భవిష్య పురాణము

118 - అగస్త్య మహర్షి కథ - అర్ఘ్వ దానవిధి

ధర్మజుని అభ్యర్థన మేరకు అగస్త్య మహర్షి కథను చెప్పసాగాడు. శ్రీకృష్ణుడు ఇలా:

“మహారాజా! ఒకప్పుడు దేవశ్రేష్ఠులైన మిత్ర, వరుణులు మందరాచలంపై గొప్ప కఠిన తపస్సును చేయసాగారు. వీరిని పరీక్షించడానికి ఇంద్రుడు ఊర్వశిని పంపించాడు. ఆమెను చూడగానే వారిరువురికీ మతిపోయినట్లయింది. రానున్న అప్రతిష్ఠని కనిపెట్టి దానిని సుప్రతిష్ఠి చేయాలని తలపెట్టి వారు తమ తేజస్సు నొక కుండలో స్థాపించి తపస్సు చేసుకోసాగారు. నిమిమహారాజు శాపం వల్ల ఆ కుండ నుండియే ప్రథమంగా సకల రాజన్యులకు గురుపీఠమైన వసిష్ఠ మహర్షీ, ఆ వెనుక దివ్య తపోధనుడు, మహాత్ముడునగు అగస్త్య మహర్షీ ఉద్భవించారు.

అగస్త్యముని లోపాముద్రను వివాహం చేసుకొని విప్రులెందరో తనను పరివేష్టించి యుండగా పత్నితో సహా మలయ పర్వత ప్రదేశంలో వైఖానస పద్ధతిలో అత్యంత కఠోర తపస్సును చేయసాగాడు. అలా చాలాకాలం చేస్తుండగా వాతాపి, ఇల్వలులను దైత్యులా ప్రదేశానికి వచ్చారు. వారు బహుదురాచారులు. బ్రాహ్మణులు చేసే యజ్ఞాలను విధ్వంసం చేసేవారు. ఇద్దరికిద్దరూ గొప్ప మాయావులు. వారు చేసే మాయలలో బ్రాహ్మణ సంహారక భోజన దానమొకటి అదేమనగా వాతాపి ఒక మేకగా మారిపోతాడు. అనేక రకాల భక్ష్య పదార్థాల రూపం కూడా ధరిస్తాడు. ఇల్వలుడు తన ఇంట్లో శ్రాద్ధ కార్యమని చెప్పి బ్రాహ్మణుల నాహ్వానించి వారికి బ్రహ్మాండమైన భోజనాలు పెడతాడు. ఆ భక్ష్య పదార్థాలలోనే వాతాపి కూడా వుంటాడు. భోజన ప్రియులైన బ్రాహ్మణులు తమకు తెలియకుండానే ఆ వాతాపిని కూడా తింటారు. అతిథులంతా భోజనానంతరం విశ్రమిస్తుండగా ఇల్వలుడు బయటికి వచ్చి ‘వాతాపీ వాతాపీ’ అంటూ పిలుస్తాడు. వారి మాయాశక్తి ప్రభావం వల్ల ఆ పిలుపు వినగానే బ్రాహ్మణుల పొట్టలను చీల్చుకొని వాతాపి బయటికి వచ్చేస్తాడు. ఈ పద్ధతిలో వారు చాలామంది బ్రాహ్మణులనూ మునులనూ చంపేశారు. ఇక వారి వంతే రావాలి.

ఒకరోజు భృగు వంశోత్పన్నులైన కొందరు బ్రాహ్మణులతోబాటు అగస్త్య మహర్షిని కూడా వారు భోజనానికి పిలిచారు. అగస్త్యుడు ఆరోజు చాలా ఎక్కువగా తిన్నాడు. ఇల్వలుడు వండినదంతా తినేశాడు. భోజనం చేసి అక్కడే ఇల్వలుని ఇంటిలోనే విశ్రమించాడు. ఇల్వలుడు ఇదివఱకు లాగే బయటి అరుగు మీదికి వచ్చి ‘వాతాపీ వాతాపీ’ అని ఎలుగెత్తి పిలిచాడు. అతడు రాలేదు. ఇతడు కాస్త కంగారుపడి ‘ఏమిరా ఎప్పటికీ రావు? ఆ బాపనోళ్ళ కడుపులు చీల్చుకొని వచ్చెయ్’ అని అరిచాడు.

