భవిష్య మహా పురాణము
16 - నామదేవ, రంకణ, యంకణాది రామానుజ శిష్యుల కథలు వరుణదేవ, పరాంబల మహిమ
సూతుడిలా చెప్పసాగాడు, “మునులారా! బృహస్పతి ఇలా అన్నాడు. ‘దేవేంద్రా! లోకంలో నీటిని ఒకచోటి నుండి మరొక చోటుకి చేర్చడం ‘ఆపవ’ మనబడుతుంది. ఆపవం మరో పేరే ‘వరుణ’ ఇక ఆ పనిని చేసే వరుణదేవుడు జలాలకూ సముద్రానికీ అధిపతి. దైత్యులను బంధించడానికి బ్రహ్మ ఆయనకొక పాశం ఇచ్చాడు. అప్పటి నుండి వరుణ దేవుని ‘పాశి’ అని కూడా వ్యవహరిస్తున్నారు.
వరుణుని కథ మానవునిగానే మొదలైంది. ఆయన శక్తి పూజకుడైన బ్రాహ్మణుడు. పేరు ఆపవుడు. శక్త్యుపాసనలలో భాగంగా ఆ బ్రాహ్మణుడు అనేక రకాల రక్తపుష్పాలతో మాలలను తయారుచేసి, రక్తచందనంతో వాటిని కలిపి మంత్రం ద్వారా భద్రకాళికి సమర్పించేవాడు. నవార్ణ (నవవర్ణ) జపతత్పరుడై ధూప, దీప, నైవేద్య, తాంబూల, ఋతుఫలాదులతో సనాతనియైన లక్ష్మీదేవిని పూజించేవాడు. తిలలతో, చక్కెర కలిపిన తేనెతో హవనం కూడా చేసేవాడు. దుర్గా సప్తశతి మధ్యమ చరిత్రను పఠిస్తూ నవార్ణ మంత్ర జపతత్పరుడై మూడు సంవత్సరాలు పూజలోనే వుండిపోవడంతో సర్వమంగళయైన భగవతీదేవి ప్రసన్నురాలై ప్రత్యక్షమై ‘ద్విజసత్తమా! నీకేం కావాలో కోరుకో” అంది. అయినా అతడు కోరుకోకుండా ‘ఈ స్తుతి చేయగిగే శక్తియే నాకు చాలు’ అనునట్లుగా సాష్టాంగ ప్రమాణం చేసి దేవీ స్తుతినే చేయసాగాడు. అపుడు దేవి భద్రకాళి పరమప్రసన్నమై, ‘వత్సా! ప్రళయం వచ్చి స్థావర జంగమాలు చాలావఱకు నశిస్తాయి. నీవు మాత్రం సముద్రంపై దానికధీశుడవై, సుఖంగా వుంటావు. తరువాత వరుణుడవై వెలుగుతావు’ అని దీవించి అంతర్ధానం చెందింది.’
మునులారా! దేవగురుని ఈ ప్రవచనాన్ని విన్న, ద్వితీయ వసువైన వరుణ భగవానుడు వెంటనే తన ముఖమునుండి ఒక తేజః పుంజము నుత్పత్తి చేసి భూమిపై దేహాలీ ప్రాంతానికి పంపగా ఆ తేజస్సు అక్కడి ధర్మభక్తుడను బ్రాహ్మణుని విధవా పుత్రికలో ప్రవేశించింది.
