భవిష్య పురాణము

55 - సూర్యాభిషేకం - రథయాత్ర

బ్రహ్మ ఇంకా వివరిస్తున్నాడని సుమంతుడు శతానీకునికి చెబుతున్నాడు. నిజానికి సూర్యుని రథయాత్రనీ, ఇంద్రోత్సవాన్నీ లోక కళ్యాణం కోసం బ్రహ్మయే ఏర్పాటు చేశాడు. ఏప్రాంతంలో వీటిని చేస్తారో ఆ ప్రాంతం కరువు రక్కసి కోరల్లో చిక్కుకోదు. చోర భయం కూడా వుండదు.

మార్గశిరశుద్ధ సప్తమి నాడు సూర్యభగవానుని ప్రతిమను శ్రద్ధగా నేతితో స్నానం. చేయించాలి. అలా చేయించినవాడు బంగారు విమానంలో అగ్నిలోకం వెళ్ళి చిరకాలం సుఖిస్తాడు. చిత్రాన్నము చక్కెర పరమాన్నము సూర్యునికర్పించినవాడు, బ్రహ్మలోకం చేరతాడు. సూర్యునికి ప్రతిరోజూ భక్తి పూర్వకంగా నేతితో అభ్యంగన స్నానం చేయించిన వానికి పరమోత్తమ పరమగతి ప్రాప్తిస్తుంది.

పుష్య శుక్ల సప్తమినాడు వేద మంత్రాలు చదువుతూ పవిత్ర జలంతో సూర్యునికి స్నానం చేయించాలి. సూర్యాభిషేక వేళ ప్రయాగ, పుష్కర, కురుక్షేత్ర, నైమిష, పృథూదక, గోకర్ణ, శోణ, బ్రహ్మావర్త, కుశావర్త, బిల్వక, నీల పర్వత, గంగాద్వార, గంగాసాగర, కాలప్రియ, మిత్రవన, భాండీరవన, చక్రతీర్థ, రామతీర్థ, త్రివేణి, సింధు, చంద్రభాగ, నర్మద, విపాశా, తాపీ, వేత్రవతి, గోదావరి, కృష్ణ, శతద్రు, పుష్కరిణి, సరయు, కౌశికి మున్నగు తీర్థాలను, నదులను, సముద్రాలను స్మరించుకోవాలి. ఇలా ఒక నెల చెయ్యాలి.

మాఘకృష్ణ సప్తమినాడు మంగళ కలశాలతో వితానాదులతో సుశోభితమైన చతురస్రాకారంలో గట్టి ఇటుకలతో నిర్మింపబడిన వేదికపై సూర్యనారాయణుని స్థాపించి హవనం చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి, వేదపఠనం చేయించి, రకరకాల నృత్య, గీత, వాద్యాదులతో ఉత్సవాన్ని జరపాలి. తరువాత మాఘశుద్ధ చవితినాడు అయాచితవ్రతం చేయాలి. పంచమినాడు ఒకమారే భోజనం చెయ్యాలి. షష్ఠినాడు రాత్రి మాత్రమే భోంచెయ్యాలి. సప్తమినాడుపవాసం చేసి హవనం, బ్రాహ్మణులకి భోజనదానం చెయ్యాలి. అందరికీ దక్షిణలిచ్చి, పౌరాణికుని ఘనంగా సన్మానించాలి. తరువాత రత్నజటితమైన సువర్ణరథంలో సూర్యుని ఉంచి మందిరం ఎదురుగానే నిలిపి ఆ రాత్రంతా ఉత్సవాలు చేయించి జాగారం చేయాలి. మాఘశుక్ల అష్టమినాడు రథయాత్ర సాగించాలి. రథానికి ముందు బాజాలు, నృత్యగీతాలు, మంగళవేదధ్వని ఉండాలి. రథం ముందు నగరానికి ఉత్తర దిశలో పయనించి క్రమంగా తూర్పు, దక్షిణ పశ్చిమ దిశలవైపు తిరగాలి. ఈ ప్రకారంగా రథయాత్రను సాగించడం వల్ల రాజ్యంలో అన్ని ఉపద్రవాలూ దూరమవుతాయి. పాలకుడు యుద్ధవిజేత అవుతాడు. ప్రజలు, పశుగణాలు ఆరోగ్యంతో వర్ధిల్లడం జరుగుతుంది. రథయాత్రలో పాలుపంచుకొన్నవారికి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది.

