సూతమహర్షి ఇలా ఉపదేశించాడు.” ఓ మహర్షులారా! తాపత్రాయాలను (ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక తాపాలు మూడూ తాపత్రయాలు) హరించి మనిషిని సర్వలోకాల్లో సుఖపెట్టేది విష్ణుభగవానుని మంగళమయ చరిత్రయే. దానిని వినేవారు సుఖిస్తారు. దానిని మరచిన వారు కష్టాలపాలౌతారు. విష్ణుపత్ని లక్ష్మికి నలుగురు పుత్రులని చెప్తారు. వారు ధర్ముడు. యజ్ఞుడు, రాజు, చోరుడు. ఈ నలుగురూ లక్ష్మీప్రియులే అనగా లక్ష్మిపై గాఢమైన మమత గలవారే. బ్రాహ్మణులకూ అతిథులకూ చేసే దానం ధర్మమనబడుతుంది. దానికి ధనం అవసరం. స్వాహా, స్వధామంత్రాల ద్వారా దేవతల, పితృదేవతల ప్రీత్యర్థం చేసే కర్మకాండ యజ్ఞమనబడుతుంది. దానికీ ధనం కావాలి. ధర్మమునూ యజ్ఞమునూ రక్షించేవాడు రాజు. ఆయనకి ఆ ధనమే ఉండాలి. ధర్మాన్నీ యజ్ఞాన్నీ చెడగొట్టడం, నష్టబఱచడం చౌర్యమనబడుతుంది. దానికి ధనమత్యావశ్యకము. అందుకే ఈ నలుగురూ లక్ష్మీ కింకరులే కాని, సత్యమున్న చోటనే ధర్మముంటుంది లక్ష్మి కూడా ఆ రెండూ వున్నచోటనే స్థిరంగా నివసిస్తుంది.
మాటను నిలబెట్టుకోవడం కూడా సత్యంలో భాగమే. కారణమేదైనా సరే భగవంతుడికిచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి సత్యాన్ని తప్పి అధర్మాన్ని ఆచరించి లక్ష్మిని పోగొట్టుకొని శిక్షార్హుడైనాడు సాధువణిజుడు. రాజుగారి కోపానికి ఆతని ఆస్తులన్నీ బలైపోగా, అతని పత్ని, కూతురు ఇంటినీ వస్త్రాభరణాలను అమ్ముకొని ఎలాగో బ్రతుకునీడుస్తున్నారు.
ఒకరోజు లీలావతి ఆకలిచే వ్యాకులయై ఒక బ్రాహ్మణ గృహానికి వెళ్ళింది. అక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూసి గొప్ప భగవద్విశ్వాసము జనించగా స్వామిని ప్రార్థించి ఇలా మొక్కుకుంది. ‘హే సత్యనారాయణ దేవా! నా తండ్రీ, భర్తా ఇంటికి వస్తే నేను నీ వ్రతాన్ని చేస్తాను.’ వెంటనే బ్రాహ్మణుడు ‘తథాస్తు’ అని దీవించాడు. అక్కడున్న బ్రాహ్మలందరి ఆశీర్వచనాలందుకొని ప్రసాదం కూడా తీసుకొని ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చిన కళావతిని ‘ఇంత ఆలస్యం చేశావే మమ్మా’ అని తల్లి అడిగింది. కళావతి తల్లి చేతిలో సత్యనారాయణ వ్రత ప్రసాదాన్ని పెట్టి “అమ్మా! సత్యనారాయణస్వామివారు ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవమని, ప్రత్యక్షఫలాన్నిచ్చే, రక్షించే దేవుడని నేను అక్కడ విన్నాను. మానవులంతా ఆయనను పూజించి తరిస్తున్నారట. నేను కూడా సత్యనారాయణ వ్రతం చేస్తాను. నాకు అనుమతిని దయచేయమ్మా. వెంటనే వ్రతాన్ని సంకల్పించుకుంటాను. మా నాన్నా మీ అల్లుడూ శీఘ్రమే వస్తారు. ఇదే నాకోరిక అని చెప్పింది.
