భవిష్య పురాణము

198, 199 - సువర్ణ - తిల శైల దానవిధి, తిలల మహిమ

మహారాజా! సువర్ణాచలదానంలో ఒక వెయ్యి పలంల బంగారాన్ని వాడడం ఉత్తమ దానవనిపించుకుంటుంది. అంతలేనివారు అందులో సగం, మరీలేని వారు ఇందులో సగం పలంల బంగారాన్ని వాడవచ్చు. దానవిధి అంతా ధాన్యపర్వత దానంలాగే వుంటుంది. విష్కంభ పర్వతాల విధి కూడా అలాగే వుంటుంది. దానంచేస్తున్నపుడు సువర్ణాచలాన్ని ఈ మంత్రంతో ప్రార్థించాలి:

నమస్తే బ్రహ్మబీజాయ బ్రహ్మగర్భాయవై నమః

యస్మాదనంత ఫలదస్తస్మాత్ పాహిశిలో చ్చయ

యస్మాధగ్నేరపత్యం త్వం యస్మాత్ తేజో జగత్పతేః

హేమ పర్వత రూపేణ తస్మాత్ పాహి నగోత్తమ (ఉత్తరపర్వం 198/4-6)

ఈ విధంగా సువర్ణాచలదానాన్ని చేసేవారు పరమశివలోకానికి వెళ్ళి అక్కడ వందేళ్లు నివసించి అప్పుడు మోక్షాన్ని పొందుతారు.

మహారాజా! ఉత్తమ విష్ణులోక ప్రాప్తిదమైన తిలశైల దాన విధానాన్ని వినిపిస్తాను. తిలలు అత్యంత పవిత్రాలు. పవిత్రాలనే పవిత్రం చేసేటంత పవిత్రాలు. వీటి ఉత్పత్తి విష్ణుదేవుని దేహము నుండి జరిగింది. అందువల్ల కూడా ఇవి పరమ పవిత్రాలు. ఎలాగంటే:

దితిపుత్రులైన మధు, కైటభులనే రాక్షసులు విష్ణువునే యుద్ధానికి ఆహ్వానించారు. వారి తపోబలం, వరప్రభావాల వల్ల ఎన్నేళ్ళైనా యుద్ధం చేశారే గాని చావలేదు, అలియలేదు. విష్ణువుకి బాగా చెమట పట్టి కొన్ని బిందువులు నేలపై బడగా వాటినుండి తిలలు, ఉడద ధాన్యము, కుశదర్భలూ ఉత్పన్నమైనాయి. కొన్నాళ్ళకి మధు రాక్షసుని విష్ణువు సంహరించాడు. వాని ‘మేదీ’ (కొవ్వు) నేలపైబడి నాటి నుండి పృథ్వికి ‘మేదిని’ అని పేరు వచ్చింది. ఎందుకంటే అది భూమినంతటిని తన రంగులోకి మార్చేసింది. చాలాసేపటిదాకా ఎవరికీ ఏమీ కనబడలేదు. మధురక్కసుడు మరణించగానే దేవతలంతా కడు సంతుష్టులై విష్ణువుని ఇలా స్తుతించారు:

‘దేవ దేవేశ! మీరే ఈ ప్రపంచాన్ని ధరించి, ఉద్ధరించి, పోషిస్తారు. సృష్టి కర్తకే సృష్టికర్త మీరు. మధుసూదన! మీ సంకల్పం వల్ల జనించిన ఈ విశ్వం దానిలోనే లయిస్తుంది. మీ ప్రసాదంగా ఈ తిలలు లోకానికి వచ్చాయి. లోకకళ్యాణ కారకులైన మీకు వందనములు. రక్షించండి.’

‘దేవతలారా! ఈ తిలలే మూడు లోకాలనూ రక్షించగలవు. శుక్లపక్షంలో దేవతలకూ కృష్ణపక్షంలో పితరులకూ తిలోదకాలిస్తే రక్షణ లభిస్తుంది. ఈ తిలాంజలులను ఏడెనిమిది మార్లు ఇస్తే మేమూ, మీరూ పితరులూ కూడా సంతోషించి మానవులనూ సంతోషపెట్టాలి. కాకులు, కుక్కలు మున్నగునవి ముట్టుకోవడం వల్ల దూషితములైన వస్తువులు తిలలతో నీటిని కలిపి వాటిపై జల్లితే పవిత్రాలై పోతాయి. తిలపర్వత దానం అక్షయదానమే కాగలదు’ అని శ్రీ మహావిష్ణువు కట్టడి చేశాడు.

తిలశైల దానానికి పదిద్రోణాల తిలలను వాడడం శ్రేష్టం. శక్తి లేనివారు, అయిదు లేదా మూడు ద్రోణాల నువ్వులతో చేయవచ్చు. విష్కంభపర్వత స్థాపనతో సహా అన్ని నియమాలనూ ధాన్య శైలదానానికి వలెనే చేయాలి. ప్రార్థన మాత్రం ఇలా చేయాలి:

యస్మాన్ మధువధే విష్ణోర్దేహస్వేద సముద్భవాః

తిలాః కుశాశ్చ మాషాశ్చతస్మాచ్ఛం నో భవంత్విహ

హవ్యే కవ్యే చ యస్మాచ్చ తిలైరేవాభి మంత్రణం

భవాదుద్ధుర శైలేంద్ర తిలాచల నమోఽస్తుతే (ఉత్తరపర్వం 199/19,20)

 ఈ దానాన్నిచ్చిన వారు దేహాంతంలో విష్ణులోకాన్ని చేరుకుంటారు. పునరాగమన రహితులై అక్కడే వుంటారు. ఈ దానానికీ మృతికీ మధ్య ఇహలోకంలో దీర్ఘాయువు, పుత్ర పౌత్రాభివృద్ధి, వారితో అవధులు లేని ఆనందం అబ్బుతాయి. దేవతలు, గంధర్వులు, పితరులు ఆ దాత దేహాంతంలో వచ్చి పూజించి స్వర్గానికి పంపిస్తారు. అక్కడ దేవేంద్రుడొక అద్భుత విమానాన్నిచ్చి విష్ణు లోకానికి పంపిస్తాడు. ఈ దానమాహాత్మ్యాన్ని ఆసక్తిగా విన్నవారికి ఒక కపిల గోవును దానమిచ్చిన పుణ్యం దక్కుతుంది.