“స్వామీ! బ్రహ్మావర్తం. మ్లేచ్ఛుల చేతిలోకి పోకుండా వుండడానికి కారణమేమిటి? అడిగాడు శౌనకుడు. చెప్పసాగాడు సూతమహర్షి,
“మునీంద్రా! సరస్వతి ప్రభావం వల్ల మ్లేచ్ఛులటువైపు రాలేకపోయారు. అక్కడ కశ్యపుడనే బ్రాహ్మణుండేవాడు. కలియుగంలో వేయి సంవత్సరముల గడిచాక దేవతల కోరికపై ఆయన స్వర్గలోకం నుండి అక్కడికి వచ్చాడు. ఆయన ధర్మపత్ని పేరు ఆర్యావతి. వారిద్దరికి పదిమంది పుత్రులు కలిగారు. వారి పేర్లు ఉపాధ్యాయుడు, దీక్షితుడు, పాఠకుడు, శుక్ల, మిశ్ర, అగ్నిహోత్రి, ద్వివేది, త్రివేది, పాండ్యుడు, చతుర్వేది. వీరంతా పేరుకు తగ్గట్టు గానే గుణవంతులయ్యారు. వారి తండ్రి కశ్యపునికి రాని వేదం లేదు, తెలియని శాస్త్రం లేదు. దొరకని జ్ఞానం లేదు. ఆయన తన పుత్రుల మధ్యలో కూర్చుని అన్ని విద్యలూ నేర్పాడు. తరువాత కశ్యపుడొకనాడు కాశ్మీరంపోయి జగజ్జనని సరస్వతీ దేవికి ఎఱ్ఱనిపూలతో, అక్షతలతో, ధూపదీపాలతో, నైవేద్య పుష్పాంజలులతో ఆమె సంతృప్తి పడేటంతగా పూజ చేసి స్తుతిస్తూ ఇలా అన్నాడు. ‘అమ్మా! నాపై నీ కరుణ ఎందుచేతనమ్మా ప్రసరించడంలేదు? నీవు ఈ లోకానికే తల్లివే! నేను ఈ లోకం వాడినీ. నీ బిడ్డనీ కానను కొంటున్నావా? ధర్మ ద్రోహులనెందుకు క్షమించి విడచిపెడుతున్నావో నాకర్థం కావడం లేదు. మ్లేచ్ఛులను అణచి ఉత్తమ సంస్కారాన్ని, సంస్కృతభాషనీ మరల నిలబెట్టనవసరం లేదా? అమ్మా! మీరు అనేక రూపాలు ధరించి ధరిత్రిని నిలబెట్టగలరు. హుంకార స్వరూపమై ధూమ్రలోచనుని చంపిన మీకు, చండీరూపిణులై దైత్య సంహారము పెద్దయెత్తున చేయగలిగిన మీకు ఈ మ్లేచ్ఛాన్నుత్తరించి (ఉత్తరించి = తెగగోసి) సంస్కృతాన్నుద్ధరించి ఈ దేశ సంస్కారాన్ని సమున్నతం గావించి నిలబెట్టడం అసాధ్యం కాదు కదా!”
ఈ స్తుతికీ, పూజా సంస్కారాలకు ప్రసన్నురాలై కశ్యపుల హృదయాలలో నివాసముండి నాల్కలపై నాట్యమాడసాగింది జగజ్జనని సరస్వతీదేవి. వారపుడు మిశ్రదేశాలకు పోయి అక్కడున్న మ్లేచ్ఛులకు వైదిక ప్రాయశ్చిత్త సంస్కారాదులను చేసి వారిని ద్విజులుగా మార్చి వెనక్కి తెచ్చారు. సరస్వతీ దేవి అనుగ్రహం వల్ల ఈ ప్రాంతంలో ఆర్యసంస్కృతిని పునరుద్ధరించి మునివృత్తిలోనే వుంటూ కూడా నూట ఇరవై సంవత్సరాల పాటు రాజ్యం కూడా చేశాడు కశ్యపుడు.