ఆ రాత్రి గడచిన వెంటనే కళావతి తల్లి ఆశీర్వాదాన్ని పొంది, పొరుగునే వున్న శీలపాలుడను వ్యాపారి వద్దకు పోయి, ‘పెద్దయ్యా! నేను సత్యనారాయణవ్రతాన్ని సంకల్పించాను. ద్రవ్యాదులకై కాస్త ధనాన్ని సర్దుబాటు చేయగలవా?’ అని అడిగింది. ఆయన వెంటనే ‘ఎంతమాటమ్మా! అసలు నేనే మీ ఇంటికి వద్దామనుకున్నాను. నిన్న ఎందుకో పాత లెక్కలు చూసుకుంటే నేనే మీ నాన్నకు కొంత డబ్బు ఇవ్వవలసి వున్నానని తేలింది. అందుచేత ఈ ధనం తీసుకొని నన్ను ఋణవిముక్తిని చెయ్యి తల్లీ!’ అంటూ ధనాన్నిచ్చాడు. కళావతి తన తల్లి లీలావతితో కలసి సాంగోపాంగంగా, సాకల్యంగా, సకల మంగళప్రదమైన సత్యనారాయణ వ్రతానుష్టానాన్ని గావించింది. శ్రీ స్వామి సంతుష్టుడైనాడు.
ఆయన ఆ రాత్రే నర్మదా తీరప్రాంతాన్నేలుతున్న రాజు కలలో కనబడి ‘రాజా! నువ్వు వెంటనే ఆ వణిక్ ప్రముఖునీ అతని అల్లునీ విడుదల చెయ్యి. వారు నిర్దోషులు. వారి అపరాధమిక్కడలేదు. నీవు వారిని వెంటనే విడిపింపకపోతే నీకు శుభం కాదు’ అని గట్టిగానే ఆదేశించాడు. రాజు వెంటనే నిద్రనుండి మేల్కొని పరమాత్మను స్మరిస్తూ వెలుగువచ్చేదాకా గడిపి ప్రాతఃకాలమే సభను తీర్చి తనకు వచ్చిన కలను గూర్చి మంత్రికి చెప్పాడు. మంత్రి వెంటనే ఉద్విగ్నుడై ‘ఇది అత్యంత ఆశ్చర్యకరము. నేను మీకు విన్నవించాలనుకున్నాను. నాకు కూడా ఇంచుమించు ఇలాటి కలే వచ్చింది. స్వామి వారు నన్నూ అలాగే ఆదేశించారు. ఆ వైశ్యునీ అతని అల్లునీ ఇక్కడికి పిలిపించి ముందు సక్రమంగా సమగ్రంగా విచారిద్దాం.’ అని మంత్రాంగం చెప్పాడు. రాజు ఆ యిద్దరినీ సభకు సగౌరవంగా తీసుకు రమ్మని సైనికులను ఆదేశించి వారు వచ్చాక మర్యాదగా ‘మీరెవరు? ఎక్కడివారు?’ అని ప్రశ్నించాడు.
‘మహారాజా! నేను రత్నపుర నివాసిని. వణిజుణ్ణి. ఇతడు నా అల్లుడు. మేము వాణిజ్యానికై ఈవూరు వచ్చాము. దైవం మరోలా తలవడంతో మీ సేవకులకు మేము చోరులవలె కనబడ్డాము. ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. మేమేదో మణులనూ ముత్యాలనూ దొంగిలించామంటున్నారు. నిజానికి అవి మా దగ్గరే, కాస్త ఎక్కువగానే వున్నాయి. మాకా అవసరంలేదు. రాజేంద్రా! మేము దొంగలము కాము. మీరు సవిస్తరంగా విచారణ చేయడం మా అదృష్టం. మా ఆభరణాలూ ద్రవ్యాలూ అన్నీ స్వయంగా చూడండి. తేడా స్పష్టంగానే తెలుస్తుంది.’
