“హే జగద్గురూ! ఈ మృత్యులోకంలో ఏ వ్రతం ద్వారా స్త్రీలకు గృహస్థాశ్రమం మనోహరంగా గడిచిపోతుంది? ఏ సాధన ద్వారా పతిప్రేమను పొందగలుగుతారు?” అని అర్థించాడు యుధిష్ఠిరుడు.
ధర్మరాజుతన పేరుకి తగినట్లుగానే కేవలం క్షత్రియ పురుషులగూర్చి మాత్రమే కాకుండా అన్ని వర్ణాల జనుల గూర్చీ స్త్రీలను గురించీ కూడా ఆలోచించి వారినందరినీ తరింపజేయాలనే కోరికతో నిస్వార్ధంగా తననుండి జ్ఞానాన్నర్థించడం చూసి మరింత ప్రసన్నుడైన మాధవుడు ఇలా అనుగ్రహభాషణాన్ని కొనసాగించాడు.
“ధర్మరాజా! ఒకప్పుడు కైలాసశిఖరంపై అమ్మ పార్వతి అయ్య శివునితో పరివేష్టించి దేవతలతో, మహామునులతో కొలువుతీరి వుండగా శివయ్య ఇలా అడిగాడు ‘పార్వతీ! నీ వైభవాన్ని చూస్తుంటే అసామాన్యమనిపిస్తోంది. నా జీవిత సర్వస్వం నీవే అన్నంతగా నా ప్రేమను నీవు పొందగలిగావు. ఏ వ్రతం నిన్నింత స్వాధీనపతికను చేయగలిగింది? ఇంత కీర్తిని ఆర్జించి పెట్టింది?
‘ప్రాణేశ్వరా! ఇదంతా మీ అనుగ్రహమే. చిన్నతనంలో నేను రంభావ్రతం చేశాను. నాకా సంకల్పం కలిగించింది. మిమ్మల్ని పొందాలనే కోరికయే. మీ అర్థాంగిని కావడం ఆ వ్రత ప్రభావమైతే స్త్రీలందరికీ స్వామినిని కావడం మీ సాంగత్యఫలం.’
‘దేవీ! ఈ అరుదైన శుభప్రదమైన వ్రతాన్ని లోకంలోకి పంపించవలసి వుంది. నీవా అనుష్టానాన్ని గూర్చి చెప్పు. ఈ మహానుభావులు దానిని లోకానికుపదేశిస్తారు. ‘
‘స్వామీ! నా చిన్నతనంలో ఒకరోజు నేను నా సఖులతో కూర్చునియుడంగా నా తల్లిదండ్రులు (మేనాదేవి పేరు ముందుండాలి) హిమవంత మహారాజూ, మేనాదేవీ అక్కడికి వచ్చారు. నా తల్లి నాతో ‘పుత్రీ! నువ్వు సౌందర్య సౌభాగ్యవర్ధకమైన రంభా వ్రతాన్నాచరించు. నీకు సౌభాగ్యం, ఐశ్వర్యం, మహాదేవీ పదవీ ప్రాప్తిస్తాయి. జ్యేష్ఠ శుక్ల తదియనాడు స్నానం చేసి వ్రత నియమగ్రహణం చెయ్యి’ అని చెప్పింది.
నేను వెంటనే ఆమె ఆదేశాన్నమలు చేస్తానని చెప్పి తదియనాడు ఇలా చేశాను. ముందుగా స్నానానంతరం నాకు నలువైపులా పంచాగ్నులను అనగా గార్హపత్య, దక్షిణ, అహవనీయ, సభ్య, సూర్యాగ్నులను ప్రజ్వలింపజేసుకున్నాను. వాటి మధ్యలో తూర్పువైపు తిరిగి కూర్చొని మృగచర్మ, జటావల్కలాదులను ధరించి చతుర్భుజి, సర్వాలంకారశోభిత, కమలాసనయగు మహాసతీ దేవిని ధ్యానించాను. మహాలక్ష్మీ, మహాకాళీ, మహామాయా, మహామతీ, గంగా, యమునా, నర్మదా, మహీ, సరస్వతీ, వైతరణీ రూపాలలో ఆ మహాసతీదేవియే సర్వత్ర వ్యాపించి వున్నదని మా అమ్మ చెప్పింది. ఆ వ్రత ప్రభావం వల్లనే ఈనాడు మీ అనుగ్రహాన్ని ఇంతగా పొందగలిగాను. రంభాదేవి అనే పేరుతో గౌరీజపం చేస్తాం కాబట్టి దీనిని రంభావ్రతమన్నారు.’
కౌంతేయా! మహాసాధ్వి లోపాముద్ర కూడా ఈ వ్రతం చేసియే అగస్త్య మహాముని ప్రాణేశ్వరియైనది. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీ పురుషుల వంశాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉత్తమ సంతతి, సంపత్తి ప్రాప్తిస్తాయి. దేహాంతంలో శివలోకంగాని, విష్ణులోకంగాని వారికి నివాసాలవుతాయి.
