భవిష్య పురాణము

1 - మధ్యమపర్వం - గృహస్థాశ్రమ ధర్మమహిమ

జయతి భువన దీపోభాస్కరో లోకకర్తా జయతి చ శితిదేహః శారంగ ధన్వామురారిః జయతి చ శశిమౌళీ రుద్రనామాభిధేయో జయతి సకలమౌళిర్భానుమాం శ్చిత్రభానుః

            ఒకప్పుడు కొందరు మహామునులు పౌరాణికులలో శ్రేష్ఠుడైన రోమహర్షణ సూత మహర్షిని అన్ని విధాలా గౌరవించి, ఆదరించి, ఆతిథ్యమిచ్చి అత్యుత్తమ వాచకుడైన ఆయనను పురాణసంహితను గూర్చి బోధింపుమని అడిగారు. ఆయన వెంటనే తన గురు దేవుడైన వ్యాస భగవానుని తలచుకొని ప్రణామం చేసి ఇలా చెప్పసాగాడు.

            ‘మునులారా! మనం ముందుగా జగత్కారణమైన బ్రహ్మస్వరూపాన్ని ధరించిన భగవంతుడు శ్రీహరికి ప్రణామం చేసి సర్వపాపాలనూ సర్వథా నాశనం గావించే దివ్యపురాణగాథలను మననం చేసుకుందాం. ద్విజోత్తములారా! విష్ణుభగవానునిచే ప్రవచింపబడిన భవిష్యపురాణము అత్యంత పవిత్రము, ఆయుష్యప్రదము. అందులోని మధ్యమపర్వం దేవప్రతిష్ఠాది ఇష్టపూర్త కర్మలను వర్ణించే పాపవిమోచనకరమైన భాగము. దానిని చెప్పుకుందాం.

            ఈ మధ్యమపర్వంలో ధర్మము, బ్రాహ్మణాదుల ప్రశంస, ఆపద్ధర్మ నిరూపణము, విద్యామాహాత్మ్యము, ప్రతిమా నిర్మాణము, ప్రతిమా స్థాపన, ప్రతిమ లక్షణాలు, కాలవ్యవస్థ, సర్గప్రతిసర్గాది పురాణలక్షణాలు, భూగోళ నిర్ణయం, తిథుల నిరూపణం, శ్రాద్ధ, సంకల్ప, మన్వంతర, ముమూర్షు, మరణాసన్నకర్మలు, దానమాహాత్మ్యము, భూత, భవిష్య, యుగ - ధర్మానుశాసనములు, ఉచ్చ - నీచ నిర్ణయము, ప్రాయశ్చిత్తాది విషయాలుంటాయి.

            మునులారా! మూడు ఆశ్రమాలకూ మూలమైనదీ, ఉత్పత్తి స్థానమూ గృహస్థాశ్రమమే. అన్యాశ్రమాలు దీని నాశ్రయించే జీవిస్తాయి కాబట్టి ఇదే అన్నిటిలోకీ శ్రేష్ఠము. గార్హస్థ్యజీవనమే ధర్మానుశాసితమైన జీవనం ధర్మ రహితమైన దానిని అర్థము, కామము కూడా పరిత్యజిస్తాయి. ధర్మం నుండియే అర్థకామాలుత్పనం కాగా. ధర్మం నుండియే మోక్షప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ధర్మాన్నే ఆదరించి, అనుష్ఠించి ఆచరించాలి. ధర్మ, అర్థ, కామములను మూడింటినీ కలిపి త్రివర్గమంటారు. క్రమంగానివి సత్త్వ రజస్తమో గుణాత్మకాలు. సాత్త్విక లేదా ధార్మిక వ్యక్తియే పైకి వస్తాడు, ఉన్నతిని పొందుతాడు. అనగా, వానిదే నిజమైన ఉన్నతి. రజస్సు, తమస్సు మాత్రమే కలవారు ఉత్తములు కాలేరు. అర్థకామాలను ధర్మం ద్వారానే సాధించాలి గాని మరొకలా కాదు.

            అర్థకామాలను అదుపులో నుంచుకొని ధర్మానికి అనుగుణంగా వాటిని వాడాలి. ధర్మం వల్లనే అన్నీ అంటే ఇహపరాలు కూడా, ప్రాప్తిస్తాయని బ్రహ్మవాదులంటారు. స్థావర, జంగమాత్మకమైన ఈ జగత్తుని ధరించి నిలబెట్టేది ధర్మమే. అది ఆద్యంతరహితమైన బ్రాహ్మీశక్తి, కర్మజ్ఞానములవల్ల (ధర్మం) ప్రాప్తిస్తుంది. జ్ఞానపూర్వక కర్మయోగాన్ని ఆచరించాలి. వైదిక కర్మలు ప్రవృత్తి మూలకాలనీ నివృత్తి మూలకాలనీ రెండు విధములు. జ్ఞానపూర్వక త్యాగమే సన్యాసము. సన్యాసుల, యోగుల కర్మ నివృత్తి పరకము; గృహస్థుల యొక్క వేదశాస్త్రానుకూల కర్మప్రవృత్తి పరకము. కాబట్టి ప్రవృత్తి యొక్క సిద్ధి కలుగగానే మోక్షకామియైనవాడు నివృత్తినాశ్రయిస్తాడు. లేకుంటే మరల మరల సంసారకూపంలో పడుతునేవుంటాడు.

            శమము, దమము, దయ, దానము, అలోభం, విషయత్యాగం, సరళత, కోపవిసర్జన, అనసూయత (అసూయ లేకుండా జీవించుట), తీర్థయాత్ర, సత్యము, సంతోషము, ఆస్తికత, శ్రద్ధ, ఇంద్రియనిగ్రహం, దేవపూజనము, బ్రాహ్మణపూజ, అహింస, సత్యవాదిత, నిందాపరిత్యాగము, శుభానుష్ఠానము, శౌచాచారం, భూతదయ - ఇత్యాది శ్రేష్ఠచరణములు నాలుగు వర్ణాలవారికీ సమానంగా పాటించవలసిన ఆచరణీయ, యోగ్య, సామాన్య కర్మలే. శ్రద్ధామూలక కర్మమే ధర్మమనబడుతుంది. ధర్మము శ్రద్ధలోనే వుంటుంది.

            శ్రద్ధయే నిష్ఠ, శ్రద్ధయే ప్రతిష్ఠ, శ్రద్ధయే ధర్మానికి తల్లివేరు. విధిపూర్వకంగా గృహస్థధర్మాన్ని నెరవేర్చు బ్రాహ్మణునికి ప్రజాపతిలోకము, క్షత్రియుని కింద్రలోకము, వైశ్యునికి అమృతలోకము, శూద్రునికి గంధర్వలోకము ప్రాప్తిస్తాయి.”