భవిష్య మహా పురాణము
125 - గ్రహణ స్నాన మాహాత్మ్యము - విధానము
“పరంధామా! నీవు మంత్రనిధివి. సూర్య చంద్ర గ్రహణస్నాన విధిని నీ నుండి విన గోరుతున్నాను” అన్నాడు అర్జునాగ్రజుడు. చెప్తున్నాడు బలరామానుజుడు.
“మహారాజా! జన్మరాశిపై గ్రహణ ప్లావనమున్న వారు ఏం చేయాలో చెబుతాను విను. అలాంటి వారు చంద్రగ్రహణ వేళ నలుగురు బ్రాహ్మణులచే స్వస్తి వాచనములను చెప్పించి గంధ, మాల్యాదులతో వారిని సత్కరించాలి. గ్రహణం పట్టడానికి పూర్వమే ఔషధాదులను సిద్ధం చేసుకోవాలి. ఛిద్రరహితములైన నాలుగు కలశలను సముద్ర భావన చేసుకుంటూ స్థాపించాలి. వాటిలో సప్త మృత్తికలను - అనగా - ఏనుగులసాల, అశ్వశాల, పుట్ట, నదీ సంగమం, సరోవరం, గోశాల, రాజద్వారం అను ఏడు స్థానాల నుండి తెచ్చిన మట్టిని వేయాలి. తరువాత ఆ కలశలలో పంచగవ్యాలు, ముత్యాలు, గోరోచనం, కమలాలు, శంఖం, పంచరత్నాలు, స్పటికం, తెల్లచందనం, తీర్థజలం, ఆవాలు, రాజ దంతమను ఓషధి, కుముదం, గుగ్గిలం, గసగసాలు - ఇవన్నీ వేసి ఆ కలశలపైకి దేవతలను ఈ విధంగా ఆవాహన చేయాలి. ‘అన్ని సముద్రాల, నదీనదాల, జలప్రద తీర్థాలూ నా పాపాలను దగ్ధం చేయడానికి ఈ కలశలలోనికి దయచేయాలిగాక.’
అనంతరం ఈ ప్రార్థన చేయాలి. ‘దేవతలకు అధిపతీ, సహస్ర నేత్రుడూ, వజ్రధారీయైన ఇంద్ర దేవా! నా గ్రహణ జన్యపీడను దూరం చెయ్యి. సమస్త దేవతల ముఖ స్వరూపుడవు, సప్త జిహ్వాయుక్తుడవు, అతుల కాంతియుతుడవునగు ఓ అగ్నిదేవా! నన్ను కరుణించి చంద్రగహణోత్పన్నమైన నా పీడను దూరం చెయ్యి. సమస్త ప్రాణుల కర్మకూ సాక్షివై ధర్మస్వరూపమే నీవైన ఓ యమధర్మరాజా! నన్ను కరుణించి నా చంద్ర గ్రహణ జన్మమైన పీడను నాశనం చెయ్యి. రాక్షస గణాధ్యక్షుడవు, సాక్షాత్ ప్రళయాగ్ని సదృశుడవు, ఖడ్గధారులలో నత్యంత భయంకరుడవైనను కరుణామయులలో ప్రథమ గణ్యుడవునైన ఓ నిరృతిదేవా! నా చంద్రగ్రహణ జన్యమైన పీడను పారద్రోలుము. నాగపాశధరుడవు, మకర వాహనుడవు, సకల జగజ్జలాధీశుడవునగు ఓ వరుణదేవా! నా పై కరుణ వర్షాన్ని కురిపించి నా చంద్ర గ్రహణ జన్మపీడ కడుక్కుపోవునట్లు కరుణించు. ప్రాణరూపంలో సమస్త ప్రాణులలో వీచు దేవుడవు కృష్ణమృగవాహనుడవు నగు ఓ వాయుదేవా! నా పై దయ జూచి నన్ను ఈ చంద్ర గ్రహణ జన్య పీడ నుండి కాపాడు.
(పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్ఛప, ముకుంద, కుంద, నీల, వర్చ - ఈ తొమ్మిదీ నవ నిధులుగా మహాభారతంలో పేర్కొనబడ్డాయి.) నవనిధులకు స్వామివీ, ఖడ్గ త్రిశూలగదాధారివీ అగు కుబేరదేవా! చంద్ర గ్రహణం ద్వారా నేను పడుతున్న కష్టాలను పడగొట్టించు. చంద్రశేఖరుడవు, పినాకపాణివి, దేవాధిదేవుడవునగు హే శివశంకరా నా చంద్రగ్రహణ జన్మపీడను భస్మం చెయ్యి. బ్రహ్మ, విష్ణు, సూర్య సహితులై జగత్తున నెలకొన్న జంగమ, స్థావర సర్వదేవతలారా! నన్నీ చంద్రగ్రహణ జన్యపీడనుండి రక్షించండి.’
ఈ విధంగా అందరు దేవతలనూ ఆహ్వానించి ఋగ్యజుస్సామ వేద మంత్రాలను ధ్వనింపజేస్తూ ఉపకరణ యుక్త కలశలలో నున్న నీటితో వ్రతియే స్వయంగా అభిషేకం చేసుకోవాలి. తరువాత తెల్లపూలమాల, చందన, వస్త్ర, గోదానాల ద్వారా వ్రతంలో పాల్గొన్న బ్రాహ్మణులను పూజించాలి. ఇష్ట దేవతలను మరల పూజించాలి. తరువాత బ్రాహ్మణులు మంత్రాలను వస్త్ర - పట లేదా కమలదళాలపై అంకితం చేసి ఆ కలశలను ద్రవ్యయుక్తంగా యజమానుని శిరస్సుపై నుంచాలి. అప్పుడు యజమానుడు తూర్పువైపు తిరిగి తన ఇష్ట దైవాన్ని స్మరిస్తూ గ్రహణం విడిచేదాకా నమస్కారం చేస్తూనే గడపాలి. చంద్రగ్రహణం విడిచాక మాంగలిక కార్యాలను గావించి గోదానం చేసి స్నాన శుద్ధుడైన బ్రాహ్మణునికి అభిమంత్రాంకితమైన వస్త్ర - పట్టమును దానం చేయాలి.
ఈ ప్రకారంగా గ్రహణ స్నానం చేసిన వారికి గ్రహణ జన్య పీడలుగాని బంధు జన వినాశంగాని ఈ జన్మలో వుండవు. పైగా వారికి పునరాగమన రహిత పరమ సిద్ధి కూడా ప్రాప్తిస్తుంది. సూర్యగ్రహణంలో మంత్రాలతో కలిపి సూర్య నామాన్ని సదా ఉచ్చరిస్తూ ఉండాలి. రెండు గ్రహణాలలోనూ సూర్యదేవుని నిమిత్తమై పద్మరాగమణులనూ చంద్రదేవునికి కపిల గోవునూ దానమిస్తూ వుండాలి. ఈ గ్రహణ స్నాన విధిని విన్నవారూ, ఇతరులకు వినిపించినవారూ సంపూర్ణ పాపాల నుండి విముక్తులై ఇంద్ర లోకంలో ప్రతిష్ఠితులౌతారు.”