భవిష్య పురాణము

5 - వివాహ సంస్కారం. స్త్రీలలో శుభాశుభ లక్షణాలు: - ఆచరణీయ శ్రేష్ఠత

ఓ రాజా! బ్రహ్మచర్యాశ్రమాన్ని ముగించి స్నాతకుడైన వాడు వేదాధ్యయనం చేసి గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. ఇంటిలోని వారు స్నాతకుడైన బ్రహ్మచారి ఇల్లు చేరగానే ముందతని మెడలో పుష్పమాల వెయ్యాలి. చక్కటి శయ్యపై కూర్చుండబెట్టి, మధుపర్కాలతో అలంకృతుని చెయ్యాలి. పిమ్మట గురువుగారి ఆజ్ఞను పొంది ఒక శుభ లక్షణలక్షితయైన సజాతీయ యుక్తవనితను అతని (బ్రహ్మచారి) తోడి వివాహానికై వెతకాలి.

“మునిసత్తమా! అసలు స్త్రీలలో ఎన్ని రకాల లక్షణాలు వారుంటారు? ఏయే లక్షణాలున్న కన్యను శుభలక్షణ లక్షితగా భావించవచ్చు?”

    అడిగాడు రాజేంద్రుడు.

    చెప్పసాగాడు మునీంద్రుడు.

“మహారాజా! ఒకప్పుడు ఋషిగణాలు బ్రహ్మదేవుని ఇదే ప్రశ్న అడిగారు. ఆయన స్వయంగా చెప్పిన మాటలనే నేను నీకు విశదపరుస్తున్నాను.

ఏ స్త్రీ యొక్క పాదాలు ఎర్ర కలువల కాంతులను కలిగియుంటాయో, అవి నేలపై నడిచినపుడు కాలికీ నేలకీ మధ్య (ఇది చింత్యము) ఖాళీలు లేకుండా సమతలాలుగా వుంటాయో ఆ చరణాలు ఉత్తమాలై, సుఖభోగాలు ప్రసాదించేవై వుంటాయి. మడమలు నున్నగా సమంగా వుండే స్త్రీ ధనవంతురాలవుతుంది. మెడమీద నాలుగు అంగుళాల దడిలో మూడురేఖలు స్పష్టంగా కనిపించేలా కలిగివున్న కలికిరత్నసంపదలకు అధికారిణి అవుతుంది. పగిలిపోయి, మాంసరహితంగా, నాడులు ఉబ్బియున్న పాదాలు దరిద్రానికీ, దుర్భాగ్యానికీ సంకేతాలు. కాలి వ్రేళ్ళు పరస్పరం తగులుతూ, గోళాకారంలో, నున్నగా, స్నిగ్ధంగా వుండి, సాపుగా చిన్నవై వుండే గోళ్ళు కలిగియుంటే ఆ స్త్రీ ఐశ్వర్యవంతురాలూ, రాజమహిషీ కాగలదు. చిన్న వ్రేళ్ళు ఆయుర్వర్ధకాలే గానీ, వాటి మధ్య మరీ ఎక్కువగా యెడముండుట మాత్రము ధనక్షీణము.

చేతి రేఖలు లోతుగా, మెత్తగా, గులాబీరంగులో వుండే స్త్రీ భోగాలను కలిగిస్తుంది. అనుభవిస్తుంది కూడా. హస్తరేఖలు తేలిపోతూ, ముక్కలై వుంటే దరిద్రం. చిటికెన వ్రేలి మూలం నుండి చూపుడు వ్రేలు దాకా ఒక రేఖ పూర్తిగా స్థిరంగా వుండే స్త్రీ నూరేళ్ళు జీవిస్తుంది. చేతియొక్క చిటికెన వ్రేళ్ళు గుండ్రంగా, పొడవుగా, సన్నగా, పక్కవ్రేలితో కలిసినపుడు జాగా నొదలకుండా, కోమలంగా రక్తవర్ణంలో వుండే స్త్రీ అనేక సుఖభోగాలను ప్రాప్తింపజేస్తుంది. బంధుజీవ పుష్పంలా ఎర్రగా, ఎత్తుగా నున్నగా వుండే గోళ్ళు గల ఆడది ధన కారకమవుతుంది. మృదుత్వం లేకుండా, మధ్యలో పగిలి, రెండు మూడు రంగుల్లో వుండే గోళ్ళు గల అతివకు శుభలక్షణాలుండవు. రెండు చేతులూ ఒకదానికొకటి సమానంగా లేకుండా, గరుకుగా తగులుతూ, పగిలిపోయివుంటే అవి గల స్త్రీ కష్టాలనుభవిస్తుంది. వ్రేళ్ళ మధ్య వుండే నరుకులు సమానంగా వుండి యవధాన్యపు గింజల గుర్తులను కలిగి వుండే వనితకు అపార సుఖాలూ, అక్షయ ధన ధాన్యాలూ ప్రాప్తిస్తాయి. మణిబలిధం పుష్టిగా వుండి మూడు రేఖలతో వెలుగులీనుతూ వుంటే ఆ తరుణి చిరకాలం పాటు అక్షయ భోగాలనూ, దీర్ఘాయువునూ పొందగలదు. ఎర్రని, నున్నని, పొట్టి గోళ్ళు కలది సౌభాగ్యవతీ, ధనవంతురాలూ అవుతుంది. గోళ్ళు పొడవుగా వుంటే కొడుకుల తల్లీ, సూక్ష్మములైతే ఐశ్వర్యవంతురాలూ అవుతుంది. మెడ బలహీనంగా వుంటే బీదరాలు అవుతుంది. మిక్కిలి పొడవైన మెడగల పొలతి అనేక పురుష సాంగత్యాన్ని అభిలషించే బంధకి అవుతుంది. మరీ చిన్న మెడ కూడా మంచిది కాదు. సంతానం మిగలరు. మెడ పక్కకివచ్చే బాహువుల ప్రారంభకాలు పొట్టిగా, గుండ్రంగా, పుష్టిగా వుండే నెలత దీర్ఘాయువై, పతి ఆయువునూ పెంచగలదు.