వణిజుని మాటలను ఆలకించి రాజు పశ్చాత్తాపపడ్డాడు. వారిని క్షమాపణ కోరాడు. వారి ఆస్తులన్నిటినీ తిరిగి ఇచ్చెయ్యడమే కాకుండా తానే స్వయంగా వారికి వస్త్రాభరణాలను కానుకజేసి రాజాతిథులుగా కొన్నాళ్ళుండమని కోరాడు. చివరి మాటకు మాత్రం సున్నితంగా అడ్డువస్తూ సాధు ‘ఊరొదిలి వచ్చి చాన్నాళ్ళయింది. మాకు సెలవిప్పించండి’ అని కోరాడు.
రాజుగారు వెంటనే కోశాధ్యక్షుని పిలిపించి వణిజుల నౌకను రత్నాదులతో నింపి రమ్మని ఆదేశించాడు. వారిని తానే స్వయంగా సన్మానించి రాజగృహంలో అద్భుతమైన భోజనం పెట్టించి వారు తెచ్చుకున్న ధన రత్నాదులకు రెట్టింపు విలువగల ద్రవ్యరాశులనిచ్చి వీడ్కొలిపాడు.
సాధు తన నగరానికి వారం రోజుల దూరంలో నావను నిలిపి తీరానికి వచ్చాడు. ఇంత జరిగినా అతనికింకా జ్ఞానోదయం కాలేదు. సత్యనారాయణస్వామి గుర్తుకి రాలేదు. ఇంకా ఊరుకుంటే ఇతడింకా అజ్ఞాన కూపంలో, అసత్యసాగరంలో మునిగిపోతాడని జాలిపడి భగవాన్ శ్రీ సత్యనారాయణస్వామియే ఒక తపస్వి రూపంలో అతని వద్దకు వచ్చి ‘సాధూ! నీ నౌక లో ఏముంది?’ అని అడిగాడు. ఇతడు తన సహజధోరణిలో ‘స్వామీ! మీకివ్వడానికి యోగ్యమైనది అందులో యేమీలేదు. అదంతా లతలతో ఆకులతో, పూలతో నిండివుంది’ అని చెప్పాడు. ‘తథాస్తు’ అని దీవించి వేసి స్వామి కాస్త దూరంగా వెళ్ళి ధ్యానముద్రలో వెలుగుల ప్రోవులాగా కూర్చున్నాడు.
స్వామి అలా అనగానే అంతవఱకు ధన, రత్న, కనకరాశుల బరువు వల్ల సగందాకా నీటిలో నున్న నావ తేలికై పోయి పూర్తిగా నీటిపైకి తేలిపోయింది. అది చూసి గుండెగుబేల్మన్న సాధు వణిజుడు గబగబా నావలోకి వెళ్ళి చూసేసరికి ద్రవ్యరాశులు కనిపించలేదు. అతడు స్వామితో పలికిన వాక్కు అక్షర సత్యమైపోయింది. నావనిండా లతలూ, ఆకులే వున్నాయి. అతడు వెంటనే ఆ దెబ్బకు తట్టుకోలేక మూర్ఛపోయాడు. అల్లుని ఉపచారాలతో లేచి తెలివి తెచ్చుకొని గుండెలు బాదుకొని రోదించసాగాడు. వజ్రాయుధం దెబ్బతిన్న కొండలాగా కూలిపోయాడు. అల్లుడు ఇలా అన్నాడు. ‘మామా! ఇది సామాన్యమానవులు చేయగలిగే పనికాదు. అంతా ఆ తపస్వి ‘తథాస్తు’ లోనే వుంది. ముందు ఆయన శరణు వేడదాం పద.’ ఇద్దరూ ఆ తపస్వి వద్దకు వచ్చారు. కష్టంమీద గొంతు పెగల్చుకొని ఇలా అనగలిగాడు. వణిజుడు. ‘మహాభాగా! తమరెవరు? ఏ గంధర్వదేవతో, సాక్షాత్ పరమాత్మయో అయివుంటారు. ప్రభో! నేను మీ మహిమను లేశమాత్రమైనా తెలుసుకోలేకపోయాను. నా అపరాధాన్ని మన్నించండి.’ ఇలా అని ఆయన పాదాలపై పడిపోయాడు సాధు.
