కపాసమనగా పత్తి. పత్తికొండ దానం పరమ శ్రేష్ఠము, సర్వ దేవతానందకరము. తన కుటుంబం ఉద్ధరింపబడాలనుకొనేవారు ఈ దానాన్ని చేయాలి. శక్తి కొలది ఇరవై భారముల నుండి ఒక భారం దాకా పత్తిని పర్వత నిర్మాణంలో వాడాలి. ఇతర నియమాలన్నీ ధాన్యశైల దానంలో వలెనే; శ్లోకం మాత్రం ఇది:
త్వమేవావరణం యస్మాల్లో కానామిహ సర్వదా ।
కార్పాసాచల నస్తస్మాద ఘౌఘ ధ్వంసనో భవ ॥ (ఉత్తరపర్వం 200/7)
ఈ ప్రకారం పత్తి కొండను దానం చేసిన వారికి ఒక కల్పం కాలం బాటు రుద్రలోక నివాసంప్రాప్తిస్తుంది. మరల పుడమిపై పడినపుడు సర్వసంపదలూ గల రాజులుగా జన్మిస్తారు.
ధర్మరాజా! దివ్య తేజస్సునీ, కరడుగట్టిన పాపాల నుండి సైతం విముక్తినీ ఇచ్చే శ్రేష్ఠదానం ఘృతాచల దానం. యాభై కుండల నేతితో నిర్మించిన ఘృతాచలాన్ని దాన మివ్వడం శ్రేష్టం. అంత శక్తి లేనివారు అందులో సగంతో, మరీ స్తోమతు లేని అందులో సగంతో నేతికొండను చేసి దానమివ్వవచ్చును. అందులో నాలుగవ వంతు వేరే తెచ్చి దానితో విష్కంభపర్వతాలను నిర్మించాలి. అగహనీ (అగహనీ అంటే మార్గశిర మాసంలో కోసిన ధాన్యం.) బియ్యంతో నింపిన పాత్రలను అన్ని నేతి కుండలపైనా పెట్టాలి. ఒక దానిపై నొకటి పెట్టుకుంటూ పోవాలి. కొండను కట్టాక వీటన్నిటినీ తెల్ల బట్టలతో కప్పి, సమీపంలోనే చెఱకుగడలనూ, పండ్లనూ ఉంచాలి. మిగతా నియమాలన్నీ ధాన్య పర్వత దానం వలెనే పాటించాలి.
దాన సమయంలో ఈ మంత్రాన్ని చదవాలి.
సంయోగాద్ ఘృతముత్పన్నం
యస్మాదమృత తేజ సోః ।
తస్మాద్ ఘృతాచల శ్చాస్మాత్
ప్రీయతాం మమ శంకరః ॥
యస్మాత్ తేజోమయం బ్రహ్మా
ఘృతే నిత్యం వ్యవస్థితం ।
ఘృత పర్వత రూపేణ
తస్మాన్నః పాహి భూధర ॥ (ఉత్తర పర్వం 201/8,9)
ఈ విధంగా శ్రద్ధాభక్తులతో ఘృతాచల దానాన్ని చేసినవారు పాపాలన్నీ కడుక్కుపోగా సుఖజీవనాన్ని గడిపి చివర్లో శివలోకప్రాప్తి నొందుతారు.