భవిష్య పురాణము

133 -136 - దమనకోత్సవం, దోలోత్సవం, రథయాత్రోత్సవాల వర్ణన

“శ్రీకృష్ణ చంద్రా! ఈ ప్రపంచంలో సువాసనలను వెదజల్లు పూలు చాలానే వున్నాయి కదా! అయినా ఈ దమనక పుష్పాన్నే దేవుళ్ళ మీద వేయాలంటారెందుకని?” అడిగాడు ధర్మజుడు. చెప్తున్నాడు చక్రధారి.

“పాండవాగ్రజా! ఒకప్పుడు మందరాచలంపై ఒక శ్రేష్ఠమూ, అత్యంత సుగంధితమూ నైన వృక్షము ఉత్పన్నమైంది. ఆ దివ్య సుగంధ ప్రవాహంలో పడి దేవతా స్త్రీలు స్వర్గాన్నీ, ఋషులు విముగ్ధులై జపతప హోమాదులనూ మఱచి అక్కడక్కడే ఆ చెట్టు చుట్టూ తిరుగాడసాగారు. అటుగా వచ్చిన లోకులంతా ఉన్మత్తులవలె అన్నీ మఱచి అక్కడే ఉండి పోసాగారు. లోకంలో శుభకార్యాలకూ మంగళకార్యాలకూ విఘ్నమేర్పడింది. దాంతో బ్రహ్మకి కోపం వచ్చి, ఆయన ఆ వృక్షంతో, ‘హే దమనకమా! నిన్ను నేను ఈ లోకంలోని దోషాలను అణచుటకు దమనం చేయడం కోసం సృష్టించాను. కాని మరోలా జరుగుతోంది. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని నీకూ తెలుసుకదా! ఒక వ్యక్తికి అపకారం చేసినవాడినే అధముడంటున్నాం. మరి ఈ రోజు నీవల్ల లోకానికే అపకారం జరిగేటట్టుంది. నిన్నేమనాలి? ఇకపై దేవ, పితృకార్యాలలో, నీ పుష్పాలకు, వాడబడే అర్హత లేకుండుగాక!’ అని చెప్పి శపించాడు.

దానికా వృక్షము ‘దేవాధిదేవా! నేను ద్వేషం వల్ల గాని క్రోధవశాన గాని ప్రయత్న పూర్వకంగా గాని ఎవరికీ అపకారం చేయలేదు. నాకింత లోకోత్తర సుగంధాన్ని తమరే ప్రసాదించారు. దాని ప్రభావం వల్ల లోకులు ఉన్మత్తులై పోయి ఉన్న పనులన్నిటినీ మఱచిపోతే, అందు నా దోషమేముంది? నా సువాసన, వారి ప్రమత్తత మీరిచ్చిన ప్రకృతులే. ప్రకృతి నతిక్రమించి మనగలుగుట సాధ్యమా?

యాయస్యజంతోః ప్రకృతిః

శుభావాయది వేతరా

సత్యస్యామేవ రమతే

దుష్కృతే సుకృతే తథా (ఉత్తరపర్వం 133/15)

నిరపరాధినైన నన్ను ఇలా శపించుట మీ అంతటి వారికి తగునా? అంటూ రోదించింది.

అప్పుడు బ్రహ్మ ముందు సమాధానపడి ఆపై జాలిపడి ‘దమనకా! నీవు చెప్పినది తర్కసహితమై యున్నది. నీకు తొందరపడి శాపమివ్వడం తగిన పనికాదు. అందుచేత నీకొక వరం కూడా ఇస్తున్నాను. వసంతర్తువులో మాత్రం నీవే అందరు దేవతల మస్తకాలనూ అధిరోహించగలవు. ఆ ఋతువులో భక్తి భావంతో దమనక పుష్పాలను భగవంతునిపై వేసిన వారికి సర్వసుఖాలూ నిత్యంగా వుండిపోతాయి. చైత్ర శుద్ధ చతుర్దశి ఇక నీ పేరిట దమనక చతుర్దశిగా విఖ్యాతమవుతుంది. ఆరోజు నీవు తృప్తి చెందితేనే ఆ ప్రతి యొక్క సర్వపాపాలూ దగ్ధమైపోతాయి’ అని వరమిచ్చి వెళ్ళాడు. ఇదీ దమనక పుష్ప చరిత్ర.’

