143 - మహాశాంతి విధానం

ధర్మరాజా! మహారాజులకు కల్యాణకారిణియు భయంకర విఘ్నాలను దూరం చేయు నదియునగు మహాశాంతి విధానాన్ని ఆలకించు. అభిషేకములప్పుడు, యాత్రల్లోనూ, పీడకలలు వచ్చినపుడు, అపశకునాలు కనిపించినపుడు, పిడుగులు, ఉల్కలు పడినప్పుడు, జన్మనక్షత్రంలో కేతువు ఉదయించినపుడు, భూకంపం వచ్చినపుడు, ప్రసూతి కాలంలోనూ, మూలగండాంతంలోనూ, కవలలు కలిగినపుడునూ, రాజుగారి ఛత్రము ధ్వజము పడిపోయినపుడూ, క్రూరగ్రహదృష్టి పడినపుడూ, జన్మ సమయంలో దుష్టగ్రహ కూటమి యేర్పడినపుడునూ, లగ్నకుండలిలో ద్వాదశ, చతుర్ధ, అష్టమ స్థానాల్లో బృహస్పతి, శని, సూర్యుడునూ మంగళుడునూ చేరినప్పుడూ, యుద్ధ సమయాల్లో, వస్త్ర, ఆయుధ, మణి, కేశ, గో, అశ్వములు నశించినపుడును రాత్రిపూట ఇంద్ర ధనుస్సు కనబడినపుడూ, సూర్యచంద్ర గ్రహణాలలోనూ, రాజులుగాని తత్సములుగాని ఈ మహాశాంతిని చేయించి దేశాన్ని కాపాడాలి. దీనివల్ల అన్ని దుర్నిమిత్తాలూ శాంతిస్తాయి. ఉత్తమవర్ణంలో ఉత్పన్నులై, శీలసంపన్నులైన వైదిక బ్రాహ్మణులచే ఈ మహాశాంతిని చేయించాలి. విశేషించి ఋగ్యజురథర్వ వేదజ్ఞాత, పవిత్రజ్ఞాన సంపన్నుడు, జపహోమపరాయణుడు, అనేక కృచ్ఛ్రాది వ్రతాల ద్వారా శుద్ధి చెందిన బ్రాహ్మణుడు ఈ మహాశాంతికి ప్రశస్తుడైన కర్మిష్ఠిగా భావింబడతాడు. ముందుగా భగవంతునారాధించి ఈ క్రియను మొదలు పెట్టాలి.

పది లేదా పన్నెండు హస్తాల సుందర మండపాన్నొక దాన్ని నిర్మించి దాని మధ్యలో నాలుగు హస్తాల ప్రమాణంలో నొకవేదినీ, ఆగ్నేయములో ఒక హస్త ప్రమాణంలో నొక సుందర కుండాన్నీ యేర్పాటు చేయాలి. అది మూడు మేఖలలతో యోనితో విభూషితమై వుండాలి. మండపాన్ని పేడతో అలికి చందన, మాలా, తోరణాదులతో అలంకరించాలి. వేదిపై ఆగ్నేయాది మూలలో క్రమంగా నాలుగూ, మధ్యలో నొకటీ మొత్తం అయిదు కలశలను స్థాపించాలి. వాటిని పంచపల్లవాలతో, సర్వౌషధులతో, పంచరత్నాలతో, రోచన చందన సప్తమృత్తికాదులతో, ధాన్యాలతో, పుణ్యతీర్థ జలాలతో నింపాలి. పంచగవ్యాలను బ్రహ్మ - కూర్చ విధానంలో తయారుచేయించాలి. తరువాత వైదిక మంత్రాలతో కలశలను అభిమంత్రితం చేసి వాటిని పూజించాలి. మధ్యలోనున్న కుంభాన్ని రుద్ర కుంభమంటారు.