‘వాడికరాడు’ అని ప్రశాంతంగా చెప్పాడు వాని వెనుకనే వచ్చి నిలచిన అగస్త్య మహాముని. ‘ఓరి దుష్ట దైత్యా! నీ తమ్ముడెప్పుడో నా జఠరాగ్నిలో భస్మమై పైకి పోయాడు. వాడితోబాటు వాడి మాయనీ కాల్చి పారేశాను’ అన్న అగస్త్యముని మాటలు వినగానే ఆయననే మింగెయ్యడానికి నోరు తెఱచుకొని మీదిమీదికి వచ్చాడు ఇల్వలుడు. కాని, అగస్త్యుని కంటి మంటలో పడి వాడు కూడా భస్మమైపోయాడు. మిగిలిన దైత్యులంతా అగస్త్య మహర్షికి భయపడి పగలంతా సముద్రగర్భంలో దాక్కొని రాత్రి బయటకు వచ్చి మునులను భక్షించడం, యజ్ఞ హోమగుండాలను విరగ్గొట్టడం, యజ్ఞ భాండములను పగుల గొట్టడం వంటి దుష్కృత్యాలను చేయసాగారు. ఇక ఇలా కాదని త్రిమూర్తులనే ముందిడుకొని ఇంద్రాది దేవతలు అగస్త్యుని వద్దకు వచ్చి ‘బ్రహ్మర్షి సత్తమా! మీకు సాధ్యం కానిది లేదు. ఈ సముద్ర జలాలన్నిటినీ మాయం చేయండి’ అని వేడుకొన్నారు. సర్వసమర్థుడైన అగస్త్యమహర్షి తనలోనే ఆగ్నేయీ ధారణావధానమును చేసుకొని సముద్ర జలాన్నంతటినీ త్రాగేశాడు. దేవతలు వెంటనే బహిర్గతమై పోయిన దైత్య జాతిని యుద్ధంలో సంహరించారు. అప్పుడు జలచరాల మనుగడ కోసం గంగమ్మ వచ్చి అగస్త్యుడు పానం చేసినంత మేర సముద్రాన్ని నింపింది.

అగస్త్య మహర్షి విషయంలో మరొక కథ ప్రాచుర్యంలో వుంది. క్షీర సాగర మథనవేళ పుట్టిన కాలకూట విషాన్ని శివుడు అలవోకగా పానం చేసి తన కంఠంలో నిలిపాడని విన్నావు కదా! పూర్తి విషాన్ని త్రాగేశాననుకొని శివుడు నిష్క్రమించాడు. ఇంకా కొంత విషం మిగిలిపోయింది. అది క్రమేపీ పెరుగసాగింది. దానిని మాయంజేసి లోకాన్ని రక్షించగలవాడు అగస్త్య మహర్షి ఒక్కడేనని బ్రహ్మ చెప్పగా విని దక్షిణ దిశలో లంక సమీపంలో తపస్సు చేసుకుంటున్న అగస్త్యముని పాదాలపై ‘త్వమేవ శరణం మమ’ అంటూ పడిపోయారు దేవదానవులు. ఆయన వారిని లేవనెత్తి విషయాన్ని గ్రహించి, ఆ విషాన్ని కూడా గ్రహించి తన తపోబల ప్రభావంతో హిమాలయాల్లో ఒక ప్రాణుల్లేని చోట నిక్షిప్తం చేశాడు.

ప్రాచీనకాలంలో జనవృద్ధి బ్రహ్మాండంగా జరిగిపోయి లోకం చాలకపోవడంతో బ్రహ్మ తన శరీరం నుండి మృత్యువుని సృష్టించాడు. అది చాలావఱకు జన సంఖ్యను తగ్గించి ఆ మృత్యువుకే మృత్యువాసన్నమైన నాడు అది అగస్త్యమహర్షిని చంపడానికి వచ్చింది. ఆ మహాతపస్వి కోపంగా చూడడంతో కాలి బూడిదై పోయింది. అపుడు బ్రహ్మ మృత్యువు యొక్క రెండవ రూపమైన వ్యాధిని సృష్టించి వదిలాడు.

దండకారణ్యంలో శ్వేతుడని ఒక రాజుండేవాడు. అదేమి కర్మమో అతనికి అతని మాంసం తింటేగాని ఆకలి తీరేదికాదు. ఎంత తిన్నా మళ్ళా అతని శరీరం మామూలుగా అయిపోయేది! అతడు ధర్మపాలన ద్వారా స్వర్గానికి పోయినా ఈ ఆకలి, స్వమాంసఖాదన బాధలు తీరలేదు. అతడొకనాడు అగస్త్యుని పాదాలపైబడి, ‘ఋషిదేవా! నేను ఎన్నో పుణ్యాలు చేసేను, చాలా దానాలిచ్చాను గాని శ్రాద్ధకర్మలు చేయలేదు. అన్నదాన, జలదానాలు చేయలేదు కాబట్టి క్షుద్బాధ, స్వమాంస భక్షణము నానెత్తిన వ్రాయబడినాయి. మీరే నన్నెలాగైనా రక్షించాలి’ అని వాపోయాడు. దయార్ద్ర హృదయుడైన అగస్త్య మహర్షి రత్నాల ద్వారా తానే స్వయంగా ఆరాజు చేత శ్రాద్ధకర్మలు చేయించాడు. వెంటనే ఆ రాజు బాధలన్నీ తొలగిపోయి దివ్య దేహం లభించింది. స్వర్గంలో సుఖంగా ఉన్నాడు.

