భవిష్య పురాణము

185 - మాతృ శ్రాద్ధవిధి

            అరుణా! శ్రాద్ధం ఎప్పుడూ కూడా రాత్రి పెట్టకూడదు. అలా చేస్తే అది రాక్షసీశ్రాద్ధ మనబడుతుంది. ఇరు సందెలలోనూ, సూర్యాస్తమయ్యాకా, శ్రాద్ధం నిషిద్ధం.’

            ‘దేవదేవా! తల్లికి శ్రాద్ధమెలాపెట్టాలి? తల్లిగా ఎవరిని పరిగణించాలి? నాందీ ముఖ - పితరుల పూజనమెట్లనరించాలి? దయచేసి నాకు చెప్పండి’ అని వేడుకొన్నాడు అరుణుడు.

            (ఖగమనగా పక్షి మాత్రమే కాదు. ఆకాశవిహారి ఏదైనా ఖగమే ఎవరైనా ఖగులే.)ఖగశార్దూలా! మాతృశ్రాద్ధం పెట్టినపుడు పూర్వాహ కాలంలో ఎనమండుగురు విద్వాంసులైన బ్రాహ్మణులకు భోజనం పెడుతూ మరొక బ్రాహ్మణుని సర్వదైవత్యునిగా పెట్టుకొని అర్చించి భోజనం పెట్టాలి. ఈ తొమ్మండుగురు బ్రాహ్మణులకీ యవ, తిల, దధి, గంధ, పుష్పాదులతో పూజచేసి ప్రదక్షిణలు చేయాలి. మంచి మధురమైన మృష్టాన్న భోజనాన్ని వారికి కర్తయే దగ్గరుండి వడ్డించాలి. ఆ తరువాత పిండదానమునివ్వాలి. అక్షతలతో పెరుగుతో పిండాన్ని తయారు చెయ్యాలి. నాలుగు వైపుల (ముడులతో) నొక మండపాన్ని తయారుచేసి దానికి ప్రదక్షిణ చేయాలి. తరువాత పూర్వాగ్రకుశలను పుష్పాలనూ దానిపై జల్లాలి. మాత, ప్రమాత, వృద్ధప్రమాత, పితామహి, ప్రపితామహి, వృద్ధ ప్రపితామహి కుటుంబంలోని ఇతర మాతలు - వీరందరినీ ఆదరపూర్వకంగా ఆహ్వానించి ఈ కార్యం చెయ్యాలి. మాతలనుద్దేశించి ఆరుపిండాలు తయారుచేసి వాటిని పూజించాలి. నందీముఖం కోసమై అయిదుగురు ఉత్తమ బ్రాహ్మణులను అయిదుగురు పితరుల రూపంలో భావించి పూజించి శాస్త్రోక్తంగా భోజనాలు పెట్టి వారికి ప్రదక్షిణలు చేయాలి.

            శ్రాద్ధంలో దౌహిత్రులు, కుతుపవేళ (మధ్యాహ్నం ఒంటి గంట సమయం), నువ్వులు ఈ మూడూ పవిత్రాలుగా భావింపబడతాయి. శుద్ధి, అక్రోధం, తొందరపాటు - తత్తరపాటు లేకపోవడం ప్రశంస యోగ్యాలుగా పరిగణింపబడతాయి. ఏకవస్త్రధారణం చేసి పితృ, దేవతా, మనుష్య పూజనార్చనాలను చేయరాదు. ఉత్తరీయం తప్పనిసరి నియమం.