భవిష్య పురాణము

60 - శ్రీవృక్ష నవమి

మహారాజా! దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినపుడు పుట్టిన సర్వలక్షణ సంపన్నయైన లక్ష్మీదేవిని చూసి, శివుడు తప్ప, ప్రతి ఒక్కరూ ఆమె తనకే కావాలనుకున్నారు. ఒకరితో నొకరు తలపడ్డారు కూడ. అప్పుడు లక్ష్మీ దేవి ఒక బిల్వవృక్షం క్రింద నిలబడి ఈ పోరాటాన్ని వీక్షించింది. చివరికి విష్ణు భగవానుడు అందరినీ ఓడించి ఆమెను చేపట్టాడు. ఇందుచేత బిల్వవృక్షాన్ని శ్రీ వృక్షమని కూడ అంటారు. కాబట్టి భాద్రపద శుద్ధ నవమి నాడు శ్రీవృక్ష నవమీ వ్రతాన్నాచరించాలి. సూర్యోదయ సమయంలో అనేక పుష్ప, గంధ, వస్త్ర, తిలాపిష్ట, అన్న, గోధుమ, ధూప, మాలాదులతో ఈ క్రింది మంత్రం ద్వారా బిల్వవృక్షాన్ని పూజించాలి.

శ్రీనివాస నమస్తేఽస్తు శ్రీ వృక్ష శివవల్లభ

మమాభిలషితం కృత్వా సర్వవిఘ్న హరోభవ  

తరువాత చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెడుతూ శ్రీదేవీ ప్రీయతాం అనుకుంటూ వుండాలి. తరువాత వ్రతి నూనె గాని ఉప్పుగాని లేని భోజనాన్ని మౌనంగా చేయాలి. ఈ విధంగా ఈ వ్రతము నాచరించినవారికి సమస్త సంపత్తులూ ప్రాప్తిస్తాయి.