భవిష్య పురాణము

1 – ప్రతిసర్గ పర్వం - 3వ ఖండం

(ఈ ఖండం రామాంశ, కృష్ణాంశలు అనగా ఆల్హా, ఊదలుల చరిత్ర, జయచంద్ర - పృధ్వీ రాజుల వీరగాధలతో పరిపూర్ణమై వుంది. ఈ అంశాలు జగనికభట్టు గ్రంథాలలో కనిపిస్తాయి. దీనికి బుందేల్‌ఖండీ, భోజపూరీ ఆది (మున్నగు) ఎన్నో సంస్కరణ పూర్వక ప్రచురణలూ వచ్చాయి. ఎన్నో భాషల్లో స్వల్ప భేదాల్లో బహుళ ప్రచారంలో వున్న ఈ కథలన్నిటికీ మూలం భవిష్య పురాణమే. ఈ కథలను లోకరంజన కోసం ఎంతో కొంత అతిశయోక్తిని జోడించి చెప్పడం జరిగింది. అంతమాత్రాన ఇవి చరిత్రలో లేవని అనడం సరికాదు. ఈ గ్రంథంలోని ఈ ఖండం ఈ చరిత్ర సారాన్నే దృష్టిలో పెట్టుకొని చెప్పబడింది.)

శౌనకాది మహర్షులు సూతమహర్షి సత్తముని ఇలా ప్రార్థించారు. “పౌరాణికోత్తమా! మీ దయవల్ల విక్రమాదిత్య చరిత్రను తెలుసుకోగలిగాము. ఆయన శాసనకాలం ‘ద్వాపరయుగంలో లాగనే ధర్మ, న్యాయ పూర్ణమై విలసిల్లినదని విని ఆనందించాం. ఓ జ్ఞాన బ్రహ్మ! మాకు శ్రీకృష్ణ లీలలను వినాలని వుంది. దయచేసి చెప్పండి.

సూతమహర్షి వెంటనే ‘నారాయణం నమస్కృత్య’ శ్లోకం ద్వారా శ్రీకృష్ణార్జునులకునూ, సరస్కతమ్మనూ, తన గురువుగారైన వ్యాసభగవానునీ భక్తిపూర్వకంగా తలచుకొని ఇలా ప్రవచించసాగాడు.

“మునులారా! భవిష్యనామక మహాకల్పంలో వైవస్వతమన్వంతరంలో ఇరవై యెనిమిదవ ద్వాపఁ యుగాంతంలో మహా ప్రసిద్ధమైన కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అందులో దుష్టులు, దురభిమానులునగు కౌరవులతో పదునెనిమిది రోజులపాటు యుద్ధం చేసి సంపూర్ణ విజయాన్ని పొందారు పాండవులు. ఆ తరువాత ఆల్హా ఊదలుల కథ మొదలైంది.”

ఆల్హా- ఖండం - ఉపక్రమం

“ఋషులారా!” చెప్పసాగాడు సూత మహర్షి, “రాబోయే దుష్కాలగతి నెరిగిన వాడై కూడ శ్రీకృష్ణుడు ఆ చివరి రాత్రి యోగరూపుడు, సనాతన దైవమునైన పరమశివుని మనసులోనే ప్రత్యక్షం చేసుకొని ఇలా ప్రార్థించాడు-’శాంతస్వరూపా, సకలభూతాధినాథా, కపర్దీ, కాలకర్తా, జగద్భర్తా, పాపవినాశకా, రుద్రా! నీకు పునః పునర్వందనాలు. భగవాన్! నా కోరిక ఒకటే. నా భక్తులైన పాండవులను రక్షించండి.’

శివుడు నందిపై నెక్కి వచ్చి చేతిలో శూలం ధరించి పాండవ శిబిరంపైన సామాన్యుల కదృశ్యరూపుడై తిరుగాడుచుండగా చూసి సంతుష్టుడై శ్రీకృష్ణుడు ధర్మజుని రాచకార్యమునొక దానిని చక్కబెట్టుటకై హస్తినాపురమునకు వెళ్ళాడు. పాండవులు ఏదో పూజకై సరస్వతీ తీరానికి వెళ్ళి రాత్రంతా అక్కడే వున్నారు.