ప్రతిమను ప్రతిష్ఠిత ప్రదేశం నుండి తీసి రథంలో పెట్టడం మళ్ళా మందిరంలో పెట్టడం పద్ధతికాదు కదా అని శివుడడిగాడు. సూర్యభగవానుడే నిరంతరం మనకోసమై భ్రమణం చేస్తూ వుంటాడు కాబట్టి ఆయన ప్రతిమను కదిలించడంలో దోషం లేదని చెప్తూ బ్రహ్మ సూర్యరథయాత్రనింకా ఇలా వివరించసాగాడు. బంగారం, వెండి లేదా ఉత్తమ దారువుతో అతిశయ దార్ఢ్యముతో రమణీయమైన రథాన్ని నిర్మించి దానికి సలక్షణ, సుశీలలైన ఆకుపచ్చని గుర్రాలను పూన్చాలి. భగవానుని ప్రతిమను రథంపై ప్రతిష్ఠించాక ఈ గుఱ్ఱాలను పూన్చి వాటిని బ్రహ్మాండంగా కుంకుమపువ్వు ఆభరణాలు, వింజామరలు మున్నగు వాటితో అలంకరించాలి. ముఖ్యంగా ఈ రథాన్ని సిద్ధంచేశాక బ్రాహ్మణులతోబాటు దీనులకు, అంధులకు, అనాథలకూ సంతుష్టికర భోజనం పెట్టి దక్షిణలివ్వాలి. వ్యక్తి వ్యక్తిత్వంతో పనిలేకుండా ప్రతివ్యక్తినీ సంతోషపెట్టాలి. రథయాత్ర స్వరూపంలో మనకు ప్రసాదించబడిన ఈ సూర్య మహాయాగానికి వచ్చినవారెవరూ నిరాదరణకో మరిదేనికో బాధపడి ఆకలితో వెనుదిరిగిపోరాదు. అలా ఒక్కరు పోయినా నిర్వాహకులకు పాపం చుట్టుకుంటుంది. వారి పితరులు అధోగతిపాలౌతారు. ఇక క్రింది మంత్రాలను చదువుతూ దేవతలకు పదార్థాలు సమర్పించాలి.

బలిం గృహ్ణంతి మే దేవా ఆదిత్యా వసవ స్తథా

మే మరతోఽథాశ్వినౌరుద్రాః సుపర్ణాః పన్నగాగ్రహాః

అసురాయాతు ధానాశ్చ రథస్యయాస్తు దేవతాః

దిక్పాలా లోకపాలాశ్చయే చ విఘ్న వినాయకాః

జగతః స్వస్తి కుర్వంతుయేచ దివ్యా మహర్షయః

మా విఘ్నం మాచమే పాపం మాచమే పరిపంథినః

సౌమ్యా భవంతు తృప్తాశ్చదేవా భూతగణాస్తథా (బ్రాహ్మపర్వం 55/68 -71)

