భవిష్య పురాణము

96,97,98 - నక్తవ్రతం - శివచతుర్దశీ వ్రతం

ధర్మజా! ఇక నక్తవ్రత విధానాన్ని ఆలకించు. ఇది ముక్తి ప్రదాయకం. ఏ మాసంలోనైనా శుక్ల చతుర్దశినాడు బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఈ వ్రతాన్ని మొదలెట్టాలి. ప్రతి మాసంలోనూ రెండు అష్టములూ రెండు చతుర్దశులూ వుంటాయి కదా!

ఆ దినాలలో శివుని పూజించి పూర్తిగా, ఏ పని చేస్తున్నా, ఆయననే ధ్యానిస్తుండాలి. రాత్రి సమయంలో పృథ్వినే పాత్రగా చేసుకొని అందులోనే భుజించాలి(గయ మున్నగు తీర్థాలలో భూమిపైనే భోజనపాత్రల రూపంలో గిన్నెలు చేయబడి వుంటాయి. ఇంటిలో అలాటివి కొందరు నిర్మింపజేసుకుంటారు. మొదట్లో జైనులు, బౌద్ధులు, భిక్షుకులు, సన్యాసులు వాటిలోనే తినేవారు. కొందరు భిక్షా పాత్రను చేతితో పట్టుకొని అందులో భోజనం చేస్తుంటారు. వీటిని కరపాత్రికలంటారు. ఇవి త్యాగ, వ్రత, తపః, సహిష్ణుతలకు చిహ్నాలు. అవన్నీ ఇందు మిశ్రితాలు.). ఉపవాసం కంటె భిక్ష, భిక్ష కంటె అయాచితవ్రతం, అయాచితం కంటే నక్త (రాత్రి) భోజనం ఉత్తమాలు. అందువల్ల ప్రతి ఒక్కరూ నక్తవ్రతం చేయాలి.

పూర్వాహ్ణంలో దేవతలూ, మధ్యాహ్నం మునులూ, అపరాహ్ణం పితరులూ, సాయంకాలం గుహ్యకాదులూ భోజనం చేస్తారు. కాబట్టి నక్తవ్రతులు ఆ తరువాత తినాలి. నక్తప్రతికి నిత్య స్నానం, స్వల్ప హవిషాన్న భోజనం, సత్యభాషణం నిత్యాహవనం, పుడమిపై పడక ముఖ్య నియమాలు. ఈ విధంగా ఒక యేడాదిదాకా చేసి చివర ఒక నేతితో నింపిన కలశముపై శివుని మట్టి ప్రతిమను స్థాపించాలి. కపిల గోవు యొక్క పంచగవ్యాలతో ప్రతిమకు స్నానం చేయించి పండు, పువ్వు, యవధాన్యము, దధి, పాలు, దూర్వాంకురము, నువ్వుగింజ, బియ్యపుగింజ - ఇవన్నీ కలిపిన నీటితో అష్టాంగ అర్ఘ్య ప్రదానం చెయ్యాలి. రెండు మోకాళ్ళూ నేలపై బెట్టి లేచి ఆ పాత్రను తలదాకా తీసుకువచ్చి శంకర భగవానునికి ధారపోయాలి. తరువాత అనేకరకాల భక్ష్యభోజ్యాలను నైవేద్యంగా ఆయనకు నివేదించాలి. ఒక ఉత్తమ సవత్సగోవునూ, వృషభాన్నీ వేదవేత్తయగు బ్రాహ్మణోత్తమునికి దక్షిణా సహితంగా దానం చేయాలి. ఈ వ్రతాన్ని చేసే వ్యక్తి దివ్య దేహధారియై ఉత్తమ విమానారూఢుడై రుద్రలోకాన్ని చేరుకుంటాడు. అక్కడ మూడువందల కోట్ల సంవత్సరాలు సుఖంగా వుండి మరల ఈ లోకానికి మరలి రావలసి వచ్చినపుడొక మహారాజుగా పుడతాడు. ఒక్కసారి ఈ నక్తవ్రతాన్ని చేసి సదాశివుని పూజించినా స్వర్గలోకం ప్రాప్తిస్తుంది.

