భవిష్య పురాణము

70 - దేవశయనీ, దేవోత్థానీ ద్వాదశి వ్రతాలు

“మహానుభావా! దేవశయనీ వ్రతమనే పేరు ఎక్కడో విన్నాను. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది, విచిత్రమనిపించింది. ఈ దేవ - శయనమేమిటి? వారూ మాలాగే నిదురిస్తే విశ్వమెట్లా నడుస్తుంది? అసలు దేవులెందుకు నిద్రబోతారు? ఈ వ్రతమేమిటి? దాని విధానమేమిటి? నా అజ్ఞానాన్ని సర్వజ్ఞులైన మీరే పోగొట్టగలరు. దయచేసి చెప్పండి” అని ప్రార్థించాడు ధర్మజుడు. చెప్పసాగాడు శేషశయనుడు.

“సూర్యభగవానుడు మిథునరాశిలోనికి రాగానే మధుసూదనభగవానుని మూర్తిని శయనింపజేయాలి. సూర్యుడు తులారాశిలోకి వెళ్ళగానే ఈ మూర్తిని మేలు కొలపాలి. అధి(క)మాసంలో కూడా ఇలాగే చేయాలి. అన్య సమయాలలో హరిని శయనింప జేయరాదు. ఆషాఢ శుద్ధ దేవశయనీ ఏకాదశి నాడు ఉపవాసముండాలి. భక్తుడు తెల్లని వస్త్రాలతో కప్పబడిన తలగడ (తలదిండు)తో కూడిన ఉత్తమ శయ్యపై పీతాంబరధారీ, సౌమ్యుడూ, శంకచక్ర గదాయుక్తుడూ నగు విష్ణు భగవానుని శయనింపజేయాలి. ఇతిహాస పురాణవేత్తయగు విష్ణుభక్తుడు పెరుగు, పాలు, తేనె, నెయ్యి, నీరులతో భగవంతుని ప్రతిమకు స్నానం చేయించి గంధధూప వస్త్ర కుంకుమాదులతో అలంకరించి ఈ క్రింది మంత్రంతో ప్రార్థించాలి.

సుప్తేత్వయి జగన్నాథ జగత్ సుప్తం భవేదిదం

విబుద్ధోత్వయి బుధ్యేత జగత్ సర్వం చరాచరం॥ (ఉత్తరపర్వం 70/10)

మహారాజా! ఈ విధంగా స్వామిని శయ్యపై స్థాపించి ఆయన సమ్ముఖంలోనే వ్రతి నోటిని అదుపులో పెట్టుకొనడం వంటి నియమ దీక్షను గ్రహించాలి. నాలుగు మాసాల తరువాత స్వామి లేచేదాకా ఎన్నో నియమాలను పాటించాలి.

ఇపుడు వ్రత త్యాగ, గ్రహణ యోగ్య నియమాలను విను. బెల్లాన్ని త్యాగం చేసేవాడు వచ్చే జన్మలో మధురవాణి గల మహారాజవుతాడు. అలాగే ఈ నాలుగు మాసాలూ నూనెను త్యజించిన వాని శత్రువులు నాశనమౌతారు; సౌభాగ్యమూ ప్రాప్తిస్తుంది. పుష్ప ద్రవ్యాలను వదలుకొంటే (సువాసన భోగాలను వదిలేస్తే) దేహాంతంలో స్వర్గం చేరి విద్యాధరులౌతారు. షడ్రసాలనూ అనగా వగరు, పులుపు, తీపి, ఉప్పు, కషాయ, కారాలను త్యజించేవారు ఇక్కడే మంచిరూపవంతులై సత్కారాలను పొందుతారు. తాంబూల త్యాగఫలం అనంతరకాలంలో శ్రేష్ఠఫలప్రదం, కమ్మని మధురకంఠ ప్రాప్తిదం నేతిని తినడం మానేస్తే రమణీయ లావణ్యం, సర్వసిద్ధులూ ప్రాప్తిస్తాయి. పండ్లు తినడం ఆపేస్తే బుద్ధి మంతులవుతారు, అనేక పుత్రవంతులూ అవుతారు. తైలమర్దనాన్ని చేయించుకోడం నిలిపి ఈ నాలుగు నెలలూ వ్రతదీక్షలో వుంటే దీప్తిమంతుడూ, రాజాధిరాజూ, దీప్త కరణుడూ, ధనాధ్యక్షుడునైన కుబేరుని సాయుజ్యం లభిస్తుంది. శ్రావణమాసంలో మజ్జిగనూ, భాద్రపదంలో పెరుగునూ, ఆశ్వయుజంలో పాలనూ త్రాగకుండా వుండే నియమాన్ని పట్టిన వారికి గోలోక వాసం ప్రాప్తిస్తుంది. తాపపక్వ వస్తువులను మాత్రమే తినాలనే నియమాన్ని పాటించేవారికి దీర్ఘాయువులైన సంతానం ప్రాప్తిస్తారు. నేలపై శయనించే నియమాన్ని పాటించేవారు విష్ణువుకి ప్రియభక్తులు కాగలరు.