ఈ మంత్రాలు చదువుతూ బలి యిస్తూ వామదేవ్యం, పవిత్రం, మానస్తోకం, రథంతరం అను వేదపాఠాలను పఠించాలి. తరువాత పుణ్యాహవాచనంతో మంగళవాద్య ధ్వనులతో సుందర, సమతల మార్గంలో రథాన్ని తీసికెళ్ళాలి. గుర్రాలు దొరకకపోతే మంచి ఎద్దులను గాని, బలిష్ఠులయిన పురుషులను గాని వినియోగించవచ్చు. శుద్ధాచరణులు, వ్రతులు నైన ముప్పది మంది గాని పదహారుగురు గాని బ్రాహ్మణులు మందిరస్థమైన ప్రతిమను మిక్కిలి సావధానంగా తెచ్చి రథంలో స్థాపించాలి. సూర్య భగవానుని ప్రతిమ కిరువైపులా సంజ్ఞాఛాయలను స్థాపించాలి. (వీరికే రాజ్ఞీ, నిక్షుభాలని పేర్లున్నాయి. సంజ్ఞను సంధ్య అనికూడా అంటారు) స్వామికి కుడివైపు ఛాయని ఎడమవైపు సంజ్ఞనీ ఉంచాలి. సారథి చేతిలో సువర్ణదండాన్ని, రథంపై సువర్ణ దండాలంకృతమైన ఛత్రాన్నీ వుంచాలి. ధ్వజాన్నీ దానికి సప్తవర్ణాల్లో ఏడు పతాకల్నీ అమర్చాలి. సారథి స్థానంలో శ్రద్ధాభక్తులున్న బ్రాహ్మణునే కూర్చోబెట్టాలి. ముందుగా ఉత్తరద్వారం వద్దకు రథాన్ని గొనివచ్చి అక్కడ ఒక రోజుంచి పూజించాలి. నవమి రోజున రథాన్ని తూర్పు వాకిలివైపు, తరువాతి దినమున దక్షిణ ద్వారం వద్దకు, ఆ తరువాతి రోజు పశ్చిమ ద్వారానికి గొంపోవాలి. ప్రతి ద్వారం వద్ద ఒక్కొక్క రోజుంచి ఉత్సవం చేయాలి. తరువాతి రోజు నగర మధ్యమ ప్రాంతానికి రథాన్ని తీసుకువచ్చి నిలిపి పూజనూ ఉత్సవాన్నీ జరిపించాలి. దీప మాలికలను ప్రజ్వలింపజేయాలి. బ్రాహ్మణులకు దానాలిచ్చి భోజనాలు పెట్టాలి. ఆ తరువాత అక్కడినుండి మందిరంలోకి రథాన్ని తీసుకురావాలి. ఒక పగలు, రాత్రి రథంలోనే ప్రతిమనుంచాలి. మరునాడు సూర్యభగవానుని ప్రతిమను రథం నుండి దింపి గొప్ప వైభవంతో పూజలూ, ఉత్సవాలూ చేస్తూ నినాదాలిస్తూ మందిరంలో స్థాపించాలి. ఈ రకంగా సప్తమి నుండి త్రయోదశిదాకా రథయాత్రను జరిపించాలి. చతుర్దశి నాట స్వామిని మందిరంలో పునఃప్రతిష్టించాలి. ఈ రథయాత్రను చేయించిన చోట సుఖశాంతులు వర్ధిల్లుతాయి. భక్తి శ్రద్ధలు పొంగారగా పాల్గొన్న జనులకెటువంటి విఘ్న - బాధలూ వుండవు.

(ఒక ఆలోచన

తల్లి చంటిపిల్లాడి చేతిలోనొక బత్తాయి పండు పెడుతుంది. దాన్ని పట్టుకొని వాడు మురిసి పోతుంటాడు. అదివాడు తినాల్సి వచ్చినపుడు తల్లే వాని వద్దకు వచ్చి ఆ పండు తొక్కలు వలిచి, తోలుతీసి, పిక్కలు విడదీసి, మెత్తటి ఈనెలు, దాని లోపలి గుజ్జును ముక్కలు ముక్కలుగా చేసి వాడి నోటికి అందిస్తుంది.

భగవంతుడు వేదాలను సృష్టించాడు. మరల తానే వ్యాసరూపంలో వచ్చి పురాణాలను రచించాడు.)