భవిష్య పురాణము

26 - భగవాన్ కల్కివిజయం - సత్యయుగోత్పత్తి కథ, అయోధ్యలో వైవస్వత మహారాజు ప్రతిష్ఠితుడగుట

వ్యాసమహర్షి ఇలా ప్రవచించాడు. “ఋషి సత్తములారా! పురాణ పురుషుని నుండి ఉత్పన్నుడైన భగవాన్ కల్కి ఖడ్గము, కవచము, డాలులను ధరించి ఒక దివ్యాశ్వము నధిరోహించి దైత్యరూపులైన మ్లేచ్ఛులందరినీ సంహరిస్తాడు. అటు పిమ్మట యోగ మార్గాన్నాశ్రయించి ఆయన పదహారువేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆ తపోయోగాగ్నిలో దగ్ధమై లోకమంతా భస్మమై నిర్జీవమైపోతుంది. అప్పుడు ప్రళయం కర మేఘాలుత్పన్నమై ప్రళయవృష్టిని కురిపిస్తాయి. భూమి మొత్తం నీటిలో మునిగిపోతుంది. ఘోర కలిపురుషుడు బలి వద్దకు పోతాడు.

భగవంతుడైన హరి మరల కర్మభూమిని రమణీయ స్థలమయిగా చేసి యజ్ఞాల ద్వారా దేవతలను తృప్తిపరుస్తాడు. యజ్ఞభాగాలందుకున్న దేవతలు శక్తిసంపన్నులై వైవస్వత మనువు వద్దకు పోయి మొత్తం వృత్తాంతాన్ని వివరిస్తారు. అప్పుడు భగవాన్ కల్కి యొక్క ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, మోకాళ్ళ నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఉత్పన్నులైతారు. క్రమంగా గౌర, రక్త, పీత, శ్యామల వర్ణాలలో నున్న మహాదేవి అనుగ్రహం వల్ల అనేకులైన పుత్రులను కంటారు. వారంతా యజ్ఞయాగాదులతో దేవతలను సంతృప్తిపఱచి భూమిని సర్వసంపన్నం గావిస్తారు. అప్పుడు ధీమంతుడైన వైవస్వతుని విష్ణురూపుడైన కల్కి తన వద్దకు రప్పించుకుంటాడు. వైవస్వతు డాయనకు నమస్కరించి, మనసారా స్తుతించి ఆయన ఆజ్ఞానుసారం అయోధ్యలో రాజ పదవినధిష్టిస్తాడు. అతని పుత్రుడు ఇక్ష్వాకుడు తండ్రి నుండి రాజపదవిని పొంది వంద దివ్య సంవత్సరముల ఆయుర్దాయమును భగవంతుని నుండి పొంది అన్నేళ్ళూ రాజ్యపాలన చేసి శరీర పరిత్యాగం చేస్తాడు.

భగవాన్ కల్కి బ్రహ్మనుద్దేశించి బ్రహ్మ సత్త్రమను యాగమును చేయగా వేద, శాస్త్ర పురాణాదులు మూర్తిమంతములై భూమిపైకి వచ్చి కల్కిని స్తుతించి స్థిరపడతాయి.

కార్తిక శుక్ల నవమి గురువారం నాడు యజ్ఞకుండం నుండి ఒక శ్రేష్ఠ పురుషుడు ద్భవిస్తాడు. సత్యమార్గ ప్రదర్శన చేయు ఆ మహనీయునే సత్యయుగ పురుషునిగా విశ్వం కీర్తిస్తుంది. బ్రహ్మాది దేవగణాలు ఆయన పుట్టిన ఈ నవమి తిథిని సకల పాపక్షయ కరంగా దీవిస్తారు. ఈ తిథినాడు ఉసిరిక చెట్టుకింద మనుష్యులు ఏ దేవతనైతే పూజిస్తారో ఆ దేవత ఆ మనుజుని వశం కావడం తథ్యం. ఈ నవమి అక్షయ నవమి, యుగాది నవమి అనే పేర్లతో ప్రసిద్ధి చెందుతుంది. ఇది లోక మంగళదాయిని, సర్వపాపవినాశిని.

భగవాన్ కల్కి అవతారం ముగిసిన పిమ్మట పాతాళ వాసులైన మహాదైత్య గణాలు తమ వాహనాలనెక్కి అనేక అస్త్రశస్త్రాలను పట్టుకొని గర్జిస్తూ దేవతలపై దాడి చేస్తారు. ఇంద్రాది ముప్పది మూడు గణాధిపతులూ తమ ఆయుధాలతో అడ్డుకొని భయంకరమైన యుద్ధం చేస్తారు. ఒక దివ్య సంవత్సరంపాటు మహా సంగ్రామమే జరుగుతుంది. కాని, మరణించిన దైత్యులందరినీ శుక్రాచార్యుడు బతికించెస్తుండడంతో దేవతలు బాగా అలసిపోయి యుద్ధభూమి నుండి వైదొలగి క్షీరసాగరంలో శయనించియున్న విష్ణుమూర్తిని శరణు వేడతారు. ఆయన విషయాన్ని విని, దేవతల స్తుతికి ప్రసన్నుడై వారి దీన పరిస్థితికి జాలిపడి, లోక కల్యాణాన్ని కూడా దృష్టిలో నుంచుకొని తన శరీరంలో సగభాగాన్ని హంసరూపంలో మలచుకొని రాక్షసుల పైకి ఎగిరివెళతాడు. సాక్షాత్తూ హరి, కోటి సూర్యతేజంతో ఒక్కమారు తమపై విరుచుకుపడేసరికి రాక్షసులంతా భస్మమైపోవడం మొదలౌతుంది. శుక్రాచార్యులవారి శక్తి ఆ భస్మాలను పునర్నిర్మించడంలో అశక్తమై పోతుంది. మిగిలిన రాక్షసులు, దైత్యగణాలు పారిపోయి వితల లోకంలో తలదాచు కొంటాయి.

పరమహంస రక్షితమైన దేవగణ సమూహం నిర్భయులై, నిరుపద్రవులై వైవస్వత మనుపుత్రుడైన ఇక్ష్వాకుని భూలోకంలో పాలకునిగా ప్రతిష్ఠిస్తుంది. సత్య లేదా కృతయుగం కొనసాగుతుంది. ఇక్ష్వాకువు వంద దివ్య సంవత్సరాలు రాజ్యం చేస్తాడు. మనుష్యుల కనీస ఆయువు నాలుగువందల సంవత్సరాలు ఉంటుంది. జ్ఞాన, ధ్యాన, శమ, దమాలను నాలుగు పాదాలా ధర్మం నడుస్తుంది.”

చతుర్థఖండంతోబాటు ప్రతిసర్గ పర్వం సమాప్తం.

శ్రీ కృష్ణ చంద్ర పరబ్రహ్మణేనమః