“స్వామీ! వర్షకాలంలో ఆకాశం నల్లమబ్బులు పట్టి వుంటుంది కదా! నలువైపులా నాట్యమాడుతూ నెమళులు కనబడుతుంటాయి. ఇలాంటి సమయంలో చంద్రుడు కనబడడు కదా! మరి కులీన స్త్రీలెవరికి అర్ఘ్యమివ్వాలి, ఎలాటి సత్కర్మలు గావించాలి?”
“ధర్మరాజా! శ్రేష్ఠ స్త్రీలు ఈ కాలంలో రోహిణీ చంద్ర వ్రత పాలనం చేయాలి. శ్రావణ కృష్ణ ఏకాదశినాడు పవిత్రలై సర్వౌషధిమిశ్రిత జలంతో స్నానం చేసి, ఉడద పిండితోనొక వంద ఇందురికాలను అయిదు ఘృతమోదకాలను తయారుచేయాలి. మొత్తం పూజా సామగ్రినంతటినీ వెంటనిడుకొని ఒక ఉత్తమ జలాశయానికి పోయి దాని ఒడ్డున పేడతో నొక మండలాన్ని రచించాలి. అందులో రోహిణీ చంద్రుల బొమ్మలను గీసి గంధ, పుష్ప, ధూప, అక్షత, దీప, నైవేద్యాదులతో వారి నర్చించి ఈ విధంగా ప్రార్థించాలి.
సోమరాజ నమస్తుభ్యం రోహిణ్యైతే నమోనమః।
మహాసతి మహాదేవి సంపాదయ మమేప్సితం॥ (ఉత్తరపర్వం 67/8)
అనంత సోమోమే ప్రీయతాం, దేవీ రోహిణీ మే ప్రీయతాం అంటూ మొత్తం పూజా ద్రవ్యాలను బ్రాహ్మణునికిచ్చి వేయాలి. అప్పుడు మొలలోతు నీళ్ళలో నిలబడి మనస్సులో రోహిణీ సహిత చంద్రదేవుని తలచుకుంటూ ఇందురికాలను తినివేయాలి. బయటికి వచ్చి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి యథాశక్తి దక్షిణలివ్వాలి. ప్రతియేటా ఈవిధంగా వ్రతాన్ని చేసే స్త్రీ, పురుషులకు ధన, ధాన్యాది, పుత్ర పౌత్రాది సంపత్తితో బాటు కలకాలం ఆనందారోగ్యాలతో జీవించే అదృష్టం పడుతుంది. తీర్థస్థలంలో మృత్యు యోగముంటుంది. త్రిమూర్తుల లోకాలలోనూ నివసించే భాగ్యమబ్బుతుంది.
అవియోగవ్రతమని ఒకటుంది. దానికైతే భాద్రపద శుద్ధ ద్వాదశినాడు పెందరాడే లేచి జలాశయానికి పోయి స్నానం చేసి శుద్ధ శుక్ల వస్త్రాలను ధరించి సుందర భూమిపై ఆవుపేడతో మండపాన్ని నిర్మించి దానిపై లక్ష్మీ సహిత విష్ణు, గౌరీ సహిత శివ, సరస్వతీ సహిత బ్రహ్మ, రాజ్ఞీ సహిత సూర్యనారాయణ దేవుల బొమ్మలను గీసి గంధ, పుష్ప, ధూప, దీపాదులతో సామాన్య పూజనుగావించిన పిమ్మట ఈ నలుగురు దేవ దంపతులనూ వేరువేరుగా పేరుకి ముందు ‘ఓం’ పేరుకి చివర ‘నమః’లను చేర్చి మంత్రాలను చదవాలి. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. యథాశక్తి దానాలిచ్చి తాను కూడా (అంటే ప్రతి) భోజనం చెయ్యాలి. ఈ అవియోగవ్రతము నాచరించిన వారికి ఇష్టజన వియోగముండదు. సంసారంలో సుఖశాంతులుంటాయి. పై దేవతల లోకాలలో, దేహాంతమందు, నివాసం, నలుగురి లోకాలలోనూ నివాసం పూర్తయినాక మోక్షము, ప్రాప్తిస్తాయి.”