భవిష్య పురాణము

151 - దాన మహిమ - ప్రత్యక్ష ధేను దానవిధి

“భగవన్! సకల విద్యా విజ్ఞాన ప్రదాయకమైన మీ శ్రీముఖము నుండి నేను పురాణ సంబంధ విషయాలను విన్నాను. వ్రతాలనూ తెలుసుకున్నాను. ఈ సంసారము యొక్క అసారతనూ గ్రహించాను. ఇక దానము యొక్క మహిమను వినగోరుచున్నాను.” అని ప్రార్ధించిన ధర్మజునితో శ్రీకృష్ణుడిలా చెప్పసాగాడు.

“మహారాజా! మృతులమై పోయిన తరువాత ధనాది వైభవాలు మనతో రావు. కానీ మనం బ్రాహ్మణులకు చేసిన దానాలు పరలోకంలో పాధేయాలై మనతో వస్తాయి. హృష్ట, పుష్ట, బలయుక్తమైన శరీరముండీ కూడా ఒరులకుపకారము చేయనివాడు ఆ శరీరమును మనం పొందినా దండగే. ఉపకార హీనుని జీవనం వ్యర్థము. కాబట్టి మన దగ్గర ఒక గడ్డిపరక వుంటే దానిని చీల్చి ఇంకొకరిచ్చి మనమొక సగం తినాలి. ధనం వున్నప్పుడెలాగూ దానం చెయ్యాలి. ఎందుకంటే ఈ ధనం మనవద్ద ఎన్నాళ్ళుంటుందో ఎవరికి తెలుసు?

గ్రాసాదర్ధ మపి గ్రాసమర్థిభ్యః కిం నదీయతే।

ఇచ్ఛానురూపో విభవః కదా కస్యభవిష్యతి॥ (ఉత్తరపర్వం - 151/6)

ధర్మార్థ కామాలను నిర్వర్తించని వాని జన్మము వ్యర్థము. దానమివ్వకుండా, హవనం చేయకుండా, తీర్థములలో ప్రాణత్యాగం చేయకుండా, సువర్ణ, అన్న, వస్త్ర, జలాదులతో బ్రాహ్మణులను సత్కరించకుండా ఈ జన్మకి ఇలాగే బతికేసిన వ్యక్తి, రానున్న జన్మల్లో అన్నవస్త్ర రహితుడై, రోగంచే గ్రసితుడై, చేతిలో ముష్టిపాత్రను పట్టుకొని యాచిస్తూనే జీవిస్తాడు. అనేక ప్రకారాల శ్రమకోర్చి కష్టపడి సంపాదించిన ధనానికీ, ధనికీ ఒకటే సుగతి మార్గం. అదియే దానం. ఉపభోగంవల్లా దానంవల్లా ధనం నశింపదు. కేవలం పూర్వపుణ్యం క్షీణించినప్పుడే ధనం నశిస్తుంది. మరణానంతరము ఈ ధనం ఎలాగూ వుండదు కాబట్టి తమ చేతితో తామే సుపాత్రులకు ధనాన్ని దాచుకోకుండా దానం చేసేవారు ధన్యులు. వ్యక్తి పూర్వజన్మలో చేసిన దానాలూ, వ్రతాలూ, దేవపూజనలే ఈజన్మలో ధన, ధాన్య రూపంలో ఫలానిస్తాయి. మరల అవే కర్మలు చేస్తే పుణ్యం పెరుగుతుంది. ఇంకా మంచి జన్మ రావచ్చు. మోక్షమే అబ్బవచ్చు.”

“వాసుదేవా! విష్ణు భగవానునీ, శంకర భగవానునీ, బ్రాహ్మణులనీ ప్రసన్నం చేసుకోవాలంటే ఏయే దానాలు ఏయే పద్ధతులలో చేయాలి?”

“ధర్మజా! గో, భూ, విద్యా దానాలు సర్వశ్రేష్టాలు.

త్రీణ్యాహురతి దానాని గావః పృథ్వీ సరస్వతీ (ఉత్తరపర్వం 141/18)

ఆవును పితకడం, భూమిని దున్నడం, విద్యను అధ్యయనం అధ్యాపనం చేయడం వల్ల ఏడు తరాల వారు తరిస్తారు. ఎటువంటి ఆవును దానమివ్వాలంటే - సుపుష్ట, సుందర, సవత్స, పయస్విని, న్యాయంగా సంపాదించిన ధనంతో కొనబడినదీ అయిన గోవునే దానమివ్వాలి. దానిని శ్రేష్ఠ బ్రాహ్మణునికివ్వాలి. ఇక ఎలా దానమీయాలీ అంటే- ఏదో ఒక పుణ్యదినం నాడు స్నానము చేసి, పితరులకు తర్పణలిచ్చి శివునికీ విష్ణువుకీ నేతితో అభిషేకాలు చేసి తరువాత పాలతో కూడా గావించి గోవును రావించి దాని కొమ్ములకు చిన్న చిన్న బంగారపు తొడుగులను పెట్టి, దానిని తాడు, దూడ, పాలు పితకడానికి కంచుపాత్రలతో సహా పూజించి, మెడకు మాలలు చుట్టి, వీపుపై బట్టలు పెట్టి తూర్పు లేదా ఉత్తరంవైపు ముఖం వచ్చేలా నిలబెట్టాలి. తరువాత దానికి ప్రదక్షిణ చేసి ఇలా ప్రార్థించాలి.

గావో మమాగ్రతః సంతుగావోమే సంతుపుష్ఠతః

గావో మే హృదయే సంతుగవాం మధ్యే వసామ్యహం (ఉత్తరపర్వం 151/29,30)

వెంటనే గోవును శ్రేష్ఠ బ్రాహ్మణునికిచ్చెయ్యాలి. తోక పట్టుకొని ఆవునీ, తొండం ముట్టుకొని ఏనుగునీ, చెవిని స్పృశిస్తూ గుఱ్ఱాన్నీ, నెత్తిపై చేయిపెట్టి దాసినీ దానమివ్వాలి. బ్రాహ్మణుడు ఆవును తోలుకొని పోతున్నప్పుడు వారి వెనుక పదడుగుల దూరం దాకా వెళ్ళి మరలిరావాలి. ఇలా గోదానం చేసిన వానికి అన్ని రకాల అభీష్ట ఫలాలూ ప్రాప్తించి దేహాంతంలో స్వర్గనివాసం లభిస్తుంది. ఆ దానమిచ్చిన క్షణంలోనే ఏడు జన్మాలుగా చేసిన పాపాలు దగ్ధమై పోతాయి.

ధర్మజా! ఈ గోదాన విధిని స్వయంగా విష్ణు భగవానుడే దక్షప్రజాపతికి వినిపించాడు గోదానం చేసిన వారు స్వర్గంలో ఎంతకాలం వుంటారంటే - పదునలుగురు ఇంద్రులు మారేదాకా పాపాలకు పశ్చాత్తాపాన్నీ గోదానాన్నీ మించిన ప్రాయశ్చిత్తం లేదు. జన్మ - జన్మాంతరాల దాకా ఫలాన్నిచ్చే దానం గోదానమొక్కటే.