“భగవన్! ఇంకా నాకు వివిధ ఉత్తమ దానాల విధి మాహాత్మ్యాలను తెలుసుకోవాలని వుంది. కొన్ని దానాలు చేసిన వారిని దేవగణాలూ, ఋషి సమూహాలు కూడా పూజిస్తారని విన్నాను. అవేవో ఆదేశించండి” అడిగాడు ధర్మజ్ఞుడు. చెప్పనుద్యుక్తుడైనాడు సర్వజ్ఞుడు.
“మహారాజా! ప్రాచీనకాలంలో మహాదేవుడు పరమశివుడు నారదునికీ, మత్స్య భగవానుడు స్వాయంభువ మనువుకీ దశవిధ పర్వత దానాన్నుపదేశించారు. వేద - పురాణ అధ్యయనాలూ, యజ్ఞానుష్టానాలూ, దేవమందిరాది నిర్మాణాలూ చేసినా రానంత గొప్ప ఫలం ఈ దానం వల్ల వస్తుంది. ముందు నేను ఆ పర్వత దాన విధానాలకు ముందు వాటి పేర్లను క్రమంగా చెప్తాను. ధాన్య శైల, లవణాచల, గుడాచల, హేమ పర్వత, తిలశైల, కర్పాస పర్వత, ఘృతశైల, రత్నశైల, రజత శైల, శర్కరాచల దానాలవి. ఆ దానవిధానాలు యధార్ధ రూపంలో క్రమంగా ఇలా వుంటాయి:
సూర్యుని అయనకాలాల్లో, పుణ్యకాలాల్లో, విషువ యోగంలో, వ్యతీపాతయోగాల్లో, గ్రహణాల్లో సూర్యచంద్రుల దృశ్యమయ్యాక, శుక్ల తదియ, ద్వాదశిలలో, పున్నముల్లో, వివాహ ఉత్సవ యజ్ఞ సమయాలలో, శుభ నక్షత్ర యోగాల్లో ఎపుడైనా విద్వాంసుడైన దాత శాస్త్రాదేశానుసారము విధిపూర్వకంగా మిక్కిలి శ్రద్ధాభక్తులతో ఈ పర్వత దానాలను చేయాలి. తీర్థాల్లోగాని, కోవెలలోగాని, గోశాలలోగాని, ఏదైనా నదీసంగమ ప్రదేశంలోగాని ఒక చతురస్రాకార మండపాన్ని నిర్మించాలి. దానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో ద్వారాలను పెట్టించాలి. భూమి పూర్వోత్తర దిశల్లో వుండాలి (వాలు). ఆ మండపంలో కొంతమేర ఆవు పేడతో బాగా అలికించి కుశలను పఱచి వాటి మధ్యలో (సుమేరు గిరికి నలువైపులా నున్న మందర, గంధమాదన, విపుల, సుపార్శ్వ, పర్వతాలను విష్కంభ సహాయక పర్వతాలుగా వ్యవహరిస్తారు.) విష్కంభ పర్వత సహితంగా దానానికై వున్న పదార్ధాలను పర్వతాకారరాశిగా చేసి పెట్టాలి. ఈ విషయంలో వేయి ద్రోణాల పరిమాణమున్న అన్నరాశి ఉత్తమం. శక్తిని బట్టి అయిదువందల, మూడువందల ద్రోణాలను కూడ పెట్టవచ్చు. మహా ధాన్యరాశితో చేయబడ్డ మేరు పర్వతానికి మధ్యలో మూడు స్వర్ణమయ వృక్షాలను నిర్మించాలి. తూర్పున ముత్యాలతో, వజ్రాలతో, దక్షిణంలో గోమేధిక పుష్యరాగాలతో, పశ్చిమంలో గారుత్మత, నీలమణులతో, ఉత్తరంలో వైఢూర్య పుష్పరాగ మణులతో మరల నలువైపులా గంధపు చెక్కలతో, పగడాలతో అలంకరించాలి. లతలను దాని పైకెక్కించాలి. రాతిముక్కలను అక్కడక్కడ తెచ్చి వేయాలి. యజమాని గర్వరహితుడై కొంతమంది ద్విజసమూహాలతో కలసి ఆ పర్వతానికి మూర్ధ స్థానంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులనూ సూర్యభగవానుని (స్వర్ణ మూర్తులను) స్థాపించాలి.