ఆ తరువాత పాండవాగ్రజుని కోరికమేరకు దోలోత్సవ రథయాత్రోత్సవాలను కూడా వర్ణించాడు పాంచజన్యహస్తుడు ఇలా:

“ధర్మజా! ఒకనాడు పార్వతీదేవి నందన వనంలో జరుగుతున్న వసంతర్తు దోలోత్సవాన్ని చూసి తనకు కూడా ఒక దోల (డోల, ఊయల) పై శంకరునితో కలసి క్రీడించాలని వుందని శంకరునే కోరింది. ఆయన వెంటనే దేవతలను పిలచి తమకొక ఉయ్యాలను నిర్మింపుడని ఆదేశించాడు.

వారు శీఘ్రమే ఇష్టాపూర్తమయాలైన రెండు స్తంభాలను పాతి, వాసుకిని త్రాళ్ళుగా నేర్పాటు చేసి రత్నజటితమైన పీటను పెట్టారు. అత్యంత మృదువైన పత్తి, పట్టులతో వస్త్రాలను నేసి దానిపై పఱచారు మరింత శోభరావడం కోసం దానికి ముత్యాల గుత్తులనూ, పూలమాలలనూ అలంకరించారు. ఈ విధంగా అత్యుత్తమమైన డోలను నిర్మించి, భక్తి వినయ సంభ్రమాలు ముప్పిరిగొనగా శంకర భగవానునికి సమర్పించారు.

పార్వతీ పరమేశ్వరులు దానిపై కూర్చొనగా శివపార్షదులూ, జయవిజయాలను పార్వతి సఖీమణులూ దానినూపసాగారు. అప్పుడు పార్వతీదేవి ఒక పాటను మధుర స్వరంతో అద్భుతంగా పాడింది. శివుడు ఆనందాబ్ధిలో మునిగిపోయాడు. గంధర్వులు ఆశ్చర్యమగ్నులై ఆమెకు వంత పాడసాగారు. అప్సరసలు ఆ పాటకి తగినట్లు ఆనంద నృత్యాలు చేశారు. చారణులు వివిధ రకాల వాయిద్యాలతో సహకరించారు.

కాని, శివుడు సర్వమూ మఱచి ప్రచండ వేగంతో ఊగుతుండడంతో ఆయన కడుపు లోనే క్రమంగా కదులుతున్న లోకాలు తల్లడిల్లాయి. పర్వతాలు వణకసాగినవి. ప్రపంచ మందంతటా ప్రచండ పవనాలు రేగడంతో సముద్రాలు అల్లకల్లోలమై పొంగజొచ్చినవి. ముల్లోకాలూ ఇలా వ్యాకులం పాలవడంతో ఇంద్రాది దేవతలంతా హుటాహుటిని కదలి వచ్చి ఈశ్వరుని ఇలా ప్రార్థించారు.

‘శరణు శరణు జగద్రక్షకా! పరమేశ్వరా! ఇక మీ డోలా లీలను ఆపకుంటే ప్రపంచమే మీలో లయమైపోయే లాగుంది.’ దేవతల ప్రార్థనలకు ప్రసన్నుడై శివుడు క్రిందికి దిగాడు. ఆయనకు దోల లేదా డోలపై ప్రసన్నత జనించి ఇలా వరమిచ్చాడు. ‘నేటి నుండి వసంతర్తువులో ఈ డోలోత్సవాన్ని చేసుకొని నైవేద్యాలను సమర్పించి ఆ డోలలపై దేవతలను ఆయా మూల మంత్రాలు చదువుతూ అధిరోహింపజేసి, చేయించి, ఆనందంగా స్తుతి చేసినవారికి అన్ని అభీష్టాలూ సిద్ధించుగాక!

