భవిష్య పురాణము

177 - బ్రహ్మాండ దాన - విధి

మహారాజా! ఇప్పుడు బ్రహ్మాండ దాన విధిని వివరిస్తాను. దీనిని అగస్త్యమహర్షి నాకు చెప్పాడు. దీని నాచరించడం వల్ల శారీరక, మానసిక, వాచిక పాపాలన్నీ పోయి యశ, ధన, ఆయు, మంగళ, సద్గతులు ప్రాప్తిస్తాయి.

తన శక్తి మేరకు ఇరవై పలంల నుండి వెయ్యి ఫలంల దాకా బరువున్న బ్రహ్మాండము యొక్క సువర్ణ ప్రతిమను, తయారుచేయించాలి. దాని పొడవు వెడల్పులు పన్నెండంగుళాల నుండి వంద అంగుళాల దాకా వుండవచ్చును. దానిలో దేవతల, దైత్యుల, మానవుల, గంధర్వుల, నాగుల, రాక్షసుల, నదుల, సరోవరాలు, సముద్రాల, పర్వతాల, దిగ్గజాల చిత్రాలను చిత్రించాలి. వాటి మధ్యలో మేరుపర్వత శిఖరాలపై పత్నీ సమేతులైన త్రిమూర్తులను కూడా చిత్రించాలి. ఈ రకంగా ఒక శ్రేష్ఠ శిల్పిచేత సువర్ణమయ బ్రహ్మాండాన్ని తయారుచేయించాలి.

ఆయన సంక్రాంతి, విషువయోగం, గ్రహణాది సమయాల్లోగాని, ఇతర పర్వదినాల్లో గాని ఈ దానాన్నివ్వవచ్చును. పుష్పాలతో నొక మండపాన్ని తయారు చేసి దానిలో నొక ద్రోణం (32 శేర్లు) పరిమాణంలో (బరువున్న) నువ్వులను పోసి వాటిపై బ్రహ్మాండ ప్రతిమను స్థాపించాలి. కుంకుమ  చూర్ణాన్ని పూసి, రెండు వస్త్రాలను కప్పి, గంధ ధూపాదులతో ఆ బ్రహ్మాండాన్ని పూజించాలి. దానికి నలువైపులా పూర్ణ కలశలను స్థాపించి పద్దెనిమిది రకాల ధాన్యాలనూ ఒక్కొక్కటీ, ఒక ద్రోణం చొప్పున వుంచాలి. చేతికఱ్ఱ, చెప్పులు, గొడుగు, పాత్రలు, ఆసనాలు, అద్దాలు, భోజనాది సమస్త సామగ్రినీ మండపం వద్ద వుంచాలి. ఈ విధంగా ఇంట్లోగానీ మండపంలో గానీ బ్రహ్మాండాన్ని స్థాపించి ఒక హస్త ప్రమాణంలో నొక చతురస్ర కుండాన్ని తయారుచేయించి అందులో హవనం చేయడానికి నాలుగు వేదాలూ తెలిసిన చారణిక బ్రాహ్మణులను వస్త్రాది ఆ భూషణాలతో అలంకృతులను చేసి సిద్ధంచేయాలి. ఉపాధ్యాయులూ, రాజ పురోహితులూ కూడా ఈ హవనం చేయాలి. గ్రహ యజ్ఞవిధితో హవనం చేయాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల, ఇతర దేవతల నామ మంత్రాలతో తిలాహుతులనూ, పదివేల ఆహుతి మహావ్యాహృతులతో ఆహుతులనిస్తూ బ్రాహ్మణులు రుద్రోపాఠం చేయాలి. తరువాత యజమానుడు స్నానం చేసి తెల్లబట్టలు కట్టుకొని సర్వోపచారాలతో బ్రహ్మాండాన్ని పూజించి పుష్పాంజలితో చేతులు జోడించి ఇలా ప్రార్థించాలి:

నమో జగత్ప్రతిష్ఠాయ విశ్వధామ్నే నమోఽస్తుతే

వాఙ్మనోఽతీత రూపాయ బ్రహ్మాండ శుభకృద్భవ ॥

బ్రహ్మాండోదరవర్తీని యాని సత్త్వాని కాని చిత్ ॥

తాని సర్వాణి మే తుష్టిం ప్రయచ్ఛంత్వ తులాం సదా

బ్రహ్మా విష్ణు శ్చరుద్రశ్చ లోక పాలాస్తథాగ్రహాః ॥

నక్షత్రాణి తథానాగా ఋషయోమరుతస్తథా

సర్వేభవంతు సంతుష్టాః సప్తజన్మాంతరాణి మే ॥ (ఉత్తర పర్వం 177/19-22)

ఈ విధంగా పుష్పాంజలులిచ్చి ఆ బ్రహ్మాండ ప్రతిమను దక్షిణతో బాటు బ్రాహ్మణునికి దానమివ్వాలి.