నలువైపులా చెఱకు, వెదురు ముక్కలతో గుహలనేర్పాటు చేయాలి. నేతితో నీటితో చిన్న చిన్న సెలయేళ్లను కూడా నిర్మింపజేయాలి. మరల తూర్పువైపు తెల్ల బట్టలతో, దక్షిణం వైపు నల్లగుడ్డలతో, పశ్చిమ దిశలో బూడిదరంగు, ఉత్తర దిశలో రక్త వస్త్రాలతో మేఘపంక్తులను నిర్మించాలి.
తరువాత మహేంద్రాది దిక్పాలకుల వెండి మూర్తులను క్రమంగా స్థాపించాలి. పర్వతానికి నాలుగు వైపులా పండ్లను, సుమనోహర పుష్పమాలలనూ, చందనాన్నీ వుంచాలి. పర్వతంపై అయిదురంగుల చద్రోవా ఏర్పఱచి దానిని వికసించిన శ్వేతపుష్పాలతో అలంకరించాలి. ఈ రకంగా శ్రేష్టమైన అమరశైలం (సుమేరుగిరి) స్థాపనచేసి దాని నాలుగు దిశల్లో క్రమంగా విష్కంభ పర్వతాలను కూడా నిర్మింపజేయాలి. అన్నీ పుష్ప, చందన శోభితాలై వుండాలి. తూర్పులో మందరాచలాకారాన్ని తేవాలి. దాని సమీపంలో పలురకాల ఫలవృక్షశ్రేణులు, దేవదారు, కదంబ వృక్షములూ చిహ్నితాలు కావాలి. దానిపై మన్మధుని స్వర్ణ ప్రతిమనుస్థాపించాలి. తరువాత వెండి రేకులతో నొక వనాన్నీ పాలతో అరుణోద నామక సరస్సునీ నిర్మించాలి. వస్త్ర, పుష్ప చందనాదులు ఎక్కడ చూచినా కనిపించేటంతగా వుంచాలి.
దక్షిణ దిశలో గోధుమను రాశి పోసి గంధమాదనాన్నీ రచించాలి. దానిపై స్వర్ణపత్రము నుంచాలి. దానిపై యజ్ఞపతి యొక్క స్వర్ణమయమూర్తి నుంచి దానిని వస్త్రాలతో చుట్టాలి. పశ్చిమదిశలో అనేక సుగంధిక పుష్పాలనూ, స్వర్ణమయ పీపల వృక్షాన్నీ బంగరు హంస బొమ్మనీ పెట్టి తిలాచలాన్ని స్థాపించాలి. దీనిని కూడ వస్త్రాలతో చుట్టి, దాని ప్రక్కన వెండి వనాన్ని యేర్పాటు చేయాలి. దీని అగ్రభాగంలో సితోదమనే సరస్సుని పెరుగుతో నిర్మింపజేయాలి. ఈ విధంగా ఆ విపులశైలాన్ని కట్టి ఉత్తరదిశలో ఉడద ధాన్య రాశులతో సుపార్శ్వమను పర్వతాన్ని నిర్మించాలి. దాన్ని కూడా సుందర వస్త్రాలతో పుష్పాలతో సుసజ్జితం చేసి, శిఖరంపై బంగారంతో చేయించిన మఱ్ఱిచెట్టునీ, ఆవునీ వుంచాలి. భద్రసర నామక సరస్సుని తేనెతో నిర్మించి వెండి వనాన్ని కూడా చేయించి పెట్టాలి. తరువాత తూర్పువైపు ఒక హస్తంపొడవు, వెడల్పు, లోతులతో నొక కుండాన్ని తీర్చి నలుగురు బ్రాహ్మణ శ్రేష్టులచే నువ్వులు, నెయ్యి, సమిధలు, కుశల ద్వారా హవనం చేయించాలి. ఈ బ్రాహ్మణులు వేద పురాణ జ్ఞాతలూ, జితేంద్రియులూ, అనింద్యులూ, చరిత్రమంచిదైన వారూ, సురూపులూ అయివుండాలి. పర్వతవాహన ఇలాచేయాలి.