సమతుల్యనాసిక - అంటే పొట్టి, పొడుగూ, లావూ, లొత్తా కాని నాసికను, పరస్పరం కలవకుండా విల్లువలె వంపు తిరిగి, దట్టం కాని, కనుబొమ్మలను, నల్లని వత్తైన నున్నని కేశములను కలిగియున్న కాంత సౌభాగ్యకారణము.

(ఈ పట్టికలోనే హంస, నెమలి గొంతుల స్వరాలు కూడా ఉన్నాయి. కాని అది చింత్యము. ఎందుకంటే వాటి గొంతులు మహా కర్ణ కఠోరంగా, నవ్వినా రోదిస్తున్నట్టే వుంటాయి.) కోయిల, వీణ, భ్రమరం, వేణు, వాదనలతో సమానమైన గొంతు ధ్వనులు గల నారీమణులు సుఖ సంపత్తులకు కోశములు. దాసదాసీజనాలకు వారు ఏలికసానులు కాగలరు. దీనికి విపరీతంగా గాడిద, కాకి, పగిలిన కంచు వస్తువుల స్వరముల గల స్త్రీకి రోగము, వ్యాధి, భయము, శోకము, దారిద్ర్యాలు ఎక్కువగా ప్రాప్తిస్తాయి. హంస,ఆవు, వృషభము, చక్రవాకం, ముఖ్యంగా ఏనుగు వంటి నడకలు గల ఆడవారు కులానికి ప్రతిష్ఠతను తీసుకొస్తారు. రాణీలవుతారు. కుక్కలా, నక్కలా, కాకిలా నడిచే స్త్రీలు నిందనీయులౌతారు. లేడిలాగా నడిచేది దాసీదవుతుంది. ఆగి ఆగి నడిచేది బంధకి కాగలదు. శరీరము, అన్ని అంగములు కోమలంగా, చెమట పట్టకుండా, రోమాలు లేకుండా వుండే స్త్రీలు పూజింపబడతారు.

కపిల వర్ణం గాని, పింగళ అంటే పసుపు పచ్చరంగు గాని వుండి, అన్ని అంగాలు పెద్దవే వుండి, వాగుడు ఎక్కువగా గల వనితను పెండ్లాడరాదు. పేరు కూడా జాగ్రత్తగా గమనించాలి. నక్షత్ర, వృక్ష, నదీ, పర్వత, పక్షి, సర్ప, భయంకర వస్తు నామములున్న స్త్రీలను పెండ్లాడరాదు. సమతుల్యాంగములు, సుందరనామం, సూక్ష్మరోమం, హంస లేదా మదగజయానం, నల్లగా మెరిసే కేశం, తెల్లగా మెరిసే దంతాలు గల సుదతినే పెళ్ళాడాలి.

ఈ క్రింది పది లక్షణాలు గల కుటుంబాలతో వివాహ బంధం కలుపుకోరాదు. సంస్కారాలను పాటించరు. పురుష సంతతి వుండదు. వేదం చదవరు - కాబట్టి చెప్పరు. పురుష శరీరాలపై కూడా పొడవైన కేశాలను పెంచుతారు. మూలవ్యాధి, క్షయ, మందాగ్ని అపస్మారము, తెల్ల మచ్చలు, కుష్టురోగాలు వారి రక్తంలో వుంటాయి.

పైన చెప్పిన శుభలక్షణాలన్నీ చూసి వెంటనే సంతృప్తి పడిపోకుండా, ఆచరణను, ఆచారాలనూ కూడా గమనించి సత్కన్యను వివాహం చేసుకోవాలి. శారీరక లక్షణాల కన్నా సదాచార సంపన్నత వైపే ఎక్కువ మొగ్గు చూపించాలని బ్రహ్మపలుకు. అందము, సులక్షణము, సంపద వున్నా ఉత్తమ ఆచరణ (మర్యాద, మప్పితం, సంస్కారం లాంటివి) లేకపోతే ఆ కన్యను వివాహమాడరాదని బ్రహ్మసలహా (సలహా అనేది ఉర్దూలోంచి వచ్చిన పదమనీ, దానిని అనువాదంలో వాడరాదనీ కోపించే మహావిద్వాంసులకు సరైన తెలుగు పదం సూచించ ప్రార్ధన.) ఆయన సలహాని పాటిస్తే ఆ కుటుంబానికి వృద్ధి, శుద్ధి, సత్కీర్తి ప్రాప్తిస్తాయి.”