ధర్మజా! రథయాత్ర విషయానికొస్తే ఒకమారు చైత్రమాసంలో మలయపర్వతంపై శంకర భగవానులు దేవతలచే పరివేష్టించబడి ప్రశాంతంగా ప్రకాశిస్తుండగా, అప్పటిదాకా మృత్యులోకంలో తిరిగి, బ్రహ్మలోకానికి పోయి వెంటనే దిగివచ్చిన దేవర్షి నారద మునీంద్రుడక్కడ కేతెంచాడు. నీలకంఠస్వామి పాదాలకు నివాళులర్పించి ఆసనాన్ని గ్రహించాడు.

‘ఎక్కడి నుండి రాక ఇటకు’ అని అడిగిన మదనసంహరుడు హరునితో నారదుడిలా విన్నవించాడు: ‘దేవదేవా! నేనిపుడు మృత్యులోకం (భూలోకం) నుండి వస్తున్నాను. అక్కడ కామదేవుని మిత్రుడైన వసంతుడు మొత్తం ప్రపంచాన్నే వశపఱచుకున్నట్లు కని పిస్తోంది. అక్కడ మందమంద సుగంధభరిత పవనాలు సుఖంగా ప్రవహిస్తున్నట్లున్నాయి. ఆమ్రమంజరి, కోకిలాది వసంతానుచరులు (తమ యేలిక వసంతుడు) ఆ లోకానికే గాక అన్ని లోకాలకూ యేలిక కామదేవుడు మన్మథుడేనని గ్రామ గ్రామానా ఘోషిస్తున్నాయి. అతని శాసనం వల్ల ప్రజలు అన్నీ మఱచి ఉన్మత్తుల్లా ప్రవర్తిస్తున్నారు. చైత్రమాసం యొక్క ఈ ప్రభావాన్నిచూసి మీకు నివేదిద్దామని ఇలా వచ్చాను.’

వెంటనే శంకరుడు దేవ గంధర్వ, అప్సర, ముని గణాలతో బాటు భూలోకానికి వచ్చి చూడగా అక్కడి పరిస్థితి నారదుడు చెప్పినట్లుగానే వుంది అందరూ ఆనందపరవశులై అప్రయత్నంగా ఉన్నట్లే ఉన్నారు. శివునితో వచ్చినవారు కూడ ఆనందితులై నృత్యగానాదుల నాశ్రయించారు. శివశంకర భగవానుడు కూడ ఆనందంగా తల తిప్పాడు గానీ ఆయనకు ఈ ఉన్మత్తత ఎక్కువసేపు నిలబడిపోతే అనర్థము జరుగుతుందని తెలిసింది. అనర్థం జరగబోతున్నదని తెలిసీ దానిని ఆపే సమర్ధత (సామర్థ్యము)ను కలిగివుండీ ఏమీ చేయకుండా వూరుకోవడం దేవునికి కూడా మంచిది కాదు. అలాగని జనులను ఆనందానికి దూరం చేయకూడదు. ఇలా ఆలోచించి పరమేశ్వరుడు వసంతుని పిలచి ‘వసంతా! నీవు చైత్రమాసంలోనే ఈ ఆనందాన్ని కలుగజెయ్యి’ అని ఆదేశించాడు. తరువాత శివుని మహిమవల్ల దేవతలు మత్తు నుండి బయటపడగా వారితో ఇలా అన్నాడు. ‘కేవలం సుఖభోగములు మంచివి కావు. భక్తి ప్రపత్తులు కూడా వుంటేనే ఏ సంబరమైనా సార్ధకమవుతుంది. మీరంతా ఈ చైత్రమాసంలో రథయాత్రోత్సవాలను రచించండి. వాటిలో పాల్గొనేవారు అన్ని భోగాలూ అనుభవిస్తూ కూడా ఆరోగ్యవంతులై వుండేలాగ నేను వరమిస్తాను.’