త్వం సర్వదేవగణధామనిధే చ విఘ్న -
మస్మద్గృహేష్వ మర పర్వత నాశయాశు ।
క్షేమం విధత్స్వ కురు శాంతి మనుత్తమాం నః
సంపూజితః పరమభక్తి మతః ప్రదేహి ॥
త్వమేవ భగవానీశో బ్రహ్మా విష్ణుర్దివాకరః।
మూర్తిమూర్తా పరం బీజమతః పాహి సనాతనః॥
యస్మాత్ త్వం లోకపాలానాం విశ్వమూర్తే శ్చమందిరం ।
కేశవార్కవసూనాంచ తస్మాచ్ఛాంతిం ప్రయచ్ఛమే ॥
యస్మాద్ శూన్య మమరైర్గంధర్వైశ్చ శివేన చ ।
తస్మాన్మాముద్ధరా శేష దుఃఖ సంసార సాగరాత్ ॥ (ఉత్తరపర్వం 1951 28-31)
ఆ తరువాత తనకు తుష్టికారకం కమ్మని మందరాచలాన్నీ, గంధర్వులచే తన యశాన్ని గానం చేయించుమని గంధమాదనాన్నీ, శక్తినిమ్మని విపులనీ, అక్షయలక్ష్మిని ప్రదానం చేయుమని సుపార్శ్వాన్నీ యజమాని పూజించి కోరుకోవాలి.
రాత్రి గీత నృత్యవాద్యాలతో పెద్ద ఉత్సవాన్ని చేయించి జాగరణ చేయాలి. మరునాటి పెందలకడనే స్నానాదులు గావించి మధ్యలో నున్న శ్రేష్ట పర్వతాన్ని యజ్ఞం చేయించిన గురుదేవునికి దానమివ్వాలి. నాలుగు విష్కంభ పర్వతాలనూ నలుగురు ఋత్విజులకూ ఇచ్చి వేయాలి. ఒక కపిల గోవును గురువుగారికి దానం చేయాలి. ధనికులైతే అందరికి ఎనిమిది నుండి ముప్పదినాలుగు దాకా గోవులను దానం చేయాలి. ధాన్యశైలాన్ని ఇలా ప్రార్థించి దానమివ్వాలి:
అన్నం బ్రహ్మయతః ప్రోక్తమన్నే ప్రాణాః ప్రతిష్ఠితాః ।
అన్నాద్ భవంతి భూతాని జగదన్నేన వర్ధతే ॥
అన్నమేవ యతో లక్ష్మీరన్నమేవ జనార్దనః ।
ధాన్య పర్వత రూపేణ పాహి తస్మాన్న గోత్తమ ॥ (ఉత్తరపర్వం 195/43,44)
వ్రతి ఉపవాసం చెయ్యాలి. పైన చెప్పిన పద్ధతిలో ధాన్యమయ పర్వతాన్ని దానం చేసినవారు నూరు మన్వంతరాల బాటు దేవలోకంలో ప్రతిష్ఠితులై అప్సరసలతో గంధర్వులతో నిండిన సుందరవిమానంలో విహరిస్తారు. స్వర్గలోకంలో పూజలందుకుంటారు. మరల పుడమిపై జన్మనెత్త వలసి వచ్చినపుడు రాజాధిరాజులై జన్మిస్తారు.