రాజ్యపుత్ర నామక దేశంలో ఎనిమిదివేలమంది శూద్రులుండేవారు. ఇక్కడి రాజుపృథువు. ఆయన నుండియే మాగధ ప్రాకృతం ఉత్పత్తి అయింది. మాగధుడను తన పుత్రునికి రాజ్యాభిషేకం చేసి ఆయన తపోవనాలకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా బ్రహ్మావర్తంలోకి సరస్వతీ దేవి దయవల్ల, మ్లేచ్ఛం చొరబడలేదు.”
ఇది విని భృగు శ్రేష్ఠుడైన శౌనకుడు ఇతర మునులు సంతోషించిన వారై పౌరాణిక సత్తముడైన సూత మహర్షికి నమస్కరించి తమ విష్ణు ధ్యాన తత్పరత, యాగాది నిర్వహణ, నిత్య నైమిత్తిక కర్మలలో నిమగ్నులయ్యారు. మరల నాలుగు సంవత్సరాలకు వారికి సూత మహర్షి దర్శనం లభించగా వారాయనను మరల పరివేష్టించి ఇలా వేడుకొన్నారు.
“లోమహర్షణ మహర్షి పుంగవా! ఇపుడు మాకు మగధరాజు వంశ విషయక జ్ఞానాన్ని ప్రసాదించండి.
చెప్పసాగాడు సూతముని.
“మునిప్రవరులారా! తండ్రి నుండి రాజ్యాన్ని పొందిన (మాగధుడు కశ్యప పుత్రుడని పురాణంలో వుంది. ఇది అతని అసలు పేరు మాగధుడు కాదేమో.) మాగధుడు ఆర్యదేశాన్ని ప్రాంతాలుగా విభజించాడు. పాంచాల (పంజాబ్) మునకు ఉత్తరంవైపు మద్రదేశం, తూర్పువైపు మగధ(ఇప్పటి నుండి ఉదయాశ్వుని కాలందాకా ‘రాజగృహపురం’ రాజధానిగా వుండేది. ఉదయాశ్వుడు రాజధానిని గంగా తీరంలో పాటలీపుత్రమనే నగరాన్ని వృద్ధి చేసి అక్కడికి మార్చాడు. ఆ తరువాత మాగధీయులందరూ పాట్నానే కేంద్రంగా జేసుకొని శాసించారు.) దానికి ఆగ్నేయంలో కళింగ (ఒరిస్సా) దక్షిణంలో అవంతిదేశం, నైరృతి వైపు ఆనర్త (గుజరాత్) దేశం, పశ్చిమంలో సింధుదేశం, వాయవ్యంలో కైకయ ఈశాన్యంలో కులింద దేశాలుగా ఆర్యావర్తాన్ని విభజించాడు. తరువాతి రాజు యజ్ఞం ద్వారా బలరాముని మెప్పించి ఆయన అంశము గల శిశునాగుని రాజ్యవారసునిగా పొందాడు. శిశునాగుడు నూరేళ్ళూ అతని పుత్రుడు కాకవర్మా, వంశపారంపర్యంగా వచ్చిన క్షేమధర్ముడు, క్షేత్రౌజుడు, వేదమిశ్రుడు, అజాత శత్రువు, దర్శకుడు, ఉదయాశ్వుడు, నందవర్ధనుడు తండ్రులకంటె పదేసి సంవత్సరాలు తక్కువగా రాజ్యం చేశారు. అనగా నందివర్ధనుడు ఇరువది సంవత్సరాలే పరిపాలించాడు. అతని కొడుకైన (ఇతడు శూద్ర స్త్రీకి జన్మించినవాడు.) నందుడూ అంతే. నందుని కొడుకు ప్రనందుడూ అతని కొడుకు పరానందుడూ పదేసియేళ్ళే రాజ్యపాలనం చేశారు. అనంతరం క్రమంగా ఈ వంశంలో సమానంద, ప్రియానంద, దేవానందులు ఇరవయ్యేసియేళ్ళు పరిపాలించగా తరువాత రాజ్యానికి వచ్చిన యజ్ఞభంగుడు, మౌర్యానందుడు, మహానందుడు పదేసి సంవత్సరాలు పరిపాలన చేశారు.
