ అంటూ ముందుకి సాగుతున్న మంత్రి సత్యప్రకాశుని భక్తికి, పట్టుదలకూ ప్రసన్నుడై సముద్రుడు తన జలాలతలంపై విద్రుమ పత్రాలతో, ముత్యాల పిందెలతో ఫలాలతో సమన్వితమైన ఒక వృక్షాన్ని లేపించి చూపించాడు. దానిపై ఒక అందాల సుందరి కూర్చుని వుంది. కాని ప్రకాశుడు కాస్త పరిశీలనగా చూసేలోపలే వృక్ష సహితంగా సముద్రజలాల్లోకి దిగిపోయింది.
ఈ దృశ్యాన్ని చూసి ఈ అనుభవానికి ఆశ్చర్యచకితుడైన సత్య ప్రకాశుడు తన రాజు వద్దకు పోయి విషయాన్నంతటినీ వివరించి చెప్పాడు. చకితుడైన రాజు మంత్రిని తోడ్కొని వెంటనే సింధు దేశ సముద్రతీరాన్ని చేరుకున్నాడు. మంత్రి చేతులు జోడించి సాగర స్తుతికుపక్రమించగానే జలతలంపై ముత్యాలచెట్టూ దానిపై మనోరమమైన మోహనాంగీ దర్శనమిచ్చారు. కాని తీరంలోని వారిద్దరూ కాస్త తేరిపార చూసేలోగానే దిగిపోయి అదృశ్యమై పోవడం జరిగింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన రాజు రాజ్యవ్యవహారాలను చూసుకొమ్మని మంత్రిని ఆజ్ఞాపించి తాను సముద్రగర్భంలో ప్రవేశించాడు.
పాతాళంలో అదే చెట్టుపై అలాగే కూర్చుని దర్శనమిచ్చిన కన్యను చూసి ఆ రాజు,’ వరాననా! నేను ప్రాణాలకు తెగించి ఈ రసాతలపులోతుల్లోకి నిన్ను చేపట్టాలనే వచ్చాను. నన్ను గాంధర్వవివాహం చేసుకో’ అని ప్రార్థించాడు.
ఆమె చల్లగా మెల్లగా నవ్వి ఇలా అంది. ‘నృపశ్రేష్ఠా! రాబోయే కృష్ణ చతుర్దశినాడు నేను నీకోసం దేవీ మందిరంలో వేచివుంటాను.’
రాజుగారు వెనుకకు మరలివచ్చి కృష్ణ చతుర్దశినాడు దేవీ ఆలయానికి పోగా అక్కడ ఆమె అతని కంటే ముందే వచ్చి వుంది. కాని రాజుకంటె ముందే ఒక రాక్షసుడు దేవ్యాలయములోకి దూసుకొనివచ్చి ఆమెను స్పృశించబోయాడు. రాజు కృద్ధుడై తన కత్తిని దూసి వానితో పోరాడి వాని తలను నరికివేశాడు. ఆమెను అప్పుడు ఇలా అడిగాడు, ‘భామినీ! నీవెవరివి? వీడెవడు? ఇక్కడికెలా వచ్చాడు? శాంతంగా, సొంతంగా నాకు వివరించు.’
‘మహారాజా! నేనొక విద్యాధర కన్యను. నాపేరు మదవతి. నాతండ్రికి నేనంటే ప్రాణం. నేను లేకుంటే భోజనం కూడా చేసేవాడుకాడు. ఒకనాడు నేను వనాలలో తిరుగుతూ సర్వం మఱచిపోయి భోజనం వేళ దాటినా ఇంకా విహరిస్తునే వున్నాను. నాతండ్రి దివ్యదృష్టితో చూసి తనప్రేమనూ, బెంగనూ ఏమాత్రం సరకు చేయకుండా, సరైన కారణం లేకుండా వనాల్లో విహరిస్తూ ఇంటికి రావడంలో ఆలస్యం చేసి క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించినందుకు కోపించి నన్ను రాక్షసుడెత్తుకు పోతాడనీ అదీ ఈ కృష్ణచతుర్దశి నాడే జరుగుతుందనీ శపించాడు. నేనిల్లు చేరి విషయం తెలుసుకొని ఆయన కాళ్ళను కన్నీళ్ళతో కడిగినంతగా రోదించగా జాలితలచి శాపవిమోచనాన్ని అనుగ్రహించాడు. అదేమనగా నన్ను వరించడానికి ఎవరైనా మహారాజు ఆరోజు వచ్చి రాక్షసుని సంహరిస్తే నాకు శాపవిమోచనమవుతుందని. నేను మరల ఎప్పటిలాగే మాలోకంలో నివసించవచ్చని చెప్పాడు. కాబట్టి ఓ మహారాజా మీ దయవల్ల నేను మళ్ళీ బ్రతికాను. మీరు అనుమతిస్తే నాలోకానికీ మాతండ్రిగారింటికీ వెడలిపోతాను’ అందామె.
మహారాజు సుతరామూ అనుమతించలేదు. ‘ముందు మనం మారాజమందిరానికి వెళదాం. పెళ్ళిచేసుకుందాం. అప్పుడు మీనాన్నగారింటికి వెళ్ళివద్దాం. నన్నూ నా రాజ్యాన్ని నీ చిత్తము వచ్చినట్లు ఏలుకో’ అని అతడెంతగానో ప్రార్ధించిన పిమ్మట ఆమె అంగీకరించింది. ఆనందంగా ఆమెను తోడ్కొని అంతః పురానికివచ్చి జరిగిన ప్రతిసంఘటననూ సంభాషణనూ మంత్రికిచెప్పి మదవతిని వివాహం చేసుకున్నాడు మహారాజు.
కాని, మంత్రి మాత్రం కొద్దిరోజులకే సమాధిలోకి పోయి ప్రాణత్యాగంచేశాడు. ఇంతవఱకు చెప్పి ఆగిన బేతాళుడు ఇలా అడిగాడు, ‘మహారాజా! అంత పరమ మిత్రుడు, రాజుగారి ఆనందాన్నీ రాజ్యక్షేమాన్ని మిక్కుటంగా కోరుకునే మంత్రి ఎందుకు ప్రాణత్యాగం చేశాడు? దీనిలోని రహస్యమేమిటి?!
‘ఏమీలేదు బేతాళా! ఆ మంత్రి రాజునీ, రాజ్యాన్నీ ప్రేమించాడు కనుకనే అలా చేశాడు. నిజానికి అతని నిష్కల్మష ప్రయత్నం వల్లనే ఆరాజు ఓ ఇంటివాడయినాడు. శ్రేష్ఠురాలు, విద్యాధరియైన మదవతి అతనికి లభించింది. కాని, తన ప్రియమిత్రుడు, రాజనీతిజ్ఞుడు, పరాక్రమశాలియైన ఆ రాజు మదవతని పొంది రానూరానూ మరీ విలాసవంతుడై పోయివుంటాడు. మదవతీనామ, కామస్మరణే నిరంతరంగా నిరంత రాయంగా చేస్తూ రాజ్యాన్నీ, ప్రజల్నీ పూర్తిగా ఉపేక్షించేసి వుంటాడు. ఈ రాజ్యం త్వరలోనే సర్వనాశనం కాబోతుందని మంత్రికి సుస్పష్టంగా బోధపడి వుంటుంది. ఎందుకంటే రాజుగారు విషయలోలుడై ప్రజలకూ అధికారులకూ ఎప్పటి కప్పుడు దర్శనాలనూ ఆజ్ఞలనూ ఇవ్వకపోతే వారు చెడిపోతారు. మంత్రిమాట వినరు. ఆ తరువాత రాజుమాటను కూడా వినరు. తన కళ్ళతో తాను ఆ అరాచకాన్ని స్వయంగా చూడడం ఇష్టంలేక మంత్రి ప్రాణపరిత్యాగం చేశాడు.’ అని వివరించి బదులిచ్చాడు విక్రమాదిత్యుడు అని చెప్పాడు సూతమహర్షి.
బేతాళుడిలా చెప్పసాగాడు, ‘రాజా! ఒకప్పుడు చూడాపుర రాజ్యాన్ని చూడామణి యను రాజు ఏలుతుండేవాడు. అతని భార్య విశాలాక్షి మంచి పతివ్రత, గొప్ప భక్తురాలు. ఆమె పుత్ర సంతానం కోసం పరమశివుని ఆరాధించగా ఆయన కృపవల్ల మన్మథుని యంత సుందరుడు, దైవాంశసమన్వితుడు నగు పుత్రుడు జనించాడు. అతనికి హరిస్వామియని పేరు పెట్టారు. అన్ని సంపదలూ అమరిన హరిస్వామి ఈ భూమిపైనే దేవేంద్రవైభవంతో జీవించసాగాడు. దేవలమునిచే శపింపబడి మానుషీ రూపాన్ని పొందిన దేవాంగన ఒక యింట రూపలావణ్యిక అనే పేరుతో అవతరించి పెరిగిపెద్దదై హరిస్వామి పత్ని అయినది. ఇద్దరు ఒకరికొకరుగా ఒకరికోసమొకరుగా ఒకరితోనొకరు కలసిమెలసి జీవిస్తుండగా ఒకనాడు గాఢనిద్రలోనున్న ఆమెను సుకలుడను పేరుగల గంధర్వుడు అపహరించుకుపోయాడు. హరిస్వామి మరునాడు పెందలకడనే లేచి చూసేసరికి భార్య కనబడలేదు. ఆమెను వెదకి వెదకి వేసారి, నిరాశతో సంసారంపై విసిగి సన్యాసం స్వీకరించి భిక్షుక వృత్తిలో జీవించసాగాడు. మనసును పూర్తిగా శ్రీహరి మీద లగ్నం చేసి ఆకలి తెలిసినపుడు మాత్రమే ఏ బ్రాహ్మణ గృహానికో భిక్షకుపోతూ తపస్సు చేసుకోసాగాడు. శివ వరప్రసాదీ, దైవాంశసంభూతుడూ ఐన వానికి దుఃఖం నుండి, చీకటి నుండి బయటపడి వెలుగులోనికి వెడలిపోవడం సహజమే కదా!
