భవిష్య పురాణము

54 - బుధాష్టమీ వ్రత మాహాత్యం

‘ధర్మరాజా! ఇపుడు బుధాష్టమి వ్రతాన్ని వినిపిస్తాను. దీనిని చేసేవారు నరకం ముఖాన్ని చూడవలసినపనే వుండదు. ఈ వ్రతానికి సంబంధించి ఒక ఆఖ్యానముంది. కృతయుగారంభంలో మనుపుత్రుడు ఇలుడుద్భవించాడు. అతడెల్లపుడూ మిత్రులతో భృత్యులతో గొప్ప వైభోగంగా వెలుగుతూ వుండేవాడు. అతడొక రోజు వేటకు వెళ్ళి ఒక జింకను తరుముకుంటూ పోయి హిమాలయపర్వత సమీపంలోని ఒక వనాన్ని చేరుకున్నాడు. ఇలుడు(ఇతని అసలు పేరు సుద్యుమ్నుడు. పుట్టినప్పుడు బాలికగా నుండి ‘ఇలా సుందరి’ అనే పేరుతో పిలువబడ్డాడు. ఇతని కథ మహాభారతంలో వుంది. చాలా పురాణాల్లోనూ కనిపిస్తుంది.) ఆవనంలో ప్రవేశించగానే స్త్రీగా మారిపోయాడు. ఆ వనం పార్వతీ పరమేశ్వరుల విహారక్షేత్రం. ‘ఈ వనంలో ప్రవేశించిన పురుషుడు ఆక్షణమే అయిపోవాలని శివుడు కట్టడి చేశాడు. ఇపుడు మహారాజైన ఇలుడు అతి సుందరియైన స్త్రీగా మారిపోయి ఆ వనంలోనే తిరుగాడడం జరిగింది. తానెవరో తెలియని పరిస్థితిలోనున్న ఈ స్త్రీమూర్తిని, ఆవనం దాటి బయటకు వచ్చిన, ఇలగా మారిన, ఇలుని చంద్రుని పుత్రుడైన బుధుడు చూశాడు. ఆమె అందాన్ని చూసి ఆకర్షింపబడి వెంటనే ఆమెను పెండ్లాడాడు. వారికి కడు కీర్తిశాలియు, సమ్రాట్టు నగు పురూరవ చక్రవర్తి జన్మించాడు. ఆయనతోనే చంద్రవంశం మొదలైంది.

ఇలను బుధుడు వివాహమాడిన రోజు అష్టమి. కాబట్టి ఆ తిథిని బుధాష్టమి అన్నారు. ఇది సర్వపాపప్రణాశిని, సర్వోపద్రవనాశిని.

దీనికి సంబంధించి మరొక కథ కూడా వుంది. విదేహరాజుల మిథిలా నగరిలో ‘నిమి’ అని ఒక రాజు పాలిస్తుండేవాడు. అతడు యుద్ధ రంగంలో మరణించాడు. అతని భార్య ఉర్మిళ రాజ్యచ్యుతయై నిరాశ్రయయై తన కొడుకునీ కూతురినీ వెంటతీసుకొని అవంతి దేశానికి వెళ్ళిపోయింది. అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట పనిచేసుకుంటూ బ్రతుకు వెళ్ళబుచ్చసాగింది. గోధుమలు పిండి చేసినపుడు (విసిరినపుడు) యజమాని చూడకుండా కొంచెం కొంచెంగా తస్కరించి తెచ్చి వండుకొని క్షుద్బాధ బారిన పడకుండా పిల్లలను రక్షించి పెంచింది. కొన్నాళ్ళకామె మరణించింది. ఆమె కొడుకు అవంతి నుండి మిథిలపోయి తన తండ్రి ఆత్మీయులను, సైన్యాన్నీ కూడగట్టి యుద్ధాలు చేసి తండ్రి రాజ్యాన్ని సాధించుకొని రాజైనాడు. అతని చెల్లెలు శ్యామల పెళ్ళీడుకొచ్చింది. ఆమె అత్యంత రూపవతి. అవంతి రాజయిన ధర్మరాజు ఆమెను గూర్చి విని స్వయంగా వచ్చి ఆమె సోదరుని ఒప్పించి ఆమెను వివాహం చేసుకున్నాడు.

ఒకరోజాయన ఆమెతో ఇలా అన్నాడు ‘వైదేహినందినీ! నీ ఇష్టం వచ్చినట్లు సర్వ లాంఛనాలతో రాజ్యమంతటా విహరించవచ్చుగాని, ఈ ఏడుతాళం వేసియున్న గదులలోకి మాత్రం పోకు’ ఆమె ‘అలాగే మహాప్రభూ’ అనేసి అప్పటికి వూరుకుంది గాని ఆమెలో అంతకుముందులేని ఉత్సుకత ఇప్పుడు కలిగింది. ఆ గదులనో స్థానాలనో, మొత్తానికి, చూడాలని నిశ్చయించుకుంది. ఒకరోజు మహారాజు తీవ్ర కార్యవ్యగ్రతలో ఊపిరిసలపకుండా నున్నపుడామె ఒక ‘నిషిద్ధ’ గృహానికి పోయి తాళం తీసి తలుపు తెఱచి చూసింది. ఆమెకు మతిపోయినంత పనయింది.

