148-150 - కన్యాదాన, బ్రాహ్మణ సేవా మాహాత్మ్యం

ధర్మజా! వివాహయోగ్యమైన కన్యను సర్వాలంకృతను గావించి బ్రాహ్మ విధిలో సుయోగ్యుడైన వరునికి ప్రదానం చేయువారు అటు ఏడు తరాల ఇటు ఏడు తరాల వారిని ఉద్ధరించగలుగుతారు. ఈ కన్యాదాన పుణ్యఫలం వారి కుటుంబాన్నంతటినీ తరింపజేస్తుంది.

ప్రాజాపత్య విధి ద్వారా కన్యాదానాన్ని చేసినవారు దక్షప్రజాపతి లోకనివాస ప్రాప్తిని పొందుతారు. తరువాత కొంతకాలానికి స్వర్గానికి వెళతారు. సొమ్ము తీసుకొని కన్యాదానం చేసేవారు ఘోర నరకంలో పడిపోతారు. వేల సంవత్సరాల దాకా తినకూడనివి తింటూ అక్కడే వుండిపోతారు. సవర్ణంలోనే పిల్లను ఇవ్వాలి.

అనాథ బ్రాహ్మణ బాలకునికి చూడాకరణ, ఉపనయనాది సంస్కారాలను చేసినవారికి అశ్వమేధ యజ్ఞఫలం లభిస్తుంది. అనాథ కన్యకు వివాహం చేసినవారు స్వర్గానికి వెళ్లి అక్కడా పూజలందుకొంటారు. కన్యతోబాటు ప్రదీప్త శుద్ద స్వర్ణాన్ని దానమిచ్చిన వారికి రెండురెట్ల కన్యాదాన ఫలం దక్కుతుందని పూర్వులనేవారు. కన్యను పూజించుట విష్ణువుని పూజించునంత పుణ్య కార్యమే.

మహారాజా! పుడిమికి వెలుగు నిడు వేల్పులే బ్రాహ్మణులు. మూడులోకాలలోనూ స్థాయి వారిని దేవతలుగానే పరిగణిస్తారు. వారు తమ మంత్ర బలంతో దేవతలను ఆ నుండి దించివేయగలరు; అదేవతలను ఆ స్థాయికి పెంచివేయనూ గలరు. కాబట్టి వారినెల్లపుడూ పూజిస్తుండాలి. దేవగణాలన్నీ బ్రాహ్మణుల నుండియే ఉత్పన్నమైనవని స్మృతులు వర్ణించాయి. కాబట్టి వారు పూజ్యతములు. దేవగణాలూ పితృగణాలూ బ్రాహ్మణుని చేతి భోజనాన్నే తింటారంటే ఇకవారి గొప్పతనానికి సాటి ఏమున్నది? ప్రత్యక్ష దేవతయైన బ్రాహ్మణుడేది మాట్లాడినా అది దేవతల పరోక్ష వాణియేనని గ్రహించాలి. ఇది వారి మాహాత్మ్యము.