తపస్వి రూపంలో నున్న శ్రీ సత్యనారాయణస్వామి అతనిని లేవనెత్తి ‘నాయనా! ఆనాడు చంద్రచూడుని సత్యనారాయణవ్రత మండపంలో ప్రమాణపూర్వకంగా నీకు సంతానం కలిగితే సత్యదేవుని వ్రతం చేస్తానని ఉద్ఘాటించావు. గుర్తుందా? మరి నీకు సంతతీ కలిగింది. ఆమెకు వివాహమయింది, నీ సిరి సంపదలూ గణనీయంగా పెరిగిపోయాయి. బందీగృహప్రాప్తీ, విముక్తీ కూడా కలిగాయి. ఇంత జరిగినా నీకింకా సత్యనారాయణవ్రతం చేయాలనిపించలేదు. మానవులకిచ్చిన మాటైనా, దేవునికి చేసిన ప్రతిజ్ఞయైనా తప్పితే అసత్యదోషం తగులుతుందనీ, అది మహాపాతకమనీ నీకు తెలియని ధర్మం కాదు కదా! కావున ఓరి మూఢాత్మా! నిన్ను ఆ పాతకం నుండి రక్షించడానికే ఇవన్నీ జరుగుతున్నాయని తెలుసుకో. సత్వరమే సత్యదేవుని స్మరించు. మిథ్యాభాషణం, ప్రతిజ్ఞాలోపం, దేవతావజ్ఞ ఇలాటివన్నీ పాపాన్ని పెంచే దోషాలు, కృత్యాలు. నువ్వు ఇవన్నీ చేశావు. భగవంతుని కనీసం స్మరించాలని కూడా నీకనిపించలేదు కదూ. అనుభవించు.’
వణిజునికి వెంటనే తనవల్ల జరిగిన అకార్యం తెలిసొచ్చింది. వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ‘స్వామీ! నీవ్రతం ఇపుడే చేస్తా. నన్నుక్షమించు అని ఎలుగెత్తి చెప్పాడు. వెంటనే, అతడు చూస్తుండగానే తపస్వి సత్యనారాయణస్వామిగా మారిపోయి దర్శనమిచ్చాడు. అపుడా సర్వమంగళ రూపాన్ని సాధువణిజుడిలా స్తుతించాడు.
సత్యరూపం సత్యసంధం సత్యనారాయణం హరిం ।
యత్ సత్య త్వేన జగతస్తం సత్యం త్వాం నమామ్యహం ॥
త్వన్మాయామోహితాత్మా నోన పశ్యం త్యాత్మనఃశుభం ।
దుఃఖాంభోధౌ సదామగ్నా దుఃఖేచసుఖ మానినః ॥
మూడోఽహంధనగర్వేణ మదాంధీ కృతలోచనః ।
నజానే స్వాత్మనః క్షేమం కథం పశ్యామి మూఢధీః ॥
క్షమస్వ మమ దౌరాత్మ్యం తపోధామ్నే హరేనమః ।
ఆజ్ఞా పయాత్మదాస్యం మేయేనతే చరణౌ స్మరే ॥ (ప్రతి..2/29/47-51)
స్వామిని ఇలా స్తుతించగానే సాధువణిజుని నౌక బరువెక్కి పూర్వపుదశకు చేరుకుంది. వెంటనే అతడు తన గృహాన్ని చేరగానే ఒక లక్షముద్రలను పురోహితుని ద్వారా వెచ్చించి సత్యనారాయణ పూజను చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. స్వామి ప్రసన్నుడై ‘వత్సా నీకోరికలన్నీ ఇక సుఖంగా నెరవేరుతాయి. పుత్ర, పౌత్ర సమన్వితుడవై ఇక్కడ శ్రేష్ఠ భోగాలననుభవించి అనాయాస దేహాంతంలో నాలోకాన్ని చేరుకుంటావు.’ అని వరమిచ్చి అంతర్ధానం చెందగా సాధువణిజుడు తన గృహోన్ముఖ యాత్రను కొనసాగించాడు.
