152 - తిలధేను దానవిధి

యుధిష్ఠిరా! వరాహస్వామి నిర్దేశించిన తిలధేను దానవిధిని ఆలకించు(వరాహస్వామి తనకు చెప్పినట్లుగా నైమిషారణ్యంలో మునులకు వ్యాసుడు వినిపిస్తుండగా దేవర్షి నారదుడది విని శ్రీకృష్ణునికి చెప్పాడు.) నేలపై వలసినంత మేర పేడతో అలికి నల్లని మృగచర్మాన్ని పఱచి చుట్టూ కుశదర్భలను వేయాలి. తరువాత దానిపై ఆవు ఆకృతిలో నువ్వులను రాశిగా పోయాలి. ఇదే తిలధేనువు. ఈ నువ్వులలో తెల్లవీ, నల్లవీ, బూడిదరంగువీ, గోమూత్ర వర్ణంలోవీ కూడా ఉండాలి. నాలుగు ఆఢకుల పరిమాణంలో ఆవూ ఒక ద్రోణం కొలతలో దూడా నిర్మింపబడాలి. ఆవు గిట్టల వద్ద వెండినీ, కొమ్ముల వద్ద బంగారాన్నీ, నాలుక సమీపంలో చక్కెరనీ, ముఖంపై బెల్లాన్నీ, గంగిడోలుపై కంబళినీ, పాదాలపై చెఱకునీ, మూపురంపై రాగినీ, కన్నులకి బదులు ముత్యాలనూ ఉంచాలి. పాలు పితకడానికొక కంచుపాత్రను కూడా పక్కనే పెట్టాలి. ఏదో ఒక పుణ్య పర్వ దినాన ఈ ధేనువుకి సలక్షణంగా పూజ చేసి బ్రాహ్మణునకు అంత సామగ్రితోనూ దానమిచ్చివేసి దాని చుట్టూ ఈ మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణ చేసి బ్రాహ్మణునికి దక్షిణనిచ్చి సాదరంగా వీడ్కొల్పాలి.

యాలక్ష్మీః సర్వభూతానాంయావై దేవోష్వవస్థితా।

ధేను రూపేణ సాదేవీ మమపాపం వ్యపోహతు॥ (ఉత్తరపర్వం 152/15)

ఈ విధంగా దానం చేసిన వారికి అన్నిపాపాలూ నశించి పరబ్రహ్మలో ఐక్యమై పోయే సిద్ధి కలుగుతుంది. ఈ దానమును ఆనందంగా పరిగ్రహించి దానం చేసిన వానిని మిక్కిలి ఆప్యాయంగా దీవించిన బ్రాహ్మణునికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.