4-5 - మ్లేచ్ఛవంశీయ రాజ వర్ణన - మ్లేచ్ఛ భాషాదుల సంక్షిప్త పరిచయం

“మునివరా! మ్లేచ్ఛయజ్ఞాన్ని ప్రద్యోతుడెలా చేశాడు? త్రికాలజ్ఞులు, పౌరాణికులునైన మీరు మాత్రమే చెప్పగలరు. దయచేసి ప్రవచించండి” అని వేడుకొన్నాడు శౌనకుడు చెప్పసాగాడు సూతుడు.

“ఋషివరా! ఒకప్పుడు క్షేమకనందనుడైన ప్రద్యోతుడు హస్తినాపురంలో నుండగా అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేశాడు. ఆతనిని దర్శించగానే ఆనందభరితుడైన ప్రద్యోత మహారాజు విధ్యుక్తంగా ఆయనను పూజించాడు. సుఖాసీనుడై ప్రసన్నుడై వున్న నారదమహర్షి ప్రద్యోతునితో ఇలా అన్నాడు. ‘మహారాజా! మ్లేచ్ఛులవల్ల మరణించిన నీతండ్రి నరకంలో పడిపోయినాడు. నీవు మ్లేచ్ఛయజ్ఞం చేస్తే గాని ఆయనకు నరకం నుండి విముక్తి, ఉత్తమలోక ప్రాప్తి, కలుగవు. కాబట్టి నీవాయజ్ఞం చెయ్యి. ‘

ఈ మాట విన్న ప్రద్యోతుని కనులు క్రోధంతో ఎఱ్ఱబడ్డాయి. వెంటనే అతడు వేదజ్ఞులైన బ్రాహ్మణులను రావించి కురుక్షేత్రం లో మ్లేచ్ఛయజ్ఞాన్ని శీఘ్రమే ప్రారంభించాడు. పదహారు యోజనాలలో చతుష్కోణ యజ్ఞకుండాన్ని నిర్మించి దేవతలను ఆవాహనం చేసి ఆరాజు మ్లేచ్ఛులను హననం (దగ్ధం) చేశాడు. బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి అభిషేకాలు చేయించాడు. ఈ యజ్ఞ ప్రభావం వల్ల అతని తండ్రి క్షేమకునికి స్వర్గప్రాప్తి కలిగింది. ఆనాటినుండి ప్రద్యోతుడు ‘మ్లేచ్ఛహంత’ నామంతో ప్రసిద్ధిచెందాడు. అతని పుత్రుని పేరు వేదవంతుడు.

స్వయంగా కలిపురుషుడే మ్లేచ్ఛరూపంలో రాజ్యపాలన చేశాడు. తరువాత అతడు పత్నీ సమేతంగా నారాయణుని పూజించాడు. దివ్యస్తుతి కూడా చేశాడు. నారాయణుడు ప్రత్యక్షం కాగానే కలి తన బాధను ఇలా వెళ్ళగ్రక్కాడు. ‘స్వామీ! ఆ ప్రద్యోతుడు నా స్థానాన్ని సర్వనాశనం చేశాడు. నా ప్రియ మ్లేచ్ఛులను హననం చేశాడు.’

‘కలీ! ఎన్నో కారణాలవల్ల యుగాలన్నిటిలోకి నీవు శ్రేష్ఠుడవుకాగలవు. ఇకనీదే రాజ్యము. నేను అనేక రూపాలు ధరించి నీకోరికను తీర్చగలను. ఆదాము నామము గల పురుషుడూ, హవ్యవతి (ఈవ్) అను స్త్రీ ద్వారా మ్లేచ్ఛ వంశాలను వృద్ధిచేయగలను’ అని ఆశీర్వదించి భగవంతుడైన శ్రీహరి అంతర్ధానం చెందాడు. నిలువెల్లా ఆనందం కలిగిన కలి నీలాచల పర్వతంపై నివాసమున్నాడు.

వేదవంతమహారాజుకి సునందుడను పుత్రుడుకలిగి రాజ్యమైతే చేశాడు కాని సంతానం లేకుండానే మరణించాడు. ఆ తరువాత ఆర్యావర్తం అన్ని విధాల క్షీణించిపోయింది. మెల్లమెల్లగా మ్లేచ్ఛుల బలం పెరుగసాగింది. నైమిషారణ్యవాసులైన ఎనభై యెనిమిది వేలమంది ఋషులు, మునులు హిమాలయాల నధిరోహించి అక్కడి బదరీ క్షేత్రంలో నివాసముండి పోయి శ్రీహరిగుణ కథన సంకీర్తనాలలో నిమగ్నులైనారు.