ఒకరోజీ సన్యాసి (ఒకనాటి హరిస్వామి) ఒక బ్రాహ్మణునింటికి భిక్షకు రాగా ఆయన భిక్షాపాత్ర నిండా శ్రద్ధాభక్తి సమన్వితమైన మనస్సుతో పాయసం వడ్డించి యిచ్చాడు. దానిని తన పాత్రలో గైకొని హరిస్వామి నదీతీరానికి పోయి అక్కడి వటవృక్షం తొఱ్ఱలో దానినిపెట్టి స్నానానికి నదిలో దిగాడు. ఈలోగా దైవప్రేరేపితమై ఒక సర్పం వచ్చి ఆపాయసంలోకి విషం ఉమిసి వెళ్ళిపోయింది. సన్యాసి హరిస్వామి స్నానం చేసి ఆ పాయసాన్ని తింటుండగనే తెలివి తప్పిపోసాగింది. అతనికి అందులో విషం కలిసిందని తెలిసిపోయింది. అతడు అలా తూలుతూనే తనకు పాయసదానం చేసిన బ్రాహ్మణుని వద్దకు వచ్చి “ఓయి బ్రాహ్మణా! నీవు నాకిచ్చిన పాయసంలో విషం కలిసింది. నేను చనిపోతున్నాను. నీకు బ్రహ్మహత్యాపాతకం తగులుతుందేమో విచారించు” అంటూ మరణించాడు. శివ ప్రసాదియైన అతడు శివలోకాన్ని చేరుకున్నాడు. విక్రమాదిత్య మహారాజా! ఇప్పుడు చెప్పండి బ్రహ్మ హత్యా పాతకమెవరికి తగులుతుంది?’
‘విషధరమైన నాగు ఆ పాత్రలో తనకి పనికి వచ్చేదేమైనా వుందేమో అని నోరు పెట్టింది. దాని నోటిలోని విషం అందులో పడడం దైవేచ్ఛ. కాబట్టి దానికి పాపమంటదు.
సన్యాసి హరిస్వామి భిక్ష కోసమై బ్రాహ్మణునింటికి వచ్చాడు. ఆ బ్రాహ్మణునికి హరిస్వామి అతిథి, దేవ స్వరూపుడు. అతిథి ధర్మపాలనం చేయడం ఆ వర్ణాశ్రమ ధర్మం. తనవద్ద ద్రవ్యం ఉండీ, అప్పుడు దానమివ్వకపోతే పాపం చుట్టుకుంటుంది. అందుకే అతడు భక్తితో దానమిచ్చాడు. ఆ విషాన్ని అతడే కలిపివుంటే తప్పకుండా అతనికే ఈ పాతకం తగిలివుండేది. కాని అలా జరగలేదు కదా! ఒకవేళ సన్యాసి ఆత్మహత్య చేసుకొనివుంటే ఈ పాతకం అతనికి తగలాలి. అలాకూడా జరగలేదు కదా! మనిషి చేసే శుభాశుభ కర్మలే వాని జన్మమృత్యువులను నిర్దేశిస్తాయి. అతడు కర్మవశాన పుట్టాడు. కర్మ తీరిపోగానే శివుని చేరుకున్నాడు. కాబట్టి ఎవరికీ పాతకం చుట్టుకోదు.’ అని వివరించాడు విక్రముడు.
రుద్రకింకరుడు బేతాళుడు తన మహారాజుకు మరొక కథను వినిపించసాగాడు.
‘మహారాజా! పూర్వం కన్యాకుబ్జం (నేటి కనౌజ్) లో దానశీలుడు, సత్యవాదియు, దేవీపూజా తత్పరుడును నగు ఒక బ్రాహ్మణుడు ఆయన తాను దానంగా గ్రహించిన ద్రవ్యాలన్నిటినీ మరల దానమిచ్చేస్తూ వుండేవాడు. ఒక సంవత్సరం శారదీయ నవదుర్గా వ్రతాలు వచ్చినవి. అతనికి ఆ సందర్భంలో ఎటువంటి ద్రవ్యమూ దానంగా రాలేదు. అతడు అప్పటికే దుర్గాపూజకు కొందరు కన్యలను ఆహ్వానించియున్నాడు. వారికి దానాలివ్వాలి. ‘ఏందారి కనకదుర్గమ్మ తల్లీ!’ అని చింతిస్తుండగా అమ్మ దయవల్ల అతనికి అనాయాసంగా అయిదుముద్రల ధనం లభించింది. ఆనందంగా ఆవ్రతమేదో ముగించాడు. తొమ్మిదిరోజులూ ఉపవాసం చేశాడు. ఈ పుణ్యం వల్ల మరణించిన తరువాత అతనికి దేవస్వరూపమే లభించింది. మరుజన్మలో విద్యాధరరాజుగా జీమూతకేతువను పేర విరాజమానడయ్యాడు. అతడు హిమాలయపర్వతాల్లో రమణీయ స్థలాల్లో నివసిస్తూ తపస్సు చేస్తూ ముఖ్యంగా కల్పవృక్షాన్ని తన తపముచే మెప్పించాడు. ఫలితంగా అతనికి అన్ని కళలలోనూ ఆరితేరిన జీమూతవాహనుడు పుత్రునిగా లభించాడు.
జీమూతవాహనుడు పూర్వజన్మలో మధ్యదేశాన్నేలిన శూరసేనమహారాజు. ఆయన ఒకనాడు వేటకై వచ్చి ఉత్పలావర్తమును చేరాడు. ఇది వాల్మీకి (ఈ వాల్మీకి మహర్షి బోయవాడనీ, పక్షుల ప్రాణాలు తీస్తూ, మనుష్యులపై దారిదోపిడీలు చేస్తూ బతికేసేవాడనీ చివరికి తన భార్యే తన పాపంలో సగం పుచ్చుకోనంటే కోపించి, విరక్తిచెంది రామనామాన్ని తిరగేసి చదివేసి మహర్షి అయిపోయి రామాయణాన్ని రాసేశాడనీ ఒక్క తెలుగు దేశంలోనే గ్రంథాల్లో వినిపిస్తోంది. సినిమాల్లో కనిపిస్తోంది. ఇది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే వాల్మీకి అనేది ఒక గోత్రనామమనీ, ఈ మహర్షి అసలుపేరు రత్నాకరుడనీ, ఈయన భరద్వాజ మహర్షి శిష్యుడనీ రామాయణంలోనే వుంది. మరికొన్ని గ్రంధాల్లో ఈయన బ్రాహ్మణుడనీ శ్రీరామునితో కలిసి చదువుకున్నాడనీ కూడా చెప్పబడింది. భవిష్యపురాణంలో కూడ వాల్మీకి బ్రాహ్మణుడనే చెప్పబడింది.) మహర్షి నివసించిన తపోవనం. అది చైత్రశుక్లనవమి రోజు. అంటే శ్రీరామనవమి. అక్కడ శ్రీరామనవమి ఉత్సవాలను ఈ మహారాజు దగ్గరుండి మరీ బ్రహ్మాండంగా జరిపించాడు. వాల్మీకి మహర్షి నివసించిన కుటీరంలో రాత్రంతా రామతారక జపంచేస్తూ జాగరంచేశాడు. రామమయములైన గాథలను తనివితీరా విన్నాడు. గానమూ చేశాడు. ఈ పుణ్యం వల్ల ఆ శూరసేన మహారాజే జీమూతవాహనుడను పేర విద్యాధర రాకుమారునిగా పుట్టాడు.
పెరిగిపెద్దయిన మహాత్ముడు జీమూతవాహనుడు శ్రద్ధగా కల్పవృక్షాన్ని పూజించాడు. ఒక యేడాదికే ఆమె ప్రసన్నురాలై సాక్షాత్కరించి వరం కోరుకొమ్మని అడుగగా ఆ ధర్మాత్ముడు, ‘అమ్మా! నా నగరం నీ దయతో ధన, ధాన్య సంపన్నం కావాలి. నాప్రజల సుఖశాంతులకు లోటుండకూడదు.’ అని కోరుకోగా ‘తథాస్త’ ని దీవించి కల్పవృక్షం కనుమరుగైపోయింది. తమ నగరం, రాజ్యం ప్రపంచంలోనే అతి సంపన్నం కావడంతో రాజ్యాన్ని దక్షుల చేతిలో పెట్టి పితాసుతు లిరువురూ అతిశయ రమణీయ మలయాచలంపైకి కఠోర తపస్సు చేయడానికై వెడలిపోయారు.