స్వస్తి వాచనములు చేసి అగ్నిని రగుల్కొల్పాలి. అగ్నిందూతం (యజు. 22/17) అనే మంత్రము ద్వారా కుండంలో అగ్నిని స్థాపించాలి. హిరణ్యగర్భః (యజుం 13/4) అనే మంత్రంతో బ్రహ్మాసనాన్ని స్థాపించాలి. అగ్నిపూజనం తరువాత ఆజ్య (నేతితో) సంస్కారం చేయాలి. ఆ తరువాత విధిపూర్వకంగా యజ్ఞీయ ద్రవ్యాలను యథావత్‌గా స్థాపించాలి. దీని తరువాత పురుషసూక్త (యజుం 31/1-16) పారాయణం (పాఠంవలె చదవడం) చేస్తూ చరు (హోమగుండంలో పక్వం చేయబోయే అన్నం)ను సిద్ధం చేసి నేలపై వుంచాలి. తరువాత పదునెనిమిది శమీ, ఏడు పలాశ సమిధలతో కుండలలో అగ్నిని పట్టించాలి. ఆఘూర, ఆజ్యభాగ సంజ్ఞక హవనాలు చేసి ఆపై జాతవేదసేం (ఋం 1/19/1) అను ఋక్కు ద్వారా నేతితో ఏడు ఆహుతులనివ్వాలి. మరల అదే ఋక్కుతో స్థాలీపాక ద్రవ్యంతో హవనం చేయాలి. తరత్ సమందీం (ఋం 9/58/1-4) అనే సూక్తంతో నాలుగు పర్యాయాలు హవనం చేసి యమాయ సోమః (ఋం 10/14/13) అనే మంత్రానికి స్వాహా అనే మాటను కలుపుతూ ఏడు ఆహుతులివ్వాలి. తరువాత ఇదం విష్ణుర్విం (యజుం 5/15) అనే మంత్రంతో ఏడుమార్లు ఆహుతులివ్వాలి. తరువాత ఇరవైయేడు నక్షత్రాలకూ ఒక్కొక్కటిగా ఇరవైయేడు ఆహుతులనివ్వాలి. అనంతరం యత్కర్మణాం ద్వారా హవనాలిచ్చి స్విష్టకృత్ హవనమును గావించాలి. అప్పుడు నేయి తిలలూ వేస్తూ గ్రహహోమాన్ని గావించాలి. తరువాత ప్రాయశ్చిత్త నిమిత్తక హవనం చేసి హోమ కర్మను సమాప్తం చేయాలి.

తరువాత యజమానునికి గోచరించిన దుర్నిమిత్త శాంతికై శ్రేష్ఠ బ్రాహ్మణుడు అతనికి కలశలలోని నీటితో ఒక్కొక్క కలశకు ఒక్కొక్క మంత్రం చదువుతూ అభిషేకం చేయాలి.

మొదటి కలశ - సహస్రాక్షేణం (ఋం 10/161/3)

రెండవ కలశ - శతాయుషాం ఇవ్వబడలేదు

మూడవ కలశ - సజేషాం (ఋం 3/47/2)

నాలుగవ కలశ - విశ్వానిదేవం (ఋం 5/82/5)

అయిదవ కలశ - ఋతమస్తుం (ఇవ్వబడలేదు)

తరువాత నమోఽస్తు సర్వభూతేభ్యః అనే మంత్రం ద్వారా దిశలకు బలినైవేద్యాల నివ్వాలి. యజమాని స్నానం చేస్తున్నపుడు బ్రాహ్మణులంతా శాంతి మంత్ర పాఠం చేస్తుండాలి. నాలుగువైపులా శాంతి జలాలను ధారగా పోయాలి. చివర మరల పుణ్యాహ వాచన పూర్వకంగా శాంతికర్మను సంపన్నం చేయాలి.

యజమాని బ్రాహ్మణులందరికీ యథాశక్తి భూ, స్వర్ణ, వస్త్ర, శయ్య, ఆసన దానాలిచ్చి దక్షిణలివ్వాలి. అనాథలకూ వికలాంగులకూ కడుపునిండా అన్నం పెట్టాలి. దీనివల్ల ఆయుర్వృద్ధీ, శత్రువుపై తత్‌క్షణ విజయం సిద్ధిస్తాయి. ధర్మరాజా! ఒక్క విషయం గుర్తుంచుకో.

అహింసకస్య దాంతస్య ధర్మార్జిత ధనస్యచ।

దయాదాక్షిణ్య యుక్తస్య సర్వేసానుగ్రహా గ్రహాః ॥ (ఉత్తరపర్వం 143/45)

హింస చేయని వాని, ఇంద్రియ నిగ్రహుని, ధర్మంగానే ధనార్జన చేసేవాని, దయా దాక్షిణ్యాలు గలవానిపట్ల గ్రహాలెప్పుడూ అనుగ్రహంతో సానుకూలంగానే వుంటాయి.”