26 - సత్యవ్రతంలో చంద్రచూడమహారాజు కథ

సూతమహర్షి ఇలా ప్రవచింపసాగాడు. “ఋషులారా! ప్రాచీనకాలంలో కేదార ఖండంలో మణిపూరక రాజ్యాన్ని ధార్మికుడూ, ప్రజావత్సలుడునైన చంద్రచూడుడనే రాజు పాలిస్తుండేవాడు. ఆయన అత్యంత శాంత స్వభావుడు, మృదుభాషి, ధీరప్రకృతి గలవాడు, నారాయణభక్తుడు. సహజంగానే మన రాజులకు శత్రువులైన మ్లేచ్ఛులు అప్పటికే వింధ్యదేశాన్ని అలముకొనియున్నారు. వారు ఈయన పైకి దండెత్తారు. అస్త్ర, శస్త్ర నిపుణుడైన రాజు భయంకరంగానే యుద్ధం చేశాడు గాని ఆయన సైన్యం చాలావఱకు నశించిపోయింది. కూటయుద్ధ నిపుణులైన మ్లేచ్ఛులు పెద్య సైన్యనష్టం లేకుండా కాలక్షేపం చేశారు గానీ పూర్తిగా గెలువలేకపోయారు. యుద్ధవిరామంలో చంద్రచూడుడు తన రాజ్యానికి దూరంగా వనాలలో ఏకాంతంగా తిరుగుతూ తీర్థాలను అక్కడక్కడ దర్శిస్తూ కాశీపురిని చేరుకున్నాడు. అక్కడ ప్రతియింటిలో సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా, కాశీపురి ద్వారకాపురిని తలపింపచేయడంతో ఆశ్చర్యపడ్డాడు. పైగా అక్కడి వారు సంపన్నులై సంతృప్తులై వున్నారు.

అక్కడి సర్వసమృద్ధికి విస్మితుడైన చంద్రచూడునికి శతానందుని వృత్తాంతం తెలిసింది. ఆయన ద్వారా ప్రసిద్ధమైన సత్యనారాయణవ్రత కల్పమూ అవగతమైనది. వెంటనే సదానంద ఉపనామంతో వర్ధిల్లుతున్న శతానందుని వద్దకు పోయి తాను రాజుననే డాంబికం ఏనాడూ లేనివాడు కావున ఆయన పాదాలకు నమస్కరించాడు. తన రాజ్యభ్రష్టత్వానికి సమీపంగా వున్న స్థితిని దెలిపి సత్యనారాయణ వ్రతాన్ని తనచేత చేయించి తననుద్ధరించవలసినదిగా చంద్రచూడుడు శతానందుని ప్రార్థించాడు.

‘మహారాజా! భగవంతుడైన శ్రీపతిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రేష్ఠసాధనం సత్యనారాయణవ్రతం. ఇది సమస్త దుఃఖశోకాదికములనూ సమయింపజేస్తుంది. ధన ధాన్యాలను వృద్ధిచేస్తుంది. సౌభాగ్య సంతతులను ప్రదానం చేస్తుంది. సర్వత్ర విజయ ప్రదాయకమవుతుంది. ఏరోజైనా ప్రదోషకాలంలోనే పూజకు అన్నీ సిద్ధము చేసుకోవాలి. అరటి స్తంభాలతో, తోరణాలతో అలంకృతమైన మండపాన్ని యేర్పాటు చేసి అందులో అయిదు కలశలను స్థాపించి అయిదు ధ్వజాలను పెట్టుకోవాలి. వ్రతి స్వయంగా బ్రాహ్మణుల సహాయంతో ఆ మండప మధ్యంలో ఒక రమణీయమైన వేదికను వేయాలి. నారాయణ భగవానుని సాలగ్రామాన్ని బంగారంతో అలంకరించి దానిపై స్థాపించి ప్రేమగా, భక్తితో దానికి చందన పుష్పాది ఉపచారాలతో పూజచేయాలి. పూజానంతరం రాత్రి సత్యనారాయణ ధ్యానంలోనే గడుపుతూ నేలపై శయనించాలి. ఇలా వరుసగా యేడు రాత్రులపాటు చేయాలి.’

శ్రద్ధగా విన్న చంద్రచూడుడు మరింత శ్రద్ధగా కాశీనగరంలోనే సత్యనారాయణ వ్రతాన్ని గావించాడు. భగవానుడు ప్రసన్నుడై రాత్రి కనిపించి అతనికొక ఉత్తమఖడ్గాన్ని ప్రసాదించాడు. శత్రువులను సంపూర్ణంగా ధ్వంసం చేసే ఆకత్తిని గ్రహించిన మహారాజు శంఖచూడుడు శతానంద బ్రాహ్మణునకు నమస్కరించి తన రాచనగరును చేరుకున్నాడు. తరువాత ఆరువేల మంది మ్లేచ్ఛులను అవలీలగా సంహరించి తన రాజ్యాన్ని నిష్కంటకం చేసుకున్నాడు. వారినుండి అపార ధన రాశులను స్వాధీనం చేసుకున్నాడు. నర్మదానది యొక్క మనోహర తటముపై మరల సత్యనారాయణ వ్రతాన్ని చేశాడు. అప్పటినుండి ప్రతి పున్నమినాడూ ప్రేమగా, భక్తితో, విధి విధానపూర్వకంగా సత్యదేవుని పూజను చేయసాగినాడు. ఆ ప్రభావం వల్ల ఆయన మరికొన్ని లక్షల గ్రామాలకు అధిపతియైనాడు. ఆనాటినుండి అరవై సంవత్సరములపాటు రాజ్యము చేసి దేహాంతంలో విష్ణులోక ప్రాప్తిని పొందాడు చంద్రచూడ మహారాజు.”

సత్యనారాయణ వ్రత కథలో మూడవ అధ్యాయము పూర్తి