భవిష్య పురాణము

65 - తారకద్వాదశీ వ్రతం - కుశధ్వజుని కథ

“భగవాన్! నేను మహా పాపిని. భీష్మ ద్రోణాది మహాత్ముల మరణానికి కారకుడైన పాతకుడిని. మీరు నాపై దయ వుంచి ఈ వధ రూపక పాప సమూహాల నుండి నాకు విముక్తి కలిగే ఉపాయాన్ని సూచించండి” అని అభ్యర్థించాడు పశ్చాత్తాపాగ్నులింకా చల్లారని ధర్మరాజు.

భగవద్గీతతో బాటు భారతయుద్ధాన్ని కూడా తన సంకల్పం మేరకే సృష్టించిన శ్రీ కృష్ణుడు ఈ విధంగా బదులిచ్చాడు.

“ధర్మరాజా! ప్రాచీనకాలంలో విదర్భ దేశాన్ని కుశధ్వజుడని ఒక ప్రతాపవంతుడైన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన ఒకరోజున వేటకు పోయి పొరపాటున తన బాణంతో ఒక బ్రాహ్మణుని వధించాడు. మరణానంతరం ఈ పాపం వల్ల భయంకరమైన రౌరవ నరకంలో పడిపోయాడు. కొన్నేళ్ళ తరువాత ఒక భయంకరమైన పాము కడుపున పుట్టి, మరల పాపాలు చేసి మరణించి ఈ మారు సింహం కడుపున పుట్టి ఇంకొన్ని పాపాలు చేశాడు. ఇలా కర్మపరిపక్వమయ్యేదాకా నింద్యయోనులలో జన్మిస్తునే వున్నాడు. అయితే, కుశధ్వజ జన్మానికి ముందలి జన్మలో అతడు తారక ద్వాదశీ వ్రతాన్ని చేసియున్నాడు. దాని ఫలం వల్ల కర్మ పరిపక్వం కాగానే అదే విదర్భ దేశానికి రాజుగా ధర్మాత్మునిగా జనించి మరల అదే వ్రతాన్ని అనేక పర్యాయాలు గావించి చిరకాలం రాజ్యాన్ని సుఖముగా నిష్కంటకముగా పాలించి దేహాంతంలో విష్ణులోకప్రాప్తి నొందాడు”.

“శ్రీకృష్ణచంద్రా ! ఆ వ్రత విధానాన్ని నా వీనులకు ప్రసాదించండి.”

“మహారాజా ! మార్గశిర శుద్ధ ద్వాదశినాడు ఈ తారక ద్వాదశీవ్రతాన్ని చేయాలి. పెందలకడనే నది లేదా చెఱువులో స్నానం చేసి తర్పణ, పూజనాదులను గావించి సూర్యాస్తమయం దాకా హవనాలను చేస్తుండాలి. అప్పుడు పవిత్రీకరింపబడిన భూమిపై గోమయంతో ఒక తారల సహిత సూర్యమండలాన్ని నిర్మించాలి. అందులో ధ్రువునికి కూడా స్థానముండాలి. తరువాత రాగి అర్ఘ్య పాత్రలో పుష్ప, జల, ఫల, అక్షత, గంధ, సువర్ణాల నుంచి దానిని చేతబట్టుకొని కనులకెదురుగా వచ్చేలాగ ఎత్తి, మోకాళ్ళపై నిలబడి తూర్పువైపు తిరిగి సహస్రశీర్షాః సూక్తమును పూర్తిగా చదివి ఆ మండలానికి అర్ఘ్య ప్రదానం చెయ్యాలి. తరువాత బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. మార్గశీర్షంతో మొదలెట్టి ప్రతినెలా క్రమంగా ఖండ - ఖాద్య, సోహాలక, తిలతండుల, బెల్లం అప్పాల, లడ్ల, ఖండవేష్టక, సత్తూ, బెల్లం పూరీల, మధు శీర్ష, పాయస, ఘృతపర్ణ, కసారాలతో భోజనాలు పెట్టాలి. తరువాత క్షమా ప్రార్థనను చేసుకొని మౌనంగా వ్రతి భోంచెయ్యాలి.

ఉద్యాపనలో వెండితో తారకమండలాన్నేర్పాటు చేసి దానిని పూజించాలి. పన్నెండు కుండలను లడ్లతో నింపి దక్షిణతోబాటు వాటినీ, మండలాన్నీ బ్రాహ్మణుని కిచ్చి వేయాలి. ఇలా ఈ వ్రతాన్ని సంపన్నం చేసినవారు సూర్యతేజంతో భాసిల్లే విమానంలో వెళ్ళి నక్షత్ర లోకం చేరుకుంటారు. అక్కడ కొన్నేళ్ళు నివసించి ఆపై విష్ణులోకాన్ని పొందుతారు. ప్రాచీన కాలంలో ఈ వ్రతాన్ని సతీ, పార్వతీ, సీతా, రాజ్ఞీ, దమయంతి, రుక్మిణీ, సత్యభామాది లబ్ధ ప్రతిష్ఠులైన నారీమణులు చేశారు. పురుషులు కూడా ఈ వ్రతాన్ని చెయ్యవచ్చును. ఈ తారకద్వాదశి వ్రతం వల్ల అనేక జన్మల్లో చేసిన పాపాలన్నీ నశిస్తాయి.