ఒకనాడు మలయధ్వజమహారాజు గారి కూతురు కమలాక్షి శివుని పూజించడానికై మలయ ప్రాంతంలోని ఒక శివ మందిరానికి వచ్చింది. అదే సమయానికి అదే పనిమీద జీమూతవాహనుడు కూడా అక్కడికి వచ్చాడు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. జీమూతవాహనుడే స్వయంగా వివాహ విషయాన్ని ప్రస్తావించడంతో ఆనందంతో పొంగిపోయిన మలయధ్వజుడు తన కూతురు కమలాక్షి నతనికిచ్చి వివాహం చేశాడు.
ఒకనాడు జీమూతవాహనుడు, మలయధ్వజుని పుత్రుడైన విశ్వావసువు కలిసి గంధమాదన పర్వతం పైకి విహారానికి వెళ్ళారు. అక్కడ నరనారాయణులను చూసి నమస్కరించారు. ఆ శిఖరంపైకి విష్ణుదేవుని వాహనమైన గరుత్మంతుడు వచ్చి వాలాడు. అప్పుడు శంఖచూడుడను నాగయువకుని తల్లి జీమూతవాహనుడున్న చోటుకి దగ్గర్లోనే కూర్చుని గుండెలవిసేలాగ రోదించసాగింది. స్త్రీ యొక్క కరుణాక్రందనాన్ని వినగానే సహజంగా దీనవత్సలుడైన జీమూతవాహనుడామె వద్దకుపోయి చాలా మృదువుగా ‘అమ్మా ఎందుకు రోదిస్తున్నావు? నీకొచ్చిన కష్టమేమిటో చెప్పు’ అని అడిగాడు. ఆమెకు అతడొక దేవతవలె తోచినట్టున్నాడు. వెంటనే ఇలాచెప్పింది. ‘రోజుకొకరు చొప్పున మానాగులను గరుడునికి ఆహారంగా పంపేలాగ మారాజుకీ, గరుడునికీ ఒప్పందం కుదిరింది. ఈ రోజు నాకంటి దీపం, మాఇంటి వెలుగు అయిన నా ఏకైక పుత్రుడు. ఆ గెద్దల రాజుకి బలియైపోతున్నాడు నాయనా. అందుకే ఏమీ చేయలేక యేడుస్తున్నాను.’
జీమూతవాహనుడేమీ మాట్లాడలేదు. ఆమెను ఓదార్చే ప్రయత్నముచేయలేదు. అది అనవసరం కూడాను. వెంటనే గరుడశిఖరం మీది వధ్యశిలవద్దకు పోయి శంఖచూడుడు ధరించవలసిన బలిబట్టలను తానే వేసుకొని పడుకున్నాడు. గరుడుడు గబగబా వచ్చి జీమూతవాహనుని తనకు నాగులిచ్చిన బలి అనుకొని కాళ్ళలో ఇరికించుకొని ఆకాశంలోనికి ఎగిశాడు. జీమూతుని పత్ని కమలాక్షి ఆకాశంలో గరుడునికి భక్ష్యం కాబోతున్న తన పతిని చూచి పెద్దపెట్టున రోదించసాగింది. ఈలోగా గరుడునికి ఏదో తేడాగా వుందనిపించింది. తనురోజూ భక్షించే భక్ష్యాలు భయంతో భయంకరమైన ముఖాలతోనే రోదనతో వుండేవి. కాని ఈనాటి భక్ష్యం మాత్రం ఆనందంగా వున్నట్టు కనిపిస్తున్నాడు. వెంటనే, తన కాళ్ళ మధ్యనున్న బలిని తేరిపార చూసిన గరుడునికి మతిపోయినంత పనైంది. వాడు నాగుడు కాడు. కాంతులు విరజిమ్ముతున్న ధర్మ సౌందర్యములుగల విద్యాధరుడో, నరుడో గాని నాగుడు ఏమాత్రమూ కాడని గరుడునికి బోధపడింది. వెంటనే భయపడుతూనే అడిగాడు. ‘నువ్వు నాకు భక్ష్యమెట్లయినావు?’ అని. ‘నేటి నీ బలి శంఖచూడ నాగుడు. అతని తల్లి దుఃఖిస్తుంటే జాలికలిగి ఆమె కొడుకును రక్షించాలనే కోరికతో అతనికంటె ముందే వచ్చి నేను బలి పీఠాన్నధిరోహించాను. అని చెప్పాడు జీమూతుడు.
ఈలోగా తనకి బదులుగా ఇంకెవరో గరుడుని గళానికి బలైపోతున్నారని శంఖచూడనాగునికి తెలిసింది. అతడు పరుగు పరుగున కొండ కొమ్మును చేరి ఇంకా ఏ ఘోరమూ జరగనందుకు సంతోషించి గరుత్మంతునితో ‘కృపాసాగరా! నీ భోజనానికి ఈ రోజు నిర్ణయింపబడినవాడను నేను. ‘ఓ మహామతీ! ఈ దివ్య పురుషుని, ఈ మహాత్ముని వెంటనే వదలివేసి నన్ను భుజించు. అదే న్యాయం’ అని గట్టిగా అరచి చెప్పాడు.
గరుడునికి జీమూతవాహనుని మహానత పూర్తిగా బోధపడింది. అతడు అత్యంత ప్రసన్నుడై జీమూతవాహనునితో ఇలా చెప్పాడు. ‘నేను నీకు వరాలిస్తున్నాను. విద్యాధరలోకంలోనే అతి పెద్ద, సుందర నగరి రాజధానిగా నీవు చక్రవర్తివి కాగలవు. శంఖచూడుని గాని అతని జాతి వారిని గాని నేనిక ఎప్పటికీ హింసింపను. నీవు ఒక లక్ష సంవత్సరాలపాటు అన్ని ఆనందాలనూ అనుభవిస్తూ రాజ్యంచేసి దేహాంతం లో వైకుంఠనివాస ప్రాప్తి నొందగలవు.’
ఈవిధంగా తన సహజ సిద్ధమైన దైవత్వం జీమూతవాహనునిచే మేల్కొల్పబడగా వారందరిని దీవించి ‘గరుత్మంతుడు అంతర్ధానం చెందాడు.
‘ఇపుడు చెప్పండి మహారాజా! శంఖచూడ, జీమూతవాహనులలో నెవరికి మహాఫలం ప్రాప్తించింది? వీరిలో ఎవరు అధిక సాహసి?’ అడిగాడు బేతాళుడు.
‘రుద్రకింకరా! మహాఫలం ప్రాప్తించింది శంఖచూడునికే. ఎందుకంటే ప్రాణం కన్న గొప్పది లేదుకదా! పైగా జీమూతవాహనుని స్వభావమే పరోపకార పరాయణత్వము. గొప్పఫలము ఏదైనా అటువంటి మహానీయునికి అధికం కాదు. ఇక సాహసి కూడా శంఖచూడుడనే చెప్పాలి. మహారాజు స్వయంగా సాహసియై వుండాలి. కర్తవ్యం కోసం బలిపీఠాన్నెక్కడం సాహసమే కాని అతని స్థాయికి అది సహజమే. శంఖచూడుడు సామాన్య నాగయువకుడు. గరుత్మంతుడు కలలో కనిపిస్తేనే గుండె ఆగిపోయే జాతి వానిది. అంలాటిది ప్రాణాలు దక్కగానే బ్రతుకుజీవుడా అని పారిపోకుండా, మిక్కిలి వేగమున జీమూతవాహనుడేమైపోతాడో అని పరుగుపరుగున వచ్చి గరుత్మంతుని చేరి కేకలు వేసి మరీ బలికాబోయిన శంఖచూడుడే పెద్దసాహసి. ఒక ధర్మాత్ముని ప్రాణాలు కాపాడిన త్యాగి’ అని రాజు వివరణతో సహా చెప్పగానే ఆనందంగా తల పంకించాడు బేతాళుడు.”
“బేతాళుడిపుడు గుణాకరుడను ఒక అసార్థక, నిరర్థక, అనర్థక నామధేయుని కథను వినిపిస్తున్నాడు” అని చెప్పసాగాడు. సూతుడు శౌనకాది మహామునులతో.