మధ్య రాత్రిలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు - ఈ ముగ్గురూ పాండవ శిబిరం వద్దకు వచ్చారు. అశ్వత్థామ బ్రహ్మజ్ఞాన సంపన్నుడనో లేక మిగతా ఇద్దరూ కూడా సామాన్యులు కారనో గాని శంకరుడు వారికి కనబడ్డాడు. వారు స్తుతి చేయగానే లోపలికి పోడానికి అనుమతి కూడా ఇచ్చాడు. అంతకు ముందెప్పుడో అశ్వత్థామ తపస్సుకి మెచ్చి ఈశ్వరుడిచ్చిన ఖడ్గంతో పాండవ శిబిరంలో ప్రవేశించిన అశ్వత్థామ ఆ కత్తితోనే ధృష్టద్యుమ్నాది వీరులందరినీ హత్య చేశాడు. తన మిత్రులిద్దరితో కలిసి బైటకి వెళ్ళి పోయాడు. ఈ హత్యాకాండ నుండి తప్పించుకొని బతికి బయటపడ్డ ఒకే ఒక వ్యక్తి పార్షదుడు, సూతుడు. అతడు ఈ జనసంహారాన్ని గూర్చి పాండవులకు తెలిపాడు. భీమాది పాండవులు ఆవేశంలో కన్నుమిన్ను గానక భగవంతుడైన శివుడే ఈ హత్యలు చేశాడని భ్రమపడి ఆయనపై అస్త్రశస్త్రాలతో యుద్ధానికి తెగబడ్డారు. ఆయన వీరిపై ఏ ప్రయోగమూ చేయలేదు కాని వీరి ఆయుధాలన్నీ తనలోనే వుండిపోయి మరి వెనక్కి రాకుండా చేశాడు.

‘మీరు శ్రీకృష్ణ ఉపాసకులు కాబట్టి బ్రతికిపోయారు. లేకుంటే మిమ్మల్ని వధించడం పెద్ద పనేం కాదు. అయినా మీరు చేసిన అపరాధానికి తగిన శిక్షను మీరు కలియుగంలో జన్మించి అనుభవించాలిగాక!’ అని శపించి శివుడదృశ్యమై పోయాడు. పాండవులు మిక్కిలి దుఃఖితులై శ్రీకృష్ణ భగవానునితో తమ గోడును వెళ్ళబోసుకున్నారు. శ్రీకృష్ణుడు వారితో సహా పద్మాసనస్థుడై ఏకాగ్ర చిత్తంతో శివుని స్తుతించగా ఆయన ప్రసన్నుడై ప్రత్యక్షమైనాడు. ‘మహాదేవా! పాండవుల శస్త్రాస్త్రాలన్నింటినీ తిరిగి వారికి ప్రసాదించండి. వారిని శాపవిముక్తులను చేయండి’ అని కోరాడు శ్రీకృష్ణుడు.

‘హే శ్రీకృష్ణ చంద్రా! నేను మీకు ప్రణామం చేస్తున్నాను. ఆ సమయంలో నేను మీ మాయ చేతనే మోహితుడనై పోయాననీ, ఆ మాయలోపడి క్రోధినై శాపమిచ్చాననీ నాకు ఆ తరువాత జ్ఞానోదయమైంది. వారి ఆయుధాలనీయగలను కానీ వారు ఈ లోకంలో పుట్టడం ఎప్పుడో నిర్ణయమైపోయింది. శ్రీకృష్ణ పరమాత్మా! మీకు తెలియనిదేమీ లేదని నాకు తెలిసినా, నాకు తెలిసిన భవిష్యత్తును మీ ముందుంచుతున్నాను. ఈ పాండవులూ ఆ కౌరవులూ కూడా తమ తమ అంశలతోనే ఈ భూలోకంలో కలియుగంలో జన్మించి తాము చేసిన పాపఫలాలనుభవించి ముక్తులౌతారు.

వాసుదేవా! ధర్మరాజు వత్సరాజు పుత్రుడై బలఖాని (మల్‌ఖాన్) అనే పేరుతో పుట్టి పెరిగి శిరీష నగరాధిపతి అవుతాడు. భీముడు వీరణ నామంతో వనరస ప్రాంతానికి రాజు కాగలడు. అర్జునుడు అత్యంత బుద్ధిమంతునిగా పరిమళుడను వానియింట బ్రహ్మానంద నామంతో పుట్టి నా పరమభక్తునిగా పెరుగుతాడు. మహాబలశాలి నకులుడు కన్యాకుబ్జంలో రత్నభానుడను వానికి లక్షణుడను పేర పుడతాడు. సహదేవుడు భీమసింహుడను వాని యింట దేవసింహునిగా జన్మిస్తాడు.