సత్యనారాయణ రక్షితుడై సుఖ శుభ లాభ సమన్వితుడై వారం రోజులలో నగరానికి బాగా సమీపంగా వచ్చి ఒక వేగునిచే తన ఆగమన వార్తను ఇంటికి పంపించాడ సాధు. ఆ వేగు లేదా దూత వణిజుని స్త్రీ లీలావతితో ‘అమ్మా! సఫలమనోరథులై అల్లుడు గారితో కలిసి విజయవంతంగా అయ్యగారు నదీతీరాన్ని చేరుకున్నారు’ అనిచెప్పాడు. ఆ సమయానికా సాధ్వి, కూతురు కళావతితో కలిసి సత్యనారాయణవ్రతం చేస్తున్నది. ఈ వార్త వినగానే మిగతా పూజ బాధ్యతను కూతురికొప్పగించి ఆమె నదీతీరానికి బయలుదేరింది. కళావతి కూడా తన సఖీగణంతో బాటు సత్యనారాయణవ్రతాన్ని సంపూర్ణంగా నిర్వహించి ‘అందరికీ ప్రసాదాన్ని పంచండి’ అని చెలులకు చెప్పేసి తాను ప్రసాదాన్ని స్వీకరించకుండానే పరుగు పరుగున పతిదేవ సందర్శనార్థమై నదీతీరం వైపు పరుగులెత్తింది.
ఇలా సత్యనారాయణ భగవానులు ప్రసాదానికి అవమానం జరగడంతో కళావతి నదీతీరాన్ని చేరగానే ఆమె భర్త వున్న నావ నదిలో మునిగిపోయింది. అందరూ దుఃఖమగ్నులై పోయారు. వణిజుడు మూర్ఛితుడైనాడు. కళావతి కూడా స్పృహ తప్పినదై నేల వాలిపోయింది. ఆమె శరీరమంతా కన్నీళ్ళతో తడిసిపోయింది. స్పృహలోకి రాగానే ‘హానాథా! నీకు బ్రహ్మ ఇట్లు వ్రాసెనా! హే విధాతా! నీవు నన్ను నాపతి నుండి దూరం చేసి నాబతుకును బుగ్గి చేశావు. పతిలేని జీవితం ఏ స్త్రీ కైనా సగం నాశనమే కదా. నిష్ఫలమే కదా’ అని విలపిస్తూ ‘హేభగవాన్ సత్యనారాయణా! నేను నాపతి వియోగాన్ని భరించి బ్రతుకలేను. ఇదిగో నదిలో ప్రవేశిస్తున్నాను. తప్పులేవన్నా వుంటే క్షమించు’ అని స్వామికి చెప్పి నదిలోకి పోసాగింది. అలా వెళుతూ కూడా తన పతిపాదుకలను తలపై పెట్టుకొని ‘హే సత్యనారాయణ స్వామీ! ఈ నదిలో నాపతి శయనించియున్న వైపే నా అడుగులు పడాలి గాక. నాకాయన నీ దయవల్ల, కనిపించాలి గాక అంటూ పోసాగింది. మరొక్క అడుగు వేస్తే మునిగిపోతుందనగా ఆకాశవాణి గట్టిగా ఇలా చెప్పింది. ‘ఓయి సాధువణిజా! నీకూతురు నా ప్రసాదాన్ని అవమానించింది. ఆమె మరల ఇంటికేగి శ్రద్ధాభక్తులతో నా ప్రసాదాన్ని సేవిస్తే ఆమె పతి నావతో సహా కనిపించగలడు. చింతించకు.’