వైతాళుడు విక్రమాదిత్యునితో ఇలా చెప్పసాగాడు, ‘మహారాజా! ఒకప్పుడు ఉజ్జయనిలో దేవశర్మయను బ్రాహ్మణుడుండేవాడు. అతని కొడుకు పేరు గుణాకరుడు. ఇతడు వ్యసనపరుడైపోయి జూదానికి, మద్యానికి తన తండ్రి ఆస్తిని చాలవఱకు తగలబెట్టగా, బంధువులందరూ కట్టగట్టుకొని వచ్చి బ్రాహ్మణ్యం మంటగలిసి పోతున్నదని బాధపడి వానిని పరిత్యజించి తగిలేశారు. అతడు ఎక్కడెక్కడో తిరిగి దైవయోగమున ఒక సిద్ధాశ్రమప్రాంతానికి చేరాడు. అక్కడ కపర్దియను సిద్ధుడుండేవాడు. ఆయన గుణాకరునికి కొంత భోజనాన్ని పంపించాడు. కాని ఆకలిబాధను అనుభవిస్తూనే గుణాకరుడు ఆభోజనాన్ని స్వీకరించలేదు. అపుడు కపర్ది ఒక యక్షిణిని పిలిచి గుణాకరుడున్న చోటికే పంపించాడు. ఆమె సగౌరవంగా గుణాకరుని తమ ఆశ్రమానికి దయచేసి ఆతిథ్యాన్ని స్వీకరింపుమని కోరింది. అతడామె అందాన్ని చూసి అప్రతిభుడై వెళ్ళాడు. ఆ తరువాత ఆమె కైలాసశిఖరానికి వెళ్ళిపోయింది. గుణాకరుడామె వియోగం చేత విహ్వలుడై యోగి కపర్ది వద్దకు పోయి ఆమెను పొందాలనే తన కాంక్షను వెల్లడించి ఎలాగైనా తన ఆశయాన్ని నెరవేర్చుకొనే ఉపాయాన్ని చెప్పమని ప్రాధేయపడ్డాడు. యోగి గుణాకరునికి ఆమె నాకర్షించే విద్యను ప్రదానం చేసి, ‘వత్సా! నీవు నలభై రోజుల పాటు అర్ధరాత్రి నీటిలో నిలబడి తెల్లారేదాకా ఈ శుభమంత్రాన్ని జపించు. నీకు ఈ మంత్రం సిద్ధిస్తే యక్షిణీ సిద్ధిస్తుంది. ఏకాగ్రత చాలా అవసరం సుమా!’ అని మంత్రోపదేశాన్నిచ్చి పంపించాడు. గుణాకరుడలాగే చేశాడు. నలభైరోజులు అయిపోయింది. యక్షిణి లభించలేదు. ఇక చేయునది లేక కపర్ది సూచనమేరకు అతనింటికి పోయి, తల్లిదండ్రులకు నమస్కరించి ఒక రాత్రి వారితో గడిపి మరునాడే ఒక ప్రసిద్ధ సన్యాసి మఠానికిపోయి అక్కడ శిష్యునిరూపంలో నివసించసాగాడు. అక్కడ పవిత్రుడై పంచాగ్నుల మధ్యలో నిలబడి కపర్దియిచ్చిన మంత్రాన్ని మళ్ళీ జపించి సాధనచేశాడు. అయినా యక్షిణి రాలేదు, అతని కాంక్ష తీరలేదు.
ఇంతవఱకు చెప్పిన బేతాళుడు జ్ఞానవిశారదుడైన విక్రమాదిత్యుని ఇలా ప్రశ్నించాడు. ‘మహాభాగా! గుణాకరుని కోరిక తీరకపోవడానికి కారణమేమై వుంటుంది?’
‘రుద్రకింకరా! ఏ సాధకునికైనా సిద్ధి ప్రాప్తించాలంటే తప్పనిసరిగా వుండవలసిన గుణాలు మూడు. మనస్సు, వాక్కు, శరీరాల ఏకాత్మ్యము. మనస్సు, వాక్కు కలిసిన సాధన పరలోకం సుఖప్రదంగా వుండడానికి పనికొస్తుంది. వాక్కు, శరీరము ఏకీభవించగా చేసే కార్యాలు అందంగా వస్తాయి. అందంగా అంటే ఈ జన్మలో ఆంశికంగానూ పరలోకంలో అధికంగానూ ఫలాలనివ్వడం. మనస్సు, శరీరమూ ఏకమై చేసే కర్మలు మరుజన్మలో సిద్ధిస్తాయి. అదే మనస్సు, వాణి, శరీరము తన్మయత చెందిచేయబడ్డ కర్మలైతే ఈ జన్మలోనే, అదీ శీఘ్రమే ఫలాలనిస్తాయి. దేహాంతంలో మోక్ష ప్రదానకరములూ అవుతాయి.
గుణాకరుడు రెండుమార్లు ఎంతో శ్రమించి మంత్రజపం చేశాడు కానీ రెండు పర్యాయాల సాధనలోనూ మనోయోగం చాలలేదు. పంచాగ్ని మధ్యంలో, జలాంతర కర్మంలో కూడా శరీరం శ్రమించింది. వాణి మంత్రజపంలో మగ్నమైంది కాని, గుణాకరుని మనస్సు మంత్రంపై కాకుండా యక్షిణి పొందుపైనే లగ్నమై వుంటుంది. ఈ కారణం వల్ల అతనికి యక్షిణి లభించలేదు. అయితే సాధన సాంతమూ వృథా అయివుండదు. ఈ చేసిన దానికి ఫలితంగానే అతడు మరుజన్మలో యక్షునిగా పుట్టి ఆ యక్షిణిని పొంది వుంటాడు.’ అని విక్రమాదిత్యుడు బదులీయగానే తాను చెప్పని కథాంశాన్ని కూడా జ్ఞానబలంతో పోల్చి చెప్పిన రాజుని చూచి సంతోషంగా తలపంకించాడు బేతాళుడు.
బేతాళుడు మరొక కథను చెప్పసాగాడు. ‘మహారాజా! ఒకప్పుడు చిత్ర కూటాన్ని రూపదత్తుడని ఒక విఖ్యాతుడైన రాజు పరిపాలిస్తుండేవాడు. అతడొకనాడు వేటకి వెళ్ళి ఒక మృగాన్ని తరుముతూ పోయి ఒక వనంలో ప్రవేశించాడు. మధ్యాహ్న కాలంలో నీటి జాడలను చూసుకుంటూ పోగా ఒక అందమైన సరస్సు, అక్కడ కమలాలను కోస్తూ ఇంకా అందమైన కన్య కనిపించారు. ఆమెతో బాటు ఒక సఖి కూడా వుంది. ఆ సుందర మునికన్య శ్రేష్ఠరూపాన్ని చూసిన వెంటనే రాజు ఆమెను తన రాణిని చేసుకోవాలని దృఢ నిర్ణయానికి వచ్చేశాడు. ఆ కన్య కూడా రూప సుందరుడైన రాజును ప్రసన్నదృష్టులతో చూడసాగింది. కొన్ని క్షణాలపాటు ఇరువురూ ఒకరినొకరు చూసుకుంటూ వుండిపోయారు. రాజు తేరుకొని ఆమె సఖి ద్వారా ఈ కన్య అక్కడి ముని యొక్క ధర్మపుత్రియని తెలుసుకున్నాడు. ఈలోగా ఆ మునీశ్వరుడే అక్కడికి రావడంతో రాజు ఆయనకు నమస్కరించి ఆయన ఆతిథ్యాన్ని పొంది తన జ్ఞానాన్ని పెంపొందించుకొనే ప్రయత్నంలో భాగంగా ‘మునీశ్వరా! ఉత్తమ ధర్మ మనగానేది’ అని అడిగాడు.
మహామనీషియైన ముని ఇలా బోధించాడు. ‘రాజా! అసహాయుల పాలన, పోషణ, శరణాగత రక్షణ, భూతదయ అన్నిటిలోకి ముఖ్య ధర్మములు. భయభీతులకు అభయమిచ్చుట కూడ దానంతో సమానధర్మమే. ఉద్దండులను దండించుటయే ధర్మము. పూజార్హత గల జనులను పూజిస్తూ, గో, బ్రాహ్మణులు సంతృప్తులై వుండేలా జాగ్రత్త పడుతూ, దండించేటపుడు పక్షపాతాన్ని సంపూర్ణంగా త్యాగం చేస్తూ రాజధర్మాన్ని పాటించాలి. దేవతలను పూజించునపుడు మోసం, మాయ, కపటం వంటి వాటిని మనసులోనికి రానీయకుండా శ్రద్ధాభక్తులతోనే వుండాలి. గురువులను, శ్రేష్ఠజనులను లాభాపేక్షతో కాకుండా సమాహిత చిత్తతతో పూజించాలి. దానం మృదుభాషణ సహితంగా చేయాలి. చిన్న పాపమైనా కూడా చాలా పెద్ద శిక్షనే వేయిస్తుందని గుర్తుంచుకొని జీవనం గడపాలి. ఇవన్నీ కలిసినదే ఉత్తమ ధర్మము.’
ఇష్టస ఖి ద్వారా విషయాన్ని తెలుసుకున్న ముని తన కన్యను రాజున కిచ్చి వివాహం చేశాడు. రాజామెను పరిగ్రహించి సతీసమేతంగా రాజధానికి బయలుదేరాడు. దారిలో వారొక వటవృక్షం క్రింద విశ్రమించారు. అంతలోనే ఒక రాక్షసుడు వారి యెదుట నిలబడి మీరు నా స్థానాన్ని అపవిత్రం చేశారు. నేను మిమ్మల్ని తినేస్తాను. అని గర్జించాడు. రాజు వాని కాళ్ళవేళ్ళాపడి తమను క్షమింపుమనీ బతిమాలగా ఇంత విఖ్యాతుడైన రాజూ ఈ విధంగా బేలపడిపోవడం కని జాలిపడి ఆ రాక్షసుడు సరే మీ ఇద్దరినీ వదిలేస్తాను గానీ, నాకు పదేళ్ళలోపు వయసుగల బ్రాహ్మణ బాలకుణ్ణి ఆహారంగా పంపాలి అన్నాడు. రాజు వెంటనే ఒప్పేసుకొని మాట ఇచ్చేసి బతుకుజీవుడా అని బయటపడి తన రాజ భవనానికి సతీసమేతంగా చేరుకున్నాడు.