ఈ సమయంలో కలి హరిని స్మరించాడు. అనంతరం గౌతమునిగా ప్రసిద్ధి గాంచిన దేవత ఒకడు కశ్యపునికి జన్మించాడు. అతడు బౌద్ధ ధర్మాన్ని సంస్కరించి పట్టణ నగరం (కపిలవస్తు) లో ప్రచారంచేస్తూ పదేళ్ళపాటు రాజ్యపాలన చేశాడు.
ఇక్కడినుండి లిచ్ఛవి రాజవంశాన్ని వర్ణిస్తాను. వీరి రాజధాని కపిలవస్తు. గౌతముని పుత్రుడు శాక్యముని. అతని రాజ్యకాలం ఇరవయ్యేళ్ళు. అతనికి శుద్ధోదనుడు అను పేరు గల పుత్రుడు జనించాడు. ఇతడు ముప్పది సంవత్సరాల పాటు రాజ్యపాలనం చేశాడు. అతని పుత్రుని పేరు శాక్యసింహుడు. కలియుగంలో రెండు వేల సంవత్సరాలు గడిచేనాటికి అతడు శతాద్రి ప్రాంతంలో రాజ్యపాలన చేస్తున్నాడు. కలియొక్క ప్రథమ చరణం నాటికి మిగిలిన వేదధర్మాన్ని నాశనం చేస్తూ అతడు అరవై సంవత్సరాలు రాజ్యశాసనం గావించాడు. అప్పటికి ఇంచుమించుగా అందరూ బౌద్ధులైపోయారు. శాక్యసింహుని పుత్రుడు బుద్ధిసింహుడు కూడా అలాగే ప్రవర్తించి ముప్పదియేళ్ళు పరిపాలన చేశాడు. ఇతని కొడుకు, శిష్యుడునైన చంద్రగుప్తుడు మహావీరుడై భారత దేశంతోపాటు అన్యదేశాలపై కూడా అధికారం చెలాయించాడు. ఇతనితో మరల పాటలీపుత్ర వంశవర్ణన ప్రారంభమవుతుంది. ఇతనితోనే మౌర్యవంశచరిత్ర ప్రారంభమవుతుంది. ఇతడు పారసీ దేశపాలకుడైన (సులూబ్) సెల్యూకస్ కూతురిని పెండ్లి చేసుకొని యవన సంబంధమైన బౌద్ధధర్మాన్ని ప్రచారంచేశాడు. ఇతడు, ఇతని కొడుకు బిందుసారుడు కూడా అరవై సంవత్సరాల చొప్పున పరిపాలన చేశారు. బిందుసారుని కుమారుడు అశోకుడు. ఆ సమయంలో కన్యాకుబ్జ దేశము నుండి ఒక బ్రాహ్మణుడు ఆబూ పర్వతం పైకి పోయి అక్కడ విధి పూర్వకంగా బ్రహ్మహోత్రాన్ని చేశాడు. వేదమంత్ర ప్రభావం వల్ల యజ్ఞకుండం నుండి నలుగురు క్షత్రియులుద్భవించారు. వారే ప్రమర లేదా పర్మార్ (సామవేది) చపహాని లేదా చౌహాన్ (కృష్ణయజుర్వేది) త్రివేది లేదా గెహర్వార్ (శుక్లయజుర్వేది) పరిహారక (అథర్వవేది) రాజపురుషులు. వీరంతా ఐరావత సంతానమైన ఏనుగులను అధిరోహించే వారు. వీరే అశోకుని వంశజులనుండి రాజ్యాలను తమ అధీనంలోనికి తెచ్చుకొని బౌద్ధానికి చరమగీతం పాడినవారు.
అవంతిలో పర్మార్లు రాజులైనారు. మొదటి పర్మారుడు నాలుగు యోజనాల విస్తృతి కలిగిన అంబావతీ అను పురిలో స్థిరనివాసము నేర్పరుచుకొని సుఖంగా జీవించాడు.