ధృతరాష్ట్రుని అంశతో అజ్మీరులో పృథ్వీ రాజనువాడును, వాని కన్యగా ‘వేల’యను పేరుతో ద్రౌపది పుట్టి ప్రసిద్ధి చెందుతారు. కర్ణుడు తారకుడను పేర జన్మిస్తాడు. అదే సమయంలో రక్తబీజుడను పేరనా అవతారం కూడా భూలోకంలో వుంటుంది. కౌరవాంశతో పుట్టిన వారంతా మాయా యుద్ధ విద్యలలో నిష్ణాతులై వుంటారు. పాండ వాంశతో పుట్టినవారు మహాయోధులు, బలశాలులు, ధార్మికులునై వుంటారు’ అన్నాడు శివుడు.

శ్రీకృష్ణుడు నవ్వుతూ, ‘మహాదేవా! నేను కూడా ఆ కాలంలోనే మాయాదేవిచే నిర్మితమైన మహావతీ పురంలో దేశరాజను వాని పుత్రునిగా ఉదయసింహుడను పేరిట మరల దేవకీ మాతకే జన్మించి పాండవులకు సహాయపడతాను. నా మరో అంశలో ఆహ్లాదుడను పేర గురుపీఠంగా జన్మిస్తాను. అగ్నివంశం నుండి వచ్చి ధర్మగ్లాని కలిగించేవారిని నశింపజేసి ధర్మ సంస్థాపన చేస్తాను. ఆ జన్మలో కూడా మీ అనుగ్రహం మాకుండాలి’ అన్నాడు. శివుడు మందస్మితుడై అదృశ్యుడైనాడు.

శాలివాహనుడు - ఏసుప్రభువు

“ఋషులారా! పాండవులు ప్రాతఃకాలమే ఉపపాండవులకు ప్రేతకార్యం చేసి పరమదుఃఖితమతులై పితామహుడైన భీష్ముని వద్దకు వచ్చారు. ఆయన వారి మనసులను చల్లబఱచి రాజధర్మాన్నీ మోక్షధర్మాన్నీ దానధర్మాలనూ ఉపదేశించాడు. భీష్మప్రేరితులై వారు ఉత్తమాచరణపరులై మూడు అశ్వమేధ యాగాలు చేశారు. అరవై సంవత్సరాలపాటు భరతవర్షాన్ని పరిపాలించి స్వర్గస్థులయ్యారు. మరల కలియుగంలో జన్మించారు.”

ఇంతవఱకు చెప్పి తాను సమాధిస్థుడై గుణాతీత పరబ్రహ్మను ధ్యానించవలసిన సమయం వచ్చిందనీ కొన్నాళ్ళదాకా వారిని కూడా ధ్యానంలో నిమగ్నం కమ్మనీ సూతమహర్షి ఋషులకు చెప్పి యౌగిక సిద్ధి నవలంబించి ఆత్మ సామీప్యాన్ని చేరి వుండిపోయాడు.

దీర్ఘకాలానంతరము శౌనకాది మహామునులకు సూతమహర్షి దర్శనం లభించింది వారాయనను ఇలా అడిగారు.

“సూత మహాదేవా! విక్రమాదిత్యుని నుండి జరిగే కాలం గూర్చి ప్రవచించండి.”