మరునాడు మంత్రిమండలి సమావేశాన్ని పెట్టి ఈ విషయాన్ని బయట పెట్టిన రాజుకి మంత్రులు తమకు తెలిసిన బ్రాహ్మణుడొకడున్నాడనీ వానికి పదేళ్ళ లోపు వయసున్న కొడుకులు ముగ్గురున్నారనీ లక్ష స్వర్ణ ముద్రలిస్తామంటే పుచ్చుకొని ఒక కొడుకుని బలియిచ్చేస్తాడని విన్నవించారు. లక్ష స్వర్ణముద్రల కన్నా, బ్రాహ్మణ బాలకుని ప్రాణం కన్నా తనయొక్క, తన యాలి యొక్క బతుకులే ముఖ్యమనుకొన్న మహారాజు వెంటనే అంగీకరించి చకచకా యేర్పాట్లు చేయించాడు.
తల్లిదండ్రుల అంగీకారంతో బ్రాహ్మణ బాలకులలో మధ్యముని రాజభటులు రాక్షసుని వద్దకు గొనిపోయారు. బలిదాన సమయంకాగానే ఆమధ్యమ కుమారుడు ముందు పకపకనవ్వాడు. వెంటనే వలవలయేడ్చాడు. విక్రమాదిత్య మహారాజా! ఆ బాలకుని హసన రోదనాలకు వ్యాఖ్యానం చెప్పగలరా? అంటూ ఆగాడు బేతాళుడు’.
‘రుద్రకింకరా! ఈ దుష్ట మనఃప్రవృత్తి ఎక్కడ ప్రారంభమైందో గానీ చాలా ఇళ్ళల్లో తండ్రికి పెద్ద కొడుకు ప్రాణ సమానమైతే తల్లికి చివరికొడుకు ప్రాణప్రదం. తనను కన్న తల్లిదండ్రులే తనను లక్ష సువర్ణ ముద్రలకోసం బలిపెట్టెయ్యడం, తనకు ఎవరైనా అన్యాయం చేస్తే తాను వెళ్ళి ఆశ్రయించవలసింది రాజునే అయినపుడు తన రక్షణ కోసం కత్తిని చేతబట్టి కదనం వైపు కదలవలసిన ఆ రాజే నిర్దయుడై, స్వార్థపరుడై, పిరికివాడై అదే కత్తితో తనను నరకి బలి ఇవ్వబోవడం చూసిన మధ్యమపుత్రునికి తన తల్లిదండ్రుల ధనాశనూ, తన రాజుగారి ప్రాణభీతిని తలచుకోగానే తెరలు తెరలుగా నవ్వుపుట్టుకొచ్చింది. అన్ని జన్మలలోకి ఉత్తమమైనది బ్రాహ్మణజన్మ. ఇది ఈరోజు పరమ అధములైన రాజ దంపతులు, బ్రాహ్మణ దంపతులు, మరియు రాక్షసుని ప్రాణభీతి, ధనాశ, ఆకలి వంటి వికృతమైన మృత్యు దంష్ట్రలవల్ల అంతమై పోతున్నందుకు అతనికి దుఃఖం పొంగుకొచ్చింది. రాజు తన ప్రాణం, తన పత్ని ప్రాణం ముఖ్యమనుకొనరాదు. పిల్లలందరికీ సమానమైన ప్రేమనే మనం పంచాలి’ అని చెప్పాడు విక్రముడు.
“మరొక కథను వినిపించసాగాడు బేతాళుడు” అని సూతుడు శౌనకునికి చెప్పాడు.
మహారాజా! జయపురాన్ని వర్ధమానుడు పరిపాలిస్తున్న కాలంలో ఆ రాజ్యంలో ఒక గ్రామంలో వేద వేదాంగపండితుడైన విష్ణుస్వామి అని ఒక బ్రాహ్మణుండేవాడు. ఆయన రాధాకృష్ణ భక్తుడు. ఆయనకి నలుగురు కొడుకులు. నలుగురూ రకరకాల వ్యసనాలకి లోనైపోయారు. నిందిత కర్మల నాచరిస్తూ తండ్రి పేరును చెడగొట్టసాగారు. మొదటి కొడుకు ధూర్తకర్ముడు, రెండవవాడు వ్యభిచారి, మూడవవాడు విషయలోలుడు, చివరివాడు నాస్తికుడు. తండ్రి పంచి యిచ్చిన ఆస్తులన్నిటినీ తగులబెట్టి దరిద్రులైపోయారు. నలుగురూ ఒకనాడు తండ్రి వద్దకు వచ్చి ‘ఆర్యా! మాదగ్గర, ఎంతప్రయత్నం చేసినా, లక్ష్మిఎందుచేత నిలబడలేదు. అని ప్రశ్నించారు. తండ్రి ఒక్కొక్కనీ సంబోధిస్తూ యిలా చెప్పాడు.
‘ధూర్తకర్మా! జూదం మొదట్లో లాభాన్ని తెచ్చినట్లు కనిపించినా క్రమ క్రమంగా మొత్తం ధనాన్ని హరించివేస్తుంది. నీ ధూర్తబుద్ధి నిన్ను ద్యూతం వైపు నడిపించి నాశనం చేసింది.
‘నాన్నగారూ! మరినాకేది దారి? లక్ష్మీకటాక్షం కలిగేది ఎట్లు?’
‘పుత్రా! తీర్థాల, వ్రతాల ప్రభావం వల్ల ముందుగా పాపం నశిస్తుంది. తల్లి దండ్రులు చెప్పినట్లు చెయ్యాలి. ముందు మేము చెప్పేది వినాలి.’ అంటూ రెండవవాని వైపు తిరిగి ఇలా అన్నాడు తండ్రి.
‘పుత్రా! వ్యభిచారం ఆరోగ్యనాశిని, ద్రవ్యవినాశినియేకాదు, మహాపాపం కూడా. దీనికి విరుగుడు బ్రహ్మచర్యమొక్కటే. బ్రహ్మచర్యవ్రతాన్ని కఠోరంగా పాటించి బ్రహ్మ పరాయణుడవైన నాడు నీకు సకల శుభములూ కలుగుతాయి.’ అని చెప్పి మూడవ వానిని సంబోధించి ఇలా అన్నాడు.
‘నాయనా విషయలోలా! మాంసభక్షణమూ మదిరాపానమూ అన్ని అనారోగ్యాలనూ కొనితేవడమే కాక పాపాలనూ వృద్ధిచేస్తాయి. వీటివల్ల దొంగతనమూ, దానివల్ల నరకమూ కలుగుతాయి. నీపాపాలన్నీ కరిగిపోవాలంటే ఐశ్వర్యసంపన్నుడూ, సర్వోత్తమ భగవానుడూ, జగత్పతీయైన విష్ణువును వ్రతపూర్వకంగా ఆరాధించి, మిగిలివున్న ద్రవ్యాన్నంతటినీ ఆయన పూజలకే వెచ్చించి మౌనంగా భోజనం చేస్తూ వుండు.’
నాలుగవ వానితో ఇలా చెప్పాడు విష్ణుస్వామి. ‘బాబూ! నువ్వు ముందు దేవనింద మానుము. తరువాత నాస్తికభావాలనూ, నాస్తిక సాంగత్యాన్నీ మనసులోంచి కూడా తుడిచిపారవేయుము. శుద్ధ ఆస్తిక మార్గాన్ని అవలంబించు. ఆత్మ శుద్ధిచేసుకొని బుద్ధిగా, సమస్త ప్రాణుల హృదయగృహాలలోనూ వుండే దేవతాగణాలన్నీ పరమాత్మరూపాలే అని గ్రహించి అందరినీ పూజించు.’
వారు తమ తండ్రి చెప్పిన సాధనలన్నింటినీ మిక్కిలి శ్రద్ధతో పాటించారు. ఒక యేడాదిలోనే, పరమశివుడు వారిని చూసి జాలిపడి వారికి సంజీవని విద్యను ప్రదానం చేశాడు. వారు దానిని గ్రహించి వెనుకకు వస్తుండగా వనంలో ఒక పులి కళేబరం కనిపించింది. వారిలోనొకడు వెంటనే దాని ఎముకలనన్నింటినీ ఒకచోట చేర్చి మంత్రం జపిస్తూ వాటిపై జల్లాడు. పులికి అస్థిపంజరమేర్పడింది. రెండవవాడు జల్లిన మంత్ర జలం వల్ల ఆ పంజరానికి మాంసపుష్టి కలిగింది. మూడవవాని మంత్రజలం దానికి రక్తాన్నీ, చర్మాన్నీ పుట్టించగా, నాలుగవవాని మంత్రజలం దానికి ప్రాణం పోసింది. అది వెంటనే లేచి ఆ నలుగురినీ చంపుకు తినేసింది. ఆవిధంగా మూర్ఖుల ప్రాణాలు ఆవిరులలో కలిసిపోయాయి. అని చెప్పి ‘మహారాజా! ఈ నలుగురిలో అందరి కన్న పెద్దమూర్ఖుడెవరు?’ అని ప్రశ్నించాడు బేతాళుడు.
