భవిష్య పురాణము

7-8 - కాలవిభాగం - తిథి నిర్ణయం; పుణ్యప్రద కృత్యాలు

మునులారా! దేవకార్యాలైనా పితృకర్మలైనా కాలమునుబట్టి సంపన్నాలౌతాయి. నియత సమయంలో చేస్తేనే ఏ కర్మయినా కార్యమైనా పూర్ణ ఫలాన్నిస్తుంది. ఎంత బాగా చేసినా ఎంత స్వర్ణాన్ని వేసినా కాలం కాని కాలంలో చేసేపని మూడు లోకాల్లో ఎక్కడా ఫలమునీయదు. కాబట్టి కాలవిభాగవర్ణన మిక్కిలి ఆవశ్యకము.

కాలము అమృతరూపము, భగవంతుని అన్యతమస్వరూపము అయినప్పటికీ ఉపాధి భేదాలతో అది దీర్ఘ లఘు మున్నగు అనేక రూపాల్లో విడగొట్టబడింది. తిథి, వారం, నక్షత్రం, రాత్రి, పగలు - అన్నీ కాలము యొక్క అంగములే. పక్ష, మాసరూపాల్లో వర్షాంతరములతో కాలం వస్తూనే వుంటుంది. కాబట్టి ఈ రూపాలే సర్వకర్మసాధనాలు. సమయాన్ని పట్టించుకోకుండా స్వతంత్రంగా ఏ కర్మనీ చేపట్టరాదు. ధర్మాధర్మాల ముఖ్యద్వారం కాలమే. తిథి మున్నగు కాల విశేషాలల్లోనే విహిత, నిషిద్ధ కర్మలు చెప్పబడ్డాయి. విహిత కర్మలను పాలించేవారు, పాటించేవారు స్వర్గానికి వెళితే విహితాన్ని త్యాగం చేసి నిషిద్ధకర్మలను చేసేవారు అధోగతికి పోతారు. పూర్వాహ్న వ్యాపినీతిథిలో వైదిక క్రియలను చెయ్యాలి. ఏకోద్దిష్ట (ఒక్కరికోసమే) శ్రాద్ధాలను మధ్యాహ్న తిథిలోనూ పార్వణ శ్రాద్ధాన్ని అపరాహ్ణ వ్యాపినీతిథిలోనూ పెట్టాలి. వృద్ధిశ్రాద్ధాదులను ప్రాతఃకాలంలో చెయ్యాలి. బ్రహ్మదేవుడు దేవతలకు తిథులతో బాటు పూర్వాహ్నకాలాన్నీ పితృదేవతలకు అపరాహ్ణన్నీ ప్రసాదించాడు. కాబట్టి దేవార్చనలన్నీ పొద్దునే సాగాలి.

ఖర్వా, దర్పా, హింస్రాలని తిథులు మూడువిధాలు. లంఘితములు ఖర్వలనీ, తిథి వృద్ధికరాలు దర్పలనీ, తిథిహానికరాలు హింస్రలనీ పెద్దలంటారు. ఖర్వదర్పాలను పరంలోనూ హింస్రాలను పూర్వంలోనూ తీసుకోవాలి. శుక్లపక్షంలో పరతిథులూ, కృష్ణపక్షంలో పూర్వతిథులూ గైకొనబడతాయి. సూర్యభగవానుడు ఉదయించినప్పుడు ఉండే తిథి స్నానదానాది కృత్యాలకు ఉచితమైనది. సూర్యుడస్తమించడానికి ముందు పది ఘడియలపాటు వుండే తిథిని దినరాత్రి తిథిగా పరిగణించాలి. ఏ పక్షంలోనైనా ఏరకం తిథియైనను (హింస తప్ప) దాని పరిథి ముగిసే దాకా సూర్యుడు అస్తమించకుండా వుంటే ఆ తిథి పితృకార్యాలకు గ్రాహ్యమే. ఒకవేళ రెండు దినాల్లో వరుసగా మధ్యాహ్నకాలవ్యాపినీ తిథులు వస్తే, అస్తపర్యంతం వుండే మొదటి తిథి శ్రాద్ధాది కర్మలకు విహితము. విదియ, తదియ, చవితి, పంచమి - లతో యుక్తమైతే ఇవి పుణ్యతిధులుగా భావింపబడతాయి. అలా కాకపోతే పుణ్య వ్యతిరేకాలవుతాయి. షష్ఠి పంచమితోనూ, అష్టమి సప్తమితోనూ విద్ధమైతే, అలాగే ఏకాదశి దశమితోనూ చతుర్దశి త్రయోదశితోనూ, అమావాస్య చతుర్దశితోనూ విద్దమైనా ఆ సమయాలలో ఉపవాసము చేయరాదు. మొండికేసి చేస్తే పుత్ర, కళత్ర, ధనాలకు నష్టము వాటిల్లుతుంది. భార్యాపుత్రులు లేని వాడికి యజ్ఞమందు అధికారము లేదు. సూర్యుడుదయించినప్పుడుండే తిథి స్నాన, అధ్యయన, దానాలకు శ్రేష్ఠము. అలాగే కృష్ణపక్షంలో సూర్యుడస్తమించినపుడుండే తిథి స్నానదానాదికర్మలకూ పితరులకూ మంచిదని చెప్పబడింది.

