191 - 192 - పాతకాలు, ఉపపాతకాలు, యమయాతనలు

            అరుణా! మానసిక, వాచిక, శారీరక భేదాలైన పాపాలెన్నో ప్రకారాలుగా వుంటాయి. అన్నీ అందరినీ నరకానికి పంపించడంలో కడు సమర్థాలే. వాటిని సంక్షిప్తంగా వచిస్తాను, విను.

            గోవులు నడయాడే మార్గంలో, నగరంలో, గ్రామములో అగ్ని, విస్ఫోటనాలకు కారకులయ్యేవారు తాగుబోతులతో సమానమైన పాపకర్ములు. పురుషునిగానీ, స్త్రీనిగానీ, గుఱ్ఱాన్నిగానీ, ఏనుగునుగానీ అపహరించేవారు, పంటలకు నష్టం కలిగించేవారు; చందనం, అగరు, కస్తూరి, పట్టువస్త్రాలు - ఇలాటి వాటిని దొంగిలించేవారు స్వర్ణచోరులతో సమానులైన మహాపాతకులు. కన్యాపహరణము, మిత్రుని లేదా పుత్రుని భార్యతోగాని, సోదరితోగాని అత్యాచార, దురాచారములొనరించువారు, కుమార్తెతో, ఇతరుల కన్యలతో సహవాసము చేయువారు, సవర్ణులతో కామక్రీడలో పాల్గొనువారు - గురువుగారి శయ్యపై శయనించిన పాపాన పోతారు. వీరు మహాపాతకులు.

            బ్రాహ్మణులకు వాగ్దానం చేసిన దానిని ఈయనివారు, సదాచారిణియైన పత్నిని వదిలివేసినవారు, సాధువులను, బంధువులను, తపస్వులను ఆపదలోనైనా ఆదుకోకుండా పరిత్యజించినవారు, ఆవును, భూమిని, బంగారాన్ని విశ్వప్రయత్నం చేసి అపహరించేవారు, భగవద్భక్తులను బాధించేవారు, ధనాన్ని, ధాన్యాన్నీ, పశువులనూ దొంగిలించేవారు, అపూజ్యులను పూజించేవారు - వీరంతా ఉపపాతకులుగా పరిగణింపబడతారు.

            నారీరక్షణ సేయనివారు, ఋషులకు దానమివ్వనివారు, దేవతలను, అగ్నిని, గోమాతను దేవతలను, సుశీలలైన స్త్రీలను, బ్రాహ్మణులను నిందించువారు కూడా ఉపపాతకులే. రజస్వలతో దురాచారము, పశువులతో కదాచారము, నాస్తికత, బాధ్యతలను పట్టించుకోకపోవడము, దుశ్శీలత, అప్రియభాషణము - ఇవన్నీ ఉపపాతకాలు.

            గో బ్రాహ్మణులను, సస్యసంపదనూ, తపస్వులనూ, సాధువులనూ దూషించువాడు నరకానికి పోతాడు. కష్టించి పనిచేసేవానిలో తపస్సు చేయువానిలో దోషాలు వెదకువారు, పర్వతాలపై గోశాలల్లో,అగ్నిలో నీటిలో, చెట్టు నీడలో, దేవాలయం గోడలపై మలమూత్ర విసర్జన చేసేవారు: కామ, క్రోధ, మదాక్రాంతులై ఇతరులలో ముఖ్యంగా తమకు నచ్చనివారిలో దోషాలు వెదికేవారు, ఎలాగైనా వారిని సాధించాలని చూసేవారు, దారిదోపిడిగాండ్రు, ఇతరుల రహస్యాలను పట్టుకొని సంతసించేవారు, చెడునే వినడానికి ప్రయత్నిస్తూ ఇతరులచే వాగించేవారు, గోవును హింసించువారు, అసమర్థ, బలహీన పశువులను కాడికి బలవంతముగా కట్టువారు వీరంతా పాతకులు, నరకానికి పోతారు.

            వీళ్ళందరికీ ఆత్మరూపంలో నరకాన్ని చేరాక అక్కడొక శరీరం లభిస్తుంది. దానిని యాతనా శరీరమంటారు. వారికక్కడ బహుళ సంఖ్యలో దుఃఖాలు ఏర్పాటు చేయబడతాయి. అధర్మపరులకు తగిన శాస్తి చేయిస్తాడు. కాబట్టే యముని యమధర్మరాజుగా వ్యవహరిస్తున్నాం, నరలోకంలో తప్పులు చేసి పాపాలు గావించి దొరికిన వారిని మహారాజో, ఆదేశంలోని చట్టమో శిక్షిస్తాయి కదా! అక్కడ తప్పుచేసీ తప్పించుకున్నవారు ఇక్కడ ఈ నరకంలో తప్పక దొరుకుతారు. వీరిని ధర్మశాస్త్రాల ప్రకారం యమధర్మరాజు శిక్షిస్తాడు. అయితే నరలోకంలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తాలు లేకపోలేదు. అవి తెలియకగానీ, తప్పకగానీ చేసిన దుష్కర్మలకే వర్తిస్తాయి. పైగా ప్రాయశ్చితం చేసుకుని పశ్చాత్తాపపడకుండా మళ్ళీ పాపాలు చేస్తే ఈ మొత్తం పాపాలన్నిటికి యమధర్మరాజు శిక్ష విధిస్తాడు. అందుచేత ఈ నరలోకంలో పుట్టినవాడెవడైనా, ఎవరైనా, స్వయంగా మంచిపనులు చేస్తూ, ఇతరులచేత చేయిస్తూ, తాను చెడ్డపనులు చేయకుండా, చేసేవారిచేత నయానో, భయానో మాన్పిస్తూ ఎల్లకాలమూ బతికేవారే మరణానంతరం సుఖపడతారు. అదే ఉత్తమ సుఖం. సుఖోత్తమం.