ధర్మజా! ఇపుడు ముల్లోకాలలోనూ ప్రసిద్ధి నొందిన ఒక శివచతుర్దశి వ్రతాన్నుప దేశిస్తాను. విను. ఇది మాహేశ్వర వ్రత శివ చతుర్దశీ నామంతో ప్రఖ్యాతి చెందింది. ఈ వ్రతాన్ని మార్గశిర శుద్ధ త్రయోదశినాడు ఒక పూట భోంచేసి, చతుర్దశినాడు నిరాహారంగా వుండి చేయాలి. చతుర్దశి నాడు శంకర భగవానుని గంధపుష్ప ధూపదీపాది ఉపచారాలతో పూజించాలి. స్వర్ణ వృషభాన్ని చేయించి దానిని కూడా పూజించాలి. అనంతరం ఆ కలశనీ వృషభాన్నీ వివిధ భక్ష్య పదార్ధాలతో సహా బ్రాహ్మణునికి సమర్పిస్తూ ఇలా అనాలి: ప్రీయతాం దేవదేవోఽత్ర సద్యోజాతః పినాకధృక్ తరువాత ఉత్తరంవైపు తిరిగి నేతిని నోట్లో వేసుకొని ఆ రాత్రి నేలపై శయనించాలి. ప్రతిమాసం శుక్ల చతుర్దశినాడు ఇలాగే చేసి పడుకోడానికి ముందు  ప్రార్ధనను చేయాలి:

శంకరాయ నమస్తుభ్యం నమస్తే కరవీరక

త్ర్యంబకాయ నమస్తుభ్యం మహేశ్వరమతః పరం

నమస్తేఽస్తు మహాదేవ స్థాణవేచ తతః పరం

నమః పశుపతేనాథ నమస్తే శంభవే నమః

నమస్తే పరమానంద నమః సోమార్ధధారిణే

నమోభీమాయ చోగ్రాయత్వామహంశరణం గతః (ఉత్తరపర్వం-97/25,27)

పన్నెండు నెలల్లో క్రమంగా గోమూత్రం, గోమయం, పాలు, పెరుగు, నెయ్యి, కుశోదకం, పంచగవ్యం, బిల్వం, యవాగు, కమలం, నల్లనువ్వులు ప్రాశ్నం చేయాలి. అలాగే మందార, మాలతి, ధతూర, సిందువార, అశోక, మల్లిక, కుబ్జక, పాటల, అర్క - పుష్ప, కదంబ, నీలకమల, కనేర - ఈ పన్నెండు పుష్పాలతో క్రమంగా పన్నెండు చతుర్దశులలోనూ ఉమామహేశుని పూజించాలి. అనేక ప్రకారాల భోజనాలను, వస్త్రాలను, ఆభూషణాలనూ, దక్షిణలనూ ఇచ్చి బ్రాహ్మణులను సంతుష్టపఱచాలి. ఒక ఉత్తమ శయ్యపై ఎనిమిది ముత్యాలను వేసి సువర్ణధేను, సువర్ణ వృషభ ప్రతిమలను దానిపై స్థాపించాలి. జలకుంభం, గిన్నెతో బియ్యం, నేయి, దక్షిణలతో సహా ఈ సామగ్రి నంతటినీ వేదవ్రత పరాయణుడు, శాంతచిత్తుడునగు భూసురుని పత్నీ సమేతంగా రావించి ఆ దంపతులకు సమర్పించాలి. ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేసే పురుషుని తల్లిదండ్రుల పాపాలు కూడా నశిస్తాయి. అతనికి వేయి అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలం దక్కుతుంది. దీర్ఘాయువు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, విద్యాదులు కూడా లభిస్తాయి. దేహాంతంలో విష్ణులోకం, అక్కడి నుండి శివలోక నివాస ప్రాప్తి లభిస్తాయి.