వారిపై సాదర దృష్టులను ప్రసరింపజేస్తూ చెప్పసాగాడు సూతమహర్షి. “విక్రమాదిత్యుడు స్వర్గానికేగిన తరువాత చాలామంది రాజులు పరిపాలించారు. తూర్పున కపిల స్థానం నుండి పడమట సింధునది దాకా, ఉత్తరాన బదరీక్షేత్రం నుండి దక్షిణాన సేతుబంధనం దాకా విస్తరించియున్న భరతవర్షంలో అప్పటికి పదునెనిమిది రాజ్యాలు లేదా ప్రదేశాలుండేవి. అవి ఇంద్రప్రస్థ, పాంచాల, కురుక్షేత్ర, కంపిల, అంతర్వేది, వ్రజ, అజమేర, మరుధన్వ, గుర్జర, మహారాష్ట్ర, ద్రవిడ, కళింగ, అవంతి, ఉడుప, బంగ, గౌడ, మాగధ, కోసలలు. ఈ ప్రాంతాల్లో వేరువేరు రాజుల శాసనాలు చెల్లుతుండేవి. భాషలు విభిన్న విధాలుగా నుండేవి. ధర్మ ప్రచారంలో కూడా తేడాలుండేవి. ఇలా ఒక నూరేళ్ళు గడిచింది. ఇక్కడ ధర్మం చాలావరకు నశించిందని తెలుసుకొని ధర్మాన్ని వదలిన రాజులు ప్రజలు సురక్షితులు కారనే జ్ఞానం వుండడంవల్ల శకాది ‘విదేశీ రాజులు వందలకొద్దీ సంఖ్యలో మందీ మార్బలాన్ని వెంట నిడుకొని సింధునదిని దాటి ఆర్యదేశంలో చొరబడ్డారు. అలాగే హిమాలయాలకు ఆవలివైపు నుండి కొందరు ప్రవేశించారు. తమలో తాము కలహించుకోవడంలో తత్పరులై, సరిహద్దుల నుండి ఇంతమంది విదేశీయులు చొరబడినపుడు విజయవంతంగా అడ్డుకోవడంగాని, అసలు ఆ సరిహద్దులను సక్రమంగా కాపాడుకోవడంగాని చేయలేని ఆర్యరాజులను ఈ విదేశీయులు యుద్ధాలలో గెలిచి మోయగలిగినంత ధనాన్నీ రత్నరాసులనూ, బంగారాన్నీ మోసుకొని మళ్ళా తమ దేశాలకు పోయారు.

ఇట్టి సమయంలో విక్రమాదిత్యుని మనుమడు శాలివాహన మహారాజు సింహాసనము నధిష్ఠించాడు. అతడు వెంటనే తన జనాలకు ధర్మాన్నీ శౌర్యరసాన్ని నూరిపోసి, స్వయంగా శక, చీనాది దేశాలసేనలపై విజయాన్ని సాధించాడు. బాహ్లీక, కామరూప, రోమక, ఖుర దేశాలలో ఉత్పన్నులైన దుష్టులను పట్టుకొని వారిని కఠినంగా శిక్షించాడు. వారి కోశాగారాలను పూర్తిగా లాగుకొని ఖజానాలో కలుపుకున్నాడు. మ్లేచ్ఛులందరినీ తన అధీనంలోకి తెచ్చుకొని వారికి ఒక దేశాన్నీ, మర్యాదనీ కల్పించి సింధునదికి ఆవలివైపు ప్రాంతంలోనే వారు ఉండాలని శాసించాడు. సింధునదికి ఇవతలివైపు మరల ఆర్యావర్తాన్ని పూర్తిగా నిలబెట్టాడు. సింధు దేశాన్ని ఆర్యులకు ఉత్తమ ప్రదేశంగా నిర్ధారణ చేసి మ్లేచ్ఛులను సింధునదికి ఆవలివైపు బ్రతకవలసినదిగా శాసించాడు.

ఒకనాడు యుగపురుషుడును, శకపురుషుడునైన శాలివాహన చక్రవర్తి హిమగిరి శిఖరం మీదికి వెళ్ళాడు. అక్కడ హూణదేశ మధ్యంలో నున్న పర్వతంపై అతనికొక సుందర పురుషుడు కనబడ్డాడు. అతని శరీరం గౌరవర్ణ కాంతులను ప్రసరింపజేస్తోంది. తెల్లని వస్త్రములను ధరించి యున్నాడు. అతనిని చూడగానే అప్రయత్నంగా కలిగిన ప్రసన్న భావంతో చక్రవర్తి “మీరెవరు?” అని అడిగాడు.

‘నేను ఈశపుత్రుడను. కుమారి గర్భము నుండి ఉత్పన్నమైనవాడను. నేను ‘మ్లేచ్ఛ ధర్మ ప్రచారకుడను. సత్యవ్రతమందు స్థితుడను.

‘మీ ధర్మమేమి?’

