భవిష్య పురాణము

153 - జలధేను దానం - ముద్గల మహర్షి ప్రసక్తి

ధర్మజా! దేవాధిదేవుడైన విష్ణువును ప్రసన్నం గావించే జలధేను దానాన్ని విను. ఉత్తమ జలంతో నింపిన ఒక కలశను స్థాపించి దానిలో పంచరత్నాలనూ, ధాన్యమునూ, మురనూ, ప్రియంగునూ, ఉసిరికాయనూ జటామాంసినీ పంచపల్లవాలనూ, కుష్ఠఓషధినీ, వట్టివేరునీ వేయాలి. తరువాత రెండు తెల్లని బట్టలతో, పూమాలలతో, జందెముతో అలంకరించాలి. కుశాసనంపై కలశ నుంచి దగ్గర్లోనే చెప్పులనూ, గొడుగునూ ఉంచి నాలుగు దిశల్లో నాలుగు వెండి గిన్నెలలో తిల, దధి, ఘృత, మధువులను నింపి పెట్టాలి. కలశలో సవత్స ధేనువు నూహించుకొంటూ దానికి గోమయాన్నిపూయాలి. తోక వుందను కున్నచోట పూలమాలను వేలాడదీసి దాని ప్రక్కన పాలు పితకడానికి పట్టు కెళ్ళే కంచు పాత్రనుంచాలి. విష్ణు భగవానునికి సర్వోపచారాలతో పూజ చేసి కలశలోనున్న జలధేనువు నభిమంత్రిస్తూ ఈ శ్లోకాన్ని చదవాలి:

విష్ణోర్వక్షసియాలక్ష్మీః స్వాహాయాచవిభావసోః

సోమశక్రార్కశక్తిర్యా ధేనురూపేణ సాస్తుఽమే॥ (ఉత్తరపర్వం - 153/8)

ఈ మంత్ర శ్లోకంతో కలశలో ధేనువును ప్రతిష్ఠించి వత్స సమన్వితమైన ఆ జల ధేనువునూ జలశాయియైన అచ్యుత గోవింద భగవానునీ సర్వోపచారాలతో పూజించి ప్రశాంత చిత్తతతో విష్ణుభగవానుని ప్రసన్నతకై ఆ కలశ స్థాపిత జలధేనువు బ్రాహ్మణునికి దానమిచ్చి ఇలా చెప్పాలి:

శేషపర్యంక శయనః శ్రీమచ్ఛార్ఙ్‌గ విభూషితః

జలశాయీ జగద్యోనిః ప్రీయతాం మమ కేశవః ॥ (ఉత్తరపర్వం 153/11)

 ‘(ర్ఙ్‌గని ‘రంగ’ అని పలకాలి)

ఈ రకంగా దానమిచ్చి ఆ రోజంతా గోవ్రతం (అంటే గోవు నుండి వచ్చు పదార్థాలనే తినుట) చేసిన వారికి అన్నిరకాల ఆనందాలూ ప్రాప్తిస్తాయి. సార్వకాలికమైన అతుల శాంతి లభిస్తుంది; అన్ని మనోరథాలూ సిద్ధిస్తాయి. ధర్మజా! ఈ విషయమై ఒక ఆఖ్యానం చెప్పబడుతూవుంటుంది ఇలా:

జాతిస్మరుడూ మహాత్ముడూనైన ముద్గలమహర్షి త్రిలోక సంచారం చేస్తూ ఒక మారు యమలోకానికి వెళ్ళాడు. అక్కడ పాపులు కుంభీపాకాది దారుణ నరకాలలో కష్టాలు పడుతుండడాన్నీ, భయంకర రూపులైన యమకింకరులు అక్షరాలా వారిని యమబాధలు పెడుతుండడాన్నీ చూశాడు. చిత్రంగా, ముద్గలముని దర్శనం కాగానే అక్కడి వారికి ఏ బాధకలుగలేదు; తెలియలేదు. హాహాకారాలూ, ఏడుపులూ, పెడబొబ్బలూ ఆగిపోయి పాపులందరి వదనాలలో ప్రశాంతత నెలకొంది. మహర్షి ఆశ్చర్యపడి దీనికి కారణం యమరాజునే అడిగాడు. ఆయన ఇలా చెప్పాడు: మహాత్మా! మీరు గత మూడు జన్మలలో విధ్యుక్తంగా జలధేను దానాన్ని చేశారు. దాని ప్రభావం వల్ల మీ దర్శనం అందరికీ ఆహ్లాద దాయకమై వెలసింది. ఇంతేకాదు మీ దర్శనం చేసినవారూ, మిమ్మల్ని ధ్యానించినవారూ, మీ గురించి చర్చలో పాల్గొన్నవారూ, మీకు కనిపించిన వారూ, మిమ్మల్ని ఏదో ప్రసంగ వశాన స్మరించినవారూ సుఖశాంతులతో, ఆనందంగా ఏ బాధా లేకుండా జీవిస్తారు.’

