భవిష్య పురాణము

17 - ప్రతి పత్కల్ప నిరూపణలో బ్రహ్మగారి పూజ - అర్చన - దాని మహిమ

“మహారాజా! పూర్వ కల్పాంతమందు జంగమ స్థావరాత్మకమైన సంపూర్ణ జగత్తు నశించిపోయినపుడు అంతటా జలమే నిండి వుండినది. ఆ సమయంలో దేవతా శ్రేష్ఠుడైన చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా ప్రకటితుడై అనేక లోకాలను, దేవగణాలను, వివిధ ప్రాణులను సృష్టించాడు. ఈప్రజాపతి బ్రహ్మనే దేవతలు పితగానూ, అన్యజీవులు పితామహునిగాను కీర్తిస్తూ వస్తున్నారు. సదా నిరంతరాయంగా పూజిస్తున్నారు. సృష్టి, స్థితి, లయ కారకుడైన ఈయన మనసు నుండి రుద్రుడు, వక్షము నుండి విష్ణువు ఆవిర్భవించారు. ఈయన నాలుగు ముఖాల నుండే వేదాలు పుట్టినవి. అందరు దేవతలు, దైత్య, గంధర్వ, యక్ష, రాక్షస, నాగ గణాలవారూ ఈయన్ని పూజిస్తారు. ఈ జగత్తంతయు బ్రహ్మమయము, బ్రహ్మలోనే నిబిడితము కావున ఆయన అందరికంటే నెక్కువగా పూజ్యుడు. రాజ్యము, స్వర్గము,మోక్షము - ఈ మూడు మహా విషయాలూ ఆయనను సేవించడం ద్వారా ప్రాప్తిస్తాయి. కాబట్టి, ఎల్లప్పుడూ, ప్రసన్నచిత్తంతో, యావజ్జీవిత పర్యంతమూ నియమాను సారంగా బ్రహ్మను పూజించేవాడు స్వయంగా బ్రహ్మలాగే పూజకి పాత్రుడవుతాడు. బ్రహ్మకోసమొక పూజామందిరాన్నేర్పాటుచేసి అందులో విధి పూర్వకంగా బ్రహ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వానికి యజ్ఞ,తప, దాన, తీర్థాదులు కోటి చేసిన ఫలితం వస్తుంది. అటువంటి మహాపురుషుని దర్శన, పాద స్పర్శలే ఏ వ్యక్తికైనా ఇరువది యొక్క తరాలను ఉద్ధరించ గలవు. బ్రహ్మభక్తులు బ్రహ్మలోక నివాసులౌతారు. అక్కడ పెద్దకాలముండిన పిమ్మట జ్ఞానయోగమాధ్యమంలో ముక్తిని పొంది తరించవచ్చు. లేదా వారి ఇచ్ఛానుసారము, మానవలోకంలో చక్రవర్తియైన రాజుగానో, వేదవేదాంగ పారంగతుడైన బ్రాహ్మణునిగానో జన్మించవచ్చు. వీరికి కఠోర నియమాలతో ఏ యజ్ఞాలు యాగాలు పూజలూ అవసరం లేదు. బ్రహ్మపూజ ఒక్కటే వారి యొక్క సర్వవాంఛలనూ తీరుస్తుంది.

బ్రహ్మమందిరంలో చిన చిన్న జీవులకు హాని గాని, భయం గాని కలుగకుండా, తనంతట తానుగా, మెలమెల్లగా, పరమశుభ్రంగా దానిని చీపురుతో తుడిచి నిర్మల జలంతో లేపనం చేసే వానికి, ఒక రోజుకే చాంద్రాయణవ్రత ఫలప్రాప్తి కలుగుతుంది. ఒక పక్షం రోజులపాటు పై విధంగా బ్రహ్మ మందిరాన్ని శుభ్రపరచేవాడు మరణానంతరం బ్రహ్మలోకానికి పోయి చాలా కాలముండి మరల భూమిపై జన్మించునపుడు సర్వ సద్గుణసంపన్నుడై, చతుర్వేదపండితుడై, ధర్మాత్ముడైన మహారాజుగా జన్మిస్తాడు.

సమాసక్తం యథాచిత్తం జంతోర్విషయ గోచరే

యద్యేవ బ్రహ్మణి న్యస్తం కోనముచ్యేత బంధనాత్ (బ్రాహ్మ 17/14)

కామక్రోధాలలో మగ్నులై పోయి చెడిపోతున్నారు. గాని అదే మగ్నత బ్రహ్మ ధ్యానంలో కలిగిననాడు ఇక చెడిపోయే వాడెవడు?

బ్రహ్మ సమానుడైన దేవతగాని, గురువుగాని, బ్రహ్మసమమైన జ్ఞానం గాని తపం గాని లేవు.

ప్రతిపదాతిథిన మొదలుపెట్టి సర్వ తిథులలోనూ భక్తి పూర్వకంగా బ్రహ్మదేవుని పూజించి, పూర్ణిమ నాడు విశేష పూజనాచరించాలి. ఘంట, శంఖము, భేరీ నినాదాలతో స్తుతి చేస్తూ హారతినివ్వాలి. ఇలా ఒక వ్యక్తి ఎన్ని పర్వ దినాలలో హారతినిస్తాడో అన్నివేల యుగాలపాటు బ్రహ్మలోక నివాస ప్రాప్తి పొందుతాడు.