అప్పటి నుండి వసంతర్తువులో తదియనాడు గౌరీదేవికీ, చవితినాడు గణపతికీ, పంచమి నాడు లక్ష్మీ సరస్వతులకీ, షష్ఠినాడు స్కందునికీ, సప్తమినాడు సూర్యునికీ, అష్టమి, చతుర్దశి నాళ్ళలో శివునికీ, నవమినాడు చండికకూ, దశమినాడు వేదవ్యాసాది మహర్షులకూ ఏకాదశ ద్వాదశుల నాళ్ళు విష్ణువుకీ, త్రయోదశినాడు మన్మథునికీ, పున్నమినాడు అందరు దేవతలకూ దోలోత్సవ, దమనకోత్సవ, రథయాత్రలు జరుగుతున్నాయి. ఇలా చేయించిన వారికి బహుకాలం స్వర్గనివాస ప్రాప్తీ, మరుజన్మలో చక్రవర్తి యోగమూ లభిస్తాయి.

మహారాజా! త్రినేత్రుడు తన మూడవ కంటిమంటలో కామదేవుడైన మన్మథుని కాల్చి బూడిద చేసినపుడు మన్మథుడి భార్యలైన రతీ, ప్రీతి గుండెలవిసేలా రోదించారు. పార్వతీదేవి వారిని చూసి జాలిపడి పరమశివునితో ‘నాథా! మీరు మన్మథునికి ప్రాణాన్నీ రూపాన్నీ ప్రసాదించి కరుణించాలి’ అంది. దానికాయన స్పందించి ‘పార్వతీ! అది ఇప్పట్లో సంభవం కాదు. అయినా నారీమణులకోసం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశినాడు అతడు వారి మనసు నుండి పుట్టుకు వచ్చి దర్శనమీయగలడు. ఆ రోజు మానవులాతనిని పూజించాలి. అతనిని ఆ రోజు పూజించిన వారికి ఆ యేడాదంతా జయప్రదంగా సుఖప్రదంగా గడుస్తుంది’ అని వరమిచ్చాడు.

ధర్మజా! ఇపుడు మదన పూజా విధానాన్ని ఆలకించు. చైత్ర శుద్ధ త్రయోదశినాడు స్నానం చేసి, ఒక అశోక వృక్షాన్ని నిర్మించి దాని క్రింద రతి, ప్రీతి, వసంత సహిత కామదేవుని ప్రతిమను సిందూరం, పసుపులతో చేయించి స్థాపించాలి. దానికి నాలుగు వైపులా విద్యాధరుల, అప్సరసల, గంధర్వుల బొమ్మలను మదనుని సేవిస్తున్నట్లుగా చేయించి వుంచాలి. సామర్ధ్యమున్నవారు కామదేవుని ప్రతిమను సువర్ణంతో చేయించాలి. మధ్యాహ్న సమయంలో గంధ పుష్ప ధూప తాంబూల దీప ఫల నైవేద్యాక్షతాది ఉపచారాలతో మన్మథునీ అతని పత్నులనీ పూజించాలి. ఈ ప్రకారంగా ప్రతి సంవత్సరం కామ పూజనోత్సవాలను నిర్వహించిన వారికి సుబిక్షం, క్షేమం, ఆరోగ్యం, లక్ష్మీప్రదం అయిన జీవితం లభిస్తుంది. బ్రహ్మాదిదేవతలూ, సూర్యాది గ్రహాలూ, గంధర్వాది ఖేచరులూ, అసుర నాగాది పాతాళాధీశులూ కూడా ఈ పూజనూ, ఉత్సవాన్ని చేసిన వారి పట్ల ప్రసన్నులై వారి సర్వ సమస్యలనూ పరిష్కరించి సౌభాగ్య, రూప, పుత్ర, సుఖాలను ప్రాప్తింపజేస్తారు.

ధర్మజా! ఈ విధంగానే జ్యేష్ఠ పాడ్యమి నుండి పూర్ణిమ దాకా భగవతి భూతమాత ఉత్సవ పూజనాలను చేయాలి. ఈ ఉత్సవాన్ని పూర్తిగా హాస్యరసానికే అంకితం చేయాలి.