‘పులికి ప్రాణంపోసినవాడే అతిపెద్ద మూర్ఖుడు. చెడును బ్రతికించరాదు.’ అని బదులిచ్చాడు మహారాజు.
(ఈ పద్మావతి కథ, దీని తరువాతిదైన మధుమతి కథ గీతాప్రెస్ గోరఖ్‌పుర్ వారి భవిష్యపురాణ ప్రతిలో లేవు. వీటిని సంస్కృతి సంస్థాన్, వేదనగర్, బరేలి వారి పురాణం నుండి స్వీకరించడం జరిగింది. సంపాదకులు శ్రీరామ్ శర్మ ఆచార్య.)
విక్రమాదిత్యుని బుద్ధి సూక్ష్మతకూ వివేచనాసక్తికీ, శక్తికీ సంతోషిస్తూ మరొక కథను చెప్పసాగాడు బేతాళుడు.
‘మహారాజా! మహేశ్వరుడు స్వయంగా కొలువుండే వారణాసీపురిని ప్రతాప ముకుట మహారాజు పాలిస్తుండేవాడు. అతని పుత్రుడు వజ్రముకుటుడు. అతడే యువరాజు. మంత్రి కొడుకైన బుద్ధిదక్షుడూ, రాకుమారుడు వజ్రముకుటుడూ ప్రాణస్నేహితులు. కలిసే చదివేవారు; కలిసే పెరుగుతున్నారు. ఒకమారు వారిద్దరూ కలిసి వనవిహారానికి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళాక వారికొక సుందర ఉద్యానవనం కనిపించింది. పువ్వులు, పక్షులు, మంచిమంచివాసనలు, మందమలయ మారుతాలూ, ఇవన్నీ రాకుమారుని ఢీకొని అతనిలో ఏదో మధురమైన ఊహలను పుట్టించాయి గాని పేరుకు తగిన వాడైన మంత్రికుమారుడు బుద్ధిదక్షుని తాకినా మనసులోకి వెళ్ళలేకపోయాయి. కాస్త ముందుకుపోయి చూడగా ఈ నీటిమీదికి గాలికి ఆలయం దొరికింది. అక్కడొక పరమ రమణీయమైన సుందర సరోవరమొకటి గోచరించింది. ఆ సరోవర తీరాన ఒక అద్భుతమైన శివాలయం ఉంది. అక్కడికి మహామునులు వచ్చిపోతుంటారు. ఈ యువకులిద్దరూ ఆ శివాలయంలోనికి వెళ్ళి పురహరుని దర్శించుకొని చాల ఆనందించారు.
ఈలోగా అక్కడికి కర్ణాటకరాజు దంతవక్త్రుని కూతురైన పద్మావతి వచ్చింది. ఆమె అందాన్ని చూసి యువరాజు మూర్ఛపోయాడు. ఆమె కూడా అతనిని చూసింది ఆకామిని ఏ కామవికారాన్నీ ప్రదర్శించలేదు కాని ఆమె కూడా అతని అందాన్ని చూసి మోహించింది. రాకుమారునికి తెలివివచ్చి చూసేసరికి ఆమె శివమందిరం వెలుపలికి వచ్చివేసి సఖీజనం పరివేష్టించియుండగా సరస్తీరాన వుంది. అతడు ‘పరమశివా! నన్ను రక్షించు’ అంటూ బయటకు వచ్చి ఆమెను చూశాడు. ఆమె ముఖం ప్రసన్నంగా పెట్టి ఒక పద్మాన్ని శిరస్సుపై నుంచుకొని మరల దానిని తీసి పట్టుకుంది. మరల దానిని చెవికి ఆనించి, దంతాలమధ్య సున్నితంగా పెట్టుకొని కంఠానికి అంటించుకొంది. మరల దానిని పాదాలవైపు పోనిచ్చి పైకితీసి హృదయంలోకి దూర్చుకున్నట్లు అభినయించి ‘అర్థమైందా’ అన్నట్లు చూసి తన చెలులతో నిష్క్రమించింది. ఆ తరువాత తన తండ్రితో కలిసి మిగతా తీర్థాలను సేవించుకుంటూ వెడలిపోయింది.
యువరాజు మోహాక్రాంతుడై మరల మూర్ఛపోయాడు. మంత్రి కుమారునికి పద్మావతి చేసిన సంజ్ఞల సంగతి ఇంకా తెలియలేదు. రాకుమారుడు మూర్ఛతేరిన వెంటనే తనలో తాను నవ్వుకుంటూ అతనిని మందిరంలో దిగవిడచి తన పనిమీద పక్క ఊరికి వెళ్ళాడు. ఈలోగా రాకుమారుని కామజ్వరం అతని పీకల మీదకి వచ్చింది. కంట చూపులేదు, నోట మాటలేదు. జబ్బు మనిషిలాగా అయిపోయి శయనాగారమును వీడుట లేదు. ఎవరికీ ఏమీ చెప్పుకోలేడు. రాజుగారు కంగారుపడి మంత్రి కుమారుని వెంటనే రమ్మని కబురుపెట్టారు. బుద్ధిదక్షుడు వచ్చి అతనికి అప్పటికే కొంత తెలుసు కాబట్టి మిగతా విషయాన్నంతటినీ రాకుమారుని నుండి అతి కష్టం మీద రాబట్టాడు. ఆమె ఎవరో ఎవరి కన్యయో ఎక్కడి చిన్నదో తెలియక సతమతమైపోతున్న యువరాజుతో ఇలా అన్నాడు మంత్రికుమారుడు. ‘మిత్రమా! ఆమె చేసిన సైగలను ఆ పరమశివుని ఆలయం వద్దే నువ్వు నాకు చెప్పి వుంటే నీకింత బాధ కలుగకనేపోను. నువ్వు విరహంలో పడి వివేచించలేదు. కాని ఆమె తన చిరునామానూ, మనో నిశ్చయాన్నీ నీకు సైగల ద్వారా తెలియజేసింది. ఆమె పేరు పద్మావతి. కర్ణాటక రాజైన దంతవక్త్రుని కూతురు. నిన్ను తన హృదయంలో నిలిపేసుకుంది. నీకోసం ఎదురుచూస్తూనే వుంటుంది. ఇదీ ఆ సైగలభావం.’ వెంటనే రాకుమారుడు వింటిని విడచిన బాణం లాగా లేచి రాజుగారి వద్దకు దూసుకుపోయాడు. మంచం పట్టేసిన వాడు మరల మంచుకడిగిన మల్లెపూవులాగా మిలమిలలాడిపోవడాన్ని చూసి రాజే ఆశ్చర్యపోయాడు. మంత్రి కుమారుడు మహారాజుతో రాకుమారుని ఆరోగ్యం ప్రస్తుతానికి కుదుట పడినట్లు కనిపించినా అసలు రోగం అలాగే వుందనీ, యువరాజే స్వయంగా కర్ణాటక రాజ్యానికి వెళ్ళి ఔషధసేవనం చేస్తే గాని పూర్తిగా నశింపదనీ, తానూ, యువరాజూ కర్ణాటక వెళ్ళి రావాలనీ విన్నవించి ఆయన అనుమతిని, ఆశీర్వాదాన్నీ పొందాడు. ఇద్దరూ జవనాశ్వాల నధిరోహించి దంతవక్త్రుని రాజధానిని చేరారు.
అక్కడ అంతఃపురంలో పనిచేసే ముసిలిదాసి నొకతెను పట్టి ధనమిస్తామని ఆశపెట్టి పద్మావతికి ఇలా కబురు పెట్టారు, ‘నీవు జ్యేష్ఠ శుక్లపంచమీ సోమవారం నాడు సరోవరం వద్ద చూసిన అందగాడు నీకోసమే వచ్చి నావద్ద నున్నాడు.’ ముసిలిదాసి ఇలా చెప్పగానే పద్మావతి కోపంగా ‘ఓసి దుష్టురాలా! ఇలా రావే ‘ అంటూ ఎర్ర చందనం పూయబడివున్న తన ఉంగరం వేలితో ఆమె కపోలాలను మూడు మార్లు తట్టి అక్కడినుండి వెళ్ళిపోయింది. ఈ సైగను బట్టి మూడు రోజుల తరువాత యువరాజును రమ్మన్నదని పోల్చుకున్నారు యువకులు. మూడురోజులు కాగానే ముసలిదాసి మరల రాకుమారితో ఇలా అన్నది. ‘అమ్మాయిగారూ! మీ అందగాడు మీకోసం చూసి చూసి అన్నపానాదులు సొక్కక అలమటిస్తున్నాడు. నీదర్శనాన్ని శీఘ్రమే కాంక్షిస్తున్నాడు.’ పద్మావతి సన్నగా నవ్వుతూ తన చేతి ఉంగరాన్ని దక్షిణం వైపున్న గవాక్షం వైపు విసిరింది. ఈ సైగను రాకుమారుడు అర్ధంచేసుకొని అర్ధరాత్రి ఆమె తెఱచి వుంచిన దక్షిణ గవాక్షం ద్వారా ఆమెను చేరుకున్నాడు. ఇరువురూ కాముకులే కావడంతో ఒక నెలరోజులపాటు అన్ని అవధులనూ దాటి ఒకరినొకరు అనుభవించారు. అప్పటికి రాకుమారునికి మంత్రికుమారుడు గుర్తుకువచ్చి తమ కలయికకు ఆ బుద్ధిదక్షుని సునిశిత మేధయే కారణమని పద్మావతికి చెప్పి అతనినొకమారు చూసి వస్తాననన్నాడు. అతనినొక్క మారు చూసి మాట్లాడి వెంటనే వెనక్కి వచ్చేస్తానన్నాడు. ఆమె అతి కష్టం మీద అంగీకరించి అతనిని వీడ్కొలుపుతూ ‘మనిద్దరినీ కలిపిన ఆప్తమిత్రుడు బుద్ధిదక్షునికి నాతరపున నివేదించండి.” అంటూ పాయసాన్ని పంపించింది. అందులో అన్ని మధుర, సుగంధ, రుచికర పదార్థాలతో బాటు కాస్త విషం కూడా కలిపింది.