బ్రాహ్మణులారా! ఇపుడు నేను బ్రహ్మచేత చెప్పబడిన శ్రేష్ఠతిథి వర్ణనను మీకందిస్తాను. ఆశ్వయుజ, కార్తిక, చైత్ర మాఘ మాసాలలో చేసే స్నానాలు, దానాలు, శివ, విష్ణు పూజనాలూ పదింతల ఫలితాన్నిస్తాయి. పాడ్యమినాడు అగ్నిదేవుని పూజించి హవనం చేస్తే అన్ని రకాల ధాన్యాలూ వృద్ధిపొంది కోరుకున్నంత ధనం లభిస్తుంది. శుక్ల తదియ, గురువారంతో యోగించిననాడు విధి పూర్వకంగా అగ్నిదేవుని పూజను నక్తవ్రత సహితంగా చేస్తే కోరుకున్నంత ఐశ్వర్యం లభిస్తుంది. మిథున (ఆషాఢ) మరియు కర్క(శ్రావణ) రాశిలో సూర్యుడుండగా వచ్చే విదియనాడు ఉపవాసము చేసి విష్ణు పూజను విధివత్తుగా గావించే స్త్రీకి ఎన్నటికీ వైధవ్యముండదు. శ్రావణ కృష్ణ విదియ (దీనినే అశూన్యశయన ద్వితీయ అంటారు) నాడు గంధ, పుష్ప, వస్త్రాలతో, వివిధనైవేద్యాలతో లక్ష్మీనారాయణులను పూజించిన దంపతులకు సకల సంపదలూ దక్కుతాయి. వారిమధ్య ఎడబాటనేదే వుండదు. వైశాఖ శుక్ల తదియనాడు గంగాస్నానం చేసిన వారు పాపవిముక్తులౌతారు. వైశాఖ తదియ స్వాతి నక్షత్రం మరియు మాఘ తదియ రోహిణీ యుక్తం మరియు ఆశ్వయుజ తదియ వృషభ రాశియోగించిన దినాల్లో చేసే దానం అక్షయఫలాలనిస్తుంది. విశేషించి ఈ ఘడియల్లో హవిష్యాన్నమునూ మోదకాలనూ దానమిచ్చిన వానికి తిరుగే వుండదు. అప్పుడే బెల్లం, కర్పురయుక్త జలదానం చేసిన వానిని విద్వాంసులే ప్రశంసించే జీవితం వరిస్తుంది. దేహాంతంలో బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. అక్కడ కూడా పూజలందుకొనే భాగ్యం లభిస్తుంది. బుధవారం, శ్రవణనక్షత్రయుక్త తదియ అయితే ఆనాడు చేసే స్నాన ఉపవాసాలు ఆత్యంత, అనంత ఫలదాయకాలవుతాయి. చవితినాడు మోదకాలతో భక్తి పూర్వకంగా గణేశుని పూజిస్తే విఘ్నాలన్నీ పూర్తిగా నశించి సకల ఇచ్ఛాపూర్తి చేకూరుతుంది.

