భవిష్య పురాణము

110 - భగ్నవ్రత ప్రాయశ్చిత్త విధి

“శ్రీకృష్ణదేవా! మరి ఈ నక్షత్ర వ్రతాలు బహుకాల వ్యాపకాలు కదా! ఏ అనివార్యకారణ దృష్ట్యానో అవి భగ్నమైపోతే, వ్రతి తప్పు లేకుండానే ఆగిపోతే, ఏ కర్మల ద్వారా వ్రతులు తరించగలరు? జగద్గురుడవు, సర్వజ్ఞుడవునగు నీవే చెప్పగలవు. ఆదేశించు” అని ప్రజాక్షేమ పరతంత్రుడైన ధర్మజుడడుగగా ఇలా చెప్పాడు మురారి.

“ధర్మజా! ఇది పరమ రహస్యమైన విషయమే అయినా నీకోసం బహిర్గతం చేస్తున్నాను. ఏ వ్రతమైనా అనేక ప్రకారాల ఉపద్రవాల వల్ల ఆగిపోతే దానిని సంపూర్ణం చేసి పూర్ణ ఫలాల నివ్వగల వ్రతములున్నాయి.

ఏ దేవీ; దేవ, దేవతా వ్రత భగ్నం జరిగిందో ఆ దేవీ, దేవ, దేవత యొక్క స్వర్ణ లేదా వెండి ప్రతిమను చేయించి పంచామృతాలతో దానికి స్నానం చేయించి ఒక జలపూర్ణ కలశపై దానిని ప్రతిష్ఠించి గంధ పుష్పాక్షత ధూపదీప వస్త్రభూషణ నైవేద్యాదులతో పూజించాలి. ఇదంతా ఏ రోజైతే వ్రతభగ్నమైందో మరుసటి సంవత్సరంగాని ఆ తరువాతగాని అదే రోజున జరగాలి.

ఓం అముక దేవాయనమః అనే మంత్రం ద్వారా ఆ వ్రతంలో ఉద్దేశించిన దేవ, దేవతకు అర్ఘ్య ప్రదానంగావించి వ్రతాన్ని పూర్తి చేయడం కోసం, వ్రత భంగ దోష నివృత్తి కోసం ఈ విధంగా క్షమా ప్రార్థన చేసి భగవంతుని శరణువేడాలి:

ఉపసన్నస్య దీనస్య ప్రాయశ్చిత్త కృతాంజలేః

శరణంచ ప్రసన్నస్య కురుష్వాద్య దయాంప్రభో

పరత్ర భయభీతస్య భగ్నఖండ వ్రతస్య చ

కురుప్రసాదం సంపూర్ణం వ్రతం సంపూర్ణ మస్తుమే

తపచ్ఛిద్రం వ్రతచ్ఛిద్రం యచ్ఛిద్రం భగ్నకే వ్రతే

తవప్రసాదాద్దేవేశ సర్వమచ్ఛిద్రమస్తు నః (ఉత్తరపర్వం 110/13-15)

తరువాత దిక్పాలకులకు అర్ఘ్య ప్రదానం చేసి ముఖ్య దేవతల అంగపూజనలను గావించి ప్రార్ధనలను చేయాలి. బ్రాహ్మణుని వ్రతి ఈ సందర్భంలో పూజించాలి.

ఆయన ఈ విధంగా ఆశీర్వదించాలి:

వాక్యం పూర్ణం మనః పూర్ణం పూర్ణం కాయవ్రతేనతే

సంపూర్ణస్య ప్రసాదేన భవపూర్ణ మనోరథః

బ్రాహ్మణాయత్ప్రభాషంతే హ్యనుమోదంతి దేవతాః

సర్వదేవమయావిప్రా నైతద్వచనమన్యథా

జలధిః క్షారతాం నీతః

పావకః సర్వభక్షతాం

సహస్రనేత్రః శక్రోఽపి

కృతో విప్ర్తెర్మహాత్మభిః

బ్రాహ్మణానాంతు వచనాద్ బ్రహ్మహత్యా ప్రణశ్యతి

అశ్వమేధ ఫలం సాగ్రం ప్రాప్యతే నాత్ర సంశయః

వ్యాసవాల్మీకి వచనాద్ బ్రాహ్మణ వచనాచ్చ గర్గ

గౌతమ పరాశరధౌమ్యాంగిరస వసిష్ఠ నారదాది ముని

వచనాత్ సంపూర్ణం భవతు తే వ్రతం (ఉత్తరపర్వం - 110/23-27)

యజమాని బ్రాహ్మణుని సాదరంగా వీడ్కొలిపి ఈ సామగ్రినంతటిని ఆయన ఇంటికి పంపించెయ్యాలి. తరువాత పంచయజ్ఞ క్రియానంతరం భోంచేయాలి.

ఈ సంపూర్ణ వ్రతాన్ని ఒకమారు భక్తితో చేసినా, వ్రతి ఖండిత వ్రత సంపూర్ణ ఫలాన్ని పొందడమే కాక వ్రతభగ్న పాపము నుండి ముక్తుడవుతాడు. అంతేకాక, ఈ వ్రతాన్నాచరించిన వానికి ధన, రూప, కీర్తి, ఆరోగ్యాదులు ప్రాప్తించి, నూరేళ్ళపాటు భూమిపై సకల సుఖ భోగాలనూ అనుభవించి స్వర్గమును చేరి ఆపై మోక్షాన్ని పొందే మహాభాగ్యం లభిస్తుంది. మహారాజా! ప్రాయశ్చిత్త రూపకమైన ఈ సంపూర్ణ వ్రతాన్ని పరమ ప్రసన్నుడై నన్ననుగ్రహించి గర్గ మహర్షి నాకుపదేశించాడు; నాచేత చేయించాడు కూడ. జన్మాంతర వ్రతభంగాన్ని కూడా ఈ వ్రతం పరిహరిస్తుంది కాబట్టి నీవు కూడా దీన్ని అనుష్టించు.