ఇక ఈ వ్రతం యొక్క విధానం సంక్షిప్తంగా ఇలా వుంటుంది. ప్రతి ముందొక మండపాన్ని తయారుచేసి దానిని గంధ పుష్పాదులచే సువాసితం, అలంకృతం చేయాలి. తదనంతరం రుద్రాణి ప్రతిమను యథాశక్తి స్వర్ణాదులతో నిర్మింపజేసి స్థాపించాలి. దానిని గంధ, పుష్ప, ధూప, దీప అనేక ప్రకారాల నైవేద్యాలతో పూజించాలి. దేవి సమ్ముఖంలో సౌభాగ్యాష్టకాలను అనగా జీలకఱ్ఱ, కడుహుండం, అపూపం, పూలు, పవిత్రనిష్పావం, ఉప్పు, పంచదార, బెల్లంలను నివేదించాలి. పద్మాసనం వేసుకొని సూర్యాస్తమయందాకా ఆదేవి సమ్ముఖంలోనే కూర్చునివుండాలి. మరల మరల ప్రణామాలు చేస్తూ దేవిని క్షమాభిక్ష వేడాలి. ఈ క్రింది మంత్రంతో రుద్రాణిని ప్రార్ధించాలి.
వేదేషు సర్వశాస్త్రేషు దివిభూమౌ ధరాతలే।
దృష్టః శ్రుతశ్చబహుశో నశక్త్యా రహితః శివః॥
త్వం శక్తి స్త్వం స్వధా స్వాహా త్వం సావిత్రీ సరస్వతీ।
పతిందేహి గృహందేహి వసుదేహి నమోఽస్తుతే॥ (ఉత్తరపర్వం 18/23,24)
అనంతరం ఒక యశస్వియైన బ్రాహ్మణుని అతని పత్నితో సహా అన్ని ఉపకరణాలతో పూజించి ఇవ్వగలిగినంత ఎక్కువ దానమివ్వాలి. కొందరు ముత్తయిదువలను పిలిచి సత్కరించి నైవేద్యాలు పెట్టాలి. ఇవన్నీ అయినాక వారి పాదాలకు ప్రణమిల్లి క్షమాభిక్ష నర్ధించి పాపనాశనాన్ని దీవనలుగా పొందాలి; మరునాటి చతుర్థినాడు మరల బ్రాహ్మణ దంపతుల నాహ్వానించి మధుర రస సమన్వితమైన చక్కటి మరపురాని భోజనాన్ని పెట్టి వ్రతాన్ని సంపూర్ణంగావించాలి.
ధర్మనందనా! ఇపుడు గోప్పదనామక వ్రతాన్ని ఆలకించు. దీనిని ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ తదియ, చవితి దినాల్లో చేస్తారు. స్త్రీగాని పురుషుడుగాని ముందుగా స్నానాదికములుగానిచ్చి అక్షతలు, పుష్పమాల, ధూప, చందన, పిష్టకాదులతో గోవుని పూజించాలి. దాని కొమ్ములను, వీలైనంత వఱకు ఇతర అంగాలను అలంకరించాలి. స్వయంగా ప్రతి నూనె, ఉప్పు లేని అగ్ని అంటని వస్తువులతో భోజనంచేయాలి. వనంలోకి వస్తూ పోతూ వున్న ఆవులకి సంతుష్టిగా గడ్డిని ఇతర పదార్థాలను పెట్టి ఈ మంత్రం ద్వారా అర్ఘ్యమివ్వాలి.
మాతారు ద్రాణాందుహితా వసూనాం స్వసాదిత్యానా మమృత సస్యనాభిః॥
ప్రసువోచం చికితుషే జనాయమా గమనాగామదితిం వధిష్ట॥
(ఋగ్వేదం 8/101/15)
తరువాత ఈ క్రింది మంత్రం ద్వారా గోవును ప్రార్థించాలి.
గోవో మే అగ్రతః సంతుగావోమే సంతుపృష్ఠతః।
గావోమే హృదయే సంతు గవాంమధ్యే వసామ్యహం ॥ (ఉత్తరపర్వం 19/7)
పంచమినాడు క్రోధరహితంగా మనస్సు ఉండేలా చూసుకొని ఆవు యొక్క పాలు పెరుగులతో కూరగాయలతో భోంచేయాలి. రాత్రి సంయమనం పాటించి విశ్రమించాలి. తెల్లవారినాక స్నానానంతరం యథాశక్తి స్వర్ణాదులతో ఆవు గిట్టను, బెల్లంతో గోవర్ధనగిరిని నిర్మించి వాటిని పూజించి ఒక బ్రాహ్మణునికి గోవిందః ప్రీయతాం అని అంటూ దానమిచ్చేసి అచ్యుతునికి ప్రణామం చేయాలి.
ఈ వ్రతాన్ని చేసినవారికి సౌభాగ్యం, లావణ్యం, ధనం, ధాన్యం, యశస్సు, ఉత్తమ ఈ సంతానం లభిస్తాయి. వారియిల్లు ఆవులతో దూడలతో వర్ధిల్లుతుంది. దేహాంతంలో వారు దివ్యస్వరూపధారులై దివ్యవిమానంలో స్వర్గానికిపోయి అక్కడ నూరు దివ్య సంవత్సరాలుండి విష్ణులోకం చేరుకుంటారు.
ఈ గోప్పద వ్రతాన్ని త్రిరాత్రంగా చేసి నిత్యము గోవునీ గోవిందునీ పూజిస్తూ గోరసాలనే భుజిస్తూ జీవనాన్ని గడిపేవారు మరణానంతరం అత్యున్నత, అత్యుత్తమ, అత్యలబ్ధమగు లోకమైన గోలోకాన్ని చేరుకుంటారు.”