ఆమె తల్లి ఉర్మిళ (ఊర్మిళ కాదు)ను అతి భయంకరులైన యమదూతలు చేతులూ కాళ్ళూ కట్టేసి సలసల కాగుతున్న నూనెలో ముంచి తేల్చుతున్నారు. ఆమె సిగ్గుపడిపోయి గబగబా ఆ ఇంటికి తాళం వేసేసి రెండవ స్థానం తాళం తీసి చూసింది. అక్కడ కూడ అలాటి యమకింకరులే ఉర్మిళనే మరో పద్ధతిలో హింసిస్తున్నారు. రెండు పెద్ద తిరగలి రాళ్ళ మధ్య ఆమె నుంచి, గిరగిర పిండి విసిరినట్లు త్రిప్పసాగారు. ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. మూడవ గృహంలో ఆమె నెత్తిలోకి ఇనుప మేకులు కొడుతున్నారు. నాలుగవ గదిలో ఒక భయంకరమైన కుక్క ఆమె శరీరాన్ని కొరుక్కు తింటోంది. అయిదవ గది ఆమె శరీరాన్ని ఱంపంతో కోస్తున్నారు. ఆరవ గదిలో చెఱకురసం పిండే యంత్రంలో ఆమెను వుంచి పిండుతున్నారు. ఏడవగదిలో ఉర్మిళ శరీరాన్ని వేలకొద్దీ క్రిములు తింటున్నాయి. అన్ని శిక్షలలోనూ రక్తం ధారాపాతంగా కారుతూనే వుంది. రోదన ధ్వనులు మిన్నంటుతునే వున్నాయి. తెలివి తప్పదు, ప్రాణం పోదు.

శ్యామలకు బాధనిపించింది. ‘ఇంత తీవ్రమైన శిక్షల ననుభవించవలసినంత పాపం నా తల్లి చేసి వుంటుందా? ఐనా ఈ దృశ్యాన్ని నాకు చూపించడంలో భగవంతుని ఉద్దేశ్యమేమై వుంటుంది? నా ద్వారా ఆమెను కాపాడాలనుకున్నాడేమో!’ ఇలా తనతో తాను, తనలో తాను పరిపరివిధాల తర్కించుకొని చివరికి భర్తనే అడిగేసింది.

‘ప్రియా! నీవీ హింసను చూస్తే మరల మామూలు మనిషివి కావడం కష్టం కాబట్టే నిన్ను అటువైపు వెళ్ళొద్దన్నాను. మీ అమ్మ పాపం చేసింది. మీ ఆకలిని తీర్చడం కోసం ఆమె కొన్నేళ్ళపాటు బ్రాహ్మణ ధనాన్ని గోధుమల రూపంలో దొంగిలించింది. ప్రాణస్నేహితుడైనా సరే బ్రాహ్మణుని సొమ్ము తింటే ఏడు జన్మలదాకా అధోగతి పాలౌతాడు. అలాటిది దొంగతనం చేస్తే ఏమవుతుందో ఊహించడానికే భయమేస్తుంది. సూర్యచంద్రులు, నక్షత్రాలు ఇక్కడున్నంత వఱకూ మీ అమ్మ అక్కడే ఆ నరకంలోనే వుంటుంది’ అని నిష్కర్షగా చెప్పేశారు ధర్మరాజు.

‘ఆర్యపుత్రా! మా అమ్మ గోధుమలు తీయడం తేవడం నాకు తెలుసు. అయినా అది అంత గొప్ప పాతకమని నేననుకోలేదు. పైగా ఆమె మాకు తిండి పెట్టడం కోసం అలా చేయవలసి వచ్చింది. మమ్మల్ని ఉంచి మా నాన్న తలను త్రెంచి దేముడు కూడా ఆమెకు అన్యాయమే చేశాడనీ, ఇపుడు ఆయనే నాకొక అవకాశాన్నిస్తాడని ఎందుకో నాకు గట్టిగా అనిపిస్తోంది. చెప్పండి ఆర్యపుత్రా! మీరు సామాన్యులు కారు. నా తల్లిని మీరే రక్షించగలరు’ అంటూ పాదాలపై పడింది.

