మహారాజా! ఇప్పుడు సర్వదోషాలనూ శాంతింపజేసే రుద్రస్నానాలను గూర్చి వినిపిస్తాను. మృత వత్స, వంధ్య, దుర్భాగ, సంతాన, హీన, కన్యగానే మిగిలిపోయిన స్త్రీ -ఇలాంటివారు రుద్ర స్నానాలు చేయాలి. అష్టమి, చతుర్దశి లేదా ఏ ఆదివారమైనా నదీ తటంపై గాని మహానదీ సంగమంలోగాని శివాలయంలోగాని స్వగృహంలోగాని సుయోగ్యుడైన బ్రాహ్మణుని నుండి స్నాన విధిని గుఱించి తెలుసుకొని స్నానాలు చేయాలి.
పేడతో అలికిన స్థానం పైనొక ఉత్తమ మండపాన్ని నిర్మించి దానిమధ్యలో అష్టదళ కమలాన్ని రచించాలి. దానిమధ్యలో కర్ణికపై మహాదేవునీ, వామదక్షిణ భాగాల్లో క్రమంగా పార్వతీదేవినీ వినాయకునీ, కమలము యొక్క అష్టదళాలలో దిక్పాలకులనూ స్థాపించాలి.
తరువాత గంధాది ఉపచారాలతో వారికి పూజ చేయాలి. మండపానికి నాలుగు కోణాలలోనూ కలశలను స్థాపించాలి. నాలుగు దిశలలోనూ భూతబలులివ్వాలి. అప్పుడు అగ్నికోణంలో గుండమును నిర్మించి ఉప్పు, ఆవాలు, నెయ్యి, తేనెలతో హవనాలివ్వాలి. హవనాలిచ్చినపుడు మానస్తోకే తనయేం (యజుం 16/16) వంటి వైదిక మంత్రాలను పఠించాలి. ఆచార్య, బ్రహ్మ, ఋత్విజ, జాపకులను నియమించుకోవాలి. ఏకాదశ రుద్రపాఠాన్ని చేయించాలి. ఇలాగే మరొక మండపాన్ని నిర్మించి వ్రతము చేయు స్త్రీ దానిపై కూర్చోవాలి. రుద్రపూజక ఆచార్యులు ఆమెకు స్నానం చేయించాలి. సూర్యకాంతపు ఆకు దొన్నెలలో నీటిని తీసుకొని రుదైకాదశినీ పాఠం చేసి ఆ జలాలను అభిమంత్రించి వ్రతియైన స్త్రీని అభిషేకించాలి. తరువాత సప్తమృత్తికా మిశ్రిత జలము, రుద్రకలశలలోని, ఇంద్రాది దిక్పాలకులను పూజించిన కలశలలోని జలములతో ఆమెకు స్నానం చేయించాలి. ఈ ప్రకారంగా రుద్ర స్నానాన్ని గావించిన పిమ్మట బంగారపు ఆవుబొమ్మనీ, సజీవ గోవునీ, పూజా సామగ్రినీ ఆచార్యునికి దానం చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వారందరినీ వస్త్ర, దక్షిణలతో తృప్తిపఱచాలి. ఇలా రుద్ర స్నానం చేసే స్త్రీకి అన్ని కోరికలూ తీరుతాయి.”