14-16 కుశకండికా - విధానం, అగ్ని జిహ్వల పేర్లు

సూతమహర్షి ప్రవచనం కొనసాగుతోంది. “బ్రాహ్మణులారా! ఇపుడు యాగ విశేషమైన స్వగృహ్యాగ్ని విధిని చర్చిద్దాం. మన వేదశాఖకి అనుకూలంగానే మనం ఈ అగ్నికార్యాన్ని సంపన్నం చేయాలి. శాఖ మారకూడదు. మారితే భయం పుట్టుకువచ్చుటయే గాక కీర్తిలో కూడా కోత పడుతుంది. గృహ్యా అనగా పుత్రులు, కన్యలు, పుట్టబోయే పిల్లలు గృహ్య శబ్ద విస్తృతార్థంలో యజమానుని యొక్క దాయాదులు కూడా చేర్చబడతారు. వారి సంస్కారాలను, యాగాలను, శాంతికర్మ క్రియలను వారి గృహ్యాగ్నిలో నుండే అనుష్ఠించాలి. దక్షస్మృతి లో దీనికి సంబంధించి ఆచార్యులేమి చేయాలో చెప్పబడింది. ఆచార్యుడీ కర్మలలో మూడు కుశలను స్వీకరిస్తాడు. కుశ గ్రహణానికి జపించవలసిన మంత్రానికి ఋషిదక్షుడు, ఛందస్సు జగతి, దేవత విష్ణువు. భూమిని శోధించినపుడు భూరసి.. (యజు 13/18) తో ప్రారంభమగు మంత్రాన్ని వినియోగించాలి. దీనికి ఋషి సువర్ణుడు, ఛందాలుగా గాయత్రి, జగతి, దేవత సూర్యుడు తరువాత ఈ మూడు కుశలనూ బొటన, చూపుడు వేళ్ళతో పట్టుకొని దక్షిణం వైపు తిరిగి ఈశానకోణం దాకా వలయాకారంలో తిప్పి వాటితో భూమిని స్పృశించాలి. దీనినే పరిసమూహన క్రియ అంటారు. తరువాత మానస్తోకేం (యజుం 16/16) అనే మంత్ర ద్వారమున గోమయంతో భూమిని నిమరాలి. తరువాత కాచుచెక్కతో చేసిన స్వయం (పుల్ల) ద్వారా రేఖాకరణ గావించాలి. తూర్పునుండి పడమటి వైపుకి మూడు రేఖలను గీయాలి. మొదటి రేఖను దక్షిణం వైపు కొనసాగించి ఉత్తరం వైపు పోనిచ్చి ఆపాలి. దీనికి విపరీతంగా చేస్తే అమంగళం కలుగుతుంది. ఆ తరువాత బొటన, అనామిక వేళ్ళతో ఆ మూడు రేఖలపైనున్న మట్టిని తొలగించాలి. దీనిని ఉద్ధరణ మని పిలుస్తారు. ఈ సమయంలో మిత్రా వరుణాభ్యాం.. (యజు. 7/23) ఇత్యాది మంత్రాలను స్మరించుకుంటూ వుండాలి. అనంతరం కుశ, పుష్ప, ఉదకాలతో గాని పంచగవ్యాలతో గాని, పంచరత్నోదకాలతో గాని, పంచపల్లవాలతో గాని (పల్లవ జలాలని అర్థం) అభ్యుక్షణ లేదా అభిసించన (బాగా తడుపుట) చేయాలి. తరువాత కర్మసాధనభూత లౌకిక స్మార్తమునుగాని శ్రౌతాగ్నిని గాని ఆనయనం చేసి ఎదురుగా స్థాపించుకోవాలి. ఈ క్రియలో మేగృష్ణామి అనే మంత్రాన్ని పఠించాలి. క్రవ్యాదమగ్నిం.. (యజు. 34/19) అనే మంత్రాన్ని చదువుతూ అగ్నిని తెచ్చి దక్షిణం వైపు కొంత భాగాన్ని విసరి వేయాలి. దానిని క్రవ్యాదాగ్ని అంటారు. సంసరక్షం - అనే మంత్రం చదువుతూ దానిని ఆవాహనం చేయాలి. తరువాత వైశ్వానరం (యజు. 26/7) అనే మంత్రంతో కుండాదులతో అగ్నిని స్థాపించాలి. బధ్నాసిం అనే మంత్రం చదువుతూ అగ్నిదేవునికి ప్రదక్షిణ నమస్కారాలు గావించాలి. అగ్నికి దక్షిణం వైపు యజమాని ఋత్విజునిగా వరించిన బ్రాహ్మణుని మిక్కిలి గౌరవంతో కుశాసనం ‘బ్రహ్మన్ ఇహ ఉపవిశ్యతాం’ అంటూ కూర్చోబెట్టాలి. అప్పుడే బ్రహ్మజ జ్ఞాన.. (యజు. 13/3) దోగ్ ధ్రీ ధేనుః.. అనే రెండు మంత్రాలను చదవాలి. అగ్ని యొక్క ఉత్తర భాగంలో ప్రణీతా పాత్రను స్థాపించాలి. ఇమంమే వరుణం (యజు. 21/1) అనే మంత్రాన్నుచ్చరిస్తూ ఆ పాత్రను నీటితో నింపాలి. ఆ తరువాత కుండానికి నలువైపులా కుశ పరిస్తరణ చేసి సమిధ, ధాన్యం, అన్నం, నువ్వులు, అప్పాలు, పళ్ళు, పాలు, కొబ్బరిబోండాలు మున్నగు యజ్ఞానికి పనికి వచ్చే వస్తువులన్నిటినీ వాటి స్థానాల్లో వుంచాలి. వికంకత వృక్షము యొక్క కర్ర నుండి చేయబడిన స్రువ (ఒక వైపు కొలత కోసం గొయ్యిలాటిది వుండే కర్ర చెంచా) నూ, శమీ, శమీపత్ర, చరూస్థాలీ (హొమయోగ్యమైన అన్నం పాత్ర) మున్నగు వాటిని సిద్ధం చేసుకునిపెట్టుకోవాలి. హోమకాలంలో ప్రణీత పాత్రను ముట్టుకోరాదు. యజ్ఞం జరుగుతున్నంత సేపూ స్నానకుంభాన్ని స్థిరంగా వుంచాలి. ప్రాదేశ మాత్రను రెండు పవిత్రకాలుగా చేసి ప్రోక్షణీ పాత్రను స్థాపించాలి. ప్రణీత పాత్ర నుండి మూడు సార్లు నీటిని తీసి ప్రోక్షణీ పాత్రలో వెయ్యాలి. ప్రోక్షణీ పాత్రను ఎడమచేతిలో పెట్టుకొని కుడి మధ్యమ, అంగుష్ఠాలతో పవిత్రకమును గ్రహించి పవిత్రంతేం (ఋ. 9/83/1) అనే మంత్రాన్ని చదువుతూ అక్కడ పెట్టిన అన్ని ద్రవ్యాలనూ మూడుమార్లు నీటి చిలకరింపులతో పవిత్రీకరించి ప్రోక్షణీ పాత్రను దక్షిణం వైపు ఉంచాలి. ప్రాదేశ మాత్రలో నేతిగిన్నెను పెట్టాలి. నేతిని నెమ్మదిగా అగ్నిలో వేస్తూ ‘అపద్రవ్యనిరసన’ గావించి పర్యగ్నికరణం చేయాలి. మండుతున్న చితుకును తీసుకొని కులాయినీం (యజు. 14/ 2) అనే మంత్రాన్ని పఠిస్తూ నేతిగిన్నెపై, చరూస్థాలిపై తిప్పాలి.