            హే ఖగశ్రేష్ఠా! నరకంలో ప్రతిప్రాణికీ పాపఫలితం ‘అవశ్యమనుభోక్తవ్య’ మవుతుంది. సత్యవాది చిత్రగుప్తుడు అతని అనుచరులు, యమధర్మరాజుకి ప్రతిప్రాణియొక్క శుభాశుభకర్మలనూ నివేదిస్తారు. సౌమ్యహృదయులు, దయాసమన్వితులు, శుభకర్మలు చేసినవారూ కూడా ముందు నరకానికే వెళతారు. వారు సౌమ్యపథంలో గొనిపోబడతారు. క్రూరకర్ములను, పాపాచరణలోనే సంలగ్నులై బతుకు గడిపి పోయిన వారిని ఘోర దక్షిణమార్గంలో, అష్టకష్టాలూ పెట్టి యమకింకరులు తీసుకుని వెళతారు. వైవస్వతపురి భూలోకానికి ఎనభై ఆరువేల ఎనభై యోజనాల దూరంలో వుంది. అయినా, శుభకర్మలు చేసి సౌమ్యమార్గంలో వెళుతున్నవారికి ఈ ధర్మపురికి వేగంగానే చేరుకున్నట్లనిపిస్తుంది. రౌద్రమార్గంలో గొనిపోబడుతున్న మహాపాపులకు మాత్రం అతిశయ దూరమైపోతుంది. బహుకష్టభరితమై పోతుంది. యమపురికి పోయే మార్గం మహాభయంకరంగా వుంటుంది. ముళ్ళు, మోకాటిపర్వతాలు, ఎలుగుబంట్లు, కత్తులలాగా పాదాలను కోసి పడేసేరాళ్ళు, సహింప రానంత వేడి, తట్టుకోలేనంత, ఎముకలు కొరికే చలి, ఇంతేకాక ఎక్కడికక్కడ ప్రేతాలు పలకరిస్తుంటాయి. పట్టి కొండలపై నుంచి క్రిందికి విసిరేస్తుంటాయి. కొండొకచో మెరకుపల్లాల దారి, కాలికింద కనబడని కంకరరాయి. కాలుపడగానే చురుక్కుమని బొబ్బలెత్తించే మిక్కిలి వేడిగానున్న నాపరాయి, దావాగ్ని పరిపూర్ణ మార్గాలు కొన్ని అంధకార బంధురములై కన్నుపొడుచుకున్నా, కానరాని కటిక చీకటి దారులు కొన్ని. పులులు, సింహాలు, కొండచిలువలు - తగులుతునే వుంటాయి. కరుస్తునే వుంటాయి. శరీరం ముక్కలైపోయి వేలాడుతుంటుంది. భరింపరాని బాధ తెలుస్తునే వుంటుంది. స్పృహ తప్పదు, ప్రాణం పోదు. (రెండోసారి పోదు కదా) ప్రయాణం సాగుతునే వుంటుంది. ఇవి చాలవన్నట్టు రౌద్రడాకినులు, భయంకర పిశాచులు, కరాళ రాక్షసగణాలు మాటి మాటికి కనిపిస్తూ సతాయిస్తునే వుంటాయి. ఈ విధంగా మహాపాతకులు ఇతర పాపులు ఆకలి, దాహం, రోగం ముప్పిరి గొనగా యమదూతలు తోలుకుని పోతుండగా నరకాన్ని చేరుకుంటారు.

            కాబట్టి పాపాన్నే కాదు పాపపుటాలోచనలను కూడా సంపూర్ణంగా బహిష్కరించి పుణ్యకర్మలనే ఆచరిస్తూ జీవించాలి. పుణ్యం వల్ల దేవలోకమే కాదు దేవత్వమే ప్రాప్తించవచ్చు. కర్తవ్య పరాయణుడై బాధ్యతలలో మునిగియున్న మనిషి ఎంత తక్కువ సమయాన్ని సూర్య పూజకి కేటాయించినా, వాని మనసును మాత్రమే చూసే నేను, ఎంతో ఎక్కువ పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాను.