205 - సదాచార ధర్మ నిరూపణం

“పరంధామా! ఈ నాడు నీ అనుగ్రహం వల్ల నేను ప్రతి పదాది తిథులలో చేయవలసిన ధర్మకార్యాలన్నిటినీ వినగలిగాను. అన్ని రహస్యాలతో మంత్రములతో బాటు వ్రత, దానాదులు ప్రారంభం నుండీ ఉద్యాపన దాకా కూలంకషంగా తెలుసుకోగలిగాను. యజ్ఞయాగాదులు, దానధర్మాలు, స్నానవిధులు, ఉత్సవాలు, ఇష్టాపూర్త కర్మలు - వంటి విషయాలపై కూడా జ్ఞానాన్ని పెంపొందించుకున్నాను. అయినా, మధుసూదనా! మీరెందరో దేవతల నానాత్వ ప్రదర్శనను చేశారు. వేరు వేరు మంత్రాలతో వేరు వేరు దేవతలనెలా మెప్పించాలో చెప్పారు. మరి, ధ్యాన యోగ పరాయణులైన వ్యాసాది మహర్షులు కేవలం అవ్యయ, సర్వగత, నిర్వికార, ఏకైక పరమాత్మనే వర్ణించారు. ఇందులో రహస్యమేమి? ఇంకా మీ ద్వారా వర్ణాశ్రమ ధర్మ నిరూపణ జరిగితే విని తరించడం కోసం నేను, ఈ మునులు, సభాసదులే కాదు లోకమే ఎదురుచూస్తోంది. మహాత్మా! ఈ విషయాలపై మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి’ అని అడిగాడు. అందరికోసం ఒక్కడూ నిలిచే అలవాటున్న ధర్మరాజు. “మహారాజా! వ్రతాల, దానాల సారాంశమే ఇంతవఱకూ వివరింపబడింది. విశేష వర్ణనం చేయాలంటే మహాదేవి సరస్వతీ దేవికే సాధ్యం. అన్ని వర్ణాశ్రమాలకూ సామాన్య ధర్మం విఘ్నరహితంగా సర్వకల్యాణాలతో జీవించడం. ఇప్పటిదాకా వర్ణింపబడిన దేవతలందరూ మూలతః ఒక పరమాత్మ యొక్క రూపాలే. బ్రహ్మయే హరి, హరియే మహేశ్వరుడు, మహేశ్వరుడే సూర్యభగవానుడు. ఆయనే అగ్ని, కార్తికేయుడు, వినాయకుడు. ఆయన మరొక తత్త్వమే శక్తి. గౌరీ, సరస్వతీ, మహాలక్ష్మీ ఇవన్నీ ఆ శక్తియొక్క భిన్న రూపాలే. అందుకే మూలతః తత్త్వమొకటే. భూమిలో అగ్ని, వాయువు, జలం అన్నీ వున్నా భూమి అనే మాటలనే వాడుతున్నాం కదా! పారమార్థిక దృష్టితో ఆలోచిస్తే భేదమున్నదనే విషయమే ఉండదు. ఎందుకంటే భేదమే లేదు కాబట్టి.

కౌంతేయా! వేదధర్మాన్ననుసరిస్తూ ఎవరే దేవతాశ్రయాన్ని కోరి వ్రతాలు చేసినా దానాలిచ్చినా అవి మూలతః ఒకే పరమాత్మ ఉపాసనా విధాలు కాబట్టి ఆయననే చేరతాయి. నేను చెప్పిన వ్రతాలూ దానాలూ అన్నీ కూడా సదాచారులకే ఫలిస్తాయి. దురాచారులకు కాదు. ఆచారహీనులైనవారు చేసే పనిని ఆరు అంగాలచే, అధీతమైన వేదం కూడా పవిత్రం చేయలేదు. అండము నుండి బయటపడి రెక్కలు చాచి ఎగిరేపక్షి అండమును వదలి వేసినట్లు ఆచారహీనుని నోటినుండి చదవబడిన వేదాలు అతనిని వదలివేస్తాయి.

ఆచార హీనం నపునంతి వేదా

యద్యవ్యధీతాః సహషడ్భిరంగై

ఛందా స్యేనం మృత్యుకాలే త్యజంతి

నీడం శకుంతా ఇవ జాత పక్షాః (ఉత్తర పర్వం 205/17)

వసిష్ఠ గౌతమాది

ధర్మ సూత్రాల్లోనూ

అనేక పురాణాల్లోనూ

ధర్మ శాస్త్రాల్లోనూ

ఇదే శ్లోకం కనిపిస్తున్నది.

ఎలాగైతే కపాలంలో పోసిన నీరు, కుక్క చర్మంతో చేసిన పాత్రలో పోసిన పాలు స్థానదోషం వల్ల అశుద్ధాలైపోతాయో అలాగే ఆచారహీనునిలోని మానవత్వం కూడ అపవిత్రమై పోతుంది. కాబట్టి ఎంత ప్రయత్నాన్నయినా చేసి ఆచారాన్ని రక్షించుకోవాలి. ధనం ఉన్నా పోయినా మంచిమనిషి గౌరవింపబడతాడు. అతని స్థాయి జనాల హృదయాల నుండి పడిపోదు. ఆచారవంతుడు ఆచారహీనుడై పోతే మాత్రం అన్ని విధాల పడిపోతాడు. మరి లేవడు. ఆచారమే ధర్మము. ఆచారమే వర్ణము. అది పోయినవానికి ధర్మమూ, వర్ణమూ కూడా పోతాయి. అధమ వర్ణమువాడు అన్ని వేదాలూ చదువుకొని అన్ని ఆచారాలూ పాటించిననాడు ఉత్తమ వర్ణం వానిలాగే చూడబడతాడు. కులమంటే గట్టు. జన్మతో వచ్చే కులం ఆ ధర్మాన్ని పాటించనినాడు నిలవదు. ధర్మం వల్ల నిలబడేదే కులం. దానికి ఆచారం వల్ల వచ్చేది గౌరవం. అది వ్యక్తిని ‘ఇక్కడా అక్కడా’ కూడా సుఖపెడుతుంది.

కపాలస్థ యథాతోయం

శ్వదృతౌవా యథా పయః

దృష్టం స్యాత్ స్థాన దోషేణ

 వృత్త హీనే తథా శుభం

వృత్తం యత్నేన సంరక్షేద్

విత్తమేతి ప్రయాతి చ

అహీనో విత్తతో హీనో

వృతతస్తు హతో హతః

ఏవమాచార ధర్మస్య మూలం రాజన్ కులస్యచ

ఆచారాద్ధి చ్యుతో జంతుర్న కులీనోన ధార్మికః

కింకులేనో పదిష్టేన విపులేన దురాత్మనాం

కృమయః కిం నజాయంతే కుసుమేషు సుగంధిషు

హీనజాతి ప్రసూతోఽపి శౌచాచార సమన్వితః

సర్వధర్మార్ధ కుశలః సకులీనః సతాం వరః

నకులం కులమిత్యా హురాచారః కులముచ్యతే

ఆచారకుశలో రాజన్నిహ చాముత్ర నందతే (ఉత్తరపర్వం 205/18-23)

ధర్మరాజా! ఆచారం నుండియే ధర్మం ఉత్పన్నమవుతుంది. సంతులు, సత్పురుషులు, ఋషులు ఏది చెప్తారో, ఏది చేసి చూపిస్తారో అదే ఆచారం సదాచారమవుతుంది. ఎవరైనా స్వశుభాన్నీ లోకకల్యాణాన్నీ కోరుకునేవారు తప్పక తెలుసుకొని పాటించవలసింది సదాచారాన్నే. సదాచారం వల్ల దోషాలూ, పాపములూ నశిస్తాయి. సదాచారవంతులని తెలిస్తేచాలు, వారిని చూడకపోయినా, వారితో పరిచయం లేకపోయినా త్రికాలాల్లో త్రిలోకాల్లో వారిని పూజిస్తూనే వుంటాము. సుశ్లోకుడైన శ్రీరామునీ, ధర్మాత్ములైన నలునీ, నిన్నూ ఈ లోకం ఎప్పటికీ గౌరవిస్తూనే వుంటుంది. ఏదైనా ఆచరణ విషయంలో అనుమానం వస్తే మీరెలా చేశారో చూసుకొని అలాగే ఆచరిస్తుంది. సదాచారవంతులే అనంతర కాలానికి ఆదర్శపురుషులవుతారు. నాస్తికులూ, ఈశ్వరీయ ఆస్థ లేనివారూ, గురువులనూ శాస్త్ర నియమాలను ఉల్లంఘించేవారూ, అధర్మపరులూ - ఇలాటివారు దురాచారులనబడతారు. వారెంత సంపన్నులైనా ఈ లోకానికి సంబంధించినంత వఱకూ చచ్చిన వారికిందే లెక్క సంపదలు లేకపోయినా, కొన్ని మంచి లక్షణాలు అలవడకపోయినా సదాచారులైన వారిని లోకం గౌరవిస్తుంది. భగవంతుడు కూడా సదాచారుల కోరికలను పూర్తిగా తీరుస్తాడు.

మనిషన్నవాడు బ్రాహ్మీవేళనే (తెల్లవారు జాము నాలుగున్నర) పక్క మీది నుంచి లేవాలి. ధర్మార్ధాల గూర్చి ఆలోచించాలి. బ్రాహ్మణుడు, అగ్ని, సూర్యుడు, గోవు వీటికెదురుగా మల మూత్ర విసర్జన చేయరాదు. పగలు ఉత్తరం వైపు, రాత్రి దక్షిణం వైపు తిరిగి ఆ రెండు పనులూ చేసుకోవాలి. ప్రాతః సంధ్య, సాయంసంధ్య వందనాలను మౌనంగా శ్రద్ధగాచేసుకోవాలి. సూర్యుని ఉదయిస్తున్నపుడూ అస్తమిస్తున్నపుడు చూడకూడదు. సంధ్య వార్చని బ్రాహ్మణుని రాజు గౌరవించరాదు. వానిచే శూద్రపు పనులను చేయించాలి. గ్రామమధ్యం, ఆశ్రమం, తీర్థం, క్షేత్రం, రహదారి, దున్నబడిన పొలం, గోశాల వంటి గౌరవ్య ప్రదేశాలలో మూత్ర విసర్జన చేయరాదు. జలాశయం మధ్యలో నీటిక్రింద వున్న మట్టి, ఆశ్రమం, పిల్లి కన్నం, అపవిత్ర స్థానంలలో మట్టిని శౌచక్రియలలో వాడకూడదు.

దేవతాదుల పూజ, గురువులకు అభివాదము, భోజనము ఆచమనం చేసిన తరువాతనే చేయాలి. నురగలు లేని, సువాసనగల, నిర్మల జలంతో తూర్పు లేదా ఉత్తరం వైపు తిరిగి ఆచమనం చేయాలి. ధర్మార్ధ కామాలను త్రివర్గాలంటారు. ఈ త్రివర్గ సంపాదనమే గృహస్థునికి ఐహిక, పారలౌకిక సిద్ధులనిస్తుంది. ప్రతి మనిషీ తన న్యాయార్జితమైన సంపాదనలో సగం భోజన, వ్యవహార, నిత్య నైమిత్తిక కర్మలకు వ్యయపఱచాలి. నాలుగవ వంతు భాగాన్ని పరలోక సంబంధి పుణ్యకార్యాలకు వినియోగించాలి. ఒక పావువంతును దాచాలి. ధనం కోసమే బ్రతకకూడదు. అలాగని ధనాన్ని నిరాదరణా చేయకూడదు. పుణ్యకార్యాలకు కూడా ధనం కావాలి కదా! పూర్వాహ్ణ కాలంలోనే క్షురకర్మ, దంతధావనం, నిత్యపూజ వంటివి జరిగిపోవాలి. ఇల్లు తుడుచుకొని కసవును ఇంటికి బాగా దూరంగా వేయాలి. అది ఏ ఇంటికో దగ్గర కాకూడదు.

మట్టిపెళ్ళలను విరగ్గొట్టేవారూ, గడ్డిపరకలను ముక్కలు చేసేవారూ, గోళ్ళను కొరుక్కొని తినేవారూ, ఎంగిలి తిండిని తినేవారూ, వస్తువులను గాని ద్రవాలనుగాని కల్తీ చేసేవారూ అల్పాయుష్కులౌతారు.

పరస్త్రీని నగ్నంగా నున్నపుడు చూడరాదు. స్వంత మలాన్నీ, రజస్వలనూ చూడరాదు, స్పృశించరాదు. రజస్వలతో మాట్లాడరాదు. నీటిలో మల విసర్జన, శృంగార కార్యము కూడని పనులు. కేశ, ధూళి, కపాల, మల - మూత్ర, సూత్ర అస్థిపంజరాదుల పై ఆసనమున్నను కూర్చోరాదు. విరిగిన ఆసనంపై కూర్చొనరాదు. పగులు వేసిన పాత్రలను వాడరాదు. జుత్తు విరగబోసుకొని అన్నం తినకూడదు. నగ్నంగా స్నాన శయనములు తప్పు. ఎంగిలి కడిగి తుడవనిచోట కూర్చొనరాదు. ఎంగిలి చేతిని తలకు తగల్చరాదు. తల వెంట్రుకలను లాగరాదు. తలపై ఎవరినీ కొట్టరాదు. శిష్యులపై, కొడుకులపై కొరడాను ఉపయోగించరాదు. తలను రెండు చేతులతో గోకరాదు. తగిన కారణం లేకుండా తల స్నానం చేయరాదు. భోజనం తరువాత రాత్రి స్నానం దోషము. స్నానం తరువాత నూనెను రాసుకొనకూడదు. నువ్వుల పిండాన్ని తింటే ఆయువు క్షీణిస్తుంది.

గురుజనులు వద్ద, శ్రేష్ఠ జనుల వద్ద చెడువూసులు చెప్పరాదు. వారు కోపిస్తే ఎలాగోలా కాళ్ళవేళ్ళా పడి ప్రసన్నులను చేసుకోవాలి. అంతేగాని ‘వీరితో మనకేమి పని’ అని ఆలోచించరాదు. ఇతరులను నిందించరాదు. నిందించే వారిని చేరదీయరాదు. ప్రశస్తమైన మందులనే వాడాలి. జుత్తు నెల్లప్పుడూ నిర్మలంగా, స్నిగ్ధంగా వుంచుకోవాలి. ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా, ప్రసన్నంగా, చూచే వారికి మనతో మాట్లాడాలనిపించేలా వుండాలి. ఇతరులలో దోషాలు వెదకి పట్టుకొనే లక్షణం మంచిది కాదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడరాదు. గుసగుసలాడు వారిని ప్రోత్సహించరాదు. ఇతరుల వద్ద ఉచితముగా గాని, ఋణముగా గాని కించిన్మాత్రమైనా దేనినీ స్వీకరించరాదు. నీటిలోకి దుమికి స్నానము చేయుట చిటారు కొమ్మనెక్కుట దోషములు. దుష్ట స్త్రీతో పరిచయము చేసుకొనరాదు. తెలియక మెలగిననూ తెలిసిన వెంటనే దుష్ట స్త్రీని పరిత్యజించవలెను. రాత్రి పూటా, వనములోనూ వీలైనంత వఱకు మోమెత్తి మాట్లాడరాదు.

బ్రాహ్మణుడు, స్త్రీ, రాజు, అధికారి, జ్ఞాని, బరువుమోసుకొని వస్తున్నవాడు, శ్రేష్ఠవ్యక్తి, మూగి, అంధులు, బధిరులు, తాగుబోతులు, ఉన్మత్తులు - వీరిని దూరము నుండే గమనించి దారిని వదలివేయవలెను. ఒకరు ధరించిన చెప్పులు, బట్టలు, హారములు ధరించరాదు. ఇతర స్త్రీలతో పరిచయమును పెంచుకొనరాదు. కానీ ఏ స్త్రీ ఆపదలో వున్నా సంకోచించకుండా రక్షించాలి.

రాత్రిపూట పెరుగు, పేలపిండి తినరాదు. అర్ధరాత్రి భోజనం చేయరాదు. ఇతరుల రహస్యాల పట్ల ఆసక్తిని చూపుట, తెలుసుకొనే ప్రయత్నముచేయుట దోషములు. రంగురంగుల బట్టలను, నల్లబట్టలను అనవసరంగా ఎక్కువసేపు ధరించరాదు. స్త్రీలను గౌరవించేవారు, ఇతరులను పీడించనివారు, సహనం, నమ్రత గలవారు ఎక్కువ కాలం సుఖంగా జీవిస్తారు.

గొడ్డలితో తెగినమ్రాను, కార్చిచ్చులో కాలిన వనము మళ్ళా చిగురిస్తాయి కాని అప్రియభాషణల వల్ల అనుచిత దూషణ వల్ల చెదరిన స్నేహాలు చిగురించవు; తెగిన బంధాలు అతుక్కోవు. కాబట్టి మాటను జాగ్రత్తగా వాడాలి. వేదాలనూ, దేవునీ నిందించరాదు. బ్రాహ్మణుని దూషించరాదు. ఎవరితోనూ వైరాన్ని పెట్టుకోరాదు. అలాగని పిరికితనాన్నీ ప్రదర్శించరాదు. అవసరమైనచోట పరాక్రమాన్ని ఉపయోగించవలసిందే. నక్షత్రాలను చూపిస్తూ అందరూ మాట్లాడరాదు.

ప్రాజ్ఞుడైనవాడు ఎక్కడ నివసించాలో చూసుకొని ముందడుగేస్తాడు. న్యాయంగా పని చేసేవాడు, బలవంతులైన శత్రువులను గెలువగలిగినవాడు, ధర్మజ్ఞుడు, గుణజ్ఞుడు నైన వాని ఆశ్రయాన్నే పొందుతాడు. మాత్సర్యం లేని స్త్రీలు వుండే చోట, గుణవంతులున్న చోట, వ్యవసాయదారులు, సస్యవృద్ధి, పంట పొలాలు వున్న గ్రామంలో గాని వీటితో బాటు పండితులు, నీతిమంతులు గల నగరంలో గాని కాపురముంటాడు. ధర్మరాజా! ఋణదాత, వైద్యుడు, క్షత్రియుడు, నిండుగా పారే జలాశయము లేని ఊరిలోని నివసించ రాదని లౌక్యులంటారు గాని ఋణగ్రహీతలకు గౌరవముండదు. బ్రాహ్మణుడు లేని ఊరిలో నివసించరాదు. మలినమైన అద్దం వైపు చూడరాదు. ఆశపోతు, స్వర్ణకారుడు మలిన దర్పణాల వంటివారు. పగిలిన కుండ, విరిగిన మంచము, కుక్క, కోడి, ముళ్ళ చెట్టు - వీటిని ఇంటి ముంగిట్లో వుంచరాదు. పగిలినకుండ వల్ల కలహాలువస్తాయి. విరిగిన మంచం కష్టాలను ఆహ్వానిస్తుంది. కుక్క, కోడి కనిపిస్తే పితరులు భోజనానికి రారు. ముళ్ళ చెట్టు కింద పిశాచాలు నివసిస్తాయి.

గృహస్థు భోజనానికి తొందర పడకూడదు. ముందుగా పెద్ద ముత్తయిదువలకు గర్భవతులకు, వృద్ధ స్త్రీలకు, పిల్లలకు, ఆకలిగొన్న అతిథులకూ భోజనం పెట్టించాలి. తరువాత ఆకలికి ఆగగలిగిన అతిథితో గాని, భార్యతో గాని కలిసి భోంచెయ్యాలి. ఆవు చేత బండిని గాని నాగలిని గాని లాగించేవాడూ, ఆవుని కష్టపెట్టి డబ్బు సంపాదించేవాడూ, అతిథికి గాని, వాకిట్లో నిలబడ్డ అన్నార్తునికి గానీ పెట్టకుండా భోంచేసేవాడూ తినేది అన్నాన్ని కాదు పాపాన్నే. భోజనం ప్రసన్నచిత్తంతో ప్రశాంతంగా తీరికగా చేయాలి. కంచం మనిషి కన్న ఎత్తులో వుండకూడదు. చీకటిలో, ఇరుకు చోట్లో భోంచేయకూడదు. భోజనాన్ని ఎప్పుడూ కూడా మధుర (తీపి) పదార్ధంతో మొదలెట్టి వెంటనే లవణ పదార్థాన్ని తినాలి. తరువాత కటు పదార్థాన్నీ చివర ద్రవయుక్త వ్యంజనము (మజ్జిగ)నూ తినాలి. భోజనం తూర్పు లేదా ఉత్తరం వైపు తిరిగి కూర్చుని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నాన్ని నిందించరాదు. భోజనానంతరం ఆచమనం చేసి ఇష్టదేవతకు నమస్కరించాలి. తరువాత చేతితో బొజ్జను నిమురుకుంటూ ఈ క్రింది మంత్ర శ్లోకాన్ని మెల్లగా, సుఖంగా, శ్రావ్యంగా పఠించాలి:

ప్రాణాపాన సమానానా ముదానవ్యానయోస్త థా

అన్నం పుష్టికరం చాస్తు మమాద్యా వ్యాహతం సుఖం

అగస్తిర్వగ్నిర్వడ వానల శ్చభుక్తం ప్రపాన్నం జరయత్వ శేషం

సుఖంచమే తత్పరిణామ సంభవం యచ్ఛత్వ రోగం - ఖలు వాసుదేవః (ఉత్తర పర్వం 205/125, 126)

భోజనం తరువాత తేలికపాటి పనులను మాత్రమే చేయాలి. ధర్మజా! సాయం సంధ్య వేళలో ఎవరైనా బాటసారి వచ్చి వాకిట్లో నిలబడితే గబగబా వెళ్ళి అతనికి పాద్యమిచ్చి, అర్ఘ్యమిచ్చి, ఆసనం చూపించి సేద తీర్చాలి. తరువాత కమ్మగా మాట్లాడి మరింత కమ్మని భోజనం పెట్టి శయనపుటేర్పాట్లు చేసి అతడు శయనించాక యజమాని ఇంట్లో అందరికీ పక్కలు అమిరాయో లేదో చూసి అప్పుడు తాను పోయి పడుకోవాలి. తూర్పు, దక్షిణాలతో శిరసును పెట్టి శయనించడం ప్రశస్తం. ఋతుకాలంలో, సంతానం కోసం మాత్రమే సంభోగంలో పాల్గొనాలి. చతుర్దశి, అష్టమి, అమావాస్య, పర్వ దినాలలో తైలాభ్యంగనము, స్త్రీ సహవాసం తప్పు. క్షురకర్మ, స్త్రీ సహవాసం, శ్మశాన గమనాల తరువాత సవస్త్ర స్నానం చేయాలి. గురువు, యజ్ఞకర్త, పతివ్రత, తపస్వులను హాస్యానికైనా తేలికమాటల పాలు చేయరాదు. దాసులపై కోపం వచ్చినా దుర్భాషలాడరాదు. గురువున్న వైపు దేవుడున్న వైపు కాళ్ళు చాచరాదు. బంధువుల పట్ల మత్సర దృష్టి జరపరాదు. భయపడిన మనుష్యులను ఓదార్చి భయం పోగొట్టాలి. దుఃఖితుల దుఃఖాలను పోగొట్టి చల్లబఱచాలి. ఈ ఓదార్పు స్వర్గానికి సోపానం. ఆక్రోశం, వివాదం, పిశునతలను త్యజించాలి.

పడుకున్నప్పుడు, పూజా సమయంలో, సభలో వేరు వేరు బట్టలు వేసుకోవాలి. పతితులతో మాట్లాడరాదు. వృద్ధులు, జ్ఞాతులు, బంధువులు దురదృష్టం కొద్దీ దరిద్రులైతే వారికి ధనసాయం (సహాయం) చేయాలి, ఓదార్పు నివ్వాలి. వారు మరల ధనికులయ్యేదాకా తన వద్ద ఉంచుకోవాలి. పావురము, చిలుక, మైనాలను పెంచుకుంటే శుభం. చందనం, వీణ, దర్పణం, నెయ్యి, తేనె, నీరు, అగ్ని నిరంతరం ఇంట్లో వుంచుకోవాలి.

ధర్మజా! ఇదీ సదాచారమంటే. ఇది సంపద్వృద్ధి. ఆయుర్వృద్ధి కలిగిస్తుంది. ఆచారమే పరమ ధర్మం. స్వర్గ ప్రాప్తిదం. ధర్మార్ధ కామఫలాలను మానవునికి ప్రాప్తింప జేసేది సదాచారమే గాని మరొకటి కాదు. దీనిని అందరూ తప్పనిసరిగా పాటించాలి.”