మునులారా! పదహారువేల సంవత్సరాల పాటు ద్వాపరయుగం ఎన్నో కీర్తులు చూసింది. కాని ఆ కాలంలోనే శూద్రులూ, వర్ణసంకరులూ రాజులవడం కూడా జరిగింది. ద్వాపరంలో ఇంకా ఎనిమిదివేల రెండువందల రెండు సంవత్సరాలు మిగిలియుండగానే మ్లేచ్ఛదేశాలకు చెందిన రాజుల ప్రభావం ఈ భూమిపై పడసాగింది. మ్లేచ్ఛుల ఆది పురుషుడు ఆదాము, అతని పత్ని హవ్వా కూడా ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని ధ్యానపరాయణులై వుండేవారు. ప్రదాన (ప్రధానకాదు) నగరపు తూర్పుభాగంలో ఈశ్వరుడు నాలుగు క్రోసుల విస్తీర్ణంలో ఒక రమణీయమైన మహావనాన్ని నిర్మించాడు. దేవుడు నిర్మించిన ఈ తోటలోకి కలి వచ్చి పాపవృక్షం క్రిందికి సర్పరూపంలో చేరాడు. నెమ్మదిగా హవ్వ (హవ్యవతి లేదా ఈవ్) వద్దకు చేరాడు. ధూర్తుడైన కలి గూలర (అపరిశుద్ధ) పత్రాలలో దాచబడిన, దూషిత వాయు యుక్తమైన ఫలాన్ని ఆమె చేత మోసపూరితంగా తినిపించాడు. దేవుని ఆజ్ఞ భంగమైనది. దీనివల్ల ఆదాము, హవ్వలకు అనేక సంతతి పుట్టారు గాని అందరూ మ్లేచ్ఛులే అయ్యారు. ఆదాము హవ్వతోడుగా స్వర్గానికేగాడు. అతని శ్రేష్ఠుడైన పుత్రుడు శ్వేతుడను పేర విఖ్యాతుడై నూట పన్నెండు సంవత్సరాలు జీవించాడు. అతని పుత్రుడు అనుహయను వాడు తండ్రి కంటే కొంచెం తక్కువగా (కాలం) శాసనం చేశాడు. అతని పుత్రుడు కీనాశుడు తాతతో సమానంగా అన్నేళ్ళపాటూ జీవించి పాలించాడు. అతడి నుండి వంశానుక్రమంగా మహల్లల, మానగర (ఇతడు తన పేరనొక నగరాన్ని నిర్మించాడు.) విరద, హనూక రాజులు పరిపాలించారు. హనూకుడు విష్ణుభక్తి పరాయణుడు. అతడు ఫలాలను హవనం చేసి ఆధ్యాత్మ తత్త్వజ్ఞానాన్ని సముపార్జించాడు. అందుకే అతడు మ్లేచ్ఛ ధర్మపరాయణుడైనాకూడా దేహాంతంలో స్వర్గప్రాప్తి నొందగలిగాడు. అతడు ద్విజసహజమైన ఆచార వ్యవహారాలను కూడా పాటించినా ఎన్ని దేవపూజలుచేసి, చేయించినా మన విద్వాంసులు చరిత్రకారులు అతనిని మ్లేచ్ఛుని గానే పరిగణించారు. విష్ణుభక్తి, అగ్నిపూజ, అహింస, తపస్సు, ఇంద్రియనిగ్రహం, ఇవి మ్లేచ్ఛ ధర్మాలుకూడా అవుతాయని, మ్లేచ్ఛలు వీటిని పాటిస్తారని మునులు ప్రకటించారు. హనూకుని తరువాత మ్లేచ్ఛవంశంలో క్రమంగా మతోచ్ఛిలుడు, లోమకుడు, (లోమకుడూ స్వర్గప్రాప్తి నొందాడు.) న్యూహుడు జన్మించారు. (ఈ న్యూహుడే నోవా) న్యూహునికి ముగ్గురు కొడుకులు - సీముడు, శముడు, భావుడు. న్యూహుడు ఆత్మధ్యానపరాయణుడు, విష్ణుభక్తుడు. ఒకరోజాయన కలలో విష్ణువు కనబడి “వత్సా! సావధానంగా వుండు. నేటికి యేడవదినాన ప్రళయం రాబోతుంది. ఓ భక్తశ్రేష్ఠా! నువ్వు అందరినీతోడ్కొని ఒక నావపైకెక్కి ప్రాణాలను రక్షించుకో. ప్రళయం తరువాత నువ్వు గొప్ప విఖ్యాత వ్యక్తివైపోతావు. భగవదాదేశం మేరకు న్యూహుడు ఒక పరమదృఢమైన నావను తయారు చేయించాడు. అది మూడు వందల హస్తాల పొడవు, యాభై హస్తాల వెడల్పు, ముప్పది హస్తాల ఎత్తు కలిగి అన్ని జీవులకూ తగినట్లుగా నిర్మింపబడింది. అన్ని ప్రాణులతో, తన వంశజులతో కలిసి విష్ణువునే ధ్యానిస్తూ అతడు నావను అధిరోహించాడు. అప్పుడు ఇంద్రుడు మేఘాలను ఆజ్ఞాపించడంతో బ్రహ్మాండమైన వర్షము, భారీగా, నలుబదిరోజులపాటు ఆగకుండా కురిసింది. సంపూర్ణ భరతఖండము సముద్రంలో కలిసిపోయింది.

