భవిష్య పురాణము

12 - దేవప్రతిమా నిర్మాణవిధి

            మునులారా! ఇపుడు నేను (అనగా సూతమహర్షి) ప్రతిమ యొక్క శాస్త్రసమ్మత లక్షణాలను వివరిస్తాను. ఈ లక్షణాలు లేని ప్రతిమ పూజార్హం కాదు. రాయి, కర్ర, మట్టి, రత్నం, రాగి మరియు అన్యధాతువులలో దేనితోనైనా ప్రతిమను చేయవచ్చును. (మత్స్యపురాణం 258/20,21) మందిరం కొలతలకి తగిన నిష్పత్తిలో ప్రతిమ వుండాలి. అన్ని శుభలక్షణాలతో ప్రతిమ నిర్మింపబడాలి. ఇంట్లో ఎనిమిదంగుళాలు దాటి ఎత్తున్న ప్రతిమను పూజించరాదు. దేవాలయ ద్వారపు ఎత్తును ఎనిమిది భాగాలుగా విభజించి మూడుభాగాల యెత్తుతో పిండికనూ రెండుభాగాల ఎత్తుతో ప్రతిమనూ నిర్మించాలి. ఎనుబది నాలుగంగుళాల (మూడున్నర హస్తాల లేదా జానల) యెత్తున్న ప్రతిమ సకల వృద్ధికరము. ప్రతిమ యొక్క ముఖము పన్నెండగుళాల పొడవుండాలి. దానిలో మూడోవంతు చిబుకము, నాసిక, లలాటము వుండాలి. నాసికతో సమాన పరిమాణంలోనే చెవి, మెడ చేయబడి వుండాలి. నేత్రాలు రెండంగుళాలుండాలి. కంటిలో మూడవవంతు కనుపాప కొలత. లలాటం, మస్తకం, గ్రీవం - ఈ మూడూ సమాన పరిమాణంలో వుండాలి. తలయొక్క ఎత్తులో సగానికి కటిప్రదేశముండేలా చూడాలి. బాహు, జంఘ, ఊరుద్వయాలొకదాని కొకటి సమానంగా నిర్మింపబడాలి. చీలమండలు నాలుగంగుళాల యెత్తు, కాలివ్రేళ్ళు మూడంగుళాల పొడవు, ఆరంగుళాల వెడల్పు, చూపుడు వ్రేలు అంత పరిమాణంలో, గోళ్ళతో సహా పాదం యెక్క పొడవు పదునాలుగంగుళాలలో చేయబడాలి. అధరం, ఓష్ఠం, వక్షం, కనుబొమలు, లలాటం, గండస్థలం, కపోలాలు పుష్టిగా, మాంసయుక్తంగా, అవసరమైనచోట నున్నగా కనిపించాలి. ప్రతిమను చూడగానే అందంగా కనిపించాలి. కనుకొలకులలో ఎరుపుజీరతో విశాలములైన నేత్రాలు భాసించాలి.

తలపై కిరీటం, కంఠంలో హారం, బాహువులకు కటకాలు, అంగదాలు, చెక్కబడి యుండాలి. మూర్తి సర్వాంగసుందరంగా, అత్యంత ఆకర్షణీయంగా వుండాలి. ప్రతిష్ఠ తరువాత అన్ని బాహ్యాలంకరణాలతో సుశోభితమై వుండాలి. ఏ భగవత్ప్రతిమ వైపు చూసినా భక్తిభావంతో నమస్కరించే వారికి అభీష్ట వస్తుప్రాప్తి కలుగుతుంది.

దివ్యమైన ముఖమండల ప్రభలు కాంతులను విరజిమ్ముచుండగా, చెవులకున్న చిత్రవిచిత్ర మాణిక్యమండిత కుండలాలు, హస్తాలపై వెలుగులీను కనకమాలలు తళతళ లాడుచుండగా, మస్తకంపై కిరీటము క్రిందికి జారుతూ నిగనిగలాడు కేశసంపద, భక్తిభావము నినుమడింపజేయుచుండగా, భక్తులపాలిటి వరదాయిని భగవతి యొక్క సౌమ్య కిశోరీ ప్రతిమ ప్రతి కోవెలలోనూ కొలువు తీరాలి. మానవుల మనోరథాలన్నీ ఈడేరాలి.

నవతాళ (నాలుగున్నర హస్తాల) ప్రమాణంలో విష్ణు ప్రతిమను నిర్మించాలి. మూడు తాళములు వాసుదేవునికీ, అయిదు తాళప్రమాణాలు నృసింహ, హయగ్రీవులకూ, ఎనిమిది నారాయణునికి, అయిదు మహేశునికీ, దుర్గాదేవికి విష్ణువుతో సమానంగా నవతాళప్రమాణమూ, మూడు లక్ష్మీ, సరస్వతులకూ, ఏడు తాళప్రమాణం సూర్యదేవునికీ ప్రతిమల ఎత్తులు విధింపబడ్డాయి.

భగవంతుని మూర్తిని తీర్థ, పర్వత, జలాశయాదుల సమీపంలో స్థాపించాలి. లేదా నగరంలో మధ్యభాగంలో గానీ బ్రాహ్మణ సమూహాలుండే చోట కూడా చేయవచ్చు. కలియుగంలో చందన, అగరు, బిల్వ, శ్రీపర్ణిక, పద్మకాష్ఠాది చెక్కలు దొరకని చోట మట్టితోనే ప్రతిమలను చేయవచ్చు.