భవిష్య పురాణము

71 - నీరాజన ద్వాదశి వ్రతం

మహారాజా! ప్రాచీనకాలంలో అజపాలుడని ఒక రాజర్షి వుండేవాడు. ఒకమారు ప్రజలంతా అతని వద్దకు వచ్చి తమ దుఃఖాలను దూరం చెయ్యవలసిందని మొఱపెట్టు కున్నారు. అతడు బాగా ధ్యాన నిమగ్నుడై ఆలోచించి నీరాజన శాంతిని అనుష్టించాడు. ప్రజలబాధలు తొలగించాడు.

అజపాలుడు రాజుగా నున్న రోజుల్లో రాక్షసనేత రావణుడు లంకాధినేతగా అధికారాన్ని ముల్లోకాలపైనా చలాయించేవాడు. దేవతలను పనిలోకి పెట్టుకున్నాడు. చంద్రుని తనకు గొడుగుగా వాడుకొన్నాడు. ఇంద్రుని తన సేనాపతిగా నియమించుకున్నాడు. వాయుదేవుని చేత రాజ్యాన్ని ధూళి నుండి శుభ్రం చేయించాడు. వరుణుని జలసేవకునిగా మలచుకున్నాడు. కుబేరుని కోశాధికారిగా, యముని శత్రుభంజకునిగా వాడుకున్నాడు. మేఘాలు రావణుని ఇచ్చానుసారమే వర్షించేవి. గంధర్వులను గానానికీ, అప్సరసలను నృత్యగీతాలకీ, విద్యాధరులను వాద్య సహకారానికీ కొలువులో నిలబెట్టుకున్నాడు. బ్రాహ్మణుడు కాబట్టి అగ్నిదేవుని తన ఇంట గార్హపత్యాగ్నిగా వుండమన్నాడు.

భూలోకంలోని రాజులందరికీ తన వద్దకు వచ్చి ఆజ్ఞలందుకు పొమ్మని వర్తమానాలు పంపించాడు. అందరూ వచ్చారు. అజపాలుడు రాలేదు. రావణుడు క్రుద్ధుడై ధూమ్రాక్షుడనే దండిమగని పిలిచి ‘మామా! నీవు శీఘ్రమే ఆ అజపాలుని వద్దకు పోయి నన్ను దర్శించుకొమ్మని చెప్పు. రాకుంటే నేనే వచ్చి నరికేస్తానని చెప్పు.’ అని పలికి పంపించాడు. అజపాలుడు ధూమ్రాక్షునితో సమయోచితంగా మాట్లాడి పంపించి వేశాడు. అనంతరం తన కొలువులోని జ్వరుడను వానిని పిలచి ‘నీవు రావణుని కొలువులోకి పోయి యథోచితంగా కార్యం సంపన్నం చేసుకొనిరా’ అని చెప్పి పంపించాడు. ఈ జ్వరుడు సామాన్యుడు కాడు. మూర్తీభవించిన జ్వరరోగము. అతడు రావణుని నిండు కొలువులో నిలచి చక్కగా మాటలాడసాగాడు. కొలువులోని వారందరికీ జ్వరం వచ్చి వణుకు పుట్టసాగింది. రావణుడు మేధావి కాబట్టి వెంటనే ఈ వచ్చిన రాజదూతను పోల్చుకొని వెంటనే ‘మీరాజు నావద్దకు రానవసరం లేదు. అతని పనిని అతడు బాగా చేసుకుంటున్నాడని తెలిసింది’ అనేశాడు. జ్వరుడు ఆనందించాడు. అందరికీ ఆరోగ్యం చేకూరినట్లయింది. ధర్మజా! అట్టి రాజర్షి అజపాలుని ద్వారా లోకానికి అందిన శాంతి వ్రతమిది. ఇది అన్ని ఉపద్రవాలనూ దూరం చేస్తుంది; అన్ని రోగాలనూ నిరోధిస్తుంది.

కార్తిక శుక్ల ద్వాదశినాడు సాయంకాలం విష్ణువు లేచిన తరువాత బ్రాహ్మణుల ద్వారా ఆయనకు హవనం చేయించాలి. ఆముదపు నూనెతో దీపాలను వెలిగించి నెమ్మదిగా నీరాజనాలివ్వాలి. పుష్ప, చందన, అలంకార, వస్త్ర, రత్నాదులతో ఆస్వామిని పూజించాలి. ఇలాగే లక్ష్మీ, చండికా, బ్రహ్మ, ఆదిత్య, శంకర, గౌరీ, యక్ష, గణపతి, గ్రహ, మాతా - పితా నాగాదులకు కూడా నీరాజనాలివ్వాలి. ఆవుకీ ఎద్దుకీ కూడా ఇవ్వాలి. ఘంటాది వాద్యాలను మ్రోయించాలి. ఆవులను సిందూరాదులతోనూ చిత్రవిచిత్ర వస్త్రాలతోనూ సింగారించి దూడలతోబాటు వాటిని పూజ జరిగే చోటికీ, ఉత్సవానికీ తీసుకుపోవాలి. వాటికి వెనుకగా గోపాలకులు రకరకాల వాయిద్యాలతో చిత్రవిచిత్ర ధ్వనులు చేస్తూ వెళ్ళాలి. గుఱ్ఱాలను కూడా ఉత్సవంలో నడిపించాలి. మహారాజు మంత్రి పురోహితులతో, నౌకర్లతో కదలివచ్చి శంఖాదుల ద్వారా గంధపుష్ప వస్త్ర దీపాదుల ద్వారా పూజలను చేయాలి. శాంతిరస్తు, సమృద్ధిరస్తు అని పురోహితులు పలుకుతూనే వుండాలి. మహాశాంతియను పేరిట ప్రసిద్ధమైన ఈ నీరాజన విధి ఏ జనావాసంలో చేయబడుతుందో అక్కడ రోగం, దుఃఖం పూర్తిగా నశిస్తాయి. సుభిక్షంగా ఆచోటు వర్ధిల్లుతుంది. రాజర్షి అజపాలుడు ఈ నీరాజన శాంతి ద్వారానే తన రాష్ట్రంలో శాంతి సౌభాగ్యాలను వృద్ధిపఱచుకున్నాడు. నీవు కూడా రాజపురోహితులను సంప్రదించి ఈ శాంతిని చేయించు” అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పాడు.