భవిష్య మహా పురాణము
72 - భీష్మ పంచక వ్రతం
తరువాత శ్రీకృష్ణుడు ధర్మజుని అభ్యర్ధన మేరకు భీష్మ పంచక వ్రత విధినీ, మహిమనూ చెప్పనారంభించాడు.
“ధర్మజా! సర్వోత్తమ వ్రతాన్నే కోరావు. ఒకప్పుడు భృగుమహర్షి నాద్వారా దీనిని తెలుసుకొని దానిని తన శిష్యులైన బ్రాహ్మణులకూ శుక్రాచార్యునికీ చెప్పగా ఆయన దానిని ప్రహ్లాదునికీ ఇతర దైత్యులకూ ఉపదేశించి వారిచేత అనుష్ఠింపజేశాడు. తేజస్వులలో అగ్నివలె, శీఘ్రగ్రాములలో పవనుని లాగున, పూజనీయులలో బ్రాహ్మణుల తెఱగున, దానాలలో సువర్ణదానం పోలిక వ్రతాలలో ఈ భీష్మపంచక వ్రతం సర్వశ్రేష్ఠ. అలాగే లోకాలలో భూర్లోకం, తీర్థాలలో గంగ, యజ్ఞాలలో అశ్వమేధం, శాస్త్రాలలో వేదం, దేవతలలో అచ్యుతుడు ఎలాటి స్థానాన్నాక్రమిస్తున్నారో వ్రతాలలో భీష్మ పంచకానిది అలాటి చోటు.
దుష్కరమైన ఈ భీష్మ పంచకవ్రతాన్ని చేసిన వానికి అన్ని ధర్మసాధనములోల అగ్రేసరత్వం లభిస్తుంది. కృతయుగంలో వసిష్ఠుడూ, భృగుగర్గాది మునులూ, త్రేతలో నాభాగుడూ, అంబరిషాది రాజులూ, ద్వాపరంలో సీరభద్రాది వైశ్యులూ ఈ వ్రతాన్ని చేశారు. కలియుగంలో శూద్రులు ఈ వ్రతాన్ని చేసి ఉత్తమ కార్యవహులౌతారు. సత్యహీనులూ, మూఢులూ దీనిని చేయలేరు. ఈ వ్రతం చేస్తున్నపుడు ప్రాణరక్షణకైనా సరే అబద్ధమాడరాదు. వేట మున్నగు వ్యసనాల జోలికి పోరాదు. అయిదురోజులపాటు విష్ణుభగవానుని పూజనాలను చేస్తూ శాకమాత్రమునే తింటుండాలి. పతి అంగీకారంతో కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. విధవ కూడా గురువునడిగి ఈ వ్రతాన్నాచరించవచ్చు.
వీటితో కార్తిక మాసమంతా ప్రతిరోజూ తెల్లవారక ముందే స్నానం, ఎంతో కొంత దానం, మధ్యాహ్నం స్నానం విష్ణుపూజనం, సాయంత్రం ఆవుపేడని ఒంటికి రాసుకొని నదిలోగాని పవిత్ర జలాశయంలోగాని మూడవ స్నానం ఈ వ్రతాచరణలో ప్రథమ భాగం. మొదటి స్నానం తరువాత యవలు, బియ్యము, తిలలతో దేవతలకు, పితరులకు తర్పణ లివ్వాలి. విష్ణు ప్రతిమకు (లేదా మూర్తికి) తేనె, పాలు, నెయ్యి, చందన మిశ్రిత జలాలు - వీటితో భక్తిగా స్నానం చేయించాలి. కర్పూర, పంచగవ్య, కేసర, చందనాది సుగంధిత ద్రవ్య మిశ్రమాన్ని స్వామికి పూయాలి. ఆయనకెదురుగా ఒక దీపాన్ని వెలిగించివుంచి అది అయిదురోజులూ రాత్రింబవళ్ళు (రేయింబవళ్ళు) ఆరకుండా వెలిగేలా చూసుకోవాలి. నైవేద్యాన్ని పెట్టి ఓం నమో వాసుదేవాయ నామ అష్టోత్తర శత జపాన్ని చేసి, షడక్షర మంత్రంతో హవనంగావించి విధి పూర్వకంగా సాయంకాలీన సంధ్యను వార్చాలి. నేలపైనే శయనించాలి. ఇవన్నీ అయిదురోజులూ చేయాలి. ఇవి కాక మొదటిరోజు కమల పుష్పాలతో స్వామి చరణాలనూ, రెండవరోజు బిల్వపత్రాలతో మోకాళ్ళనూ, మూడవరోజు మొగలిపూలతో నాభినీ, నాల్గవరోజు బిల్వ, జపా పుష్పాలతో స్కంధ ప్రదేశాన్నీ, అయిదవరోజు మాలతీ పుష్పాలతో ఆయన శిరస్సునీ పూజించాలి. ఇది ద్వితీయ భాగం.
వ్రతాచరణలో చివరిభాగం ఏకాదశినాడు మొదలవుతుంది. ప్రతి ఆరోజు అభిమంత్రిత గోమయాన్నీ, ఆ మరునాడు గోమూత్రాన్నీ నోటిలో వేసుకోవాలి. త్రయోదశినాడు పాలనూ చతుర్దశినాడు పెరుగును స్వీకరించాలి. ఈ ప్రాశ్నం కాయసిద్ధి కుద్దేశింపబడింది. అయిదవరోజు స్నానం చేసి కేశవుని విధ్యుక్తంగా పూజించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి శక్తికొలది దక్షిణలివ్వాలి. పురాణవాచకులకు వస్త్రాలనూ ఆభూషణాలనూ సమర్పించాలి. ఆ రాత్రి ప్రతి పంచగవ్య పానము చేసి అనంతరం అన్నం తినాలి. ఈ విధంగా వ్రతాన్ని పూర్తి చేయాలి. (వ్రత విధానాన్ని ముందే ఆకళింపు చేసుకొని సందేహాలుంటే గురువుగారిని ప్రార్థించి నివృత్తి చేసుకొని వ్రతాన్ని మొదలెట్టాలి)
మహారాజా! ఈ వ్రతం పరమ పవిత్రం. సర్వపాప ప్రణాశకం. మహాత్ముడైన భీష్ముడు అంపశయ్యపై నుండి ఈ వ్రతాన్ని నియమసహితంగా నాకుపదేశించాడు. ఈ యుగంలో ఆయన పేరుతో నేను దీనిని వ్యవహరిస్తున్నాను. (కృతయుగంలో విష్ణురూపంలో భృగుమహర్షి కుపదేశించిన శ్రీకృష్ణుడు ద్వాపరయుగాంతంలో కృష్ణరూపంలో భీష్ముని ద్వారా ఈ వ్రతోపదేశాన్ని పొందాడనుకోవాలి) ఈ వ్రతాన్నాచరించిన వారికి విష్ణుదేవుడే ముక్తిని ప్రసాదిస్తాడు. కార్తిక శుక్ల ఏకాదశినాడు ఈ వ్రతాన్ని మొదలుపెట్టి పౌర్ణమినాడు పూర్తి చేయాలి.