ఒక్క హిమాలయాల మీది బదిరీ నారాయణ క్షేత్రం మాత్రం మునిగిపోలేదు. నైమిషారణ్యం నుండి బయలు దేరి వచ్చి అక్కడ చేరిన బ్రహ్మజ్ఞానులైన ఎనభైఎనిమిది వేలమంది మునులు సురక్షితంగా వున్నారు. న్యూహుడు కూడా తన నావలో అక్కడికే వచ్చి చేరాడు. మిగతా ప్రపంచంలో ఏ ప్రాణీ మిగలలేదు. మునులప్పుడు విష్ణుమాయను ఈ విధంగా స్తుతించారు.

‘మహాకాళీ దేవికి నమస్కారములు. దేవకీమాతకు నమస్కారములు. విష్ణుపత్ని లక్ష్మీదేవికీ, రాధాదేవికీ, రేవతి, పుష్పవతీ, స్వర్ణవతీమ తల్లులకు నమస్కారములు. కామాక్షీ, మాయామాతలకు వందనాలు. మహావాయుప్రభావంతో, మేఘముల భయంకర శబ్దాలతో, ఉగ్రజల ధారలతో నిండిన జగత్తును చూసి మాలో దారుణమైన భయం ఉత్పన్నమైంది. భైరవీమాతా! మేము మీ కింకరులము. మమ్మల్ని రక్షించండి’.

దేవికి దయకలిగి వెంటనే జలధారల జడిని ఆపేసింది. ఆ తరువాత హిమాలయ ప్రాంతంలో భూమి ఒక యేడాది కాలానికి నీరంతా తీయగా స్థలరూపానికొచ్చింది. దానికి శిషిణాయనిపేరు. న్యూహుడు అక్కడ స్థిరపడ్డాడు.

శౌనకుడిలా అడిగాడు. “మునీశ్వరా! ప్రళయం తరువాత ఇప్పుడేమి జరుగుతున్నదో దివ్యదృష్టి ద్వారా తెలుసుకొని మాకు చెప్పండి.”

“శౌనకా! న్యూహుని భక్తికి సుప్రసన్నుడై మహావిష్ణువు వాని వంశాన్ని చక్కగా వృద్ధిపఱచాడు. వేదవాక్యాలూ, సంస్కృతమూ కనిపించని భాషగా మ్లేచ్ఛభాషను ఆయన సృష్టించి పోషించాడు. న్యూహుడు ఈ జ్ఞానంతో (లిపులన్నింటికీ బ్రాహ్మీయే మూలమని భారతీయ విశ్వాసము. స్వయంగా మహావిష్ణువే న్యూహ మహారాజు హృదయంలో ప్రవేశించి అతని బుద్ధిని ప్రేరేపించగా నతడు అప్పటికి వున్నలిపిని తిరగేసి కుడిడైపు నుండి ఎడమవైపుకి రావడం మొదలుపెట్టాడు. ఇదే లేఖనప్రక్రియ ఈనాటికీ ఉర్దూ, అరబీ, ఫార్సీ, హిబ్రూలలో కనిపిస్తోంది.) బ్రాహ్మీలిపినుండి దానితో ఏ మాత్రమూ పోలిక వుండని లిపులను సృజించాడు.