కళావతి ఈహిత వాక్కుని విని ఆశ్చర్యచకితయై అలాగే చేసి నదీతీరానికి వచ్చేసరికి ఆమె పతి తన నౌకతో సహా నిక్షేపంగా అన్ని నిక్షేపాలతో బాటు కనిపించాడు. అందరూ ఆనందంగా ఒకరినొకరు అభినందించుకొని ఇల్లు చేరగానే సాధు ఒక లక్ష ముద్రలు వ్యయపఱచి అత్యంత భక్తిశ్రద్ధలతో ఒక పెద్ద ఉత్సవం నడిపింంచినట్లుగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాడు. స్వామి వరమిచ్చినట్లుగానే సుఖంగా జీవించి దేహాంతంలో వారంతా స్వర్గానికి వెళ్ళి ఆ తరువాత సత్యలోక నివాసాన్ని పొందారు. ఈ ఇతిహాసాన్ని భక్తిపూర్వకంగా వినేవారు కూడా విష్ణుదేవునికి ప్రీతిపాత్రులై తమ మనఃకామనలన్నిటిని నెరవేర్చుకోగలరు. ఋషులారా! నేను నివేదించిన ఈ సత్యనారాయణవ్రతం అన్ని వ్రతాలలోకీ శ్రేష్ఠమైనది. బ్రాహ్మణ ముఖం ద్వారా జనించి చేయబడుతున్న ఈ వ్రతం (దీనిని మానవలోకానికి చెప్పినవాడు శతానందుడనే బ్రాహ్మణుడు) కలికాలంలో అతిశయ పుణ్యప్రదం.” అని అనుగ్రహభాషణాన్ని ఆపాడు సూతమహర్షి.
ఇది శ్రీ సత్యదేవుని వ్రతకథలో ఆరవ అధ్యాయము.
శ్రీ సత్యనారాయణ వ్రతకథ సర్వం సంపూర్ణం.
గీతాప్రెస్, గోరఖ్‌పుర్ వారి భవిష్యపురాణ ప్రతిలో సత్యనారాయణవ్రతం చేయడానికి ముందు ప్రొద్దున్నే అయిదు కలశలను సిద్ధం చేసుకోవాలని మాత్రమే చెప్పబడింది.
స్కాందపురాణంలో ఒక కలశనే సిద్ధం చేసుకోవాలని చెప్పబడింది. వ్రత ప్రారంభంలో మండపంలో పవిత్రీకృత వైశాల్యంలో బియ్యాన్ని పోసి, నెరపి, దానిపై నొక వస్త్రాన్ని పఱచి దానిపై కలశను పెట్టి దానిపై మరొక నూతన వస్త్రాన్ని ఉంచాలనీ, ఈ వస్త్రంపై శ్రీ సత్యనారాయణస్వామి వారి ప్రతిమను ప్రతిష్ఠించాలనీ స్కాందపురాణం ఉపదేశిస్తోంది.
భగవాన్ సత్యసాయిబాబా ఒకనాటి అనుగ్రహ భాషణంలో సత్యనారాయణవ్రత ప్రసక్తి వచ్చినపుడు ఈ వ్రతంలో అయిదుకలశలనే వాడాలని చెప్తూ ఎలా వాడాలో కూడా ఉపదేశించారు ఇలా. “మండప మధ్యంలో స్కాందపురాణంలో చెప్పినట్లుగానే సత్యనారాయణ కలశను స్థాపించి దానికి కుడివైపు వరుణకలశం, ఎడమవైపు అరుంధతి కలశం, స్వామికలశకు వెనుక కుడిచివర లక్ష్మీనారాయణకలశం, ఎడమ చివర వాయు లేదా రుద్ర కలశం వుండాలి. స్వామికి వలెనే ఇతర దేవతలకు కూడా ప్రతిమలను కలశలపై ప్రతిష్ఠించాలి.”