రాజకుమారుడు తన మిత్రుని కలుసుకున్నాడు. ఈ నెలరోజులూ బుద్ధిదక్షుడు చిత్రగుప్తుని పూజలు, ఉపాసన చేశాడు. రాకుమారుడతనికి తన ప్రేయసి ఎంతో ప్రీతితో నివేదించిన పాయసాన్నిచ్చాడు. అతడు దానిని పక్కన పెట్టేశాడు. ఎంతసేపు చూసినా అతడు దానిని ముట్టుకోకపోయేసరికి యువరాజుకు కోపం వచ్చి మిత్రునిపై చిందులేశాడు. బుద్ధిదక్షుడు నవ్వుతూ అక్కడ తిరుగుతున్న ఊరకుక్కల్లో రెండు కాళ్ళు లేని దానిని వెదకి దానికి ఈ పాయసాన్ని పెట్టాడు. అది వెంటనే చచ్చిపడిపోయింది. యువరాజుకి మరింత కోపం వచ్చింది. ఈమారు తన ప్రేయసి మీద. పద మిత్రమా! ఇంటికి పోదాం. ఈ కామిని ముఖం కూడా ఇక చూడను. ఇటువంటి దుష్టురాలిని ప్రేమించడమే మహాపాపం అంటూ బయలుదేరాడు.
బుద్ధిదక్షుడు గట్టిగా నవ్వి ‘కోపం వద్దు మిత్రమా! ఆమె నన్ను చంపాలనుకొనివుండదు. అయినా, ఆమెకూ, నెల్లాళ్ళపాటు నువ్వు అంతఃపురంలోనే వున్నా పోల్చుకోలేని ఆ రాజుకూ గట్టిబుద్ధి చెప్పాలి. నువ్వు మళ్ళా ఆమె వద్దకుపోయి ఆమె అలంకారాలను కొన్నిటిని అపహరించుకొనిరా. ఆమె మోకాలిపై ఇంతవేగం చెరగని త్రిశూలం ముద్రను, ఈ పదార్థమును నీటిలో తడిపివేసి వచ్చెయ్యి,’ అని చెప్పాడు. యువరాజు సంతోషంగా వెళ్ళి అలాగే చేసి వచ్చాడు.
అపుడు వారిద్దరూ రుద్రమండల శ్మశానానికి వెళ్ళారు. సన్యాసివేషాలు వేసుకున్నారు. మంత్రికుమారుడు గురువులాగానూ రాకుమారుడు శిష్యుడుగాను వేషం కట్టారు. మహాయోగి వేషంలో నిజంగా మహాయోగీశ్వరుని వలెనే తేజస్సున్న మంత్రి కుమారుడు రాకుమారుని పిలచి ‘శిష్యా! ఈ స్వర్ణాభరణాన్ని రాజుగారి ద్వారం వద్దకు పోయి అమ్ముకొని రమ్ము’ అన్నాడు. శిష్యుడలాగే చేసి రాజభటులకు పట్టుబడ్డాడు. వారితనిని దొంగగా భావించి దంతవక్త్ర రాజు వద్ద ప్రవేశపెట్టారు. రాజుల ఆభరణాలకు కొన్ని ప్రత్యేకతలుంటాయి. అందుచేత ఈఆభరణం తన ఇంటిదేనని పోల్చినరాజు ‘ఓ సన్యాసీ! ఈ ఆభరణం నీకెలా దొరికింది? అని అడిగాడు. మాగురువుగారైన మహాయోగీశ్వరుడు గారిచ్చారు. ఆయన రుద్రభూమిలో వున్నారు.’ అని యువరాజు చెప్పగానే రాజు భటులను పంపించి బుద్ధిదక్షుని తన కొలువుకి రప్పించాడు. అతనినీ ఇలాగే, కాస్త మర్యాదగా అడిగాడు.
‘మహారాజా! నేను మరుభూమిలో మంత్రోపాసన చేస్తుండగా ఎవరో పిశాచి వచ్చింది. నాపూజకు అడ్డువచ్చిందని నేను దాని మోకాలి పైన కాల్చిన త్రిశూలం గుర్తు పెట్టాను. అది భయపడిపోయి నాకీ అలంకారాలనిచ్చి పారిపోయింది. అది ఎక్కడున్నా అశుభమే. అందుకే దాని జాడ తెలుసుకోవడానికే నా శిష్యుని ఇలా చెప్పి పంపించాను.’ అని చెప్పాడా గురువు.
వెంటనే రాజు ఆ పిశాచి పద్మావతియేననుకొని ఆమెకు దేశ బహిష్కార శిక్ష విధించాడు. ఊరి పొలిమేరల్లో ఆమె కోసమే కాచుకొనియున్న యువరాజు ఆమెను పరిగ్రహించి తన రాజ్యానికి తీసుకువచ్చి వివాహం చేసుకున్నాడు. మంత్రికుమారుడు మాత్రం ‘ఈ మొత్తం వ్యవహారంలో నాకు చిత్రగుప్తుని ఉపాసించడానికి ఒక నెల సమయం దొరికింది. ఈ వృత్తాంతంలో జరిగిన పాపాలను ఎలా రాస్తాడో ఏమో’ అని గొణిగాడు.
ఇంతవఱకు చెప్పి, కాస్త ఆగి, ఇలా ప్రశ్నించాడు బేతాళుడు ‘మహారాజా ఇంతకీ ఈ కథలో జరిగిన పాపాలేవి? ఎవరు కర్తలు?’
‘బేతాళా! కార్యార్థులమై వున్నపుడు చిన్నవో, పెద్దవో తప్పులు చెయ్యడం అందరికీ సహజమే. మంత్రికుమారుడు విషాన్ని కుక్కకు పెట్టడం అలాటిదే. కుక్క కుంటిదైనా ప్రాణం, ప్రాణమే, పాపం పాపమే. ఇక పద్మావతి, వజ్రముకుటులు వివాహాత్పూర్వమే కామభోగాలననుభవించడం పాపం. మొత్తం కథలో మహాపాపి దంతవక్త్ర మహారాజు. ప్రజలను కన్నబిడ్డలను వలె కనిపెట్టుకోవాలని రాజధర్మం చెప్తుంది. అలాటిది ఈయన కన్నబిడ్డనే కనిపెట్టుకోలేదు. చిన్ననాడే ఆమె రజోగుణాన్ని పోల్చుకొని చిన్నప్పుడే ఆమెకు పెళ్ళిచేసి పంపించివేయవలసింది. అలా చేయకపోగా తనతో తీర్థయాత్రలకు బయలుదేరిన మనిషి ఎవరితో ఎలా మసలుకుంటోందో చూసుకోవాలనే ఆలోచన కూడా ఆయనకి వచ్చినట్టులేదు. తన అంతఃపురంలో పరాయిదేశపు రాకుమారుడు నెల్లాళ్ళపాటు వుండగలిగాడంటే, రాజభక్తి వుండవలసిన ముసలిదాసి ధనానికి అమ్ముడుపోయిందంటే ఇవన్నీ రాజరిక వ్యవస్థ వైఫల్యాలే కాబట్టి మహారాజు నిర్లక్ష్యవైఖరియే మహాపాపం’ అని బదులిచ్చాడు విక్రముడు.
ప్రసన్నుడై బేతాళుడు చివరి కథను ప్రారంభించాడు.