త్యాగం గొప్ప ధర్మం. నఖకేశాలను తీయించుకోకుండా వుండి, ప్రతిదినం గంగా స్నానం చేస్తూ మౌనవ్రతంలో వుండే వానిని రాజులు కూడా గౌరవిస్తారు. వాని ఆజ్ఞను ఉల్లంఘింపరు. ఎల్లప్పుడు నేలపైనే భోజనం చేసేవాడు రాజవుతాడు.

ఓం నమో నారాయణాయ

అనే మంత్రాన్ని నిరాహారంగా వుండి జపిస్తూ విష్ణు చరణాలకు నమస్కరిస్తూ జీవించే వారికి గోదాన ఫలం ప్రాప్తిస్తుంది. విష్ణుపాదోదకాన్ని స్పృశించినంత మాత్రముననే మానవులు కృతార్థులు కాగలరు. ఈ చాతుర్మాస్యంలో విష్ణు మందిరంలో ఉపలేపనమునూ అర్చననూ చేయడం వల్ల కల్ప పర్యంతము రాజ జన్మలు లభిస్తాయి. స్తోత్రం చదువుతూ విష్ణు భగవానునికి నూరు ప్రదక్షిణలు చేసి పుష్పమాలాదులతో పూజించినవారు దేహాంతంలో హంసల విమానమెక్కి విష్ణులోకాన్ని చేరుకుంటారు. విష్ణు సంబంధమైన పాటలు పాడుతూ వాద్యములను కూడా వినియోగించినవారు గంధర్వ లోకాన్ని చేరుకుంటారు. ప్రతిరోజూ శాస్త్ర చర్చలను గావిస్తూ లోకులకు జ్ఞానప్రదానం చేసేవాడు వ్యాసరూపమునొంది విష్ణులోకాన్ని చేరుకుంటాడు. భోజన నియమాలను నిష్కర్షగా పాటిస్తూ మితాహారియై జీవించువాడు దేహాంతంలో పుష్కరక్షేత్ర స్నానఫలాన్ని పొంది స్వర్గాన్ని చేరుకుంటాడు. దినంలో ఆరవ (అంతిమ) భాగంలో మాత్రమే భోజనం చేయువారు తమ రూపంలోనే స్వర్గాన్ని చేరుకుంటారు. కురుక్షేత్రంలో నివసించిన పుణ్యఫలం నిత్యం విస్తరాకులలో భోజనం చేయువారికి దక్కుతుంది. రెండు జాముల వఱకు నీటిని త్యాగం చేసినవానికి ఎప్పటికీ ఏ రోగమూ రాదు.