శ్రావణ శుక్ల పంచమినాడు రెండు ప్రధాన ద్వారాలనూ వాటి ముందలి ప్రదేశాలనూ ఆవుపేడతో చక్కగా అలికి, ఆరిన పిమ్మట అక్కడ నాగదేవతల బొమ్మలను గీసి పాలు, పెరుగు, సిందూరం చందనం, గంగాజలం, సుగంధద్రవ్యాలతో నాగపూజ చేస్తే ఆ కుటుంబం నిర్భయంగా జీవించవచ్చు. వారి ప్రాణాలకు గొప్ప రక్షణ వుంటుంది. శ్రావణ కృష్ణ పంచమి నాడు ఇంటి ఆవరణలో వేపాకులతో మనసాదేవిని పూజించిన వారికి సర్పభయముండదు. భాద్రపదషష్ఠినాడు స్నానాలూ, దానాలూ చెయ్యడం వల్ల అనంత పుణ్యం లభిస్తుంది. విప్రులారా! మాఘ మరియు కార్తిక షష్ఠినాడు ఏ వ్రతం చేసినా ఇహ, పరలోకాలలో అసీమమైన యశస్సు లభిస్తుంది. శుక్ల సప్తమితో సంక్రాంతి యోగించిననాడు ఆ పుణ్యదినాన్ని మహాజయా అనీ సూర్యప్రియా అనీ వ్యవహరిస్తారు. భాద్రపద సప్తమి అపరాజిత. ఏ సప్తమి లేదా షష్ఠి ఆదివారంతో యోగించినా అది లలితా నామక దినమవుతుంది. ఆ రోజున చేసే పుణ్యకర్మలకు పుత్ర పౌత్రాభివృద్ధి, మహాపుణ్యము ఫలాలుగా వస్తాయి.

అష్టాదశభుజయైన మాతను ఆశ్వయుజ మరియు కార్తిక శుక్ల అష్టమి దినాల్లో పూజించాలి. ఆషాఢ శ్రావణ శుక్ల అష్టమి దినాల్లో చండికాదేవిని ప్రాతఃకాలమే స్నానం చేసి అత్యంత భక్తి భావనతో పూజించి రాత్రి అభిషేకాలు చేయాలి. ఫలితాలు చెప్పబడలేదు. చైత్రశుక్ల అష్టమినాడు అశోకపుష్పాలతో మృణ్మయీ భగవతీ దేవిని అర్చిస్తే అన్ని రకాల శోకాలూ దూరమైపోతాయి. శ్రావణమాసంలో గాని సింహ సంక్రాంతిలో రోహిణీయుక్త అష్టమి అనే అత్యంత ప్రశంసావహ దినాన గాని పూజలు చేయాలి. ప్రతి నవమి నాడూ దేవీ పూజలను గావించాలి. ఫలితాలు చెప్పబడలేదు. కార్తిక శుక్లదశమినాడు శుద్ధ ఆహారాన్ని మాత్రమే స్వీకరించేవారికి బ్రహ్మలోక ప్రాప్తి గలదు. జ్యేష్ఠశుద్ధ దశమిని గంగాదశహరా అంటారు. ఆశ్వయుజదశమికి విజయ అనీ, కార్తిక దశమికి మహాపుణ్య అనీ ప్రసిద్ధనామాలున్నాయి.