‘మహారాజా! సత్యం నాశనమైపోతున్నపుడు మర్యాదరహితమై మరుగుచున్న మ్లేచ్ఛ ప్రదేశానికి దేవదూతగా మతప్రవక్తగా నేను ఉదయించాను. దస్యుల మధ్య భయంకరురాలైన ఈశామసీ అను కన్య ఉత్పన్నమైంది. నేనామెను చేరదీసి ఆమెనొక దేవతను చేశాను. నేను మ్లేచ్ఛులలో స్థాపించిన ధర్మసూత్రాలను వారిచేత అవలంబింప జేయడానికి వెళుతున్నాను. ఆ ధర్మసూత్రాలను వింటారా?’

‘వింటాను చెప్పండి.’

‘అన్నిటికన్న ముందు, మనిషి తన మానస, దైహిక మాలిన్యాన్ని సంపూర్ణంగా అవి నిర్మలమయ్యే దాకా తొలగించుకోవాలి. తరువాత ఇష్టదేవతను జపించుకోవాలి. వాణి సత్యాన్నే తప్ప వేరొక దానిని ఆశ్రయించరాదు. న్యాయసమ్మతంగానే జీవించాలి. సూర్యమండల స్థితుడైన పరమాత్మను ఏకాగ్ర చిత్తంతో పూజించాలి. ఈశ్వరుడే సూర్యుడు. సూర్యుడు అనిత్యభూతాల సారాన్ని నాలుగువైపుల నుండీ ఆకర్షిస్తాడు. హే భూపాలా! అందువలన ఆయన విలీనమైపోయాడు. కాని, నా హృదయంలో నిత్య విశుద్ధ కల్యాణ కారియైన ఈశునిమూర్తి స్థిరంగా వుంది. కాబట్టి నన్ను కొన్ని భాషల్లో ఈశామసీహ్ (అనీ కొన్ని భాషల్లో జీసస్ క్రయిస్ట్ అనీ కొన్ని భాషల్లో ఏసుప్రభువనీ) అంటారు. (బ్రాకెట్లు అనువాదకునివి)

ఇది విని శాలివాహనుడు ఆ మ్లేచ్ఛ పూజ్యునికి నమస్కరించి తన రాజ్యానికి విచ్చేసి అశ్వమేధ యాగాన్ని చేసి అరవై సంవత్సరాలపాటు రాజ్యాన్ని చేసి స్వర్గలోకమును చేరుకున్నాడు.

భోజరాజు - మహామదు

మునులారా! శాలివాహనుని వంశంలో పదిమంది రాజులు అయిదువందల సంవత్సరాలపాటు రాజ్యం చేశారు. వారందరూ స్వధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి స్వర్గ లోకాని కేగినవారే.

ఆ తరువాత భూమండలంపై ధర్మాచరణ లుప్తమై పోయింది. శాలివాహన వంశంలో ఆ సమయంలో జనించిన భోజమహారాజు దేశంలో ధర్మం క్షీణదశకు చేరుకోవడాన్ని చూసి ఇక ఉపేక్షించరాదని యెంచి పెద్దయెత్తున దిగ్విజయయాత్రకు బయలుదేరాడు. ఆతని సైన్యం పదివేలమందితోబాటు కాళిదాసు వంటి మహావిద్వాంసులైన బ్రాహ్మణులు కూడ బయలుదేరారు. ఆ మహారాజు సింధునదిని దాటి గాంధార, మ్లేచ్ఛ, కాశ్మీర శఠ రాజుల నందరినీ ఉగ్రరణాలలో ఓడించి వారి కోశాగారాలను తన రాజ్యానికి తరలించి వారి, అధర్మవర్తనలను విచారించి కఠోరదండనలను వేశాడు. ఆ సమయంలో శిష్యమండల పరివృతుడైన మహామదు అను గొప్ప మ్లేచ్ఛాచార్యుని భోజమహారాజు చూడడం జరిగింది. ఆ తరువాత భోజరాజు మరుస్థలంలో వెలసిన మహాదేవుని దర్శించాడు. ఆ స్వామికి పంచగవ్య మిశ్రిత గంగాజలంతో అభిషేకం చేసి చందనాదులతో భక్తిపూర్వకంగా పూజ చేసి ఇలా స్తుతించాడు.