ధర్మజా! ఈ దానానికి సంబంధించి ఒక ఆఖ్యానముంది. సత్యయుగంలో సుద్యుమ్నుడని ఒక మహారాజుండేవాడు. అతడు ఐశ్వర్యవంతుడు, శక్తిశాలి, పదివేల యేనుగుల బలముకలవాడు. అతడు మూడువేల యేండ్లు నిష్కటంకంగా రాజ్యపాలన చేసి పుత్రునిపై రాజ్యమును వేసి వనాలలోకి తపస్సుకై వెడలిపోయాడు. అక్కడ కఠోర తపస్సు చేస్తుండగా దివ్యవిమానం వచ్చి, దేహాంతంలో, అతనిని స్వర్గానికి గొని పోయింది. పుణ్యఫలం, తపోబలం అతనికి నిరాటంకంగా అన్ని లోకాలూ తిరిగే శక్తినిచ్చాయి. అతడు బ్రహ్మలోకాన్ని చేరుకోగానే స్వయంగా బ్రహ్మదేవుడే ఎదురేగి అతనికి గొప్పగా ఆదర సత్కారాలు చేసి శ్రేష్ఠమైన ఆసనంపై కూర్చోబెట్టాడు. అక్కడే వుండిపొమ్మన్నాడు. అన్ని లోకాల్లో అన్ని రకాల ఆనందాలూ కరతలామలకములుగా నున్నా అతడు దేనినీ అనుభవించలేకపోతున్నాడు. చివరికొకనాడు బ్రహ్మనే ప్రాధేయపూర్వకంగా ఇలా అడిగాడు:

‘హే దేవేశా! ఆకలి, దాహము నా ప్రాణాలు తోడేస్తున్నాయి. ఏ భోగాన్నీ అనుభవించ లేకపోతున్నాను. ఇది నా ఏ జన్మ దుష్కర్మ ఫలము?’

‘సుద్యుమ్నా! నువ్వు ధర్మమూర్తివి. ప్రజలకు కావలసినవన్నీ చేశావు. గొప్ప ఆధ్యాత్మవాదివి, మహా తపస్వివి కాబట్టే ఇక్కడి దాకా రాగలిగావు. కాని, దానాది సత్కర్మలను చేయలేదు. అవి నీ తపస్సుకు ప్రతిబంధకాలనుకొన్నావు. అవకాశముండీ దానమివ్వని కారణంగా ఇలా బాధపడుతున్నావు’.

‘దేవదేవా నాపై దయవుంచి ఈ ఆకలిదప్పులు దూరమయ్యే ఉపాయం సూచించండి.’ ‘సుద్యుమ్నా! నువ్వు భూలోకానికి వెళ్ళు. నీశరీరం నీకువస్తుంది. బ్రహ్మాండ ప్రతిమా దానాన్ని సాదరంగా శాస్త్రోక్తంగా చెయ్యి. నీకు తృప్తికలుగుతుంది’ అని ఉపదేశించాడు బ్రహ్మదేవుడు.

సుద్యుమ్నుడలాగే చేసి స్వర్గానికేగి సర్వభోగాలనూ అనుభవించగలిగాడు.

ధర్మజా! ఈ దానం చేస్తే చరాచర జగత్తునే దానమిచ్చినంత ఫలం లభిస్తుంది. ఈ దాని తన వంశాన్నుద్ధరించి, తాను ముప్పదియారు మన్వంతరాల దాకా బ్రహ్మలోకంలో సుప్రతిష్ఠితుడై మరల పుడమిపై పుట్టినపుడు అన్ని సుఖాలూ నిరంతరంగా అనుభవించగలిగే వానిగానే పుడతాడు. ఈ దాన మాహాత్మ్యాన్నీ కథనీ శ్రద్ధగా భక్తితో విన్నవారికి సద్గతులు ప్రాప్తిస్తాయి.