ధర్మజా! చాతుర్మాస్యంలో ఈ ప్రకారంగా వ్రతం చేసి నియమాలను పాటించిన సాధకునికి సంపూర్ణ సంతోషం కలుగుతుంది. విష్ణుశయన వేళలో శుభకార్యాలేవీ చేయరాదు. అలాగే సంక్రాంతి లేని మాసం అనగా మలమాసం దేవ, పితృకార్యాలేవీ గావింపరాదు. కటిదానాన్ని అనగా స్వామి ఒత్తిగిలి మారి పడుకోవడాన్ని భాద్రపదశుక్ల ఏకాదశినాడు చేసి ఆరోజు మహాపూజను నిర్వర్తించాలి.

మహారాజా! ఇక విష్ణుశయనానికి కారణాన్ని విను. ఒకప్పుడు యోగనిద్రాదేవి నాకోసం కఠోరమైన తపస్సు చేసి నన్ను మెప్పించింది. ఆమెకు నా అంకంలో స్థానం ప్రసాదించాలని వేడుకొంది. నా శరీరం మీద ఎక్కడా జాగా లేదు. కన్నులొక్కటి ఖాళీగా మిగిలాయి. అప్పుడామెకు నాలుగు నెలల పాటు నా కన్నులలో కొలువిచ్చి అనుగ్రహించాను అప్పటి నుండి నేనా మనస్వినిపై ఆదరంతో క్షీరసాగరంలో శయనిస్తాను. కార్తిక శుక్ల ఏకాదశినాడు విష్ణువు మేలుకొంటాడు. ఆ మేలుకొలుపు విధానాన్ని అనగా దేవోత్థానీ వ్రతాచరణను ఆలకించు.

ఇదం విష్ణుర్విచక్రమేత్రేధానిదధేపదం

సమూఢమస్యపా స్రురేస్వాహా (యజుర్వేదం 5/15)

ఆయన లేవగానే మన ధార్మిక క్రియలన్నీ మరల ప్రారంభమవుతాయి. శంఖ, మృదంగ ధ్వనులను చేస్తూ జయఘోషతో భగవానుని రాత్రి రథంపై కూర్చోబెట్టి తిప్పాలి. దేవదేవేశుని మేల్కొల్పగానే మొత్తం నగరిని మిఱుమిట్లు గొలిపేటంతగా దీపాలతో అలంకరించి నృత్య, గీత, వాద్యాదులతో మంగళోత్సవాన్ని చేయాలి. ఏకాదశి రాత్రి మందిరంలోనే జాగరం చెయ్యాలి. ద్వాదశినాడు పెందరాళే స్వచ్ఛమైన జలంలో స్నానం చేసి విష్ణువును పూజించాలి. ఘృతాది ద్రవ్యాలను అగ్నిలో హవనం చేసి మరల స్నానం చేసి బ్రాహ్మణులకు విశిష్ట అన్నాలతో భోజనం పెట్టాలి. నెయ్యి, పెరుగు, తేనె, బెల్లంలతో చేసిన లడ్లను భోజనంలో వడ్డించాలి. ప్రతి సంతోషంగా పదకొండు, పది, ఎనిమిది, అయిదు లేదా ఇద్దరు విప్రులకు పుష్ప గంధాదులతో విధివత్తుగా సత్కారం చేసి వారితో బాటు శ్రేష్ఠులైన సన్యాసులకు కూడా భోజనం పెట్టాలి. తాను ఇన్నాళ్ళూ త్యజించిన ద్రవ్యాలను దక్షిణతో సహా వారికి సమర్పించాలి. వారిని సాదరంగా వీడ్కొల్పి తాను స్వయంగా భోజనం చేయాలి. గత నాలుగు మాసాలుగా తినని వాటిని కూడా తినాలి. ఈ రకంగా చాతుర్మాస్య వ్రతం చేయడంవల్ల ధర్మదేవత అనుగ్రహం లభిస్తుంది. అది ఇక్కడున్నంత కాలం రక్షిస్తుంది. దేహాంతంలో వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది. పునర్జన్మ వుండదు. ఈ మాహాత్మ్యాన్ని ధ్యానంగా విని, స్తుతించి, ఇతరులకు చెప్పిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. స్వామి శయనించునాడు, మేల్కొనురోజు ఉపవాసము చేయువారికి సద్గతులు కలుగుతాయి.