ఆమెకు కొడుకు పుట్టినపుడు అదంతా హరిలీలయని తెలిసిన ధర్మభక్తుడు పరమప్రసన్నుడై మనుమని ఆదరించి నామదేవు (నాందేవ్)డని పేరుపెట్టి పెంచాడు. ఆ బాలకుడు పెరిగి పెద్దవాడై సాంఖ్యయోగ పరాయణుడయ్యాడు. చరాచర సంపూర్ణ బ్రహ్మాండమంతా విష్ణు మయమేనని తెలుసుకోగలిగాడు. కాశీ వెళ్ళి హరిప్రియ రామానందుని ఆశ్రయించాడు. ఆయన శిష్యునిగా అక్కడే జీవించసాగాడు. ఆ సమయంలో దేహలిలో మ్లేచ్ఛపతి సికందర్ రాజ్యం చేస్తున్నాడు. అతడు నాందేవ్ పేరు ప్రఖ్యాతులను విని అతనిని తన కొలువులోనికి పిలిపించుకొని అన్ని విధాలా పరీక్షించి అతడు సామాన్యుడు కాడని గ్రహించాడు. సికందరు నాందేవ్‌కి అయిదులక్షల ముద్రలను దక్షిణగా ఇచ్చాడు. నాందేవుడు ఆ ద్రవ్యంతో కాశీలో ఒక శుభ్రమైన, శ్రేష్ఠమైన, శిలామయమైన ఘట్టాన్ని నిర్మించాడు. తన అపారయోగ బలంతో అప్పటికే మరణించిన పదిమంది బ్రాహ్మణులనూ, అయిదుగురు రాజులనూ, అయిదుగురు వైశ్యులనూ, వందగోవులనూ బ్రతికించాడు. అనగా పునర్జీవితులనుగా చేశాడు.
‘దేవేంద్రా! పూర్వకాలంలో విశ్వానరుడని ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతనికి పుత్ర సంతానం కలగలేదు. అతడు ఆరాధన ద్వారా బ్రహ్మదేవుని పూజించాడు. ఒక యేడాదికి బ్రహ్మసంతుష్టుడై ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు.
‘భగవాన్! మీకు నమస్కారము. ప్రకృతికే పరదేవతయై ఆదిమధ్యాంతాలు లేనివాడు నాకు పుత్రునిగా కావాలి. ‘
‘విశ్వా నరమునీ! నీ కోరిక నాకు ఆశ్చర్యాన్నీ ఆనందాన్నీ కలిగించింది. సరే. మాయా భూతుడు, జనార్దనుడు నైన హరియే స్వయంగా నీ పుత్రరూపంలో వస్తాడు’ అని వరమిచ్చి బ్రహ్మ అంతర్హితుడైనాడు. విశ్వానరునికి పావకుడను పుత్రుడు పుట్టాడు. అతడు అష్టవసువులకూ అధిపతియై వైశ్వానర నామంతో ప్రసిద్ధుడయ్యాడు. స్వాహాదేవిని పెండ్లాడాడు. హరి అగ్నిరూపుడైనపుడు వైశ్వానరుడని పిలువబడుతున్నాడు. పురాకల్పంలో ఆయనే అనలుడయ్యాడు.’
మునులారా! బృహస్పతి ఇంతవఱకు చెప్పి అగ్నివైపు చూశాడు. వెంటనే అగ్నిదేవుడు తన ముఖమునుండి ఒక తేజఃపుంజమును భూమికి పంపించాడు. అది వసువై కాంచనపురంలో లక్ష్మీదత్తుడను వైశ్యుని ఇంటిలో ప్రవేశించగా ఆ లక్ష్మీదత్తునికి రంకణుడను పుత్రుడు జనించాడు. అతడు పెరిగి పెద్దవాడై తన పత్ని యంకణతో సహా ఎన్నో ధర్మకార్యాలను నిర్వర్తించాడు. తమ దగ్గరున్న మొత్తం ద్రవ్యాన్ని ఈ రకంగా కైంకర్యం చేసి చివరికి కట్టెలు కొట్టుకొని జీవించవలసి వచ్చినా వారు దుఃఖించలేదు. ఆ దశలో కూడా ఉన్నంతలోనే ఆనందంగా దేవపూజను మానకుండా జీవనం గడిపారు. మహాత్మునిగా పేరుగాంచిన రంకణుడు రామానందుల శిష్యుడు.”