ధర్మరాజా! ఒకప్పుడు వింధ్య పర్వతుని మనసులో ఒక ఆలోచన బయలుదేరింది. ఇలా ‘ఆమేరు పర్వతుడు నాకంటె గొప్పవాడేమీ కాదు కదా! ఐనా సూర్యభగవానుడు వానికి రోజూ పరిక్రమ చేస్తాడు. నా చుట్టూ ఎప్పుడూ తిరగడు. ముందాయన గమనాన్ని ఆపేస్తాను. ఆ తరువాత నా కోరికను విన్న వించుకుంటాను’ ఈ ఆలోచనతో ఆయన యెత్తును అనూహ్యంగా పెంచి వేశాడు వింధ్యాద్రి. దేవతలంతా వ్యాకులపడి ఈ వింధ్యా లోచన లోకంలో ఒకవైపు గాఢాంధకారాన్ని శాశ్వతంగా సృష్టించబోతున్నదని తెలుసుకున్న వారై బ్రహ్మసూచన మేరకు మరల వచ్చి అగస్త్యుని ప్రార్థించారు. ‘ప్రభో! తమరు విశ్వంపై దయ వుంచి, సూర్యుని మార్గాన్ని నిరోధించబోతున్న వింధ్య పర్వత రాజేంద్రుని ఆపాలి’ అని ప్రార్థించారు. అగస్త్య మహర్షి దీనివల్ల తనకు వ్యక్తిగతంగా నష్టం వస్తుందని తెలిసీ లోకకల్యాణం కోసం వింధ్యాద్రిని దించడానికి బయలుదేరాడు. వింధ్యపర్వతం వద్దకు పోయి ‘పర్వతోత్తమా! నేను దక్షిణ దేశానికి తీర్థయాత్రలకై బయలుదేరాను. నీవు కాస్త క్రిందికి వంగితే నిన్ను దాటి పోగలను’ అన్నాడు. మహర్షి ఆజ్ఞను పాటించి వింధ్య పర్వతుడు అలాగే చేశాడు. ఆ పర్వతాన్ని దాటాక అగస్త్య మహర్షి మరల ‘పర్వతోత్తమా! నేను తిరిగి వచ్చేదాకా ఇలాగే వుండు’ అన్నాడు. అగస్త్య మహర్షి ఆదేశాన్ని జవదాటే శక్తిలేక వింధ్య పర్వతుడు అలాగే వుండిపోవాల్సి వచ్చినది. అగస్త్య మహర్షి మరలి రాలేదు. సూర్యుని రాకపోకలకు ఎటువంటి అంతరాయమూ ఏర్పడలేదు. లోకానికి రాబోయిన ఉపద్రవం ఆగిపోయింది. కాని మహర్షికి మాత్రం కాశికా విశ్వేశుని దర్శన భాగ్యం దూరమైపోయింది. అందుకే ఆయన అవతార సమాప్తి వేళ ఈ లోకాన్ని విడిచిపోవలసి వచ్చినపుడు ఆకాశంలో దక్షిణ దిశలో భార్యతో సహా ఒక జాజ్జ్వల్యమైన నక్షత్రంగా నిలచిపోయాడు. ఈనాటికీ మనం తలలెత్తి చేతులు జోడించి ఆయనకు నమస్కరిస్తుంటాం. ఆయన ఆనందంగా కాశీవిశ్వేశ్వరుని దర్శిస్తుంటాడు.

ఇలా ఎన్నో అద్భుత లీలలను అగస్త్య మహర్షి చూపించాడు. కుబేరుని పిలచి తన భార్య కోసం సకల భోగాస్పద, ఆనందైశ్వర్య సంపన్నమైన నగరును కట్టించాడనేది కూడ ఒక ఆదర్శభర్తగా అగస్త్యుడు చూపించిన లీలలలో మరొకటి మాత్రమే. ధర్మజా! నీవు కూడా ఆ అగస్త్య భగవానునికి అర్ఘ్య ప్రదానం చేసి అఖండ పుణ్యాన్ని సంపాదించుకో. ఇది ఎలా చేయాలంటే, కన్యారాశిలో సూర్యుని ఏడవ అంశ (5/22) మిగిలి వున్నప్పుడు అగస్త్య భగవానుడు తూర్పున ఉదయిస్తాడు. అప్పుడే ఆయనకి అర్ఘ్య ప్రదానం చేయాలి.

