భవిష్య పురాణము

27 - ఆర్ద్రానందకరీ తృతీయ వ్రతం

మహారాజా! ఇపుడొక త్రైలోక్య ప్రసిద్ధమైన, ఆనంద సంధాయకమైన వ్రతాన్ని వర్ణిస్తాను. ఆకర్ణించు. దీనిపేరు ఆర్ద్రానందకారి. ఏ నెలలోనైనా తదియ ఆషాఢ లేదా రోహిణి లేదా మృగశిర నక్షత్రంతో యోగిస్తే ఆరోజు ఈ వ్రతాన్ని చేయాలి. ఆరోజు కుశ, గంధోదకంతో స్నానం చేసి తెల్లవస్త్రాలను కట్టుకొని శ్వేతమాలనూ శ్వేత చందనాన్నీ ధరించి ఉత్తమ సింహాసనంపై శివపార్వతుల ప్రతిమను స్థాపించి సుగంధిత శ్వేత పుష్పాలతో చందనాదులతో వారిని పూజించాలి. ఈ క్రింది మంత్రాల నుచ్చరిస్తూ గౌరీశంకరులను క్రమంగా పూజించాలి.

ఓం వాసుదేవ్యై నమః, శంకరాయ నమః తో పాదాలనూ,

శోకవినాశిన్యైనమః, ఆనందాయ నమః తో పిక్కలనూ

రంభాయై నమః, శివాయనమః తో ఊరువులనూ

ఆదిత్యై నమః, శూలపాణయే నమః తో కటినీ,

మాధవ్యై నమః, భవాయ నమః తో నాభినీ,

ఆనందకారిణ్యై నమః, ఇంద్రధారిణే నమః (ఇం కి బదులు ‘చం’ వుండాలేమో)

తో వక్షః స్థలాన్నీ, ఉత్కంఠిన్యై నమః, నీల కంఠాయ నమః తో కంఠాన్నీ, ఉత్పల ధారిణ్యై నమః, రుద్రాయ నమః తో చేతులనూ, పరిరంభిణ్యై నమః, నృత్యశీలాయ నమః తో భుజాలనూ, విలాసిన్యైనమః, వృషేశాయ నమః తో ముఖాన్నీ, సస్మరశీలాయై నమః, విశ్వవక్త్రాయ నమః తో పెదాల్నీ, మదనవాసిన్యై నమః, విశ్వధామ్నే నమః తో కనులనీ, రతిప్రియాయై నమః, తాండవేశాయ నమః తో కనుబొమలనూ, ఇంద్రాణ్యై నమః, హవ్యవాహాయ నమః తో లలాటాన్నీ, స్వాహాయై నమః, పంచశరాయ నమః (ఆలోచించాలి)తో మకుటాన్నీ పూజించాలి.

తరువాత ఈ క్రింది మంత్రం ద్వారా పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాలి.

విశ్వకాయౌ విశ్వముఖా విశ్వపాద కరౌశివౌ

ప్రసన్నవదనౌ వందే పార్వతీ పరమేశ్వరౌ

కాళిదాసు యొక్క జగత్ప్రసిద్ధమైన శ్లోకం

“వాగర్థావివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మీద ఈ పురాణ ప్రభావమే పడి వుంటుంది. అది కూడా ప్రార్థనా శ్లోకమే.

ఈ విధంగా ప్రార్థించి ఆ మూర్తికి ఎదురుగా అనేక ప్రకారాల కమలాలనూ, శంఖ, స్వస్తిక చక్రాదులనూ చిత్రించాలి. మార్గశిర మాసంతో మొదలుపెట్టి ప్రతి మాసంలో విదియనాళ్ళలో క్రమంగా గోమూత్రం, గోమయం, పాలు, పెరుగు, నెయ్యి, కుశోదకం, గోశృంగోదకం, బిల్వపత్రం, కుండనీరు, వట్టి వేరుంచిన నీరు, యవచూర్ణ జలం, తిలోదకములను మాత్రమే నోట్లో వేసుకొని రాత్రి నేలపై శయనించాలి. ఉమామహేశుల పూజలలో సర్వత్ర తెల్లపూలే ప్రశస్తంగా పరిగణింపబడుతున్నాయి.

సంవత్సరాంతంలో బ్రాహ్మణ దంపతులను సాదరంగా ఆహ్వానించి వారికి ఉప్పుతో, బెల్లంతో నింపిన కుండలనూ, పట్టువస్త్రాలనూ, చందనాన్నీ, కండువాలనూ, చందనాన్నీ, చెఱకుగడలనూ, శివపార్వతుల స్వర్ణ ప్రతిమనూ దానం చేస్తూ ఈ మంత్రం పఠించాలి.

గౌరీ మే ప్రీయతాం నిత్యమఘ నాశాయ మంగళా

సౌభాగ్యాయాస్తు లలితా భవానీ సర్వసిద్ధయే (ఉత్తరపర్వం 27/19)

చివరగా దంపతులకు శయ్యాదానం చేయాలి. చేస్తూ కొన్నిమార్లు గౌరీ మే ప్రీయతాం అంటూ వుండాలి.

ఈ వ్రతాన్ని చేసిన పురుషునికి ఈ లోకంలో ధనమూ, ఆయువూ, ఆరోగ్యమూ, సుఖమూ లభిస్తాయి. దేహాంతంలో శివలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ వ్రత విధానాన్ని చెప్పిన వారికీ విన్నవారికీ గంధర్వులచే పూజింపబడుతూ ఇంద్రలోకంలో నివసించే భాగ్యమబ్బుతుంది. స్త్రీలు తమ పతులతో సహా గౌరీలోకాన్ని పొందుతారు.