జలధేను మాహాత్మ్యాన్ని వినిపించిన తరువాత యమధర్మరాజు ‘మునీంద్రా! భగవంతుని ఆదేశంమేరకు శ్రీకృష్ణభగవానుని గూర్చి మీకు నాలుగు ముక్కలు చెప్పగలగడం నా పూర్వ పుణ్యఫలంగా భావిస్తున్నాను. శ్రీకృష్ణదేవుని ఆశ్రయం పొందినవారు నా నియమాలను ఇక పాటించనక్కరలేదు. ధేనుదానం కృష్ణప్రీతికరం, ఇదేకాక శ్రీకృష్ణ పూజన వ్రతాదులను చేయువారు, నిత్యమూ ఆయనను ధ్యానించేవారు, ఆయన యొక్క అనంత, వాసుదేవాది నామాలను నిరంతరం ఉచ్చరించేవారు, అచ్యుతః ప్రీయతాం అంటూ దానాలు చేసేవారు నా లోకానికి రారు. లోకాలన్నిటినీ నేను శాసిస్తే, నాకే ఆ కృష్ణభగవానుడు శాసకుడు.’

సఏవనాథః సర్వస్య తన్నియోగ కరావయం

జన సంయమనశ్చాహమ స్మత్సంయమనోహరిః॥ (ఉత్తరపర్వం 153/33)

 యమధర్మరాజు యొక్క ఈ మాటలను విన్న పాపులు అగ్నిలో మండుతూనే శస్త్రాలతో పీడింపబడుతూనే శ్రీకృష్ణభగవానుని స్తుతిస్తూ ఆయన పవిత్రనామ స్మరణను గావించ సాగారు. వెంటనే ఆ పుణ్యకర్మ ప్రభావం వల్ల నరకలోకపుటగ్ని చల్లగా అయిపోయింది. అస్త్రశస్త్రాలన్నీ పూరేకుల్లా అయిపోయాయి. సర్వత్ర ఒక దివ్య ప్రకాశం అలముకొన్నది. యమకింకరులు మూర్ఛపోయారు. శీతల, సుగంధిత వాయువక్కడ ప్రవహించ నారంభించింది. ఒంటిమీద స్పృహ కోల్పోయి అన్నీ మరచి అన్నీ విడచి వాసుదేవ కృష్ణ నామస్మరణ చేస్తున్న పాపులకు నారకీయ శరీరాలు పోయి దివ్య శరీరాలు వచ్చి వస్త్ర, ఆభూషణ, మాలాదులు అమరినవి. ఇదంతా కృష్ణలీలయనీ వీరిని బ్రోచుటకే ఆ స్వామి ముద్గలుని ముందు పంపించి తరువాత తనచేత ఆయన నామాన్ని పాపులకు ఉపదేశింప జేశాడని గ్రహించిన యమధర్మరాజు ఆ దివ్య శరీరధారులను కృష్ణుని పూజించినట్లే అర్ఘ్య పాద్యాదులతో సత్కరించాడు. కృష్ణనామ స్మరణలో సర్వం మరచిన ఆ పూర్వపాపులను దివ్యవిమానాలు వచ్చి తీసుకొనిపోయినవి. ముద్గలమహర్షి ఈ విచిత్ర సంఘటనను కనులారా తనివి తీరాగాంచి తానెపుడో చేసిన జలధేనుదాన మాహాత్మ్యానికి పదే పదే వందనాలు చేస్తూ ఇలా అన్నాడు.

‘అహో! ఈ విష్ణుమాయ ఎంత విచిత్రమో అంత కఠినం కూడా కదా! అందులో మోహితులై జీవించు ఈ జనం ఆయననే మరచిపోతారు. కనబడుతున్నా పోల్చుకోలేరు. సర్వకీటకాది యోనుల్లో పడి పరిభ్రమిస్తుంటారు. మానవజన్మ వచ్చినా ఆయనను తలచుకోరు, మోక్షానికి ప్రయత్నించరు. మాయామోహితుడైన మనిషి తనకోసం తాను బ్రతుకు తున్నాననుకుంటూ నిజంగా తనకేంకావాలో తనవాడెవరో కనుక్కోలేకపోవడం విష్ణుమాయ విలసనమే. ఎంత ఆశ్చర్యము! ఇంత అభేద్యమైన మాయ కూడా ఆయనను స్మరించగానే పొగమంచులా విడిపోవడం మరింత విచిత్రం. ఎవరైతే మానవజన్మను పొంది కూడా ఆయనను ఆరాధించరో వారి మానవజన్మ వ్యర్థమైపోతుంది.

యోనవిత్తర్ధి విభవేర్నవాసోభిర్న భూషణైః

తుష్యతే హృదయేనైవ కస్తమీశం నపూజయేత్ (ఉత్తపర్వం 153/65)

శ్రీకృష్ణ భగవానునికి మీ ధనమూ, వైభవమూ ఆ భూషణాదులూ అవసరం లేదు. మనసారా స్మరిస్తే చాలు. ఓ మానవులారా! మరీ మరీ విన్నవిస్తున్నాను. మీరు ఇక్కడా, అక్కడా ఉద్ధరింపబడాలంటే శ్రీ విష్ణు భగవానుని ఆరాధించండి ధేను దానాన్ని చేయండి. నరకయాతన అతి దుఃఖదాయని. నా కనులతో నేనే స్వయంగా దానిని చూశాను. ఆ నరకం నుండి ఎలా బయటపడాలో కూడా చూసి చెప్తున్నాను. మనసులో విష్ణువుని పెట్టుకోండి.’

ధర్మజా! ముద్గలమహర్షి ఇలా కొన్ని వందల సంవత్సరాలపాటు మానవులకు హితోపదేశం చేస్తూనే జీవిస్తాడు.