న్యూహా తను సృజించిన లిపులను ఒక్కొక్కటిగా తన పుత్రులకిచ్చి అన్ని రకాల అపశబ్దాలనూ వ్రాయించాడు. అతని పుత్రులైన సీమ, శమ, భావల పేరిట సిమ, హామ, యాకూత్ అనే పేర్లతో మూడు భాషలను వ్యవహారంలోకి తెప్పించాడు. భావుడు లేదా యాకూత్ అనే వానికి యేడుగురు కొడుకులు. వారు జుమ్ర, మాజూజ, మాదీ, యునాన, తువలోమ, సక, తీరాస వారు పోయి పరిపాలించిన ప్రాంతాలకు వారిపేర్లే వచ్చాయి. (జుమ్ర పుత్రుల పేర్లు చెప్పబడలేదు. యునాను కొడుకులు: ఇలీశ, తరలీశ, కిల్తీ, హూదా. హాముని పుత్రులు: కుశ, మిశ్ర, కూజ, కనాఆఁ. కుశుని కొడుకులు: సవా, హబీల, సర్వత, ఉరగమ, సవతిక, నిమరూహ్. నిమరూహపుత్రులు ; కలన, సినా, రోరక, అక్వద, బావున, రసనాదేశక.) జుమ్రుని పదిమంది పుత్రుల విషయంలోనూ యునానుని నలుగురు, న్యూహుని ద్వితీయ పుత్రుడైన హామ (శమ) అనువాని నలుగురు పుత్రుల విషయంలోనూ, వారిలో పెద్దవాడైన కుశుని ఆరుగురు కొడుకుల విషయంలోనూ ఇలాగే ఆయా ప్రాంత నామాలేర్పడ్డాయి. అవే తరువాత దేశాల పేర్లయినాయి. కుశుని పుత్రులలో చివరివాడు మహాబలశాలియైన నిమరూహ్. ఇతనికి ఆరుగురు పుత్రులు.”

ఇంతవఱకు చెప్పి సూతమహర్షి భవిష్యద్వర్తమానాలలోకి చూడడానికేమో సమాధిస్థుడై పోయాడు. కొన్ని సంవత్సరాల తరువాత కనులు తెఱచి మరల ఇలా ప్రవచించాడు.

“ఋషులారా! ఇపుడు నేను న్యూహుని పెద్దకొడుకైన సిమ మహారాజు వంశాన్ని వర్ణిస్తున్నాను. మ్లేచ్ఛరాజైన సిముడు అయిదు వందల సంవత్సరాలపాటు ఉత్తమ రాజ్యపాలన నందించాడు. ఆ తరువాత వంశానుగతంగా అర్కుంసదుడు, సింహలుడు, ఇబ్రుడు, నాలుగువందల యేళ్ళు పరిపాలించగా ఇబ్రపుత్రుడు ఫలజుడు రెండువందల నలభైయేళ్ళు మాత్రమే రాజ్యం చేశాడు. అతని పుత్రుడు రఊ రెండు వందల ముప్పది - నాలుగేళ్ళు రాజ్యం చేయగా జూజ యను రఊ పుత్రుడును తండ్రితో సమాన సంవత్సరాలే పాలించాడు. అతని కొడుకు నహూరుడు వీరుడై శత్రురాజులనేకులను జయించి నూట అరవై సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అతని కొడుకు తాహరుడు కూడా తండ్రిలాగే పరిపాలించాడు. అతని పుత్రులపేర్లు అవిరామ, నహూర, హారనులు.

మునులారా! నేనిప్పటికి మ్లేచ్ఛరాజుల పేర్లు మాత్రమే చెప్పాను. వీరంతా సరస్వతీ దేవి శాపం వల్ల మ్లేచ్ఛ భాషలే మాట్లాడుతూ అధమాచార పరులయ్యారు. కలియుగంలో వీరి సంఖ్య విశేషంగా వృద్ధినొందింది. నేను సంక్షిప్తంగానే చెప్పాను. సంస్కృత భాష ఒక్క భారత దేశంలోనే మిగిలింది. అన్యభాగాలలో మ్లేచ్ఛ భాషలే ఆనందానిస్తున్నాయి.

ఓయి భార్గవతనయా! మహామునీ! శౌనకా! కలిగియుగంలో మూడువేల సంవత్సరాలు గడచిన పిమ్మట అవంతీ నగరంలో శంఖ నామకుడైన ఒక రాజు ఉదయించాడు. అప్పటికి మ్లేచ్ఛదేశాల్లో శక వంశ రాజులుండేవారు. వీరెలా అభివృద్ధి చెందారో వినండి. కలియుగంలో రెండువేల సంవత్సరాలు గడిచేనాటికి మ్లేచ్ఛవంశీయులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయారు. విశ్వంలోనే అధికభాగం వారి పాలన క్రిందకి వచ్చియున్నది. రకరకాల మతాలు కూడా పుట్టుకొచ్చాయి. సరస్వతీనదీ తీరమందున్న(మొదట్లో విశ్వమంతటా సంస్కృత భాషయే విరాజిల్లుతుండేది. బలిద్వీపంలో ఇప్పటికీ అలాగే వుంది. సుమత్రా, జావా, జపాన్ ఆది దేశాల్లో కొన్ని భాగాల్లో దీనికి ప్రాచుర్యముంది. బోర్నియో, ఇండోనేషియా, చైనాలలో ప్రాచీన కాలం నాటికే సంస్కృతముంది. మధ్యకాలంలో ఉపేక్షించబడింది. అయితే జర్మనీ, రష్యా, బ్రిటన్ విద్యావంతుల సత్ ప్రయాస వలన ఈ రోజు విశ్వంలోని చాలా విశ్వవిద్యాలయాలలో సంస్కృత భాష చదవబడుతోంది. చెప్పబడుతోంది.)  (గంగకి ఉత్తరంగా, బిజనూరు నుండి ప్రయాగ దాకా, ఉత్తరంలో నైమిషారణ్యం దాకా విస్తరించిన ప్రదేశం.) బ్రహ్మావర్త క్షేత్రమే మనకి పూర్తిగా మిగిలింది. మూశా అనుపేరు గల ఒక వ్యక్తి మ్లేచ్ఛుల మూలపురుషులలో నొకడు. ఆచార్య పీఠమై విలసిల్లాడు. అతడు తన మతాన్ని ప్రపంచమంతటా వ్యాపింపచేశాడు.

కలియుగ ప్రారంభం నుండే భారతదేశంలో దేవపూజా, దేవభాషా తగ్గుతూ వచ్చాయి. మెల్లమెల్లగా ప్రాకృత, మ్లేచ్ఛ భాషల ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. వ్రజభాషా, మహారాష్ట్రీ ఈ రెండూ విశేష ప్రాచుర్యం నోచుకున్న ప్రాకృతాలు కాగా యావనీ మరియు గురుండికా (ఆంగ్లము) మ్లేచ్ఛ భాషలలో ప్రముఖమైనవి. వీటిలో మరల నాలుగు లక్షల దాకా సూక్ష్మభేదాలున్నాయి. ప్రాకృతంలో పానీయం పానీ కాగా బుభుక్షా భూఖ్ అయింది. అలాగే మ్లేచ్ఛ భాషలో పితృశబ్దము పేతర్, ఫాదర్ కాగా భ్రాతృ శబ్దము బాదర్ - బ్రదర్ అయింది. ఇలాగే జాను నిజైన్‌గా, ఆహుతుని ఆజుగా, రవివారాన్ని సన్‌డే, షష్టిని సిక్స్‌టీగా, ఫాల్గునాన్ని ఫిబ్రవరిగా మార్చుకుని పలుకసాగినారు. (షష్టి=60, షష్ఠి=6) భారతదేశంలో అయోధ్య, కాశీ, మథురాది ఏడు పవిత్రపురాలున్నాయి. ఇపుడు అక్కడ కూడా హింస ప్రజ్వరిల్లుతోంది. బందిపోటు దొంగలు, శబరులు, భిల్లులు, మూర్ఖవ్యక్తులు దేశమంతటా అభివృద్ధి చెందుతున్నారు. మ్లేచ్ఛ దేశాల్లో మ్లేచ్ఛ ధర్మాన్ని పాటించేవారు సుఖంగా జీవిస్తున్నారు. ఇదే కలియుగ విశేషత. భారతదేశంలో దాని ద్వీపాల్లో ఇక మ్లేచ్ఛులే సార్వభౌములౌతారు. వారి రాజ్యమే నడుస్తుంది. ఇక మీరు భరతావనినీ వైదిక ధర్మాన్నీ రక్షింపుమని శ్రీహరిని ప్రార్ధించండి”.