తరువాత స్రువను కుడిచేతిలో నిడుకొని అగ్నికి చూపించాలి. సమ్మార్జన కుశలతో స్రువను ఆ మూలాగ్రము స్పృశించాలి. తరువాత ప్రణీతలోని నీటితో మూడుమార్లు ప్రోక్షించి ఉత్తరం వైపు పెట్టుకోవాలి. నేతిపాత్రను ఎదురుగా పెట్టుకోవాలి. పవిత్రీనుండి నేతిని మూడు పర్యాయములు ఉత్ ప్లవనంగావించాలి. పవిత్రీనుండి ఈశాన్యంతో ప్రారంభించి దక్షిణావర్తనం చేస్తూ మరల ఈశాన్యపర్యంతం పర్యుక్షణ చేయాలి. తరువాత అగ్నిదేవుని ఈ విధంగా ధ్యానించాలి. “అగ్నిదేవునిది రక్తవర్ణము, ఆయనకి మూడు ముఖాలు, ఆయన తన ఎడమ చేతిలో కమండలాన్నీ కుడి చేతిలో స్రువనీ గ్రహించియున్నాడు. “ధ్యానానంతరము స్రువను చేపట్టి హవనం చెయ్యాలి.

ఈ ప్రకారంగా స్వగృహ్యోక్త విధి ద్వారా బ్రహ్మను, ఋత్విజులను వరణం - అనగా యేర్పాటు చేసుకోవాలి. కుశ కండికా కర్మను నిర్వర్తించి అగ్నిని పూజించాలి. ఆధార, ఆజ్యభాగ, మహావ్యాహృతి, ప్రాయశ్చిత్త, ప్రాజాపాత్య, స్విష్టకృత్ హవనాలను చెయ్యాలి. ఆధారహవనాలు ప్రజాపతి, ఇంద్ర నిమిత్తమై చేసే ఆహుతులు, ఆజ్యభాగాలు అగ్నికీ, చంద్రునికీ ఇవ్వబడే ఆహుతులు. భూఃభువః స్వః ఈ మూడు మహావ్యాహృతులు. అయాశ్చాగ్నేం ఇత్యాది అయిదు మంత్రాలు ప్రాయశ్చిత్త సంజ్ఞికాలు. ఒక ప్రాజాపత్య ఆహుతి, ఒక స్విష్టకృత్ ఆహుతి. ఈ ప్రకారంగా హోమంలో పదునాలుగు ఆహుతులు నిత్య సంజ్ఞికాలై వుంటాయి. ఈ విధంగా చతుర్దశ ఆహుత్యాత్మక హవనాలిచ్చి కర్మ - నిమిత్తక దేవతలనుద్దేశించి ప్రధాన హవనం చేయాలి.

అగ్నికి ఏడు జిహ్వలుంటాయని చెప్పబడింది. అవి హిరణ్య, కనక, రక్త, ఆరక్త, సుప్రభ, బహురూప, సతి. ఇవన్నీ దేవీ స్వరూపాలే. వీటిని ధ్యానం చేస్తే యజ్ఞం యొక్క సంపూర్ణ ఫలము దక్కుతుంది.