‘మరుస్థల నివాసివై మ్లేచ్ఛులచే ఆవరింపబడియున్ననూ శుద్ధ సచ్చిదానంద స్వరూపంతో వెలుగుతున్న పరమేశ్వరా! నీవు త్రిపురాసుర సంహారివి. నానావిధ మాయాశక్తుల విచ్ఛేదకుడివి. నేను నీ శరణు కోరి వచ్చాను. నన్ను నీ దాసునిగా చేకొనమని శిరస్సు వంచి పాదాభివందనం చేసి నమస్కరిస్తున్నాను.

పరమేశ్వరుడు ప్రసన్నుడై తన వాణిని ఇలా వినిపించాడు. ‘భోజరాజా! నీవు వెంటనే మహాబళేశ్వర తీర్థానికి వెళ్ళు. ఇది బాహ్లీక నామకమగు భూమి. ఇది మ్లేచ్ఛ దూషితమై పోయింది. ఈ దారుణ ప్రదేశంలో ఆర్యధర్మం లేనేలేదు. మహామాయావి త్రిపురాసురుడు, దైత్యరాజు బలి ఆత్మలు వేరొక ఆశ్రయాన్ని పొందాయి. నాద్వారా వరములను పొందిన ఆయాశ్రయమే అయోనిజుడై అవతరించి మహామదు అనుపేరుతో వర్ధిల్లుతున్నాడు. అతడు దైత్యులను వర్ధిల్ల చేయడానికే పుట్టాడు. నీవిక్కడి నుండి మరలిపో. వాని ప్రభావంలో పడకు. నీవు విశుద్ధంగా వుండాలనే వరం నేనిస్తున్నాను.

పరమేశుని ఆదేశం మేరకు భోజరాజు తన జైత్రయాత్రను ముగించి సైన్య సహితుడై మహాబళేశ్వరం వైపు మరలిపోయి తన రాజ్యాన్ని చేరుకున్నాడు.

విదేశీయులు రాగానే చెడిపోయేది మొట్టమొదటి భాషయే. అందుచే భోజరాజు సంస్కృత భాషను పండితుల సహాయంతో పండితుల సహాయంతో బాగా విస్తృతపఱచి దానిని కాపాడుతూ వృద్ధిపఱచే పనిని అగ్రవర్ణాలకు ఒప్పగించాడు. శూద్రుల కొఱకు ప్రాకృతభాషలను తయారుచేయించి ప్రయోగించాడు. ఆ తరువాత యాభై సంవత్సరాలు పరిపాలించి స్వర్గలోక ప్రాప్తిని పొందాడు. భోజమహారాజు ఈ దేశంలో భగవద్భక్తినీ దేశభక్తినీ భాషానురక్తినీ ఆచరించి చూపి వృద్ధి చేసిన చక్రవర్తిగా చరిత్రలో నిలచిపోయాడు. ఆయన దయవల్లనే వింధ్యగిరికీ హిమాలయానికీ మధ్యగల భూమి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని ఆర్యభూమిగా తలెత్తుకొని సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ నిలబడింది.  

దేశరాజు, వత్సరాజుల ఆవిర్భావం

భోజరాజు స్వర్గారోహణము తరువాత అతని వంశంలో ఏడుగురు రాజులు పరిపాలించారు. వారందరూ అల్పాయుష్కులూ, మందబుద్ధులూ, అల్పతేజస్వులూ కావడం వల్ల అంతా కలిపి మూడువందల యేళ్ళు కూడా పరిపాలించలేకపోయారు. వారి రాజ్య కాలంలోనే చిన్న చిన్న రాజులనేకులు బయలుదేరారు. వీరిలో కొందరు కాలక్రమాన పెద్దరాజులైనారు. భోజవంశంలో పదవవాడైన గంగాసింహుడు కల్పక్షేత్రంలో ధర్మపూర్వకంగా రాజ్యం చేస్తున్నప్పటికి అంతర్వేదిలో కన్యాకుబ్జ ప్రాంతంలో జయ సింహుడను రాజు పరిపాలించేవాడు. తోమర వంశం వాడైన అనంగపాలుడు ఇంద్ర ప్రస్థానికి రాజు. వీరేకాక గ్రామాల్లో కూడా రాజులు బయలుదేరారు. ఆ గ్రామాలు పక్క జనపదాలను కలుపుకొని రాష్ట్రాలైనాయి.