ఆరోజు పొద్దున్నే తెల్లనువ్వులతో స్నానము చేసి తెల్లబట్టలు ధరించి, తెల్లపూల మాలలను అలంకరించుకొని పంచరత్న సహితమైన ఒక స్వర్ణ కలశను స్థాపించాలి. దానిపై అనేక ప్రకారాల భోజ్య పదార్థాలనూ, సప్తధాన్య సహితమైన నేతిపాత్రనూ వుంచాలి ఆ నేతి పాత్రపై జటాధారియూ, కమండలు సహితుడూ, శిష్య పరివేష్టితుడూనగు అగస్త్య మునీంద్రుని స్వర్ణ ప్రతిమను స్థాపించాలి. తరువాత తెల్ల చందనం, మల్లెపూలు, ఉత్తమ ధూపం, దీపనైవేద్యాదులతో ఆయనను పూజించాలి.

ఇప్పుడు అర్ఘ్యప్రదాన విధి మొదలవుతుంది. ఒక వెదురు పాత్రలో ఖర్జూరం, కొబ్బరికాయ, గుమ్మడిపండు, కీరదోస, దోస, కర్కోటక, ఆరవేల్ల, జామ, అనాస, అనార్ నారింజ, అరటిపండ్లు, కుశ, దూర్వ, కాశ, నీలకమలాలు, అంకురితాన్నములను వేసి ఆ పాత్రను మిక్కిలి గౌరవంతో ప్రక్కన పెట్టుకొని, బంగారు, వెండి లేదా రాగి అర్ఘ్య పాత్రను మరింత నమ్రతతో తలపై పెట్టుకొని మోకాళ్ళపై కూర్చుని దక్షిణంవైపు తిరిగి ఈ క్రింది మంత్రాలతో అగస్త్య భగవానునికి ఆదరంతో భక్తిగా అర్ఘ్యమివ్వాలి:

కాశపుష్ప ప్రతీకాశ అగ్ని మారుత సంభవ

మిత్రావరుణాయోః పుత్ర కుంభయోనే నమోఽస్తుతే

వింధ్య వృద్ధి క్షయకర మేఘతోయ విషాపహ

రత్నవల్లభ దేవర్షే లంకావాస నమోఽస్తుతే

వాతాపిర్భక్షితోయేన సముద్రాః శోషితాః పురా

లోపాముద్రా పతిః శ్రీమాన్యోఽ సోతస్మై నమో నమః

యేనోదితేన పాపాని ప్రలయం యాంతి వ్యాధయః

తస్మై నమోఽస్త్వగస్త్యాయ సశిష్యాయ సుపుత్రిణే (ఉత్తరపర్వం 118/69-72)

తరువాత అగస్త్య ప్రతిమను విద్వాంసుడైన శ్రేష్ఠ బ్రాహ్మణునికి దానమివ్వాలి. ఒక పండునుగాని ధాన్యాదులనుగాని ఒక యేడాదిపాటు త్యజించాలి.

ఈ ప్రకారంగా ఏడేళ్ళపాటు అర్ఘ్యాన్నిచ్చిన బ్రాహ్మణుడు చతుర్వేద జ్ఞాతా, సకల శాస్త్ర మర్మజ్ఞుడూ కాగలడు; క్షత్రియుడు సమస్త పృథ్వీలోకాన్ని గెలిచి చక్రవర్తి అవుతాడు; వైశ్యుడు ధన ధాన్య పశు సమృద్ధి నొందుతాడు; శూద్రుడు ధనాన్నీ ఆరోగ్యాన్నీ సమ్మానాన్నీ అందుకోగలడు; స్త్రీలు సౌభాగ్య, బుద్ధి, వృద్ధి, పుత్ర లాభాదులతో వర్ధిల్లగలరు. విధవలు అనంత పుణ్యాన్నీ కన్యలు శ్రేష్ఠపతినీ రోగులు శాశ్వతారోగ్యాన్నీ అగస్త్యుని కర్ఘ్యమిస్తే పొందగలరు. అగస్త్య మహర్షి ఆఖ్యానాన్ని శ్రద్ధగా విన్నవారికి పాపాలు నశించి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది.