భవిష్య మహా పురాణము
అధ్యాయము -32 - బోపదేవచరిత్ర ప్రసంగంలో శ్రీమద్భాగవత మాహాత్మ్యం
సూతమహర్షి ఇలా చెప్పసాగాడు. ‘శౌనకమహామునీ! తోతాద్రిలో బోపదేవుడను బ్రాహ్మణు డొకాయనుండేవాడు. ఆయన శ్రీకృష్ణభక్తుడు, వేదవేదాంగ పారంగతుడు. ఆయన గోప - గోపీ ప్రతిష్ఠితమైన బృందావన తీర్థానికి పోయి అక్కడ శ్రీకృష్ణారాధనను భక్తిశ్రద్ధలతో నిష్ఠగా చేశాడు. ఒక యేడాది ఆవిధంగా తపించిన పిమ్మట బోపదేవునికి శ్రీహరి ప్రత్యక్షమై అతిశయ జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆజ్ఞానం వల్ల అతని హృదయంలో భాగవతకథ ఉద యించింది. శ్రీ శుకమహర్షి పరీక్షిత్తుకి చెప్పిన ఆ సనాతన మోక్ష స్వరూపకథను బోపదేవుడు హరిలీలామృతమను పేరిట మరల వర్ణించాడు. కథాకథనం పూర్తికాగానే జనార్దనుడు, భగవానుడునైన విష్ణువు బోపదేవుని యెదుట సాక్షాత్కరించాడు. ‘ఓ మహామతీ! నీకేం కావాలో కోరుకో” అని అడిగాడు.
‘నమస్కారం భగవన్! మీరు సంపూర్ణ విశ్వంపై అనుగ్రహవర్షాన్ని కురిపించే ఆది మేఘులు. దేవ, పశు, పక్షి, మానవాదులు మీనుండే ఉద్భవించారు. నరకంలో దుఃఖాలనుభవింపవలసిన ప్రాణులన్నీ ఈ కలియుగంలో మీనామ జపమాత్రాన సుఖిస్తాయి. వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమద్భాగవత జ్ఞానాన్ని మీరు నాకు ప్రసాదించారు. ఇపుడు నాకు భాగవత మాహాత్మ్యాన్ని గూర్చిన అవగాహనను ప్రసాదించండి ఇదే నేను కోరుకొనే వరము’ అన్నాడు బోపదేవుడు.
స్వామి ప్రసన్నుడై ‘బోపదేవా! దంభులు, పాఖండులతో నిండిన బౌద్ధరాజ్యం ఉత్తర దేశంలో ఏర్పడిన కాలంలో నొకప్పుడు శంకరభగవానుడు పార్వతీ సమేతంగా దిగి వచ్చి కాశీలోనొక ఉత్తమభూమిలో నివసించాడు. ‘హే సచ్చిదానందా! హే ప్రభో! జగదానందప్రదాతా! మీకు జయమగుగాక ‘ అంటూ ఆనందంగా ప్రణామం చేస్తున్న శివుని చూసి ఆశ్చర్యపడ్డ పార్వతి ‘భగవన్! ఈనాడు మీరెవరినో భగవానుని స్తుతించడం చూస్తున్నాను. మీరు కాక, మీచేతనే పూజించబడే దేవశ్రేష్ఠుడున్నాడా? అని అడిగింది.
‘మహాదేవీ! ఈ కాశీ పరమపవిత్ర క్షేత్రము. సనాతన పరబ్రహ్మ ఇక్కడే తిరుగుతుంటాడు. (ఆయనే) నా ప్రణామానికి ఆయనే యోగ్యుడు. ఇప్పుడిక్కడ నేను భాగవత సప్తాహయజ్ఞాన్ని చేయబోతున్నాను.’ అని వివరించాడు శివుడు.
ఈయజ్ఞ స్థల రక్షణకై చండునీ, గణేశునీ, నందినీ, కొందరు గుహ్యకులనూ శివుడక్కడ స్థాపించాడు. తరువాత స్వయంగా ధ్యానంలో కొంతసేపుండి అప్పుడు పార్వతికి యేడురోజుల పాటు భాగవత కథను చెప్పాడు. ఎనిమిదవరోజు కూడా ఆయన చెప్తూ పార్వతీదేవి వైపు చూస్తే ఆమె నిద్రలో వుంది. ‘దేవీ! నువ్వెప్పుడు నిద్రలోకి జారుకున్నావు? భాగవత కథనెంతవఱకూ విన్నావు?’ అని శంకరుడు ఆదరంగానే అడుగగా నామె ‘క్షమించండి దేవా! నేను క్షీర సాగర మథనం దాకా కలిగియున్న విష్ణుచరిత్రను శ్రవణం చేశాను’ అని చెప్పింది.
ఆ క్షేత్రంలోనే ఒక చెట్టు తొఱ్ఱలో చిలుకరూపంలో స్థితుడై వున్న శ్రీశుకమహర్షి శివుడు చెప్పిన భాగవతకథనంతటినీ విని ఆ పుణ్యం వల్ల అమరుడై నిలిచాడు. ఇపుడు, ఓయి బోపదేవా! నా ఆదేశం మేరకు ఆశుకదేవుడు నీ హృదయంలో ప్రవేశిస్తాడు. భాగవత మాహాత్మ్యమంతా తనంత తానుగానే నీకు అవగతమైపోయి నీ వాక్కు ద్వారా నిర్గమిస్తుంది. నీవు వెంటనే విక్రమాదిత్యుని తండ్రియైన గంధర్వసేనుని వద్దకుపోయి, నర్మదాతటంపై పరివేష్టించి ఆయనకు భాగవతాన్ని వినిపించు. అన్ని దానాల్లోకి హరిమాహాత్మ్య విషయక దానము సర్వోత్తమమైనది. విష్ణుభక్తులలో ప్రతియొక్కడూ దీనిని సత్పాత్రులకు వినిపించాలి. ఆకలి గొన్నవానికి అన్నదానం చేస్తే వచ్చే పుణ్యంకన్న కూడ హరికథలను వినిపించుట గొప్పదైన పుణ్యం’ అని చెప్పి విష్ణువు అంతర్ధానం చెందగా బోపదేవుడు ప్రసన్నమనస్కతతో నర్మద వైపు పయనించాడు.”