ఇక బ్రాహ్మస్నానం. కపిల గోవు యొక్క పంచగవ్యాలనూ, కుశదర్భలచే పవిత్రీకరింపబడిన శుద్ధ జలాలనూ ఉపయోగించి వేద మంత్రాలను పఠిస్తూ బ్రహ్మదేవునికి చేయించేది పరమ పుణ్యప్రదమైన బ్రాహ్మస్నానం. ఇది అన్ని ఇతర పుణ్యస్నానాలకు నూరు రెట్లు పుణ్యాన్నిస్తుంది. యజ్ఞాలకూ, అగ్ని హెూత్రాది కార్యక్రమాలకూ అగ్రవర్ణుడు కపిల గోవు నొకదానిని (కనీసం) కలిగి వుండాలి. బ్రహ్మదేవుని ప్రతిమకు కపిల గోవు నెయ్యితో అభ్యంగన స్నానం చేయించాలి. దీనివల్ల కోటి పాత జన్మల్లో చేసిన పాపం నశిస్తుంది. ప్రతిపాదక తిథినాడు చేయించిన స్నానం వల్ల ఇరువది యొక్క తరాలు తరిస్తాయి. బ్రహ్మదేవుని కపిల క్షీర స్నానం చేయించడం మరింత పుణ్యప్రదం. దానివలన సువర్ణ వస్త్రాలతో అలంకరించబడిన పదివేల సవత్స గోవులను వేదజ్ఞులైన బ్రాహ్మణులకు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. బ్రహ్మకు ఒక మారైన క్షీరస్నానం చేయించిన వానికి బంగారు విమానంలో బ్రహ్మలోకానికి పోయే భాగ్యం కలుగుతుంది. పెరుగుతోనైతే విష్ణులోకమూ, తేనెతోనైతే ఇంద్రలోకమూ, చెఱకురసం తోనైతే సూర్యలోకమూ ప్రాప్తిస్తాయి. నిర్మలమైన శుద్ధజలంతో బ్రహ్మదేవునికి నిత్యస్నానం చేయించేవానికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. నీటిని గుడ్డ ద్వారా పోసి బ్రహ్మకు స్నానం చేయించేవారు ఎల్లప్పుడూ తృప్తిగా జీవిస్తారు. సంపూర్ణ విశ్వమే వారికి వశీభూతమై వుంటుంది. సమస్తమైన ఔషధాలతో స్నానం చేయించిన వారికి బ్రహ్మలోకము, చందన జల స్నానానికి రుద్రలోకము, సర్వ సుగంధపుష్పాలతో ముఖ్యంగా కమల, నీలకమల, పాటల, కనేర పూలతో స్నానానికి బ్రహ్మలోకము ప్రాప్తించడమేకాక ఆ లోకంలో పూజితులయ్యేటంత ప్రతిష్ఠ లభిస్తుంది. కర్పూర, అగరు మిశ్రిత జలంతో బ్రహ్మకు స్నానం చేయించినా, నూరు మార్లు గాయత్రితో అభిమంత్రితమైన జలంతో చేయించినా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. శీతల జలంతో కాని కపిల గోవు యొక్క గోరు వెచ్చటి పాలతో గాని, స్నానం చేయించి, వెంటనే నేయితో కూడా చేయించిన వారు పాపముక్తులౌతారు. ఈ మూడు స్నానాలనూ భక్తి పూర్వకంగా కొన్నాళ్ళు చేయించి పూజ కూడా చేసిన వానికి అశ్వమేథయజ్ఞం చేసిన ఫలం దక్కుతుంది. సువర్ణ కలశాలతో బ్రహ్మస్నానం చేయించిన వానికి కోటి అశ్వమేధాల ఫలం దక్కుతుంది. రజతమైతే లక్ష, లోహమైతే నూరు.

పవిత్ర వస్త్రాన్ని ధరించి, ఆసనంపై కూర్చొని, సంపూర్ణంగా అన్ని వ్యాసాలు చేసి, నాలుగడుగుల విస్తీర్ణంలో అష్టదళ కమలాన్ని నిర్మించి, దాని మధ్య నానావర్ణయుక్తమైన ద్వాదశ దళయంత్రాన్ని వ్రాసి పంచ వర్ణాలతో దానిని నింపి మరల గాయత్రి మంత్రాక్షరాలతో న్యాసం చెయ్యాలి. ఇది బ్రహ్మకి స్నానం చేయించగానే పూజకి ముందు చెయ్యవలసిన కార్యక్రమం. పూజ చేసిన పిమ్మట ఓంకారాన్నుచ్చరిస్తూ, పీఠస్థాపన చేసి తేజ స్వరూపి బ్రహ్మదేవుని ఆవాహన చేయాలి. పద్మంలో కూర్చొని నాలుగు ముఖాలతో వెలుగుతూ, చరాచర విశ్వాన్ని సృష్టించే బ్రహ్మదేవుని ధ్యానిస్తూ పూజ చేయాలి. ఇలా ప్రతిపదాతిథినాడు భక్తిపూర్వకంగా, గాయత్రిమంత్ర సహితంగా పరమేష్టిని పూజించేవాడు చిరకాలం బ్రహ్మలోకంలో నివసించగలడు.