అగ్నివంశం బాగా విస్తరించిన రాజ వంశాలలో నొకటి. మంచి బలవంతులైన రాజులు ఆ వంశం వారు. తూర్పులో కపిలస్థానం (గంగాసాగర్), పశ్చిమంలో బాహ్లీకం, ఉత్తరాన చీనాదేశం, దక్షిణాన సేతుబంధం - ఈ మధ్య భాగంలో అరవై లక్షలమంది భూపాలకులూ, గ్రామపాలకులూ శాసించిన కాలమది. అందరూ బలవంతులైన పాలకులే. వీరి రాజ్యాలలో ప్రజలంతా అగ్నిహోత్ర కర్మలను చేసేవారు, గోబ్రాహ్మణ హితాన్ని మనసారా కోరేవారు, ద్వాపరయుగ సమానమైన ధర్మ కార్యకర్తృత్వ నిపుణులు. సర్వత్ర ద్వాపరయుగ లక్షణాలే కనిపిస్తుండేవి. ప్రతి ఇంటిలో ధన సమృద్ధి, ప్రతి వ్యక్తిలో ధర్మం, ప్రతి గ్రామంలో దేవమందిరాలు, ప్రతి దేశంలో యజ్ఞం - ఇవీ నాటి భరతదేశ పరిస్థితులు. మ్లేచ్ఛులు కూడా ఆర్యధర్మాన్నే పూర్తిగా అనుసరించేవారు. కలిమళ్ళా భయభీతుడై కొందరు అసమ్మతివాదులైన మ్లేచ్ఛులను వెంటబెట్టుకొని నీలాచల పర్వతంపై శ్రీహరి నామం జపిస్తూ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడతనికి శ్రీకృష్ణ పరమాత్మ రాధా సమేతుడై దర్శనమిచ్చాడు. కలి వారినిలా స్తుతించాడు.

“హే భగవాన్! మీరు నా సాష్టాంగదండ ప్రణామాన్ని స్వీకరించండి. నన్ను రక్షించండి. ఓ కృపానిధులారా! నేను మిమ్మే శరణుజొచ్చాను. మీరు సర్వపాపవినాశ కర్తలు. సర్వకాల నిర్మాతలు. మీది సత్యయుగంలో గౌరవర్ణము, త్రేతలో రక్తవర్ణము, ద్వాపరయుగంలో పీతవర్ణం. నా (కలి) యుగంలో మీది కృష్ణరూపము. నా పుత్రులు మ్లేచ్ఛ రక్తముండి కూడా ఆర్యధర్మాన్నవలంబించి వేస్తున్నారు. నా రాజ్యం ఇలా వుండకూడదు కదా! ప్రతియింటా జూదము, మద్యము, స్వర్ణము, స్త్రీల హాస్యములూ వర్ధిల్లాలి కదా! కాని అగ్నివంశ క్షత్రియులు నా సంస్కృతిని నాశనం చేసేశారు. హే జనార్దనా! రాధానాథా! నన్ను రక్షించి నా యుగాన్ని నిలబెట్టండి.’

శ్రీకృష్ణుడు దరహాస భాసుర సుందరవదనుడై ఇలా అభయమిచ్చాడు. ‘కలీ! కాలచక్రం సక్రమంగా తిరగాలి కలియుగం మరో సత్యయుగాదుల ఆవిర్భావానికి అవసరం. అందుకైనా నిన్ను కరుణించాలి కదా! నా అంశలోనే మహావతిలో నొక పరాక్రమశాలి జన్మిస్తాడు. అతడు మహాబలశాలులైన అగ్నివంశ క్షత్రియులను అణగద్రొక్కి మ్లేచ్ఛ రాజవంశాన్ని ప్రతిష్ఠిస్తాడు.

తరువాత కొన్నాళ్ళకి భరతవర్షానికే ప్రమాదకర పరిస్థితులేర్పడినాయి. పృధ్వీరాజ్ చౌహన్ వీర స్వర్గాన్నలంకరింపగా సహెూద్దీనుడు (గోరీమహమ్మదు) తన దాసుడైన కుతుకొద్దీనుని ఇక్కడ శాసకునిగా నియమించి అశేష అమూల్య ధన స్వర్ణ రత్నరాసులను దోచుకొని తన దేశానికి మోసుకుపోయాడు.”

ప్రతిసర్గపర్వం తృతీయఖండం సంపూర్ణం.