భవిష్య పురాణము

7 - వ్రతోపవాస మహిమ - శకట వ్రతం

మహారాజా! నీ వింతవఱకూ విన్న నారకీయ శిక్షలను పుణ్యం ద్వారా దూరం చేసుకోవచ్చనుకున్నాం కదా! ఆ పుణ్యం వ్రతోపవాసాల ద్వారా ఎక్కువగా లభిస్తుంది. అతి దుర్లభమైన మనుష్య జన్మను పొందిన ప్రాణి ఎటువంటి కర్మలు చెయ్యాలంటే ఏ కర్మ చేసినందుకూ పశ్చాత్తాప పడవలసిన అవసరం రాకూడదు. అంటే తప్పన్నది తన చేతా, వాతా జరుగరాదు. దాన, వ్రత, ఉపవాసాదులచే సంపాదింపబడిన కీర్తి మనకన్న ముందే పరలోకం చేరుకొని అక్కడ మనను సుఖపెట్టేలాగుండాలి. వ్రతం, స్వాధ్యాయం చేసేవాడు రెండు చోట్లా (ఇహపరాల్లో) సుఖపడతాడు. దీనికి సంబంధించి ఒక కథ వుంది.

ప్రాచీన కాలంలో యోగసిద్ధి కోసం శ్రమించి సాధించిన సిద్ధుడొకాయన ఒక భయంకర వికృత రూపాన్ని ధరించి తిరుగుతుండేవాడు. పొడవుగా దిబ్బగా పెదాలు, గోతులు తీరిన ముఖం, కొన్ని సగం విరిగిన దంతాలు, పచ్చగా నేత్రాలు, వేలాడుతున్న చేటల్లాగా చెవులు, బారెడు పొట్ట, కాస్త వంగిన కాళ్ళు, చీలిన పాదాలు - ఇలా ప్రత్యంగ వికారుడై తిరుగుతున్న అతనికొక బ్రాహ్మణుడు, మూలజాలికుడను పేరుగలవాడు, ఎదురేగి ఇలా ప్రశ్నించాడు. ‘అరే! మీరెప్పుడొచ్చేశారు స్వర్గం నుండి మళ్ళా దేనికొచ్చారు? దేవతల చిత్రాలనే మోహితాలను చేసి ఆడించే సర్వాంగ సుందరి, స్వర్గానికే అలంకారం అయిన రంభను చూశారా? మీరు మరల పైకి వెళ్ళి రంభ కనిపించినపుడు నా మాటగా చెప్పండి ‘ఓ రంభా! అవంతిపురం నుంచి వచ్చి వెళ్ళిన బ్రాహ్మణుడు నీ కుశలమడిగాడ’ని చెప్పండి.

‘మీరు నన్నెలా పోల్చుకున్నారు?’ అడిగాడు సిద్ధుడు ఆశ్చర్యంగా.

‘స్వామీ! ఎవరికైనా ఏవో ఒకటి రెండు అంగాలే వికృతంగా వుంటాయి. కాని ఇలాటి ప్రత్యంగ వికృతి వుండదు. వుందంటే ఆ ప్రత్యంగ వికృతి వెనుక ఏదో సర్వాంగ సౌందర్యం గుప్తంగా దాచబడిందని అర్థం. కాబట్టి మీరు స్వర్లోకవాసియని అనుమానించాను.

ఈ వివరణను వినగానే సిద్ధుడు అదృశ్యమై పోయాడు. కొన్నాళ్ళ తరువాత మళ్ళా వచ్చి మూలజాలిక బ్రాహ్మణునికి కనిపించి ఇలా అన్నాడు.

‘బ్రాహ్మణోత్తమా! నేను స్వర్గానికి వెళ్ళి రంభను ఏకాంతంలో కలిసి మీ గురించి అడిగాను. ఆమె ఏమీ చెప్పలేదు. పైగా స్వర్గంలో నిర్మలవిద్య, పౌరుషం, దానం, తపం, యజ్ఞం, వ్రతం ఇవి మాత్రమే ఒక వ్యక్తి పేరును ఊరి పేరుతో సహా గుర్తింపును తెస్తాయని చెప్పాంది.

‘సిద్ధ పురుషా! ఈ మారు రంభకనబడినపుడు నేను శకటవ్రతాన్ని సంపూర్ణ నియమ నిష్ఠలతో నిత్యం చేస్తుంటానని చెప్పండి’ అన్నాడు బ్రాహ్మణుడు చిన్నగా నవ్వుతూ.

సిద్ధుడు వెంటనే స్వర్గానికి వెళ్ళాడు. ఈ మారక్కడ నిండు సభలో రంభనుద్దేశించి ఈ బ్రాహ్మణుని సందేశాన్ని వినిపించాడు. అతని గుణ, రూపాలను కూడా వర్ణించాడు. రంభ పరమ ప్రసన్నురాలై ఇలా పలికింది.

‘ఓ సిద్ధమహాకాలా! ఆనాటి వనవాసి, నేటి అవంతిపురనివాసియగు ఆ మూలజాలిక బ్రహ్మచారి సత్తముడు నాకు బాగా తెలుసు. దర్శనం, సంభాషణ, ఏకత్రనివాసం, ఉపకారం అను క్రియలవల్ల మానవుల్లో స్నేహం జనించి వర్ధిల్లుతుంది. కాని నాకు పైవాటిలో ఆ బ్రాహ్మణునితో ఏ సంపర్కమూ కలగలేదు. ఏ భాగ్యమూ అబ్బలేదు. నామ మాత్ర శ్రవణం. శకట వ్రతం అతని పట్ల నాకు స్నేహాన్ని కలిగించి పెంచాయి.’

ఆమె వెంటనే దేవేంద్రుని సమీపానికి పోయి తనకాబ్రాహ్మణుని పట్ల కలిగిన అనురక్తినీ, అతని తపశ్శక్తిని వివరించింది. ఇంద్రుడు కూడా ప్రసన్నుడై తన దూతలను పిలిచి ‘మీరు వెంటనే ఆ బ్రాహ్మణుని కడకు పోయి అతనిని సర్వామూల్యవిచిత్ర వస్త్ర భూషణాలంకృతుని చేసి దివ్య వైభవోపేతమైన విమానంలో నావద్దకు గొనిరండు’ అని ఆజ్ఞాపించాడు. అతనిని ఎంతో ఆదరంతో చూసుకున్నాడు.

కాబట్టి ధర్మనందనా! ఇదీ శకటవ్రత మాహాత్మ్యం. దీన్ని నేను సంక్షిప్తంగానే చెప్పాను. దృఢవ్రతియైన పురుషునికి రాజలక్ష్మీ, వైకుంఠలోకం, సకల మనోవాంఛిత ఫలాల వంటి దుర్లభయోగాలన్నీ కడు సులభంగా ప్రాప్తిస్తాయి. సదా సత్పరాయణుడైన పురుషుడు ఇందువల్లనే వ్రత సంలగ్నజీవనుడు కావలసివుంటుంది.”