‘మహారాజా! యమునా నదీ తీరానగల ధర్మస్థలీపురంలో హరిశర్మయని, గొప్ప పురోహితుడుండేవాడు. ఆయన గొప్ప అవిరళజపహోమతత్పరుడు. అతని భార్య సుశీల పేరుకు తగినట్టుగానే పతివ్రత, మంచి స్వభావము కలది. అతని పుత్రునిపేరు సత్యశీలుడు. ఇతడు అన్ని విద్యలనూ అధ్యయనం చేయడంలో తత్పరుడు, గొప్పగురుభక్తి గలవాడు. హరిశర్మ కూతురే మధుమతి. అతని కడగొట్టు సంతానం. ముద్దుగా పెరిగినా సద్గుణాల ప్రోవు ఈ మధుమతి. ఆమెకు యుక్తవయసు రాగానే ఆమె తండ్రీ, అన్నా వివాహానికి తగిన వరుని కోసం ప్రయత్నించసాగారు. ఒక వివాహమహోత్సవానికి పండిత పరిషత్తును ఏర్పాటుచేశారు. దానికెందరో మహాపండితులు వచ్చారు. దానికి విచ్చేసిన వామనుడనే వేద వేదాంగవిధుడు, అఖిల విద్యాపారంగతుడు రాజపురోహితుడైన హరిశర్మ ఇంటిలో దిగాడు. అతనికి ఆతిథ్యమిచ్చాడు హరిశర్మ. మధుమతి అతనిని చూసి ప్రేమించింది. ఈ మోహంలో పడి అన్నపానాదులను, విద్య, నిద్రలను కూడా త్యజించింది. అదే సభలో పాల్గొన్న మహా వేదవిద్యాసంపన్నుడైన త్రివిక్రముడను ద్విజుని చూసి ముచ్చటపడిన హరిశర్మ తన పుత్రికనిచ్చి వివాహం చేస్తానని చెప్పాడు. ఈలోగా సత్యశీలుడు తన గురుపుత్రుడైన కేశవుని అందచందాలనూ, అధ్యయన, అధ్యాపనాలనూ చూసి ఆనందపరవశుడై అతనికి తన చెల్లెలినిస్తానని మాట యిచ్చి వచ్చాడు. మధుమతి ప్రేమించిన వామనుడు ఆమె తల్లికి కూడా నచ్చాడు. ఆమె అతనిని మధుమతి పెండ్లి మాటలాడడానికి మాఘకృష్ణత్రయోదశి నాడు వచ్చి తన భర్తను కలుసుకొమ్మని చెప్పింది. దైవికంగా త్రివిక్రముని హరిశర్మా, కేశవుని సత్యశీలుడూ అదే రోజు రమ్మని ఆహ్వానించారు. కాని, అదే రోజు ప్రొద్దున్న మధుమతి పాముకాటుకి గురై మరణించింది. పెళ్ళికొడుకులు ముగ్గురికీ ఆమె మృతదేహమే దర్శనమిచ్చింది.
ఆ ముగ్గురూ ఆమెను ప్రేమించిన వారే. ఈ దుర్ఘటనను చూసి తట్టుకోలేక ఆమె దహన సంస్కారాలు పూర్తయ్యేదాకా అక్కడే వుండిపోయారు. వామనుడామె చితాభస్మాన్ని తెచ్చుకొని దానివైపే చూస్తూ మధుమతినే ధ్యానిస్తూ వుండిపోయాడు. గురుపుత్రుడైన కేశవుడు ఆమె అస్థికలను మూటకట్టి తెచ్చుకొని ఆమె ధ్యానంలోనే జీవిస్తూ మనశ్శాంతి కోసం తీర్థయాత్రలు చేయసాగాడు. త్రివిక్రముడు సంసారంపైనే విరక్తిచెంది యతిగా మారిపోయి ఊళ్ళు తిరగసాగాడు. ఒకరోజు లక్ష్మణపురి అనే నగరంలో శివాలయంలో జపం చేసుకుంటున్న ఈ త్రివిక్రముని రామశర్మయను ఒక పరమశివభక్తుడు శివాలయంలో చూసి తన యింటికి అతిథిగా ఆహ్వానించాడు. వీరు ఇంటికి వెళ్ళిన సమయానికే ఆగృహంలోని బాలకుడొకడు పాముకాటువల్ల మృతిచెందాడు. రామశర్మ వెంటనే సంజీవనీ మంత్రాన్ని జపిస్తూ ఆబాలకుని శరీరాన్ని నిమరగా వాడు పునర్జీవితుడయ్యాడు. త్రివిక్రమునికి సంతృప్తికరంగా భోజనం పెట్టి అతని జాలిగాథను విన్న రామశర్మ కరుణాతరంగితుడై సర్వాంగీణంగా, సంజీవనీ మంత్ర విద్యను త్రివిక్రమునికి ఉపదేశించాడు. త్రివిక్రముడు వెంటనే నిర్విరామంగా జపం చేస్తూ మధుమతిగారి వూరికి బయలుదేరాడు. ఇతడు వెళ్ళేసమయానికి ఆవూరి యువరాజు మరణించాడు. త్రివిక్రముడు రాజు మందిరానికి పోయి వానిని బ్రతికించాడు. ‘స్వామీ! మీరు ఏ ఆజ్ఞ ఇచ్చినా శిరసావహిస్తాను. ఏదో ఒక సేవను నాచేత చేయించుకోండి’ అని తనను ప్రార్థించిన రాజుగారితో త్రివిక్రముడిలా అన్నాడు.
‘మహారాజా! నేనొక మనిషిని బ్రతికింపవలసియున్నది. ఆ మనిషి అస్థికలను మోసుకుంటూ కేశవనామధారియైన బ్రాహ్మణోత్తముడొకడు తీర్థయాత్రలు చేస్తున్నాడు. ఎలాగైనా వానికి నా విషయం చెప్పి ఇక్కడికి తీసుకొని రావాలి.’
సమర్థుడు, కృతజ్ఞుడునైన రాజునకసాధ్యమేముంది? కేశవుని పట్టుకొని అతనికి విషయమంతా చెప్పి అనతికాలంలోనే రాజుగారి చారులు తీసుకువచ్చారు. మంత్రసాధకుడైన త్రివిక్రముడు హోమం చేసి కేశవుడు తెచ్చిన అస్థికలను ఒక క్రమంలో పెట్టి, వామనుడు యిచ్చిన భస్మాన్ని వాటిపై జల్లి మొత్తం ప్రేతాన్ని హోమగుండంలో ప్రవేశపెట్టి సంజీవనీ మంత్రాన్ని జపించగా, సంజీవనీ మంత్రజప హోమాలఫలంగా, త్రివిక్రముని దయవల్ల, మధుమతి మరల జీవితురాలై మరుని బాణంలాగా హోమగుండంలో నిలబడింది.
ఆమె బయటికి రావడంతో తల్లి, తండ్రి, అన్నలతో బాటు ముగ్గురువరులూ సంతోషించారు. ఎవరూ తొందరపడి యేమాటా బయటికి అనడం లేదు కాని అందరి మనస్సులలో సుళ్ళు తిరుగుతున్న ప్రశ్న ఒకే ఒక్కటి. మధుమతి ధర్మం ప్రకారమైతే ఈ మువ్వురిలో ఎవరిని పెండ్లాడాలి?
‘విక్రమాదిత్యమహారాజా! మీరే దీనికి, వివరణ పూర్వకంగా, ధర్మసూక్ష్మాధారంగా జవాబు చెప్పగలరు. చెప్పండి.’ అని ఆపాడు బేతాళుడు.
అపుడు విక్రమాదిత్యుడిలా వచించాడు. ‘ఓ మహామతీ! ప్రాణదానం చేసిన త్రివిక్రముడు మధుమతికి తండ్రి వంటివాడు. అస్థికలనిచ్చిన కేశవుడు సోదర సమాన డౌతాడు. ఇక పరమ శైవాగమానుసారం భస్మం అత్యద్భుతమైన అలంకారం. అలంకారాలను,సొమ్ములను పెట్టేవాడు భర్త, కాబట్టి ఆమెను వామనుడే వివాహమాడాలి.’
‘విక్రమాదిత్య మహారాజా! శంకర భగవానుల ఆజ్ఞపై నేను నీవద్దకు వచ్చాను. నీధర్మబుద్ధినీ, విజ్ఞానాన్నీ పరీక్షించి చూసి ప్రసన్నుడనయినాను. నేను నీ భుజాలపైనే అదృశ్యంగా నివాసముంటాను. నీవు సర్వభూపతులనూ గెలిచి చక్రవర్తివి కాగలవు.
మనక్షేత్రాలూ, పురాలూ, నగరాలూ, దేవాలయాలూ, దస్యులద్వారా నాశనం చేయబడ్డాయి. ముందు వాటిని స్వాధీనం చేసుకొని శాస్త్రప్రకారం శుద్ధిచేయించి వాటికి మరల పూర్వవైభవాన్ని ప్రసాదించడం నీప్రథమ కర్తవ్యం. న్యాయపూర్వకంగా పృథ్విని శాసించి, ధర్మాన్ని మరల నాలుగు పాదాలపై నడిపించి, నీవు యుగపురుషునిగా, శకపురుషునిగా భారతవర్షచరిత్రలో నిలిచిపోగలవు’ అంటూ అదృశ్యమైనాడు. బేతాళుడు.
విక్రమాదిత్యుడు మునులను పూజించి వారి నిర్దేశకత్వంలో నడుస్తూ అశ్వమేధయజ్ఞాన్ని జయప్రదంగా చేసి చక్రవర్తియై భారతదేశాన్ని పెక్కేండ్లు పరిపాలించి దేహాంతంలో స్వర్గప్రాప్తిని పొందాడు.”
(దక్షిణంలో తప్ప మిగతా భరతఖండమంతటా ఇప్పటికీ ప్రాచీనపంథాలో వ్రాయబడిన, బడుతున్న గ్రంథాలలో క్రీస్తుశకం కనబడదు. విక్రమశకమే కనబడుతుంది. వారు ఈ రోజు తేదీని కూడా విక్రమసంవత్ వి. సం. అని వ్రాస్తారు. ఒకప్పుడీ దేశంలో మహాభారత నాయకుడు ధర్మరాజు పేర యుధిష్ఠిరశకం వ్యవహారంలో వుండేది. ఇపుడు విక్రమశకముంది. అనగా విక్రముడు అంత గొప్పవాడని అర్థం.)