భవిష్య పురాణము

136 -137 - ప్రతిమ - ప్రతిష్ఠ - ఫలం

నారదుడు సాంబునికి ఇంకా చెబుతున్నాడు.

‘అధివాసన విధిని అవధరించు నాయనా! పవిత్రభూమిని ముందు లేపనాలతో కడిగి తుడిచి, పంచవర్ణాలతో సుందర చతురస్రమండలిని రచించు. పతాక, ధ్వజ, తోరణ, ఛత్ర, పుష్ప మాలాదులతో దాన్ని అలంకరించి మండలిలో కుశదర్భలు పఱచి దానిపై సూర్యదేవుని మూర్తిని స్థాపించు. భగవానుని ఆవాహన చేసి అర్ఘ్యమిచ్చి, మధుపర్క, వస్త్ర, యజ్ఞోపవీతాదులతో పూజించి అవ్యంగాన్ని అర్పించు, ప్రతియేడూ శ్రావణమాసంలో నూతన అవ్యంగాన్ని సమర్పిస్తుండాలి. గుర్తుంచుకో. ఇది ఆయనకు పవిత్రకము. అవ్యంగ సమర్పణనాడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. భగవానుని ప్రతిమకు సుగంధద్రవ్య లేపనము చేసి పుష్పమాలను వేసి, ధూపాన్ని చూపించి నమః శంభవాయ (యజు 16/41) అనే మంత్రాన్ని జపిస్తూ ప్రతిమను శయ్యపై శయనింపజేయాలి. ఇలా కోరికలను తీర్చే పూజలు తక్కువ. సర్వకామనా పూర్తికి ఈ విధమైన శయనసేవ లేదా అధివాసన పరిక్రమాన్ని అయిదు, మూడు, లేదా ఒక రాత్రి చెయ్యాలి.

దేవాలయంలో ఈశాన్యంవైపు ఉత్తమ స్థానం మధ్యలో కుశదర్భలను పఱచి తెల్లని వస్త్రాలతో నొక సుసజ్జితమైన శయ్యను వెయ్యాలి. తల తూర్పుముఖంగా రావాలి. దానిపై సూర్యదేవుని ప్రతిమను పడుకోబెట్టాలి. ఆయనకు కుడిపక్క నిక్షుభను, ఎడమపక్క రాజ్ఞిని చరణాలకు సమీపంగా దండనాయకునీ పింగళునీ స్థాపించాలి.

ఆ రాత్రి నీవు ఆ మందిరంలోనే జాగారణ చెయ్యాలి. వంది - చారణులచే స్తుతి, నృత్య, గీతాదులతో ఉత్సవాన్ని చేయించాలి. తెల్లవారగానే ఋగ్వేదవిధానంలో ప్రతిమను ఉద్బోధనము చేసి స్వస్తివాచన పూర్వకంగా భగవానుని పూజచేసి బ్రాహ్మణులకూ, భోజకులకూ హవిష్యాన్నభోజనం పెట్టాలి. వారిని దక్షిణలతో సంతోషపెట్టాలి. తరువాత గర్భగుడిలో పిండికపై ఏడు గుర్రాలతో ప్రకాశించు సువర్ణరథాన్ని స్థాపించి సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యమిచ్చి మంగళవాద్యాలతో జలధారలతో ప్రోక్షించి ఉత్తమ ముహూర్తంలో స్థిరలగ్నంలో ప్రతిమను స్థాపించాలి. ముఖాన్ని తిన్నగా వుండేలా జాగ్రత్తపడాలి. కుడియెడమలలో నిక్షుభాదేవి, రాజ్ఞీదేవిలను ప్రతిష్ఠించాలి. తరువాత మోదక, శష్కులీ, పాయస, కుశరాది పదార్థాలతో దశదిక్పాలకులకూ ఆవాహన పూజాదికములను సమర్పించి బలులివ్వాలి. (జంతుబలులు కాదు)

ఆ తరువాత స్తుతులతో వివిధ ఉపచారాలతో సూర్యభగవానులు పూజలు చేసి బ్రాహ్మణులకు, భోజకులకు భోజనాలు పెట్టి దక్షిణలివ్వాలి. ఇలా ఈ కార్యాన్ని నెరవేర్చిన భక్తులకు నిరంతరాయంగా సూర్యభగవానుల సాన్నిధ్యం లభిస్తుంది. మూడురోజుల పాటు ఉత్సవాలలో పాలుపంచుకున్న వ్యక్తి సూర్యలోకానికి పోతాడు. సూర్యవిగ్రహాన్ని ప్రతిష్ఠించిన వారికి పది అశ్వమేధయాగాలూ, వంద వాజపేయ యజ్ఞాలూ చేసిన ఫలం దక్కుతుంది. మందిరంలో వాడబడిన ఇటుకలు పగలకుండా వున్నంతకాలం మందిర నిర్మాత స్వర్గసుఖాలననుభవిస్తాడు. సూర్యమందిరాన్ని పునర్మించడం, ఉద్ధరించడం మరింత గొప్పకార్యం.’