ఏకాదశీవ్రతం చేయడం వల్ల సర్వపాపాలూ నష్టమైపోతాయి. ఈ వ్రతానికి దశమి నాడు జితేంద్రియులై యుండి ఒక పూటే భోజనం చేయాలి. మరునాడైన ఏకాదశినాడు పూర్తిగా ఉపవాసముండి ద్వాదశినాడు పారణ చేయాలి. ద్వాదశి తిథి ఒక్కటే పన్నెండు రకాల పాపాలను దగ్ధం చేస్తుంది. చైత్రశుక్ల త్రయోదశినాడు అనేక పుష్పములతో ఇతర సామగ్రితో కామదేవుని పూజ చేయాలి. దీనిని అనంగత్రయోదశి అంటారు. చైత్రకృష్ణ అష్టమి శనివారం పడినా, శతభిష నక్షత్రంతో యోగించినా ఆ రోజు గంగలో స్నానంచేస్తే వేలకొలదీ సూర్యగ్రహణ పూజలు చేసిన ఫలం దక్కుతుంది. అలాగే ఈ మాసంలోనే కృష్ణత్రయోదశి శనివారం పడినా, శతభిషతో యోగించినా దానిని మహివారుణీ పర్వదినమంటారు. ఈ రోజు చేసే స్నాన, దాన, శ్రాద్ధాలకు అక్షయ ఫలాలుంటాయి. చైత్ర శుక్ర చతుర్దశిని దంభభంజినీ అంటారు. ఈ రోజు ఉమ్మెత్త వేరుతో కామదేవుని పూజిస్తే ఉత్తమస్థానం ప్రాప్తిస్తుంది. అనంత - చతుర్దశీవ్రతం సంపూర్ణ పాపనాశకం. భక్తి పూర్వకంగా దీని నాచరించేవారికి అనంతసుఖాలు లభిస్తాయి. ప్రేత - చతుర్దశీ లేదా యమ చతుర్దశినాడు తపస్వులైన బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దానాలు చేసిన వానికి యమలోక ప్రవేశముండదు. ఫాల్గున కృష్ణ చతుర్దశి శివరాత్రియను పేర ప్రసిద్ధి గాంచియున్నది. అది అన్ని అభిలాషలనూ నెరవేర్చే పుణ్యదినము. ఈ దినం నాలుగు జాములలోనూ స్నానాలు చేసి భక్తిపురస్సరంగా శివారాధన చెయ్యాలి. చైత్ర పూర్ణిమ, చిత్తానక్షత్రం, గురువారం - ఈ మూడూ కలిసొచ్చిన అదృష్టాన్ని మహాచైత్రీ అంటారు. ఇది అనంత పుణ్యప్రదాయిని. ఇలాగే విశాఖాది నక్షత్రాలతో కలసివచ్చు వైశాఖీ, మహాజ్యేష్ఠా వంటి పన్నెండు పున్నములు వుంటాయి. ఈ సమయాలలో చేసే స్నాన, దాన, జప, నియమాది సత్కర్మలకు అక్షయ ఫలితాలుంటాయి. విష్ణులోకంలో పదికాలాలపాటుగానీ అక్షయంగా గానీ వుండే భాగ్యమబ్బుతుంది. ఎందుకంటే పున్నములు చేస్తే పితరులు తృప్తులవుతారు. హరిద్వారంలో జరిగే మహావైశాఖీ పర్వదినోత్సవం విశేష పుణ్యమును ప్రసాదిస్తుంది. ఈ విధంగానే శాలగ్రామక్షేత్రంలో మహాచైత్రి, పురుషోత్తమక్షేత్రంలో మహాజ్యేష్ఠీ, శృంఖలక్షేత్రంలో మహాషాఢీ కేదారంలో మహాశ్రావణీ, బదరికాక్షేత్రంలో మహాభాద్రీ, పుష్కర, కన్యాకుబ్జాల్లో మహాకార్తికీ, అయోధ్యలో మహామార్గశీర్షీ, మహాపౌషీ, ప్రయాగలో మహామాఘీ, నైమిషారణ్యంలో(ఈ పొరపాటెలా జరిగిందో తెలియదు గాని తెలుగులో మాత్రం ఇంచుమించు అన్ని పుస్తకాల్లో ‘నైమిశారణ్యం’ అనే కనిపిస్తోంది. నిజానికి ‘షా’ తో నున్న పదమే సరైనది. ‘నిమిష’ నుండి ‘నైమిష’ అనేమాట నిష్పన్నమవుతుంది. ప్రతి నిమిషమూ మిక్కిలి విలువైనదే ఆ అరణ్యంలో, అక్కడ జరిగే యాగాలూ చర్చలూ పరమ పుణ్య, విజ్ఞాన ప్రదాయకాలు. అందుకే దాన్ని ‘నైమిషారణ్యమన్నారు’) మహాఫల్గునీ పూర్ణిమ విశేష ఫలదాయకాలన్నీ అక్షయ ఫలాలనిస్తాయి. ఆశ్వయుజ పూర్ణిమను కౌముది, అంటారు. ఈ రోజు ఈ పర్వాలలో చేయబడు శుభాశుభ కార్యాలన్నీ చంద్రోదయ కాలంలో అన్ని నియమాలూ పాటిస్తూ లక్ష్మీపూజ చేయాలి. ప్రతి అమావాస్యనాడు తర్పణాలివ్వాలి శ్రాద్ధకర్మలు చెయ్యాలి. కార్తిక అమావాస్యనాడు ప్రదోష సమయంలో లక్ష్మీపూజను విధివత్తుగా చేసి ఆ తల్లి ప్రీతికై దీపాలను ప్రజ్వలింపజేయాలి; నదీతీరాన్నీ పర్వతాలనూ, గోశాలనూ, శ్శశానాన్నీ, వృక్షమూలాలనూ, కూడళ్ళనూ, ఇంటినీ దీపాలతో అలంకరించాలి.