ధర్మరాజు వెంటనే ఆమెను లేవనెత్తి బుజ్జగించి ‘ప్రియా! నీ ఊహ నిజమేకావచ్చు. నీవు ఏడుజన్మల క్రిందట బ్రాహ్మణిగా జన్మించి సఖులతో కలసి బుధాష్టమీ వ్రతాన్ని చేశావు. ఆ ఫలాన్ని నువ్వు సంకల్ప పూర్వకంగా నీ తల్లికి ధారవోస్తే ఆమెకు ఈ నరకం నుండి విముక్తి కలుగుతుంది.’

ఈ మాటను విన్న వెంటనే శ్యామల స్నానం చేసి తన వ్రత పుణ్యఫలాన్ని సంకల్ప పూర్వకంగా తల్లికి దానం చేసి వేసింది. వ్రత ప్రభావం వల్ల ఆక్షణమే ఉర్మిళ దివ్యదేహ ధారిణియై విమానంలో కూర్చుని స్వర్గానికి పోయి బుధగ్రహ సమీపంలో స్థాపింపబడింది.

ధర్మనందనా! ఇక ఈ వ్రత విధానాన్ని వినిపిస్తాను, ఆకర్ణించు. శుద్ధ అష్టమి ఎప్పుడు బుధవారం నాడు పడినా ఆ రోజు ‘ఏకభుక్తం చేయాలి, పూర్వాహ్ణంలో నదిలోగాని చెఱువులో గాని స్నానంచేసి అందులోని నీటిని కొత్త కలశలో నింపి ఇంటికిగొని వచ్చి స్థాపించి అందులో బంగారాన్ని జారవిడిచి వుంచాలి. ఒక వెదురుపాత్రలో అన్నాన్ని వండి వుంచాలి. (వండిన అన్నాన్ని వెదురు పాత్రలో వుంచాలి) ఈ వ్రతాన్ని ఎనిమిది బుధాష్టముల దాకా చేయాలి. క్రమంగా ఎనిమిదిరకాల పక్వాన్నాలు - మోదకాల (లడ్ల)తో, నేతి అప్పాలతో, వటకాలతో (వడలు కావచ్చు), శ్వేత కాసారంతో చేయబడి పదార్ధాలతో, సోహాలక (ఖండ యుక్త అశోకవర్తి)ములతో, ఫలపుష్పాదులతో, తీపి పదార్థాలతో (భోగాలు తయారు చేయించి వాటినన్నిటినీ) బుధునికి నైవేద్యాలర్పించాలి. స్వయంగా మిత్రులతో కలిసి భోంచేయాలి. బుధాష్టమి కథలను వినాలి. కథలను వినకుండా ఏమీ తినరాదు. అయిదు గురివింద గింజల లేదా దానిలో సగం సువర్ణంతో బుధుని ప్రతిమను తయారు చేయించి గంధ, పుష్ప, నైవేద్య, పీతాంబర, దక్షిణాదులతో పూజించాలి.

పూజా మంత్రాలు ఇవి :

ఓం బుధాయ నమః

ఓం సోమాత్మజాయనమః

ఓం దుర్బుద్ధి నాశనాయ నమః

ఓం తారాజాతాయ నమః

ఓం సౌమ్యగ్రహాయ నమః

ఓం సర్వసౌఖ్య ప్రదాయ నమః

తరువాత క్రింది మంత్రాన్ని చదువుతూ ప్రతిమనూ భక్ష్య వస్తువులనూ బ్రాహ్మణునికి దానం చేయాలి.

ఓం బుధోఽయం ప్రతిగృహ్ణాతు

ద్రవస్థోఽయం బుధః స్వయం!

దీయతే బుధరాజాయ

                              తుష్యతాం చ బుధోమమ (ఉత్తరపర్వం 54/51)

బ్రాహ్మణుడు మూర్తి మున్నగువానిని పరిగ్రహిస్తూ ఈ మంత్రాన్ని చదవాలి.

బుధః సౌమ్యస్తారకేయో రాజపుత్ర ఇలాపతిః

కుమారోద్విజరాజస్యయః పురూరవసః పితా

దుర్బుద్ధి బోధ దురితం నాశయిత్వావయోర్బుధః 

సౌఖ్యంచ సౌమనస్యంచ కరోతు శశి నందనః (ఉత్తరపర్వం 54/52,53)

ఈ విధంగా బుధాష్టమి వ్రతాన్ని చేయువారు ఏడుజన్మల దాకా జాతిస్మరులౌతారు. సర్వప్రాప్తులౌతారు. వారి దేహాంతం నారాయణ స్మరణతో తీర్థ స్థానంలో జరుగుతుంది. వారు ప్రళయ పర్యంతం స్వర్గంలో నివసిస్తారు. ఈ వ్రతాన్ని గూర్చి విన్నవారికి బ్రహ్మహత్యాది పాతకాలు కూడా నశిస్తాయి.”